Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పరస్పర సహకారంతోనే నగరాభివృద్ధి

$
0
0

గుంటూరు, ఏప్రిల్ 4: ప్రజలు, నగరపాలక సంస్థ అధికారుల పరస్పర సహకారాలతోనే నగరంలో సంపూర్ణ పారిశుద్ధ్య వ్యవస్థను నెలకొల్పడం సాధ్యమవుతుందని సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పారిశుద్ధ్యంపై అవగాహన సదస్సు, పవర్‌పాయింట్ ప్రజంటేషన్ జరిగింది. ఇన్‌చార్జి కమిషనర్ పి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జెడి విచ్చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మాజీ రాష్టప్రతి అబ్దుల్‌కలాం స్థాపించిన నీడ్స్ స్వచ్ఛంద సంస్థ స్ఫూర్తితో 2020 నాటికి క్లీన్ ఇండియా నినాదంతో గుంటూరు నగరాన్ని సుందరీకరించాలన్నారు. తాను తెనాలి దగర్గలో ఉన్న ప్రగతి రిసార్ట్స్ ఉద్యానవనానికి వెళ్లినప్పుడు అక్కడ ఒక్కదోమ కూడా లేకపోవడాన్ని గమనించానన్నారు. ఈ విషయమై తన మిత్రుడైన కోటేశ్వరరావును అడుగగా చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచడం వల్లే దోమలు వ్యాప్తి లేదని చెప్పడంతో తాను పారిశుద్ధ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. గుంటూరు నగరాన్ని పారిశుద్ధ్య రహిత నగరంగా ఎందుకు తీర్చిదిద్దలేమనే ప్రశ్న మనసులో మెదలడంతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. తాను సామాజిక సేవా స్ఫూర్తితోనే సెలవుపెట్టి ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నామన్నారు. హాస్టల్‌లో చేరే ప్రతి విద్యార్థి మొట్టమొదట రోజు ఒక మొక్కను నాటి చదువుపూర్తయ్యే వరకు మొక్క సంరక్షణ బాధ్యతను స్వీకరించినప్పుడు దేశం పచ్చదనంతో పరవశిస్తుందన్నారు. సూరత్‌లో ప్లేగు వ్యాధి సంక్రమించినప్పుడు రాష్ట్రాన్ని వదిలి ప్రజలు వెళ్లిపోయారని, ఆ సమయంలో నగర కమిషనర్ ప్లేగువ్యాధి నివారణకు కలిసికట్టుగా కృషి చేయడంతో ఆ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారని, దీంతో వెళ్లిపోయిన ప్రజలందరూ తిరిగి వచ్చేలా చేశారని, ప్రస్తుతం గ్రీన్‌సిటీగా సూరత్ వెలుగుతోందని, దీనికి ముఖ్యకారణం ప్రజలందరూ కమిటీగా ఏర్పడి కలిసికట్టుగా పనిచేయడమేనని తెలిపారు. ప్రస్తుతం గ్రీన్‌సిటీలో చండీఘడ్ మొదటిస్థానంలో ఉండగా రెండవ స్థానంలో సూరత్ ఉందని, రాష్ట్రంలో వరంగల్ జిల్లా ముందుందన్నారు. అయితే మనందరి కృషితో గుంటూరు నగరాన్ని రెండవ గ్రీన్ సిటీగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ నగరంలో 86 కోట్ల రూపాయల ఆస్తిపన్ను వసూలైందని, ఈ ఆస్తిపన్నులో పారిశుద్ధ్యం కోసం సగానికి సగం ఖర్చు చేస్తుండటం వల్ల నగరాభివృద్ధి సాధ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరాభివృద్ధికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థల వారు సహకరిస్తే పారిశుద్ధ్యానికి చేసే ఖర్చును ప్రజల సంక్షేమానికి కేటాయించవచ్చన్నారు. ఇందులో భాగంగా చెత్తను అమ్మి వచ్చిన డబ్బుతో పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి, వారి ఆరోగ్యానికి ఖర్చు చేసేందుకు ప్రణాళికలను తయారు చేస్తున్నామన్నారు. వీటన్నింటినీ నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రోజువారీ పారిశుద్ధ్య పనులు నిర్వహించే కార్మికుల్లో కొందరిని ప్రత్యేక కమిటీగా నియమించి అవసరమైనచోట్ల తగిన విధంగా ఉపయోగించడం జరుగుతుందన్నారు. పారిశుద్ధ్య మెరుగుదల కోసం ప్రగతి రిసార్ట్స్ ఎండి కోటేశ్వరరావు 10 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు కార్మికులు ధరించే టోపీలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, అర్బన్ ఎస్‌పి ఆకె రవికృష్ణ, ఘన వ్యర్థ పదార్థాల నిపుణుడు సురేష్ బండారీ, నీడ్స్ ఇండియా న్యూఢిల్లీ సంస్థ ఘన వ్యర్థ పదార్థాల పర్యవేక్షకులు, తెనాలి పర్యావరణ ఇంజనీర్ ఉదయ్‌సింగ్, నగరపాలక సంస్థ డిసి అబ్దుల్ లతీఫ్, ఎంహెచ్‌ఒలు డాక్టర్ లక్ష్మానాయక్, శ్రీ్ధర్, బయాలజిస్ట్ వీర్రాజు, నగరపాలక సంస్థ మినిస్టీరియల్ ఎంప్లారుూస్ అసోసియేషన్ అధ్యక్షుడు నమ్రత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నృసింహుని రథశాలను ప్రారంభించిన స్పీకర్
మంగళగిరి, ఏప్రిల్ 4: స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం ఎదుట గల మరమ్మతులు జరిపి ముస్తాబు చేసిన స్వామివారి రథశాలను గురువారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొనే్నళ్ల క్రితం నిర్మించిన రథశాల శిథిల స్థితికి చేరడంతో సుమారు 8 లక్షల రూపాయల వ్యయంతో గుంటూరుకు చెందిన టుబాకోబోర్డు డైరెక్టర్, టిటిడి ధార్మిక మండలి సభ్యుడు తాడిశెట్టి మురళీమోహన్ రథశాలకు మరమ్మతులు జరిపించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి స్పీకర్ మనోహర్‌కు, మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఘనస్వాగతం పలికారు. తొలుత స్పీకర్ మనోహర్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామివారిని, రాజ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో ఉపప్రధాన అర్చకులు నల్లూరి శ్రీరామచంద్ర భట్టాచార్యులు, దివి అనంత పద్మనాభాచార్యులు స్పీకర్‌ను ఆశీర్వదించారు. దాత తాడిశెట్టి మురళీమోహన్‌తో పాటు పార్టీ నాయకులు మేకల రవికుమార్, రాధా, ట్రస్ట్‌బోర్డు మాజీసభ్యులు దేవతి భగవన్నారాయణ, వాకా ముత్యాలు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జంజనం భిక్షారావు, కంకణాల శివ, విన్నకోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సాగర్ కుడి కాలువకు నీరు విడుదల
విజయపురిసౌత్, ఏప్రిల్ 4: వేసవి లో తాగునీటి ఎద్దడి నివారణకు గురువారం నాగార్జున సాగర్ జలాశయం నుండి కుడి కాలువకు నీటిని విడుదల చేశారు. సాగర్‌క్రస్ట్ గేట్ల ద్వారా తొలుత కుడి కాలువకు రెండు వేల క్యూసెక్కుల చొప్పున సాయంత్రానికి 6,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు సాగర్ చీఫ్ ఇంజనీర్ యల్లారెడ్డి తెలిపారు. డెల్టా ప్రాంతానికి తాగునీటి అవసరాల నిమిత్తం సాగర్ నుండి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సాగర్ జలాశయం నుండి ప్రకాశం బ్యారేజీకి ఆరు వేల క్యూసెక్కుల చొప్పున తొమ్మిదో తేదీ నాటికి 2.6 టిఎంసిల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈతకు వెళ్లి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
చేబ్రోలు, ఏప్రిల్ 4: సరదాగా ఈతకు వెళ్లి చెరువులో పడి ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు మృతిచెందిన సంఘటన ఇది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా మార్టూరు మండలం, రాజుపాలెం గ్రామానికి చెందిన జాస్తి ప్రవీణ్ (22) అనే విద్యార్థి వట్టిచెరుకూరు మండల పరిధిలోని పుల్లడిగుంట గ్రామంలో గల మలినేని ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. గుంటూరులోని ఓ రూంలో ఉంటూ రోజూ కాలేజీకి వచ్చి వెళ్తుంటాడు. అయితే గురువారం నలుగురు విద్యార్థులతో కలిసి ప్రవీణ్ పుల్లడిగుంట గ్రామ సమీపంలోని ఓ చెరువులో సరదాగా ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రవీణ్ మృతిచెందగా భయభ్రాంతులకు గురైన తోటి విద్యార్థులు పరారయ్యారు. సమాచారం అందుకున్న చేబ్రోలు సిఐ జె పూర్ణచంద్రరావు, వట్టిచెరుకూరు ఎస్‌ఐ పి మురళీకృష్ణ సంఘటనా స్థలానికి వచ్చి ప్రవీణ్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చేతికందివచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాపులను సంఘటిత పర్చేందుకు చైతన్యరథయాత్ర
