విశాఖపట్నం, ఏప్రిల్ 5: విశాఖ బీచ్ కారిడార్‌ను అంతర్జాతీయ ప్రమాణాలు, ప్రపంచస్థాయి పర్యాటక హంగులతో విశేషంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో యంత్రాంగంలో కదలికమొదలైంది. కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి చొరవతో ఈప్రాజెక్టు పనులను చేపట్టేందుకు సమీకృత ప్రణాళికను ఖరారు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. దీనిలో భాగంగా పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చందనాఖాన్ అధికారులతో శుక్రవారం నాడిక్కడ సమావేశమయ్యారు. బీచ్‌కారిడార్ సుందరీకరణకు కేంద్రం నిధులు కూడా మంజూరు చేసిన నేపధ్యంలో చేపట్టాల్సిన పనులపై జిల్లా కలెక్టర్, వుడా విసి, జివిఎంసి కమిషనర్ ఇతర అధికారులతో చర్చించారు. విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి భీమునిపట్నం వరకూ బీచ్‌రోడ్డును పర్యాటకంగా అభివృద్ధి పరచేందుకు ప్రస్తుతం ఉన్న ప్రదేశాలతో పాటు కొత్త ప్రాంతాలను గుర్తిస్తామని ఆమె వెల్లడించారు. ఆర్‌కె బీచ్, కైలాసగిరి, రుషికొండ, బావికొండ, తొట్లకొండ, భీమిలి తదితర ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాకు కొత్త హంగులను సమకూర్చేందుకు గల అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆమె ఆదేశించారు. బీచ్ కారిడార్ పనులకు జిల్లా కలెక్టర్ వి శేషాద్రి పర్యావేక్షణ అధికారిగా వ్యవహరిస్తారని ఆమె ప్రకటించారు. వుడా, జివిఎంసి, ఆర్కియాలజీ, ఎపిటిడిసి, పర్యాటక శాఖలు వారివారి పరిధిలో పనులు చేపట్టాల్సి ఉందన్నారు. బావికొండ, తొట్లకొండ వంటి బౌద్దారామ క్షేత్రాలు పర్యాటకులను విశేషంగా అకట్టుకుంటున్నాయని, వీటిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి పరచాల్సి ఉందన్నారు. అలాగే బీచ్‌రోడ్డులో మరో అరుదైన ఎర్రమట్టిదిబ్బలు ప్రాంతాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పచ్చదనం, ల్యాండ్‌స్కేపింగ్ వంటి పనులను చేపట్టనున్నట్టు వెల్లడించారు. పర్యాటక ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఇప్పటికే మధురవాడ, కాపులుప్పాడ, ముడసర్లోవ ప్రాంతాల్లో ప్రైవేటు భాగస్వామ్యంలో 850కోట్ల రూపాయలతో అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాజెక్టులను చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె తెలిపారు. బీచ్‌కారిడార్‌లో వాటర్‌స్పోర్ట్స్ ఏర్పాటు చేసేందుకు అవసమైన అధ్యయనం చేపట్టాలని సూచించారు. భీమిలిలో మత్స్యకారుల ఉత్సవంతో పాటు బుద్ధ జయంతి వంటి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ శేషాద్రి మాట్లాడుతూ బౌద్ద క్షేత్రాలకు పేర్గాంచిన విశాఖలో బుద్ధిస్ట్ సర్క్యూట్ పేరిట బావికొండ, తొట్లకొండ, పావురాలకొండతో పాటు అనకాపల్లి సమీపంలోని బొజ్జన్నకొండలను కలిపి అంతర్జాతీయ స్థాయి పర్యాటక సముదాయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్‌కె బీచ్‌ను అభివృద్ధి పరచడం ద్వారా పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాల్సి ఉందన్నారు. వుడా విసి ఎన్ యువరాజ్ మాట్లాడుతూ బీచ్ కారిడార్ అభివృద్ధిలో వుడా తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు. సమావేశంలో వుడా కార్యదర్శి కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
* పర్యాటకశాఖ ప్రధాన కార్యదర్శి సమీక్ష * త్వరలోనే పనులు ప్రారంభం
english title:
beach corridor
Date:
Saturday, April 6, 2013