విజయవాడ, ఏప్రిల్ 4: రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లే నిమిత్తం గన్నవరం విమానాశ్రయానికి రానున్న దృష్ట్యా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా బుద్ధప్రకాష్ ఎం జ్యోతి సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి గన్నవరం విమానాశ్రయానికి రానున్న దృష్ట్యా చేపట్టవలసిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డా బుద్ధప్రకాష్ ఎం జ్యోతి, సిపి ఎన్ మధుసూదనరెడ్డి గురువారం ఉదయం వివిధ శాఖల అధికారులతో విమానాశ్రయం విఐపి లాంజ్ నందు సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి శుక్రవారం ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కొద్దిసేపు విశ్రాంతి అనంతరం హెలికాఫ్టర్ ద్వారా పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వెళ్ళనున్నారన్నారు. ఈ సందర్భంగా చేపట్టవలసిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు పలు సూచనలు జేశారు. విమానాశ్ర ప్రాంగణంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలించాలని నగర పోలీసు కమిషనర్ నిఘా విభాగపు అధికారులకు సూచించారు. సమావేశంలో ఎసిపిలు షకిలాభాను, సత్యనారాయణ, స్థానిక సిఐ జి రత్నరాజు, ఎస్‌ఐ షరీఫ్, ఎయిర్‌పోర్టు ఇన్‌చార్జి ప్రాన్సీస్, తహశీల్దార్ వైవి ప్రసన్నలక్ష్మి, వైద్యాధికారిణి డా శైలజా తదితరులు పాల్గొన్నారు.
బాలుర సమీకృత వసతిగృహంపై ఎసిబి దాడులు
నూజివీడు, ఏప్రిల్ 4: స్థానిక ఎస్‌ఆర్‌ఆర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలుర సమీకృత వసతిగృహంపై గురువారం సాయం త్రం అవినీతి నిరోధకశాఖ అధికారు లు దాడులు జరిపారు. రికార్డులు పరిశీలించారు. వసతిగృహంలో ఉన్న స్టాకును పరిశీలించగా అస్తవ్యస్తంగా ఉంది. చివరకు చిన్నారుల హాజరులో కూడా చాలా తారతమ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వసతిగృహంలో గ్యాస్ సిలిండర్లు, కందిపప్పు, పంచదార వంటి నిత్యావసర వస్తువులు కూడా చాలా తక్కువగా ఉన్నట్లు అవినీతి నిరోధక అధికారుల పరిశీలనలో వెల్లడి అయింది. ఈ వసతిగృహంలో 232మంది విద్యార్థులు ఉన్నట్లు వసతిగృహ అధికారులు లెక్కలు చూపుతుంటే అధికారుల దాడి చేస్తున్న సమయంలో 152మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. రికార్డులు కూడా ఒక పద్ధతి ప్రకారం లేకుండా ఇష్టానుసారంగా వసతిగృహ అధికారులు నిర్వహిస్తున్న విషయం ఎసిబి
అధికారులు పరిశీలనలో తేలింది. ఈ సందర్భంగా డిఎస్పీ ఎం నరసింహారావు విలేఖరులతో మాట్లాడుతూ సమీకృత వసతిగృహంపై పలు ఫిర్యాదులు వచ్చాయని, సక్రమంగా భోజనం పెట్టడం లేదని, మెనూ పాటించలేదని, ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారని అన్నారు. వీటిని పరిశీలించేందుకుగాను వసతిగృహంపై దాడులు చేశామని చెప్పారు. వసతిగృహంలోని నిర్వహించాల్సిన అన్ని రికార్డులు సక్రమంగా లేదన్న విషయం తమ పరిశీలనలో వెల్లడి అయిందని అన్నారు. వివిధ రకాల స్టాకులు కూడా చాలా వ్యత్యాసంలో ఉన్నాయని, ఆహారం పెట్టే విషయంలో పిల్లల నుండి కూడా సమాచారం సేకరిస్తున్నామని ఆయన వివరించారు. వసతిగృహంలో 232మంది విద్యార్థులు ఉన్నట్లు రికార్డులో చూపారని అయితే వసతిగృహంలో ఉన్న విద్యార్థులు 157మంది మాత్రమేనని అన్నారు. ఇక్కడ ఉన్న లోపాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. సమీకృత వసతిగృహ ప్రాంగణంలో ఉన్న ఎఎస్‌డబ్య్లు అధికారి కార్యాలయం ను కూడా తమ అధీనంలోకి తీసుకుని రికార్డులు పరిశీలిస్తున్నట్లు డిఎస్‌పి నరసింహారావు తెలిపారు. వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, పౌష్టిక ఆహారం అందించాలన్న ప్రభుత్వ ప్రధాన లక్ష్యం పక్కదారి పడుతుండటంతో దాడులు చేస్తున్నట్లు చెప్పారు. ఈ దాడులలో ఎస్‌ఐలు శ్రీనివాస్, రవి, నాగరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.
