ఒంగోలు, ఏప్రిల్ 4: నాగార్జునసాగర్ డ్యాం నుండి జిల్లాకు గురువారం ఉదయం ఆరువేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. దీంతో జిల్లాలోని 168 నోటిఫైడ్, 109 నాన్ నోటిఫైడ్ మంచినీటి ట్యాంకులు సాగర్ నీటితో నిండనున్నాయి. నాగార్జునసాగర్ నుండి కేవలం పది రోజులపాటు మాత్రమే నీటిని విడుదల చేస్తామని ఎన్‌ఎస్‌పి సిఇ ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. జిల్లాకు ఈనెల ఆరవ తేదీ సాయంత్రానికి సాగర్ నీరు వచ్చే అవకాశాలున్నట్లు ఆయన పేర్కొన్నారు. నాగార్జునసాగర్ నీటిని విడుదల చేసి మంచినీటి ట్యాంకులకు నింపాలని మార్కాపురం శాసనసభ్యుడు కందుల నారాయణరెడ్డి కలెక్టరేట్ వద్ద నిరవధిక నిరాహారదీక్ష కూడా చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆయన దీక్షను కూడా విరమించారు. ఇదిలాఉండగా జిల్లాలోని మంచినీటి చెరువుల్లో సమృద్ధిగా నీరులేక వెలవెలబోతున్నాయి. జిల్లాలోని ప్రజలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నాగార్జునసాగర్ నీరు విడుదల కాకపోతే ఒంగోలు, మార్కాపురం ప్రాంతాలకు చెందిన ప్రజలు తీవ్ర అవస్థలు పడేవారు. కాగా ప్రతి సంవత్సరం జిల్లాకు నాగార్జునసాగర్ నీటిని విడుదల చేస్తుంటారు. కాని గుంటూరు జిల్లాకు చెందిన రైతులు నీటిని చౌర్యం చేయటం పరిపాటిగా మారింది. దీంతో జిల్లాలోని ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. జిల్లాకు సక్రమంగా సాగర్ నీరు అందేలా జిల్లా కలెక్టర్ విజయకుమార్ పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాల్వల గట్లు తెగకుండా, నీరు సక్రమంగా వచ్చేలా కాల్వలపై అధికారులతో పెట్రోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇదిలాఉండగా దర్శి మెయిన్ కెనాల్ పరిధిలో ఏడు నోటిఫైడ్ ట్యాంకులు, దర్శి బ్రాంచి కెనాల్ పరిధిలో నోటిఫైడ్ ట్యాంకులు మూడు ఉండగా నాన్ నోటిఫైడ్ ట్యాంకులు 46 ఉన్నాయి. ఒంగోలు బ్రాంచి కెనాల్ పరిధిలో నోటిఫైడ్ ట్యాంకులు 29 ఉండగా నాన్ నోటిఫైడ్ ట్యాంకులు 15, అద్దంకి బ్రాంచి కెనాల్ పరిధిలో నోటిఫైడ్ ట్యాంకులు 83, నాన్ నోటిఫైడ్ ట్యాంకులు 48 ఉన్నాయి. అదేవిధంగా కొమ్మమూరు కెనాల్ పరిధిలో నోటిఫైడ్ ట్యాంకులు 21, గుండ్లకమ్మ రిజర్వాయర్ పరిధిలో 20, మూసి పరిధిలో ఐదు ట్యాంకులు ఉన్నాయి. ఈ ట్యాంకులన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం విధించిన పది రోజుల గడువులోగా సాగర్ నీటితో నింపాల్సి ఉంది. అదేవిధంగా ఒంగోలు నగరంలోని ఎస్‌ఎస్ ట్యాంకులు కూడా సాగర్ నీటితో నిండనున్నాయి. మొత్తంమీద జిల్లాకు ఆరువేల క్యూసెక్కుల నీటిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లాలో మంచినీటి ఎద్దడిని నివారించేందుకు 567.74 కోట్ల రూపాయలతో ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించారు. ఈనిధులతో మంచినీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయటం, బోర్‌వెల్స్‌ను ఆధునికీకరించటం, ప్రైవేటు నీటి వనరులను గుర్తించి ఆ నీటిని ప్రజలకు ఉపయోగించేలా పనులు చేయనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
* టిడిపి జిల్లాఅధికార ప్రతినిధి శాసనాల
