విశాఖపట్నం, ఏప్రిల్ 5: తాగునీటి సదుపాయం కల్పన విషయంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యుఎస్) ప్రణాళిక లేకుండా ముందుకెళ్తోంది. అసలు వస్తాయోరావో తెలియని నిధులతో పనులు చేపట్టేందుకు టెండర్లను పిలిచేందుకు, సమగ్ర ప్రాజెక్టు రిపోర్టులను కోరేందుకు సన్నాహాలు పూర్తి చేయడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 11 నియోజకవర్గాల పరిధిలోని సుమారు 336 ఆవాసాలకు తాగునీటి సదుపాయం కల్పించే ప్రాజెక్టుల విషయంలో గత కొంతకాలంగా ఏనిర్ణయం తీసుకోలేక మల్లగుల్లాలు పడుతోంది. జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పాడేరు నియోజకవర్గ పరిధిలోనే తొమ్మిది ప్రాజెక్టులు, పథకాలు సమగ్ర ప్రాజెక్టు నివేదిక, టెండర్ దశలో మగ్గుతున్నాయి. వీటి విలువ దాదాపు 67 కోట్ల రూపాయల వరకూ ఉంది. ఇక 37 కోట్ల రూపాయల అంచనాలతో చేపట్టే ఎనిమిది ప్రాజెక్టులు టెండర్ దశను దాటి ముందుకెళ్ళిన దాఖలాలు లేవు. గత రెండేళ్ళుగా జిల్లాలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరక్క 13వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల కాలేదు. ఎన్నికైన పాలకవర్గాలు లేకపోతే నిధులను నిలిపివేస్తామని సాక్షాత్తు కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రి పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్నారు. 40 కోట్ల రూపాయల విలువైన పలు పనులు 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టాలని భావించారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగి పాలకవర్గాలు ఏర్పాటైతే కానీ ఈనిధులు విడుదల కావు. భౌగోళికంగా జిల్లాలోని 11 మండలాల్లో 6690కిమీ మేర విస్తరించిన ఉన్న ఏజెన్సీలో 244 గ్రామ పంచాయతీల పరిధిలో 3545 ఆవాసాలు ఉన్నాయి. వీటిలో 2045 ఆవాసాలకు పాక్షికంగానే నీటి సరఫరా జరుతున్నట్టు అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. రక్షిత మంచినీరు అందుబాటులో లేక గిరిజన ప్రాంతాల్లో ప్రజానీకం ప్రతియేటా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వేసవిలో ఏజెన్సీ ప్రాంతంలో మంచినీటికి విపరీతమైన ఎద్దడి ఉంటుంది. ఈసమస్యను ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికలు అధికారుల వద్ద లేవు. ప్రతి వేసవిలోనూ ఎదురయ్యే ప్రధాన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనిపక్షంలో గిరివాసుల తాగునీటి కష్టాలు తీర్చలేమన్నది వాస్తవం.
కదలని కరవు ప్రణాళిక
జిల్లా వ్యాప్తంగా వేసవిలో ఎదురయ్యే తాగునీటి ఇబ్బందులను తక్షణమే ఎదుర్కొనేందుకు వీలుగా ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ప్రతియేటా కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కంటింజెంటీ యాక్షన్‌ప్లాన్ రూపొందించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం సంవత్సరం వేసవి నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు గాను 4.95కోట్లరూపాయలతో ప్రణాళికను రూపొందించారు. ఇదిలా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పాలకవర్గాలు లేకపోవడంతో మంచినీటి సరఫరా తీరు అంతంతమాత్రంగానే ఉంటోంది. కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు ఉన్నప్పటికీ నీటి సరఫరా విషయంలో పరిస్ధితిలో మార్పులేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో చోటుచేసుకుంటున్న అంతరాయాల కారణంగా రక్షిత మంచినీటి పథకాలు రోజల తరబడి పనిచేయట్లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాకు తీవ్ర విఘాతమేర్పడుతోంది. మంచినీటి సరఫరాకు సంబంధించి డెడికేటెడ్ విద్యుత్ లైన్ల ఏర్పాటు అంశం ప్రతిపాదన దశను దాటలేదు. దీంతో గ్రామీణ ప్రాంతంలో నీటి సరఫరాకు విఘాతం తప్పట్లేదు.
* రాని ఆర్థిక సంఘం నిధులతో ప్రణాళిక * డిపిఆర్ దశలో తొమ్మిది, టెండర్ స్టేజ్‌లో ఏడు పథకాలు
english title:
drinking water
Date:
Saturday, April 6, 2013