మార్కెట్ యార్డు చైర్మన్ ‘మోకా’ తొలగింపు
* ప్రభుత్వ ఆదేశాలు జారీ
మచిలీపట్నం, ఏప్రిల్ 4: మచిలీపట్నం మార్కెటింగ్ యార్డు చైర్మన్ పదవి నుంచి మోకా భాస్కరరావును తప్పిస్తూ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు మార్కెటింగ్ శాఖ కమిషనర్ నుంచి ఇక్కడకు ఆదేశాలు వచ్చాయి. యార్డు ఆఫీసు కార్యాలయం ఎదుట నోటీసు బోర్డులో చైర్మన్ పదవి నుంచి భాస్కరరావును తప్పించినట్లు లేఖ అంటించారు. పాలనాపరమైన లోపాల వల్ల తప్పిస్తున్నట్లు కారణాలు చెబుతున్నా దీనివెనుక రాజకీయ కారణాలు బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని)తో పాటు మోకా భాస్కరరావు కూడా ఇటీవల వైఎస్‌ఆర్‌సిపిలో చేరిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఆయన పదవి ఊడిందనే అభిప్రాయం వక్తమవుతోంది.
కాంగ్రెస్‌తో కుమ్మక్కైన టిడిపికి బుద్ధి చెప్పండి
* గుడ్లవల్లేరు సభలో షర్మిల
గుడివాడ, ఏప్రిల్ 4: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెడుతున్న టిడిపికి ప్రజలంతా గట్టిగా బుద్ధి చెప్పాలని వైఎస్సార్‌సిపి నాయకురాలు షర్మిల పిలుపునిచ్చారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా గుడ్లవల్లేరు మండలంలో గురువారం ఆమె పాదయాత్ర నిర్వహించారు. వడ్లమన్నాడు, వేమవరం, కవుతరం గ్రామాల మీదుగా రాత్రికి గుడ్లవల్లేరు సెంటర్‌కు చేరుకుని అక్కడ జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. రాజన్న రాజ్యానికి జగనన్న జీవం పోస్తారని, రైతులకు, మహిళలకు వడ్డీలేని రుణాలిచ్చి ఆదుకుంటారన్నారు. రైతులు పంట నష్టపోకుండా 2వేల కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అవుతారని, రాజశేఖరరెడ్డి పథకాలను కొనసాగిస్తారన్నారు. గుడ్లవల్లేరు మండల ప్రజలు చూపిన అభిమానం, ఆప్యాయతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, నేతలు వాసిరెడ్డి పద్మ, నందమూరి లక్ష్మీపార్వతీ, దుక్కిపాటి శశిభూషణ్, మండలి హనుమంతరావు, పాలడుగు రాంప్రసాద్ పాల్గొన్నారు.
గుక్కెడు తాగునీరివ్వండి
కలిదిండి, ఏప్రిల్ 4: గుక్కెడు తాగునీరు లేక నానా అవస్థల పాలవుతున్నామని అధికారులకు మహిళలు మొరపెట్టుకున్నారు. మండలంలోని యడవల్లి, కొండంగి గ్రామాల్లో గురువారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. కొండంగి గ్రామ మహిళలు పసర రంగుతో ఉన్న నీటిని సదస్సు వద్దకు తీసుకొచ్చి అధికారులకు చూపించారు.
క్లోరినేషన్ చేయకుండా నేరుగా విడుదల చేయటంతో తాగటానికి పనికిరాకుండా ఉన్నాయని విన్నవించుకున్నారు. కొత్తగా పెళ్లి సంబంధాలు రాక ఉన్న సంబంధాలే తెగిపోతున్నాయని, ఈ ఊరికి పిల్లనిచ్చే దిక్కుకూడా కరవైపోయిందని ఆవేదన వ్యక్తపర్చారు. గ్రామానికి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని మహిళలు తహశీల్దార్ క్షీరసాగర్‌కు వినతిపత్రం అందించారు. స్పందించిన తహశీల్దార్ ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సదస్సులో మొత్తం 21 అర్జీలు వచ్చాయి. ఆర్‌ఐ శశికుమార్, మండల సర్వేయర్ నరసింహారావు, విఆర్‌ఓలు గంగాధర్, శామ్యూల్ పాల్గొన్నారు.
లక్ష్మీనర్సింహుని సేవలో సిబిఐ జెడి లక్ష్మీనారాయణ
జగ్గయ్యపేట , ఏప్రిల్ 4: నిత్యం కేసులు, విచారణలలో బిజీగా ఉండే సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గురువారం సాయంత్రం కుటుంబ సమేతంగా వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీనర్సింహస్వామి వారి సన్నిధిలో గడిపారు. భార్య ఊర్మిళ, కుమార్తె సాయినిత్యతోపాటు స్నేహితులు విజయవాడ సివిల్ సప్లైస్ ఎఎస్‌ఒ కోమలి పద్మ, ఆమె భర్త రాజబాబుతో కలిసి సాయంత్రం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ సూపరింటెండెంట్ భూపాల్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం అనంతరం స్వామి జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు. ఆయన ఆలయంలో అన్నదాన పథకానికి విరాళం ప్రకటించి పుస్తకంలో స్వయంగా నమోదు చేశారు. ఈసందర్భంగా కలిసిన మీడియా ప్రతినిధులతో కేసుల విషయం మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఆలయంలో అలాంటి విషయాలు మాట్లాడటం సంప్రదాయంకాదని సున్నితంగా తిరస్కరించారు. తాను మొదటి నుండి నర్శింహస్వామివారి భక్తుడిని కావడం వల్లనే స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా వైకుంఠరావు, పట్టణ టిడిపి కార్యదర్శి మైనేని రాధాకృష్ణతో సహా పలువురు జెడి లక్ష్మీనారాయణను కలిశారు. అనంతరం వేదాద్రిలోని బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రాన్ని ఆయన సందర్శించారు. వేదాద్రి, జగ్గయ్యపేట విఆర్‌ఒలు కొల్లి శ్రీను, గెంటేల నారాయణరావు వారిని అనుసరించారు.
