విశాఖపట్నం, ఏప్రిల్ 5: విశాఖ నగరాభివృద్ధి సంస్థ ఏ ముహూర్తాన జురాంగ్...హరిత ప్రాజెక్ట్‌ను ప్రారంభించిందో అన్నీ అవరోధాలే.. అన్నీ అడ్డంకులే.. అడుగడుగునా సమస్యలే. అద్యంతం సమస్యాత్మంగా మారిన జురాంగ్ కంపెనీని వదిలించుకుని, మొత్తం ప్రాజెక్ట్‌ను తమ చేతుల్లోకి తీసుకుని, అంతా తమ కనుసన్నలలో పనులు చేయిద్దామనుకుంటే, ఇంకో సమస్య తలెత్తింది. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి అయ్యే సమయనికి అదనంగా 40 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ 40 కోట్లను లబ్దిదారులే భరించాలని వుడా గతంలో సూచన ప్రాయంగా చెప్పింది. సుమారు 700 మంది లబ్దిదారులు ఈ భారాన్ని భరించాలంటే, ఒక్కొక్కరికి ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల అదనపు భారం పడుతుంది. ఇప్పటికే వడ్డీలకు రుణాలు తెచ్చుకుని, ఇళ్ళ నిర్మాణం పూర్తికాక, ఇబ్బందులు పడుతున్న లబ్దిదారులకు మూలిగే నక్కపై తాటిపండు పడినట్టవుతోంది. హరిత లబ్దిదారులంతా ఒక అసోసియేషన్‌గా ఏర్పడి, ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించమని కచ్చితంగా చెప్పేశారు. ఈ విషయమైవుడా కూడా ఆచి తూచి అడుగేస్తోంది. అదనపు భారం గురించి ఇప్పుడే లబ్దిదారులకు చెపితే, వారి నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని, ఆ తరువాత అదనపు భారం గురించి నెమ్మదిగా చెపుదామన్న ఆలోచనలో వుడా ఉంది. హరిత ప్రాజెక్ట్ సర్వాంగ సుందరంగా తయారైన తరువాత కాస్తంత ఎక్కువ ధరకైనా లబ్దిదారులకు అంటకట్టాలన్న ఆలోచనలో వుడా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ పరిస్థితి నుంచి అటు వుడా, ఇటు లబ్దిదారులు బయటపడాలంటే, తాజాగా ఇస్తున్న కాంట్రాక్ట్‌లలో కాస్తంత జాగ్రత్త వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదియేమైనా హరిత లబ్దిదారులకు మాత్రం అదనపు భారం ఇప్పటికీ పొంచి ఉన్నట్టే.
* రూ.40 కోట్ల గురించి తేల్చని విసి * లబ్దిదారుల భరించాలంటే కష్టమే
english title:
haritha gaadha
Date:
Saturday, April 6, 2013