మార్కాపురం, ఏప్రిల్ 4: కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని కోల్పోయి పరిపాలన సాగిస్తుందని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన చూస్తుంటే రోమ్‌నగరం తగలపడుతుంటే పిడేల్ వాయిస్తూ కూర్చున్న న్యూరోచక్రవర్తి గుర్తొస్తున్నారని టిడిపి జిల్లాఅధికారప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం అన్నారు. జిల్లాకు సాగర్‌జలాలు అందించి తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తూ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి రెండు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షలు సఫలీకృతమైన నేపథ్యంలో స్థానిక తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్కాపురం పట్టణానికి పొంచి ఉన్న తాగునీటి సమస్యను ఎమ్మెల్యే కందుల అనేకమార్లు సంబంధిత మంత్రుల, అధికారుల, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారని, ఎంతఒత్తిడి తెచ్చిన సదరు పాలకులు, అధికారులు స్పందించక పోవడంతో ప్రాణత్యాగానికి సిద్ధపడి సాగర్‌నీరు విడుదల కోసం నిరాహార దీక్ష చేపట్టారని, కందుల దీక్ష మార్కాపురం ప్రాంతప్రజల దాహాన్ని తీర్చిందన్నారు. ఒక ఎమ్మెల్యే స్వయంగా దీక్షచేపట్టి పోరాటం చేస్తుంటే ఏఒక్క అధికారి కూడా దీక్ష శిబిరానికి చేరి నిర్ణీత హామీ ఇచ్చేందుకు ముందుకు రాలేదని, ప్రతిపక్షపార్టీ నేతలంటే అంత చులకన అని శాసనాల ప్రశ్నించారు. ఎట్టకేలకు సాగర్‌నీటిని తాగునీటి ప్రయోజనాలకు విడుదల చేసిన అధికారులు 30రోజులపాటు నిరంతరంగా నీటిని విడుదల చేయాలని, దూపాడు ఎస్‌ఎస్ ట్యాంక్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరంతరంగా నీరు అందించని పక్షంలో తిరిగి నిరాహార దీక్షలు, ధర్నాలకు పూనుకుంటామని హెచ్చరించారు. సంక్షేమ పథకాలను తుంగలోతొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని రద్దుచేసి అందరికీ వైద్యం అందేలా వైద్యశాలలను ఆధునీకరిస్తామనడం విడ్డూరంగా ఉందని, ముందుగా వైద్యుల భర్తీకి నోచుకోని వైద్యశాలల్లో డాక్టర్ల పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆర్ధోపెడిక్ వైద్యులు లేకపోవడంతో ఏ చిన్నప్రమాదం జరిగినా గుంటూరు, కర్నూల్, ఒంగోలుకు పరుగులు తీయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ ఉద్యమంలో భాగంగా త్వరలో టిడిపి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ నీటి విడుదల కోసం దీక్షలో కూర్చోని విజయం సాధించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి ఈసందర్భంగా కార్యకర్తలు, అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలో టపాసులు కాల్చి విజయోత్సవర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు తాళ్ళపల్లి సత్యనారాయణ, వాణిజ్యవిభాగం రాష్ట్ర కార్యదర్శి ఇమ్మడి కాశీనాథ్, మాజీమున్సిపల్ చైర్మన్ జక్కా లక్ష్మీప్రకాశ్, షేక్ షెక్షావలి, తెలుగు యువత నాయకులు రవికుమార్‌రెడ్డి, మండలపార్టీ అధ్యక్షులు కె శ్రీనివాస యాదవ్, మైనార్టీ నాయకులు అమిరుల్లాఖాన్, కాశీంఖాన్, కందుల వేణుగోపాలరెడ్డి, కనిగిరి వెంటరమణ, వక్కలగడ్డ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
పైవార్తకు 2 కలర్ ఫోటోలు పంపుతున్నాము.