కలుషితమైన చెరువు నీరు
* పశువుల మృత్యువాత * రెవెన్యూ సదస్సులో రైతుల మొర
కూచిపూడి, ఏప్రిల్ 4: చెరువులో నీరు కలుషితం కావటంతో పశువులు రోగాల బారినపడి మృతి చెందుతున్నాయని నిడుమోలు గ్రామస్థులు నియోజకవర్గ రెవెన్యూ సదస్సుల ప్రత్యేకాధికారి, ఉడా స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్ నూర్‌బాషా రహంతుల్లా, డిఆర్‌ఓ ఎల్ విజయచందర్‌కు మొరపెట్టుకున్నారు. రెవెన్యూ సదస్సుల సందర్భంగా మొవ్వ మండలం నిడుమోలు శివారు దళితవాడలో గురువారం తహశీల్దార్ జి భద్రు ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో 46 అర్జీలు అందాయి. వీటిలో 22 పట్టాదార్ పాస్ పుస్తకాలు, 12 కౌలు రైతుల రుణ అర్హత కార్డులు, భూముల సర్వేకు ఐదు, డి.్ఫరం పట్టాలకు ఏడు అర్జీలు అందాయి. ఈసందర్భంగా నిడుమోలు గ్రామానికి చెందిన బ్రాహ్మణ చెరువులో చేపల చెంపకందారులు విషపూరితమైన పదార్థాలు కలపటంతో పశువులు మృతి చెందుతున్నాయని డొక్కు లక్ష్మీనారాయణ, జొన్నలగడ్డ లక్ష్మణరావు, గొరిపర్తి శివయ్య, డి రాంబాబు, జె సుబ్రహ్మణ్యం ప్రత్యేకాధికారికి మొరపెట్టుకున్నారు. దీనిపై పాటదారుని హెచ్చరించాలని విఆర్‌ఓను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ జి భద్రు, ఆర్‌ఐ ఎ శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ డివి రమేష్, సర్వేయర్ శేషగిరిరావు, విఆర్‌ఓలు వేణుగోపాలరావు, నెహ్రూ, ఎ రవి, ఆర్ కృష్ణ, సుబ్రహ్మణ్యం, ఎఓ సునీల్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఎఓ సమ్మెట ఆంజనేయ, తదితరులు పాల్గొన్నారు.
సహకరించండి.. అభివృద్ధి చేస్తా!
పెడన, ఏప్రిల్ 4: పెడన నియోజకవర్గ అభివృద్ధికి తనకు సహకరించాలని శాసనసభ మాజీ ఉప సభాపతి, పెడన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బూరగడ్డ వేదవ్యాస్ నాయకులు, కార్యకర్తలను కోరారు. వైఎస్‌ఆర్‌సిపిలోకి వెళ్ళిన ఎమ్మెల్యే జోగి రమేష్ స్థానంలో ఇన్‌చార్జ్‌గా నియమితులైన తరువాత తొలిసారిగా గురువారం ఆయన పెడన వచ్చారు. పార్టీ అధ్యక్షులు కటకం ప్రసాద్, ఉపాధ్యక్షులు మాదాసు బాబూరావు, అధికార ప్రతినిధి సిహెచ్‌వి అప్పారావు, సంయుక్త కార్యదర్శి తాడేపల్లి కృష్ణప్రసాద్, ప్రధాన కార్యదర్శి హనీఫ్ ఖాన్ తదితరులతో తొలుత అగస్తేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు బళ్ళ గంగాధరరావు, మెట్ల చిన్న, పిచ్చుక కోటేశ్వరరావు, దొడ్డిపట్ల గంగరాజు, యక్కల సుకుమర్, యర్రా నాగేశ్వరరావు, తదితరులను కలుసుకుని మద్దతు కోరారు. పలు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ శుక్ర, శనివారాల్లో కృత్తివెన్ను, పెడన పట్టణ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం నాలుగు మండలాల సమావేశాలు పూర్తయిన తరువాత నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఇన్‌చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు వేదవ్యాస్ వివరించారు. బళ్ళ గంగయ్య, దొడ్డిపట్ల నాగేశ్వరరావు, వరుదు రామకృష్ణ, కోడూరు శ్రీను, పడమటి బాబి, తదితరులు పాల్గొన్నారు.