పొన్నూరు, ఏప్రిల్ 4: కాపులను బిసిలుగా గుర్తించి అన్ని రంగాల్లో రిజర్వేషన్ల అమలు డిమాండ్ సాధనకై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాజకీయాలకు అతీతంగా కాపులకు సంఘటితపర్చేందుకు కాపు చైతన్యరథయాత్ర చేపట్టనున్నట్లు రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు కోట శ్రీనివాసరావు తెలిపారు. పొన్నూరులోని మిలీనియం స్కూలు ఆవరణలో గురువారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులను బిసిలుగా గుర్తిస్తామని హామీ ఇచ్చి 2004లో గద్దెనెక్కిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ మాటను విస్మరించారన్నారు. కాపు నేత ఇక్కుర్తి సాంబశివరావు మాట్లాడుతూ 10 వేల కోట్లతో కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకై అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తామని సాంబశివరావు తెలిపారు. ఇందుకోసం విజయవాడలో కాపునేతలను సంఘటితపర్చేందుకు కృషి చేస్తామని, తమ డిమాండ్లను అంగీకరించకుంటే కాపులు ప్రత్యేక పార్టీని కూడా ఏర్పాటు చేసేందుకు వెనుకాడేదిలేదని అన్నారు. విలేఖర్ల సమావేశంలో కాపునేతలు ఆకుల సాంబశివరావు, జి సాయిబాబు, మువ్వా వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వర్షపునీటి సంరక్షణకు చర్యలు అవశ్యం
గుంటూరు (పట్నంబజారు), ఏప్రిల్ 4: వర్షపునీటి సంరక్షణకు చర్యలు చేపట్టకపోవడం వలనే నేడు ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, కృష్ణాజిల్లా భూగర్భజల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎ వరప్రసాదరావు చెప్పారు. గురువారం స్థానిక లాడ్జిసెంటర్‌లోని ఎఎల్ బిఇడి కాలేజీలో అంతర్జాతీయ నీటి సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ఎర్త్‌వాచ్ సంయుక్త ఆధ్వర్యంలో బిఇడి విద్యార్థులకు నీటిసంరక్షణ- యాజమాన్యం అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్ జి డానియేలు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి డిడి వరప్రసాదరావు మాట్లాడుతూ శతాబ్దం క్రితం భూ ఉపరితలంపై సమస్త జీవకోటికి అందుబాటులో ఉన్న నీరు మానవుల విచ్చలవిడి వాడకం వల్ల భూమి అడుగుకి చేరిందన్నారు. పెరుగుతున్న జనాభాతో పాటు అవసరాలకు అధికమొత్తంలో నీటిని వినియోగిస్తూ వాననీటి సం రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. లక్ష్మీపతికుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అంశాలపై బిఇడి విద్యార్థులు విద్యాబోధనలో తర్ఫీదు పొందాలన్నారు. అనంతరం డిడి వరప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. భూగర్భజలశాఖ ఫిజియోజిస్ట్ కె కోటేశ్వరరావు, ఎర్త్‌వాచ్ కన్వీనర్ తిరుపతిరెడ్డి, ఎస్ రామకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పార్థసారథిగా
నృసింహుడు