కందుల దీక్ష విరమణ
ఒంగోలు అర్బన్, ఏప్రిల్ 4: జిల్లాకు నాగార్జునసాగర్ నీరు విడుదల చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని డిమాండ్ చేస్తూ మార్కాపురం శాసనసభ్యుడు కందుల నారాయణరెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారం విరమించారు. జిల్లాకు సాగర్ నీరు విడుదల చేసి జిల్లాలోని 163 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు నీటిని నింపి ప్రజలకు దాహార్తిని తీర్చేవరకు దీక్ష విరమించేది లేదని దీక్ష చేపట్టిన కందుల నారాయణరెడ్డికి మద్దతు రోజు రోజుకు పెరగడంతో స్పందించిన జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు గురువారం జిల్లాకు సాగర్ నీటిని విడుదల చేయించింది. జిల్లా రెవెన్యూ అధికారి జె రాధాకృష్ణమూర్తి దీక్షా శిబిరం వద్దకు వచ్చి కందులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఈ సందర్భంగా డిఆర్‌ఓ రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ విజయ్‌కుమార్ బుధవారం ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నారు. జిల్లా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీటిని సక్రమంగా అందించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. అన్ని మండలాలలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలన్నారు. సాగర్ జలాలను జిల్లాలోని అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు నింపి ప్రజలకు దాహార్తిని తీర్చాలని సూచించారని వెల్లడించారు. ఎండలు మండిపోతున్న తరుణంలో జిల్లా ప్రజలకు, పశువులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం స్పందించి సాగర్ కాలువలకు నీటిని విడుదల చేయించిందన్నారు. ఈ సందర్భంగా దీక్ష చేపట్టిన మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు సాగర్ నీటిని విడుదల చేసినందుకు జిల్లా కలెక్టర్ విజయ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి జె రాధాకృష్ణమూర్తి తదితర అధికార యంత్రాంగానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నీటి చౌర్యం జరగకుండా అధికార యంత్రాంగంతోపాటు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు కాలువలపై పర్యటించాలని పిలుపునిచ్చారు. పూర్తిస్థాయిలో జిల్లా ప్రజలకు తాగునీరు అందాలని కోరారు. పూర్తిస్థాయిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు నీరు చేరే విధంగా అధికార యంత్రాంగం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు యర్రాకుల శ్రీనివాస్ యాదవ్, కొమ్మూరి రవిచంద్ర, బొల్లినేని వాసుకృష్ణ, వైవి సుబ్బారావు, యానం చినయోగయ్య యాదవ్, పోగుల సుందరం, కమ్మా వెంకటేశ్వర్లు, మారెళ్ళ వివేకానంద, దాసరి వెంకటేశ్వర్లు తదితర నేతలు పాల్గొన్నారు.
‘శనగ దిగుమతులపై ఆంక్షలు విధించాలి’
ఒంగోలు అర్బన్, ఏప్రిల్ 4: శనగ దిగుమతులపై వెంటనే ఆంక్షలు విధించాలని ఆచార్య రంగా కిసాన్ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆచార్య రంగా కిసాన్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఆచార్య రంగా భవన్‌లో శనగ రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, మహబూబ్‌నగర్ జిల్లాల నుండి రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆచార్య రంగా కిసాన్ సంస్థ అధ్యక్షుడు ఆళ్ళ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో శనగరైతుల సమస్యలపై కూలంకశంగా చర్చించారు. శనగ రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరిని కలిసి సమస్యలను వివరించినట్లు కిసాన్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. శనగ దిగుమతులపై ఆంక్షలు విధించాలని, శనగ ఎగుమతులను ప్రోత్సహించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రైతుల వద్ద నిల్వ ఉన్న శనగలకు గిట్టుబాటు ధరలు కల్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారన్నారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌పార్టీ ధ్యేయమని ప్రగల్భాలు పలుకుతున్న పాలకులు రైతుల సంక్షేమంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. శనగ రైతులను అన్నివిధాల ఆదుకోవాలని కోరారు. ఇప్పటికే రైతుల వద్ద శనగపంట పూర్తిస్థాయిలో నిల్వలు ఉన్నాయన్నారు. ధరలు లేక అల్లాడిపోతున్నారన్నారు. ఇలాంటి తరుణంలో రైతులను అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో రైతులు, రైతు సంఘాల నాయకులతో పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆచార్య రంగా కిసాన్ సంస్థ ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య, రైతు సంఘాల ప్రతినిధులు అవనీంద్ర ప్రసాద్, గుండవరపు కోటేశ్వరరావు, నాగబోయిన రంగారావు, ఆరికట్ల విజయభాస్కర్‌రెడ్డి, కర్నూలు కృష్ణారెడ్డి, మండవ శ్రీనివాసరావు, నన్నూరి నాగేశ్వరరావు, నాదెండ్ల చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.