ఇళ్లు కట్టించాలని పేదల ఆందోళన
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 4: స్థానిక జాతీయ కళాశాల పక్కన ఎస్‌ఎన్ గొల్లపాలెం వెళ్ళే రహదారిలో ఉన్న ఖాళీ స్థలంలో ఇళ్లు కట్టించాలని కోరుతూ నిరుపేదలు అక్కడకు చేరుకుని ఆందోళన చేశారు. వీరికి తెలుగుదేశం పార్టీ బందరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొల్లు రవీంద్ర సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ళ స్థలాలు లేక ఈప్రాంతంలో సుమారు వెయ్యి మందికి పైగా నిరుపేదలు అద్దె ఇళ్లలో ఉంటున్నారని, కనుక ప్రభుత్వం స్పందించి వీరికి నివేశన స్థలాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈప్రాంతంలో కాకపోయినా వేరే ప్రాంతంలోనైనా ఇళ్ళస్థలాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోలెం హరిబాబు, నారగాని ఆంజనేయ ప్రసాద్, మోటమర్రి బాబాప్రసాద్, పచ్చిగోళ్ళ కొండలరావు, కాసాని భాగ్యారావు, రాజేంద్రప్రసాద్, ఇలియాస్ బాషా, కె అంజిబాబు పాల్గొన్నారు.
షర్మిలకు ఎమ్మెల్యే కొడాలి ఘన స్వాగతం
గుడివాడ, ఏప్రిల్ 4: షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం ఉదయం 9గంటలకు రెడ్డిపాలెం గ్రామం నుండి గుడివాడ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. వడ్లమన్నాడు గ్రామం వద్ద ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), వేలాది మంది కార్యకర్తలు, ప్రజానీకం షర్మిలకు ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో భాగంగా వడ్లమన్నాడులో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు మహిళలు, రైతులు సమస్యలను షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. డ్వాక్రా రుణాలు అందడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ళస్థలాల కోసం దరఖాస్తు చేస్తున్నా మంజూరు కావడం లేదని పలువురు గ్రామస్థులు చెప్పారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చినా బ్యాంకర్లు వాటిని చూసి నవ్వుతున్నారని రైతులు వాపోయారు. ఈ సమస్యలను విన్న షర్మిల తీవ్రంగా స్పందించారు. రైతులకు సాగునీరు, విద్యుత్ లేక అవస్థలు పడుతున్నారన్నారు. పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారన్నారు. రైతులకు రుణం కూడా అందక అప్పులు పుట్టక అల్లాడుతున్నారన్నారు. డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ, వడ్డీలేని రుణాలు ఇస్తున్నామంటూ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ప్రకటనలు గుప్పిస్తోందని, వాస్తవానికి మహిళల నుండి అధికంగా వడ్డీలు వసూలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఇళ్ళు నిర్మించుకోడానికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 30ఎకరాల భూమిని సేకరిస్తే చిత్తశుద్ధి లోపించిన ప్రభుత్వం ఆయా స్థలాలను ప్రజలకు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. జగనన్న పాలన వచ్చేవరకు పేదలంతా ధైర్యంగా ఉండాలన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని తిరిగి ప్రారంభించడంతో పాటు పింఛన్లను 700 రూపాయలకు పెంచుతామని, వికలాంగుల పింఛన్‌ను వెయ్యి రూపాయలు చేస్తామని హామీ ఇచ్చారు. కష్టకాలంలో జగనన్నకు, నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కొడాలి నానికి ప్రజలంతా మద్దతుగా నిలిచి రాజన్న రాజ్యాన్ని సాధించుకోవాలని షర్మిల సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, నేతలు వాసిరెడ్డి పద్మ, నందమూరి లక్ష్మీపార్వతి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, నియోజకవర్గ నేతలు దుక్కిపాటి శశిభూషణ్ (పండుబాబు), మండలి హనుమంతరావు, యలవర్తి శ్రీనివాసరావు, పాలేటి చంటి, అడపా బాబ్జి, చింతల భాస్కరరావు, కాటాబత్తుల రత్నకుమారి, బాణావత్ ఇందిరారాణి, బొజ్జగాని కోటమ్మ పాల్గొన్నారు.
నడుపూరులో షర్మిల పాదయాత్ర
పెడన, ఏప్రిల్ 4: మండల పరిధిలోని నడుపూరు గ్రామంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకురాలు షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా గురువారం పాదయాత్ర నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు వాకా వాసుదేవరావు, ఉప్పాల రాంప్రసాద్, పార్లమెంట్ ఇన్‌చార్జ్ కుక్కల నాగేశ్వరరావు, సేవాదళ్ జిల్లా కన్వీనర్ మావులేటి వెంకటరాజుతో కలిసి ఆమె రెడ్డిపాలెం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం గుడ్లవల్లేరు మండలంలోకి అడుగుపెట్టారు. రెడ్డిపాలెం వద్ద ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి, ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు షర్మిలకు స్వాగతం పలికారు. కొండలమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం చైర్మన్ పెనే్నరు ప్రభాకరరావు ఆధ్వర్యంలో షర్మిలకు స్వాగతం పలికారు.
