విశాఖపట్నం, ఏప్రిల్ 5: తన కాలికి రిపేర్ చేసుకుంటూ.. ప్రభుత్వాన్ని కూడా రిపేర్ చేస్తున్నానని చెప్పుకుంటున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్వపార్టీని రిపేర్ చేసుకోలేకపోతున్నారు. ఆయన జీవితంలో అత్యంత ప్రతిష్ఠాత్మంగా చేపట్టిన వేల కిలో మీటర్ల పాదయాత్రను కష్టమైనా కొనసాగిస్తునే ఉన్నారు. ఇప్పటి వరకూ జనం ఆయనకు నీరాజనాలు పడుతునే ఉన్నారు. అయితే ఆఖరు జిల్లాకు విశాఖకు వచ్చేప్పటికి పరిస్థితి ఏవిధంగా ఉంటుందో చెప్పలేకపోతున్నారు. ఈ జిల్లాలో సీనియర్లు అలకపాన్పు ఎక్కి కూర్చున్నారు. చంద్రబాబు, సుజనా చౌదరి, పార్టీ కార్యదర్శి స్థాయిలో వీరి బుజ్జగింపులు జరిగాయి. వారు జిల్లాకు తిరిగి వచ్చిన చంద్రబాబు పాదయాత్రపై దృష్టి పెట్టారా? పెట్టాలన్నా నాయకత్వ బాధ్యతలు తీసుకున్న వారు అందుకు అవకాశం కల్పిస్తున్నారా? అంటే దీనికి లేదనే సమాధానం వస్తోంది. బాబు పాదయాత్ర గురించి పార్టీలో ఏ ఒక్కరిని కదిపినా, పెదవి విరుస్తున్నారు తప్ప, ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు. అలిగి వెళ్లి, తిరిగి వచ్చిన వారిని, బాబు పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారులో పరిగణలోకి తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మాజీ కార్పొరేటర్లను, పార్టీ మాజీ అధ్యక్షులను ఆహ్వానించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే నడవలేని పరిస్థితిలో ఉన్న చంద్రబాబును జనం ఏమాత్రం లేని ప్రాంతాల్లో అనవసరంగా తిప్పే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు తలెత్తుతున్నాయి. చంద్రబాబు జిల్లాలోకి ఈ నెల 11నే వస్తున్నా, నగరంలోకి ఎప్పుడు వస్తారన్నది ఇప్పటికీ స్పష్టంగా లేదన్న విమర్శలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా శుక్రవారం జిల్లా పార్టీ నాయకులంతా కలిసి బాబు రూటును ఖరారు చేయడానికి ట్రయల్ రన్ వేశారు. కాగా, ఎవరి నియోజకవర్గాల్లో వారు తమ బలాన్ని ప్రదర్శించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇక, చంద్రబాబు పాదయాత్ర ముగించిన చోట పైలాన్ నిర్మాణం, బహిరంగ సభకు సంబంధించి పార్టీ వర్గాల నుంచి ఇప్పటికీ స్పష్టమైన సమాచారం అందడం లేదు.
ఇదిలా ఉండగా ఆదివారం పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు తదితరులు నగరానికి చేరుకుంటున్నారు. పైలాన్ నిర్మించే స్థలం, రూట్ మ్యాప్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత అధికారికంగా ప్రకటన చేస్తారని పార్టీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ తెలియచేశారు.
* ఖరారు కాని బాబు మార్గం
english title:
route
Date:
Saturday, April 6, 2013