తాగునీటికి తంటాలు
* దొనకొండ వాసులు రైలెక్కనిదే గొంతు తడవని పరిస్థితి
* రెండు బిందెల నీటి కోసం రోజంతా వృథా
* నీటి సమస్యపై కలెక్టర్‌కు హెచ్‌ఆర్‌సి నోటీసులు
మార్కాపురం/దొనకొండ, ఏప్రిల్ 4: ఒకప్పుడు రైల్వే ఉద్యోగులతో కిటకిటలాడిన దొనకొండ నేడు తాగునీటి కోసం తహతహలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బొగ్గు ఇంజన్లు ఉన్న సమయంలో ఇక్కడ లోకోషెడ్ ఉండి అనేకమంది ఉద్యోగులు పనిచేస్తుండేవారు. ప్రస్తుతం ఆయిల్ ఇంజన్లు కావడంతో షెడ్ ఎత్తివేయడంతో ఉద్యోగులందరూ వెళ్లిపోవడంతో కళ తప్పింది. ప్రస్తుతం నివాసం ఉంటున్నవారికి నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. స్థానికంగా ఉన్న బోర్లనీరు తాగితే ఫ్లోరిన్ ప్రభావంతో చిన్నతనం నుంచే అంగవైకల్యం ఏర్పడి వృద్ధాప్యంలో వచ్చే రోగాలన్నీ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దొనకొండ ప్రజలు తాగునీటి కోసం మార్కాపురం మండలంలోని గజ్జలకొండ దారి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతినిత్యం తెనాలి నుంచి మార్కాపురం వచ్చే ప్యాసింజర్ రైలులో దొనకొండ వాసులు ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని 15కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్జలకొండ రైల్వేస్టేషన్‌కు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రైలు మార్కాపురం వెళ్ళి తిరిగి వచ్చేలోపు బిందెలను నింపుకొని గమ్యం చేరుకోవడం పరిపాటిగా మారింది. నీటికోసం కుటుంబంలోని ఒకరు పనులు మానుకొని గజ్జలకొండ నుంచి నీటిని తీసుకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏదైనా కారణాల వలన ప్యాసింజర్ రైలు రాకుంటే తాగునీటికి తిప్పలు తప్పడం లేదని దొనకొండ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొనకొండ మండలంలోని చందవరం సమీపంలో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ద్వారా పైపులైన్లను ఏర్పాటుచేసి నీటిసరఫరా చేసేవారు. అయితే సాగర్‌నీరు విడుదల కాకపోవడంతో ఎస్‌ఎస్‌ట్యాంకు పూర్తిగా ఎండిపోయింది. దీనితో దొనకొండ వాసులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. అయితే ట్యాంకులో నీరు ఉన్నప్పటికీ సరఫరా కోసం ఎప్పుడో ఏర్పాటు చేసిన పైపులు తుప్పుపట్టి లీకేజీలు ఏర్పడి కలుషితనీరు వస్తుందని, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నీటితోనే జీవితాలను వెళ్ళదీస్తున్నామని గ్రామస్థులు అంటున్నారు. ప్రస్తుతం ఆ నీరు కూడా అందుబాటులో లేకపోవడంతో గజ్జలకొండకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. ఈవిషయంపై ఇటీవల కొన్ని చానెళ్ళలో వార్తలు రావడంతో సుమోటోగా స్వీకరించిన మానవహక్కుల కమిషన్ జిల్లాకలెక్టర్‌ను నీటి సరఫరాపై నివేదిక అందచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే గురువారం ఉదయం నాగార్జునసాగర్ కాలువ ద్వారా తాగునీటి సమస్యను తీర్చేందుకు నీటిని విడుదల చేయడం వలన మరోవారం రోజుల్లో చందవరం ఎస్‌ఎస్ ట్యాంక్‌కు నీరు అందే అవకాశాలు ఉన్నాయని, దీనితో దొనకొండ వాసులకు నీటి కష్టాలు తీరుతాయని అధికారులు అంటున్నారు. ఏదిఏమైనా నిత్యం 15కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్జలకొండకు వెళ్ళి రైలులో నీరు తెచ్చుకొని గొంతు తడుపుకోవాల్సిన పరిస్థితి రావడం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది.