12 నుండి టెన్త్ ‘స్పాట్’
మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 4: పదో తరగతి పరీక్షల నిర్వహణలో భాగంగా ఈ నెల 12నుండి స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి డి దేవానందరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 10నుండి మూల్యాంకన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కానీ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 12నుండి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభించనున్నట్లు వివరించారు.
చెరువుల తవ్వకంపై జరిమానా
అవనిగడ్డ, ఏప్రిల్ 4: దక్షణ చిరువోల్లంక శివారు ఒడుగువానిపాలెంలో అనుమతులు లేకుండా అక్రమంగా రొయ్యల చెరువులు తవ్వుతుండటంతో తహశీల్దార్ కె మైనర్‌బాబు గురువారం సంబంధిత రైతులకు 25వేల రూపాయల జరిమానా విధించారు. అదే గ్రామానికి చెందిన సనకా కోటేశ్వరరావు, సనకా అచ్యుత రామయ్య, వెంకటస్వామి, హరిబాబు, వడుగు శ్రీమహావిష్ణుకు చెందిన 50ఎకరాల్లో రొయ్యల చెరువులు తవ్వుతుండగా గుర్తించి జరిమానా విధించారు.
పెనమలూరు సిఐపై కేసు
విజయవాడ , ఏప్రిల్ 4: కమిషనరేట్‌లో పని చేస్తున్న సిఐతోపాటు మరో వ్యక్తిపై పాయకాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం పెనమలూరు స్టేషన్ సిఐగా విధులు నిర్వహిస్తున్న ధర్మేంద్ర గతంలో పాయకాపురం సిఐగా పని చేసిన సమయంలో ఓ పొలం వివాదంలో తల దూర్చినందుకు బాధితురాలైన మహిళ కోర్టును ఆశ్రయించింది. అంబాపురానికి చెందిన పిండ్రాల బుల్లెమ్మ పేరుతో ఆమె భర్త 2004లో 50 సెంట్లు పొలాన్ని కొనుగోలు చేశాడు. పొలం చుట్టూ కంచె వేసుకుని ఆమె వ్యవసాయం చేయసాగింది. అయితే కంచె తొలగించి పొలంలో షెడ్డు వేసుకోవాలని ఇదే ప్రాంతానికి చెందిన గరికపాటి రాధాకృష్ణ అనే వ్యక్తి ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో నున్న పోలీసులు రంగప్రవేశం చేసి రాధాకృష్ణ తరుఫున సిఐ ధర్మేంద్ర బుల్లెమ్మ భర్తను బెదిరించడంతోపాటు తప్పుడు కేసులు బనాయించినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. చేసేదేమీ లేక బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. ఫిర్యాదును పరిశీలించిన మీదట హైకోర్టు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థకు రిఫర్ చేసింది. రాష్ట్ర సేవాధికార సంస్థ నుంచి నగరంలోని మండల న్యాయసేవాధికార సంస్థకు సిఫార్సు చేయగా పలుమార్లు సిఐతోపాటు గరికపాటి రాధాకృష్ణలకు నోటీసులు జారీ అయ్యాయి. అందుకు స్పందించనందున కేసు నమోదు చేయాల్సిందిగా మండల న్యాయసేవాధికార సంస్థ ఫస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును సూచించింది. దీంతో బుల్లెమ్మ ఫిర్యాదుపై న్యాయమూర్తి ఆదేశాల మేరకు పాయకాపురం పోలీసులు సెక్షన్ 506, 509, 385, 120బి కింద సిఐ ధర్మేంద్ర, గరికపాటి రాధాకృష్ణలపై కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌ను కోర్టుకు సమర్పించారు.
దళారుల ప్రమేయం లేకుండా సకాలంలో పనులు
విజయవాడ, ఏప్రిల్ 4: రవాణా శాఖలో వాహనాల రిజిస్ట్రేషన్‌ల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు వరకు నిర్దేశిత గడువులో దళారుల ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకత్వంతో విధులు నిర్వర్తిస్తానని కృష్ణా జిల్లా ఉప రవాణా శాఖాధికారిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన యువకుడు సిహెచ్ శివలింగయ్య చెప్పారు. 2007లో నేరుగా ఆర్‌టిఓగా ఈ శాఖలోకి ప్రవేశించి అన్ని రకాల సమస్యలను అవగతం చేసుకోగల్గానన్నారు. అందుకే దళారుల ప్రమేయం లేకుండా నిర్ణీత కాలంలో పనులు జరిగేలా చర్యలు చేపడుతున్నామన్నారు. శివలింగయ్య గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో వాణిజ్య పరమైన వాహనాలు లక్షా 25 వేలు ఉండగా వీటిల్లో 40 వేల వాహనాలు త్రైమాసిక పన్ను చెల్లించకుండానే తిరుగుతున్నాయని అన్నారు. నిబంధనల ప్రకారం వీటి యజమానులందరిపై చర్య తీసుకునే అవకాశం ఉందన్నారు. సంబంధిత వాహనాలు అందుబాటులో లేకపోతే రెవెన్యూ రికవరీ చట్టం కింద సంబంధిత యజమానుల ఆస్తులను సీజ్ చేయవచ్చన్నారు. అందుకే వాటి యజమానులు ముందుగా సమాచారం అందిస్తే వాటి రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ పన్ను రద్దు చేయవచ్చన్నారు. వాస్తవానికి ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఈ చట్టం అమల్లోకి రాలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇటీవలే పన్ను చెల్లించని 40 వేల వాహనాల యజమానులకు నోటీసులు జారీ చేయగా వీరిలో 9 వేల మంది స్పందించారన్నారు. 1500 వాహనాలు మూలబడ్డాయని తెలియగా వాటి రిజిస్ట్రేషన్లను రద్దు చేశామన్నారు. ఇలాంటి వాహనాలు తమ తనిఖీల్లో పట్టుబడితే 200 శాతం అధికంగా అపరాధ రుసుం వసూలు చేస్తున్నామని చెప్పారు.