మంగళగిరి, ఏప్రిల్ 4: స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో జరుగుతున్న ఆస్థాన అలంకారోత్సవాల్లో గురువారం రాత్రి పార్థసారథిగా లక్ష్మీ నృసింహ స్వామివారిని అలంకరించారు. ఈ ఉత్సవ కైంకర్యపరులుగా లంకా నాగేశ్వరరావు, ఆస్థాన కైంకర్యపరులుగా పచ్చళ్ల సుబ్రహ్మణ్యం కుమారులు వ్యవహరించారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు స్వామివారిని అలంకరించారు. పార్థసారథి అలంకారంలో దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహ స్వామివారిని భక్తులు నేత్రపర్వంగా తిలకించారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ ఇఓ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఉత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించారు. శుక్రవారం శ్రీరంగనాయకులు అలంకారం జరుగుతుందని ఇఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
పిల్లలకు కాసు క్లాసు
రొంపిచర్ల, ఏప్రిల్ 4: రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఉపాధ్యాయునిగా మారారు. రొంపిచర్లలో గురువారం మధ్యాహ్నం పలు కార్యక్రమాల్లో పాల్గొని నరసరావుపేటకు వెళుతూ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆయన వెళ్ళారు. తరగతి గదిలో విద్యార్థులను పరిచయం చేసుకున్నారు. అనంతరం బ్లాక్‌బోర్డుపై పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టిన ప్రధాని ఎవరు? ఇందిరాగాంధీతో విభేదించిన సిఎం ఎవరు? నాగార్జునసాగర్ ప్రాజెక్టును కట్టినదెవరు అంటూ రాసి సమాధానాలు చెప్పాలని విద్యార్థులను కోరారు. దీనికి విద్యార్థులు వరసగా జవహర్‌లాల్ నెహ్రూ, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మనందరెడ్డి అని మూడుప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో ఆశ్చర్యపోయిన కాసు మీకు ఎవరో ముందుగా అన్ని చెప్పారంటూ చలోక్తి విసిరారు. పాఠ్య పుస్తకాల్లో ఈ ప్రశ్నలు ఉన్నాయంటూ విద్యార్థులు చెప్పారు.
మహాత్ముల రచనలు మహామంత్ర శక్తిమయాలు
* సామవేదం షణ్ముఖశర్మ
గుంటూరు (కల్చరల్), ఏప్రిల్ 4: సమాజాన్ని ఆధ్యాత్మిక పరంగా జాగృతం చేయాలనే ఏకైక లక్ష్యంతో భవిష్యత్ తరాల వారికి దిశానిర్దేశం చేయాలన్న ఆశయంతో అత్యుత్తమమైన రచనలు అందించిన మహాత్ముల సాహిత్యం, ఎల్లప్పుడూ మహామంత్ర శక్తిమయమైందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ శ్లాఘించారు. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయం వేదికగా గత మూడు రోజులుగా షణ్ముఖశర్మ శ్రీరామ కర్ణామృతమ్ జ్ఞానయజ్ఞ ప్రవచనాన్ని కొనసాగిస్తున్నారు. గురువారం రాత్రి వాల్మీక, వ్యాస, పోతన, ఆదిశంకర, భగవద్రామానుజులు తదితర మహనీయుల రచనల్లోని ఉదాత్తమైన అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని లోకానికి అందించి మానవులంతా సన్మార్గంలో పయనించడానికి దోహదం చేశారన్నారు.
గోడను ఢీకొన్న స్కూల్ బస్సు
* త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
నిజాంపట్నం, ఏప్రిల్ 4: చెరుకుపల్లికి చెందిన హోలియర్ పాఠశాల బస్సు గురువారం ఉదయం విద్యార్థులను అడవులదీవిలో ఎక్కించుకుని పుల్లమెరక మీదుగా నగరం వచ్చేందుకు రెడ్డిపాలెం రహదారిపై సౌత్ డ్రైనేజ్ వంతెనను దాటే సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి రోడ్డుకు మార్జిన్ లేకపోవటంతో వంతెన గోడను ఢీకొంది. అప్రమత్తమైన గ్రామస్థులు విద్యార్థులను బస్సులో నుండి దింపివేశారు. విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవటంతో వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ బస్సులో సుమారు 80 మంది విద్యార్థులున్నారు. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటన జరిగిన ప్రదేశానికి వచ్చి తమ పిల్లలను తీసుకువెళ్లారు. పొక్లెయినర్ సహాయంతో బస్సును అక్కడి నుండి తరలించారు.

ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలపై పెనుభారాలు
* టిడిపి సంతకాల సేకరణలో బోనబోయన
గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 4: ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించి అధికారాన్ని అప్పగించినందుకు ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం పెనుభారాలు మోపుతోందని, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించినందుకు పశ్చాత్తాతప పడుతున్నారని టిడిపి నగర కన్వీనర్, తూర్పు, పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్, జియావుద్దీన్, యాగంటి దుర్గారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీలకు నిరసనగా చేపడుతున్న సంతకాల సేకరణలో భాగంగా గురువారం బోనబోయిన, జియావుద్దీన్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలోని 47,48 డివిజన్లలో, పశ్చిమ నియోజకవర్గంలోని 31,36 డివిజన్లలో యాగంటి ఆధ్వర్యంలో వేర్వేరుగా సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా బోనబోయిన మాట్లాడుతూ రాష్ట్రానికి కేటాయించిన గ్యాస్, బొగ్గు కేంద్రం సరఫరా చేయలేకపోవడం, అవినీతివలన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు ఉత్పత్తి చేయలేక పోతున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ అసమర్థ, అవినీతి విధానాలతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిని, ప్రజలు అష్టకష్టాల పాలవుతున్నారని ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి యాగంటి దుర్గారావు మాట్లాడుతూ పవర్ హాలిడే, విద్యుత్ కోతల కారణంగా పరిశ్రమలు మూతపడి, లక్షలాది మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. విద్యుత్ చార్జీలపై టిడిపి నిర్వహిస్తున్న సంతకాల సేకరణకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో టిడిపి నాయకులు గోళ్ల ప్రభాకర్, ఎలుకా వీరాంజనేయులు, జాగర్లమూడి శ్రీనివాసరావు, ముత్తినేని రాజేష్, దామచర్ల శ్రీనివాసరావు, నాగెళ్ల తిరుపతయ్య, గుంటుపల్లి గురవయ్య, పానకాల వెంకటమహాలక్ష్మి, మానుకొండ శివప్రసాద్, ఎం విజయ, పోతురాజు ఉమాదేవి, ఎం మురళి, కె హనుమంతరావు, సైమన్, జి దయారత్నం, బి సాయి, పొదిలి రమేష్, బి రాజా, ఆదాం, కమలాకర్, మహంకాళి, నరసింహారావు, బాబు, రఘురాం తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాలకతీతంగా జిల్లా అభివృద్ధికి ముందుకు రావాలి: స్పీకర్ మనోహర్
గుంటూరు, ఏప్రిల్ 4: రాజకీయాలకు అతీతంగా జిల్లా ప్రజా ప్రతినిధులందరూ గుంటూరు జిల్లా అభివృద్ధికి ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైందని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని 41వ వార్డు విష్ణునగర్‌లో 82 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్లకు, డ్రైనేజీలకు స్పీకర్ మనోహర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో పాటు కలెక్టర్ సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మనోహర్ మాట్లాడుతూ గుంటూరు జిల్లా ఎంతో చరిత్ర కల్గిందని, దేశంలోనే రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా అని అన్నారు. ఏ విషయంలోనైనా గుంటూరు జిల్లాలో జరిగే పరిణామాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తుంటాయని చెప్పారు. జిల్లా నుండి అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లా ఉన్నారని, భారతదేశానికి ఎంతో ఘనకీర్తిని సంపాదించిపెడుతున్నారని పేర్కొన్నారు. ఇటువంటి జిల్లాను మరింత అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రతినిధులంతా ఆలోచించి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తే బాగుంటుందని సూచించారు. ప్రజల సహకారం, భాగస్వామ్యంతోనే నిరంతర అభివృద్ధి సాధ్యపడుతుందని, దీనికి ఉదాహరణే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రూ. 