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి:కలెక్టర్
ఆంధ్రభూమి బ్యూరోరఒంగోలు, ఏప్రిల్ 4: జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులన్నింటిని వేగవంతంగా పూర్తిచేయడానికి చర్యలు తీసకోవాలని జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని సిపిఓ కాన్ఫరెన్స్‌హాలులో పంచాయతీరాజ్ ఇంజనీర్లతో కలెక్టర్ పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పనులకోసం కేటాయించిన నిధులు ఖర్చు చేయడంలో ఇంజనీర్ల వైఖరిపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో 56 మండలాలలో పూర్తిస్థాయిలో ఇంజనీరింగ్ అధికారులు ఉన్నప్పటికి పనుల పురోగతి లేకపోవడం దురదృష్టకరమన్నారు. పంచాయతీరాజ్ పనులపై ఇంజనీర్లతో ఎస్‌ఇ పంచాయతీరాజ్ సమీక్షించుకోవాలన్నారు. 2012 - 13 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన పనులన్ని వెంటనే ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అద్దంకి నియోజకవర్గంలో వివిధ పథకాల కింద 447 పనులు 38 కోట్ల రూపాయలతో మంజూరయ్యాయన్నారు. వీటిలో 412 పనులు గ్రౌండింగ్ చేశామన్నారు. 29 పనులు ఇప్పటివరకు ప్రారంభం కాలేదన్నారు. 316 పనులు పూర్తిచేశారన్నారు. 29 పనులు ఇప్పటి వరకు ప్రారంభించకపోవడం పట్ల పంచాయతీ ఇంజనీర్లపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. చీరాల నియోజకవర్గంలో 13 కోట్ల రూపాయలతో 215 పనులు మంజూరు చేశామన్నారు. 176 పనులు గ్రౌడింగ్ చేయగా 39 పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో 39 కోట్ల రూపాయలతో 463 పనులు మంజూరు చేశామన్నారు. 357 పనులు గ్రౌండింగ్ అయ్యాయన్నారు. 181 పనులు పూర్తయినట్లు తెలిపారు. 106 పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదని కలెక్టర్ తెలియజేశారు. పర్చూరు నియోజకవర్గంలో 36 కోట్ల రూపాయలతో 446 పనులు మంజూరయ్యాయన్నారు. 338 పనులు గ్రౌండింగ్ చేయగా 272 పనులు పూర్తిచేసినట్లు ఇంజనీర్లు కలెక్టర్‌కు తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లాపరిషత్ సిఇఓ ఎం గంగాధర్‌గౌడ్, పంచాయతీరాజ్ ఎస్‌ఇ రామకృష్ణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి మోహన్‌కుమార్, పంచాయతీరాజ్ ఇఇలు, డిఇలు తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సరఫరాకు
ప్రాధాన్యత ఇవ్వాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఒంగోలు, ఏప్రిల్ 4: జిల్లాలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని సిపిఓ కాన్ఫరెన్స్‌హాలులో అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేషన్ అధికారులతో తాగునీరు, వ్యక్తిగత మరుగుదొడ్లు, గృహ నిర్మాణం తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా తాగునీటి పథకాలన్నింటిని వినియోగంలోకి తెచ్చే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు 7 కోట్ల 47 లక్షల కంటిన్‌జెంట్ ప్లాన్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. నాగార్జునసాగర్ కాలువ కింద ఉన్న ఆర్‌డబ్ల్యుఎస్ తాగునీటి పథకాలను నీటితో నింపడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తాగునీటి పథకాల నిర్మాణాలకు నిర్ణయించిన సమయంలోగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణీత సమయంలో కాంట్రాక్టర్లు పనులు పూర్తిచేయనట్లైతే నోటీసులు ఇచ్చి కాంట్రాక్టు రద్దు చేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేషన్ అధికారులు తమ పరిధిలో కనీసం రెండు తాగునీటి పథకాల పనులను తనిఖీలు చేసి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బోర్‌వెల్ మరమ్మతుల నిర్వహణకు బోర్‌వెల్ సామానులు మార్కెట్ రేట్ల ప్రకారం టెండర్లు నిర్వహించాలన్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ చేపట్టిన తాగునీటి పథకాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని, పూర్తయిన పథకాలకు నిరంతరం విద్యుత్ సరఫరా అందించాలని కలెక్టర్ ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం మంజూరు చేసిన చిన్నచిన్న తాగునీటి పథకాలను నెలల తరబడి పూర్తిచేయకుండా కాలం వెళ్ళబుచ్చటం మంచి పద్ధతి కాదన్నారు. పనులు వెంటనే పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ హెచ్చరించారు. కొండపి నియోజకవర్గంలో 24 తాగునీటి పథకాల పనులు ప్రపంచ బ్యాంకు నిధులతో మంజూరు అయ్యాయన్నారు. వెంటనే పనులు పూర్తిచేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మార్కాపురం నియోజకవర్గంలో పూర్తయిన తాగునీటి పథకాలకు విద్యుత్ సరఫరా అందించడంలేదని ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. తాగునీటి పథకాల విద్యుత్ సరఫరాకు డిడిలు చెల్లించినట్లైతే వెంటనే విద్యుత్ సరఫరా అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మండలాలకు కేటాయించిన వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యాలను పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సిపిఓ కెటి వెంకయ్య, జిల్లాపరిషత్ సిఇఓ ఎన్ గంగాధర్‌గౌడ్, డిఆర్‌డిఎ పిడి ఎ పద్మజ తదితరులు పాల్గొన్నారు.