తమ కార్యాలయంలో దళారుల బెడద నివారణకు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతన్నామని ఓ ప్రశ్నకు సమాధానంగా శివలింగయ్య చెప్పారు. ఏ పని అయినా నిర్ణీత కాలంలో జరిగేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అంతేగాక తను ప్రతిరోజూ సాయంత్రం 3 నుంచి ఐదు గంటల వరకు అందరికీ అందుబాటులో ఉంటానని, ఫిర్యాదుల విభాగం 9848528 లేదా కాల్‌సెంటర్ 1100, 18004251110 నెంబర్‌ల ద్వారా ఎవరైనా ఫిర్యాదులు చేయవచ్చని వాటికి ఎస్‌ఎంఎస్‌ల ద్వారా జారీ చేస్తామని చెప్పారు. ఆర్‌టిసికి ప్రైవేట్ బస్సుల తాకిడి అధికంగా ఉందనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఏ బస్సు అయినా విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు ప్రయాణీకులతో అది పూర్తి సమాచారంతో వెళ్లాల్సి ఉందన్నారు. అలాగే టాక్స్ కాబ్‌లు సైతం ఇష్టానుసారం ప్రయాణీకులను ఎక్కించుకునే వీలు లేదన్నారు. నిబంధనలను అదుపుతప్పి సంచరించే బస్సులు ఇతర వాహనాలపై భారీగా అపరాధ రుసుంను వసూలు చేయడమే గాక వాటి రిజిస్ట్రేషన్లను సైతం రద్దు చేయడానికి వెనుకాడబోమని శివలింగయ్య చెప్పారు. నగరంలో అనుమతి లేకుండా సంచరించే ఏడు సీట్ల ఆటోలపై దాడులు చేస్తూనే ఉన్నామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నూతన వాహనాలు విక్రయించే డీలర్లు రిజిస్ట్రేషన్‌ల పేరిట అదనపు సొమ్ము వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోగలమని ఆయన హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ఇక ప్రతీ నెలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని చెప్పారు. భారీ వాహనాల వేగంకు చెక్‌పోస్టుల వద్ద అడ్డుకట్ట వేస్తున్నామంటూ స్పీడ్ గన్‌ల ద్వారా వాటి వేగాన్ని గుర్తిస్తూ జిల్లాలో రోజుకు కనీసం 30 కేసులు నమోదు చేస్తున్నామన్నారు.
నగరంలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా
పాతబస్తీ, ఏప్రిల్ 4: వేసవి కాలంలో చోరీలకు ఎక్కువ అవకాశాలున్నాయని, పోలీసులు, ప్రజలు అప్రమత్తంగా ఉంటే నేరాలను నియంత్రించవచ్చని నగర డెప్యూటీ పోలీసు కమిషనర్ రవిప్రకాష్ అన్నారు. నగరంలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సంచరిస్తున్నట్టు తమకు పక్కా సమాచారం ఉందన్నారు. ప్రజల సహకారంతో నేరాలను నియంత్రిస్తామని ఆయన అన్నారు. గురువారం సాయంత్రం పంజా సెంటర్‌లోని శ్రీ కృష్ణవేణి హోల్‌సేల్ క్లాత్‌మర్చంట్స్ కాంప్లెక్స్‌లో డిసిపి ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిపి కొన్ని సూచనలు ఇచ్చారు. హైదరాబాద్ జంట పేలుళ్ల సంఘటన అనంతరం ప్రతి రోజూ సాయంత్రం నగరంలో పలు ప్రాంతాల్లో తాము తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సుమారు రెండు నెలల నుండి అన్ని క్రైం విభాగాల్లో సిబ్బందిని పెంచామని, అడుగడుగునా నిఘా పెంచామన్నారు. దుర్గగుడిపై సిసి కెమెరాలు ఏర్పాటు చేసిన విధంగానే కృష్ణవేణి క్లాత్ మర్చంట్స్ కాంప్లెక్స్‌లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వ్యాపార సంఘ నాయకులకు సూచించామన్నారు.