30 కోట్లతో అనేక వౌలిక సదుపాయాలు కల్పించడమన్నారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని నిరంతర కృషితో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటానని చెప్పారు. గుంటూరు నగరంలో అదనంగా 10 గ్రామాలు కలిసినందున తాగునీటి సమస్య, ఇతర వౌలిక సదుపాయాల ఏర్పాటు చేయాల్సిన ఆవసరం ఉందన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో 450 కోట్ల రూపాయలతో తాగునీటి ప్రాజెక్టు మంజూరైన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ గత ఏడాది గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 30 కోట్ల వ్యయంతో వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎన్‌టిఆర్ స్టేడియంలో శానిటేషన్ టాస్క్ఫోర్స్‌ను లాంఛనంగా ప్రారంభించారు. శాసనమండలి సభ్యుడు సింగం బసవపున్నయ్య, ఇన్‌చార్జి కమిషనర్ పి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

బృందావన వెంకన్న సన్నిధిలో సిబిఐ జెడి
గుంటూరు , ఏప్రిల్ 4: గుంటూరు నగరపాలక సంస్థలో ఏర్పాటు చేసిన పారిశుద్ధ్యంపై అవగాహన సదస్సుతో పాటు పలు ప్రవేటు కార్యక్రమాల్లో పాల్గొనడానికి నగరానికి విచ్చేసిన సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గురువారం బృందావన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని తన మిత్రులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అర్చామూర్తిని లక్ష్మీనారాయణ ధ్యానించారు. అనంతరం అర్చకస్వాములు సిబిఐ జెడిని ఆశీర్వదించి ప్రసాదాలను అందజేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వేరే కార్యక్రమం నిమిత్తం విచ్చేసిన సిబిఐ జెడి లక్ష్మీనారాయణకు బృందావన వెంకటేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాధాకృష్ణమూర్తి, కోశాధికారి లంకా సూర్యనారాయణ, సభ్యులు లంకా విజయబాబు, ముక్కామల మోహనరావు తదితరులు స్వాగతం పలికి శ్రీవారి దర్శనం చేయించారు.
18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ
ఓటు హక్కు కల్పించాలి
అమరావతి, ఏప్రిల్ 4: స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండేలా అధికారులు, బిఎల్‌ఒలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మండల తెలుగు యువత నాయకులు మేకల శ్రీనివాసరావుయాదవ్ కోరారు. ఇప్పటికీ గ్రామాల్లో 40 శాతం మంది యువకులు ఓటు హక్కు పొందలేదని తెలిపారు. బిఎల్‌ఒలు ఇళ్లదగ్గర కూర్చుని కాకుండా ఆయా బూత్‌ల పరిధిలో తిరిగి అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు కల్పించాలని కోరారు.

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: కన్నా
మంగళగిరి, ఏప్రిల్ 4: పేద, బడుగు వర్గాల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం మంగళగిరిలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. పేదల సంక్షేమం గురించి కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీల వారితో చెప్పించు కోవాల్సిన పరిస్థితి లేదని మంత్రి కన్నా అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు సంబంధించి ఈనెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు గ్రామాల్లో కళాజాతాల ద్వారా వివరిస్తామని, విద్య, స్వయం ఉపాధి పథకాల గురించి రూపకల్పన జరుగుతోందని మంత్రి కన్నా అన్నారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో రైతాంగానికి ప్రతి ఏటా ఇబ్బంది కలిగిస్తున్న కొండవీటివాగు ఆధునీకరణ పనులు వేగవంతం జరిపిస్తామని, గుంటూరు ఛానల్ ఆధునీకరణ పనులు కూడా జరిపిస్తామన్నారు. విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టణాలను కలుపుతూ వివిధ అభివృద్ధి పనులు జరుపనున్నట్లు చెప్పారు. విద్యుత్ చార్జీల పెంపు గురించి ఆయన మాట్లాడుతూ పేదలపై భారం పడకుండా చార్జీలపై సమీక్షిస్తామని సిఎం చెప్పారని గుర్తుచేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం గ తంకంటే ఇప్పుడు బాగుందని మంత్రి కన్నా పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతం లేదని, నాయకుడు లేడని కన్నా విమర్శించారు.
విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి
మేడికొండూరు, ఏప్రిల్ 4: విద్యుత్‌షాక్‌కు గురై కార్మికుడు మృతిచెందిన సంఘటన మండలంలోని పేరేచర్లలో గురువారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి... పేరేచర్ల గ్రామానికి చెందిన మర్రిపాలెం కరిముల్లా (30) నాని క్రషర్‌లో కార్మికుడుగా పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే గురువారం క్రషర్‌లో పనికి వెళ్లి వెల్డింగ్ చేస్తుండగా విద్యుత్‌షాక్ తగిలి అక్కడికక్కడే ఊపిరి వదిలాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
6 నుండి క్రికెట్ టోర్నీ
అమరావతి, ఏప్రిల్ 4: అంబేద్కర్ విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో ఈనెల 6 నుండి 13వ తేదీ వరకూ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ విజ్ఞాన సమితి నాయకులు దొంతమాల నరేష్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా 10,116, 5,116, 3,116 ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల క్రీడాకారులు 5వ తేదీ సాయంత్రంలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో నిర్వాహకులు ఎం బాబు, జి రత్న, బి రమేష్, టి నాని తదితరులు పాల్గొన్నారు.

వర్శిటీలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు
నాగార్జున యూనివర్శిటీ, ఏప్రిల్ 4: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 50 కెవి సోలార్ పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఆర్‌ఆర్‌ఎల్ కాంతం గురువారం తెలిపారు. పవర్‌ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం నుండి అనుమతి మంజూరైన మేర ఏర్పాట్లకు సంబంధించి స్థల పరిశీలన, తదితర కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. మొదటి దశలో వర్శిటీలోని దూరవిద్యాకేంద్రం, అడ్మినిస్ట్రేటివ్ భవనం, లైబ్రరీలకు సోలార్ పవర్‌ను వినియోగించనున్నట్లు తెలిపారు.
పీజీలో వచ్చే విద్యాసంవత్సరం నుండి క్రెడిట్ సిస్టమ్
వర్శిటీ పరిధిలో 2013-14 విద్యా సంవత్సరం నుండి పిజి కోర్సుల్లో ఛారుూస్ బేస్‌డ్ క్రెడిట్ సిస్టమ్‌ను అమలు చేయనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఆర్‌ఆర్‌ఎల్ కాంతం తెలిపారు. ఈ మేరకు గురువారం వర్శిటీలోని డైక్‌మెన్ కార్యాలయంలో జరిగిన పిజి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా పిజి అభ్యసిస్తున్న విద్యార్థి 2,3 సెమిస్టర్లలో తనకు నచ్చిన సబ్జెక్టును ఎంచుకునే అవకాశముంటుందని తెలిపారు.
12, 13 తేదీల్లో జీనోమిక్స్‌పై వర్సిటీలో జాతీయ సదస్సు
వర్సిటీ ఫార్మాస్యూటికల్ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 12, 13 తేదీల్లో ‘న్యూ ట్రెండ్స్ ఇన్ మాలిక్యులర్ మెడిసిన్ అండ్ ఫార్మాకోజీనోమిక్స్’ అనే అంశంపై జాతీయసదస్సు జరుగుతుందని వర్సిటీ ఫార్మాస్యూటికల్ కళాశాల ప్రిన్సిపాల్, సదస్సు కన్వీనర్ డాక్టర్ ఎ ప్రమీలారాణి తెలిపారు. వర్సిటీలోని డైక్‌మెన్ ఆడిటోరియంలో రెండు రోజుల పాటు జరిగే ఈ జాతీయ సదస్సులో వైద్యరంగానికి చెందిన శాస్తవ్రేత్తలు, వైద్యులు, పరిశోధకులు పాల్గొంటారని తెలిపారు.

* గ్రీన్ సిటీగా గుంటూరును తీర్చిదిద్దాలి: సిబిఐ జెడి లక్ష్మీనారాయణ
english title: 
green city

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>