కృష్ణవేణి క్లాత్ మర్చంట్స్ కాంప్లెక్స్‌లో తనిఖీలు
కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలోని కృష్ణవేణి హోల్‌సేల్ క్లాత్‌మర్చంట్స్ కాంప్లెక్స్‌ని పోలీసులు గురువారం జల్లెడ పట్టారు. డిసిపి రవిప్రకాష్, ఎసిపి టి హరికృష్ణ ఆధ్వర్యంలో కాంప్లెక్స్‌లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. వస్త్ర వ్యాపారుల సంఘం నాయకులకు నేరాలు నియంత్రణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ తనిఖీల్లో డిసిపి, ఎసిపిలతోపాటు సిఐ ఎస్ ప్రసాదరావు, ఎస్‌ఐలు జగదీశ్వరరావు, సత్యశ్రీనివాస్, ఈశ్వరరావు, కొండపల్లి శ్రీనివాసరావు, 20 మంది సిబ్బంది, స్పెషల్ బెటాలియన్స్ పాల్గొన్నారు.
పూర్తి నగదు చెల్లించి పక్కాగృహ హక్కుదారులవ్వాలి
అజిత్‌సింగ్‌నగర్, ఏప్రిల్ 4: జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం నిధులతో నిర్మించిన జి ప్లస్ త్రీ పక్కాగృహ సముదాయాల్లో లబ్ధిపొందిన వారు తాము చెల్లించాల్సిన రుసుమును త్వరితగతిన చెల్లించేందుకు సమాయత్తం కావాలని, పూర్తి రుసుము చెల్లించిన వారికి తమ గృహాన్ని తమ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉన్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ జిఎస్ పండాదాస్ పేర్కొన్నారు. ఈవిషయమై గత నెలలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పూర్తి రుసుము చెల్లించిన వారికి వారి గృహాలను రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీచేసే కార్యక్రమం గురువారం సాయంత్రం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ పండాదాస్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో 18,000 పక్కాగృహాలను నిర్మించగా కేవలం పది వేల రూపాయలను చెల్లించుకుని పక్కాగృహాలను కేటాయించడం జరిగిందని, అయితే వారు చెల్లించాల్సిన మిగిలిన 30 వేల రూపాయలు విజయవాడ నగర పాలక సంస్థ చెల్లించడం జరుగగా ఆ నగదును తిరిగి కార్పొరేషన్‌కు చెల్లించే బాధ్యత ప్రతి లబ్ధిదారునికి ఉందన్నారు. పక్కాగృహం కేటాయించి సంవత్సరాలు గడుస్తున్నా లబ్ధిదారులు కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన నగదును చెల్లించకపోవడంతో స్పెషల్ డ్రైవ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ డ్రైవ్‌లో సుమారు 217 మంది లబ్ధిదారులు స్వచ్చంధంగా ముందుకు వచ్చి పూర్తిస్థాయిలో చెల్లించాల్సిన రుసును చెల్లించడం అభినందనీయమన్నారు. ఈ డ్రైవ్‌లో ఇప్పటి వరకూ రెండు కోట్ల 64లక్షల రూపాయలు కార్పొరేషన్‌కు జమ అయిందన్నారు. వీరిలో 118 మంది లబ్ధిదారుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించి వారికి పూర్తి హక్కు కల్పిస్తూ ఎలాట్‌మెంట్ పత్రాలను అందించడం జరిగిందన్నారు. మిగిలిన వారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్నందున రాబోయే కొద్ది రోజుల్లో వారికి కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం జరుగుతుందన్నారు. జి ప్లస్ త్రీ పొందిన లబ్ధిదారుల్లో ఇంకా ఆరు వేల మంది తమ కాంట్రిబ్యూషన్ చెల్లించలేదని, వారిని కూడా చైతన్యవంతులుగా చేసి పూర్తిస్థాయిలో కాంట్రిబ్యూషన్ చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ పండాదాస్ తెలిపారు. పూర్తిస్థాయిలో కాంట్రిబ్యూషన్ చెల్లించలేని లబ్ధిదారులకు చెల్లించే నగదును బ్యాంకు రుణంగా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ సౌకర్యాన్ని కూడా లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని త్వరితగతిన తమ గృహాలకు హక్కుదారులుగా అవ్వాలని కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజనీర్ జి కొండలరావు, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ఎ ఉదయ్‌కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
స్విమ్మింగ్‌లో పతకాలు పండించిన పిసి
విజయవాడ , ఏప్రిల్ 4: గత నెల 24 నుంచి 30వరకు అస్సాం రాష్ట్రం గౌహతిలో జరిగిన 61వ ఆలిండియా పోలీసు అక్వాటెక్ మీట్‌లో పాల్గొని స్విమ్మింగ్ పోటీలో రెండు బంగారు పతకాలు, మూడు వెండి పతకాలు సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చి తన ప్రతిభ కనపరిచిన పోలీసు కానిస్టేబుల్ మోతుకూరి తులసీ చైతన్య (డబ్ల్యూపిసి 2410)ని నగర పోలీసు కమిషనర్ ఎన్ మధుసూదనరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఆయన కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కృష్ణాజిల్లా కలెక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి, డిసిపి ఎం రవిప్రకాష్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన చైతన్యను అభినందించి ప్రోత్సహించారు. కృష్ణలంక పోలీస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న రామకృష్ణారావు (పిసి 1460) కుమారుడు తులసీ చైతన్య (25). 2012లో నగర పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా ప్రవేశించారు. మొదటి నుంచి స్విమ్మింగ్ పట్ల ఆసక్తి ఉన్న చైతన్య గౌహతిలో జాతీయ స్థాయిలో జరిగిన ఆలిండియా పోలీసు ఆక్వాటెక్ మీట్‌లో పాల్గొని 50మీటర్లు, 100 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ విభాగంలో రెండు బంగారు పతకాలు, అలాగే 200 మీటర్ల ఫ్రీ స్టైల్, 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగాల్లో మూడు వెండి పతకాలను సాధించి తన ప్రతిభ కనబరచడంతోపాటు ఐర్లాండ్ దేశం బెల్‌పాస్ట్‌లో 57దేశాలు పాల్గొనే వరల్డ్ పోలీసు గేమ్స్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ నగర పోలీసు శాఖతోపాటు రాష్ట్ర పోలీసు శాఖ గౌరవ ప్రతిష్టలు ఇనుమడింప చేసేలా స్విమింగ్ పోటీల్లో పతకాలు సాధించింనందుకు చైతన్యకు అభినందలు తెలియచేశారు.
వైస్ చైర్మన్ రాజీనామా
అజిత్‌సింగ్‌నగర్, ఏప్రిల్ 4: కృష్ణాజిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన విజయవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ (పటమట) పాలక మండలిలో విభేదాలు భగ్గుమన్నాయి. చైర్మన్ పోకడలను నిరసిస్తూ సాక్షాత్తూ వైస్ చైర్మన్ పారుపల్లి బంగారు విఠల్ మార్కెట్ కమిటీ ఇన్‌చార్జ్ కార్యదర్శికి ఎం దివాకారరావుకు తన రాజీనామా పత్రాన్ని అందజేయడంతో కమిటీలో నెలకొన్న విభేదాలు మరింత తారాస్థాయి చేరినట్లయింది. వివాదం రేపిన వైస్‌చైర్మన్ విఠల్ రాజీనామా తదుపరి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటన్న విషయంలో కూడా ఇటు వ్యవసాయ మార్కెట్ కమిటీలో తోపాటు నగర కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. దళిత వర్గానికి చెందిన వైస్ చైర్మన్ విఠల్ రాజీనామాను అంగీకరిస్తే పార్టీ దళిత వర్గాల్లో వ్యతిరేకత చుట్టుముడుతుందన్న భావన నగర కాంగ్రెస్ అధినాయకత్వంలో కూడా వాదనలు రేగుతున్నాయి. అగ్రకులానికి చెందిన చైర్మన్ ప్రవర్తిస్తున్న తీరుపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజకీయ పునరావాస కేంద్రంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ పనితీరుపై ఇటీవల గత కొద్ది రోజులుగా పలు అవినీతి అరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కమిటీ చైర్మన్ తీసుకొంటున్న చర్యలు, పాలక సభ్యులపై వ్యవహరిస్తున్న తీరుపై కూడా పలు అరోపణలు నెలకొంటున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుతో రాష్ట్రంలో దళితుల ప్రగతికి దోహదపడుతున్నామని ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం దళితులకు కూడా నామినేటెడ్ పోస్టులు ఇచ్చినట్లే ఇచ్చి పొమ్మనలేక పొగ పెట్టినట్టు వ్యవహరింపచేస్తున్న తీరుకు బంగారు విఠల్ రాజీనామాయే నిదర్శనంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. వాస్తవానికి పేరు, పరపతి ఉన్న వ్యవసాయ మార్కెట్‌లో దళితులకు వైస్ చైర్మన్ స్థాయి నామినేటెడ్ పోస్టు దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వెల్లువెత్తగా ఆ తరువాత పాలన కాలంలో ఎదురవుతున్న చీత్కారాలు, ఏవగింపులు వారి సహనానికి పరీక్షగా మిగులుతున్నాయని, దీంతో వారు పాలక కమిటీలో ఇమడలేక రాజీనామా బాట పడుతున్న విషయానికి ఇదొక నిదర్శనంగా నిలుస్తుంది. విఠల్ తన రాజీనామాలో చైర్మన్ తనపై వ్యవహరించిన వివక్ష తీరును పేర్కొనడం చూస్తే నామినేటెడ్ పోస్టుల్లో దళితుల స్థానం ఏమిటో తేటతెల్లమవుతోంది. గత నెల 23వ తేదీన పాలక కమిటీ ఇన్‌చార్జ్ కార్యదర్శికి రాజీనామా పత్రాన్ని అందజేసినా ఇంతవరకు ఈ విషయంపై పట్టించుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం.