Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సరుకుల ప్యాకేజీ...కార్డుదారులకు గజిబిజి

$
0
0

విశాఖపట్నం, ఏప్రిల్ 5: తెలుపురంగు రేషన్‌కార్డుదారులకు ఉగాది కానుకగా పంపిణీ చేయనున్న ప్రత్యేక ప్యాకేజీ కార్యక్రమం గందరగోళ పరిస్థితులను తెచ్చిపెడుతోంది. ఈ ప్యాకేజీ వలన కార్డుదారులకు ప్రత్యేకించిన ప్రయోజనం లేదనేది స్పష్టమవుతోంది. తీసుకునే సరుకుల్లో కోత పడనుంది. కుటుంబంలో ఇద్దరు వారం రోజులు వాడితే సరిపోయే ఈ ప్యాకేజీ కంటితుడుపు చర్యగానే కార్డుదారులు భావిస్తున్నారు. ఈ ప్యాకేజీ ద్వారా కిలో గోధుమలు, ఏమాత్రం సరిపోని కారం, పసుపు, ఉప్పు, చింతపండు, చక్కెర, కందిపప్పు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్యాకేజీని కార్డుదారులు ఒకేసారి పొందవచ్చని, లేనిపక్షంలో ఇందులో కొన్నింటినే తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నతీరు విమర్శలకు దారితీస్తోంది. కిలో కందిపప్పు రూ.50, రూ.6.75కిలో చక్కెర, రూ.40ల విలువైన కిలో పామాయిల్, ఏడు రూపాయలతో కిలో గోధుమలు, మరో 16.50రూపాయలతో కిలో గోధుమపిండి, ఐదు రూపాయల ఉప్పు, రూ. 30లకు అరకిలో చింతపండు, 20రూపాయల విలువైన 250 గ్రాముల కారం, పది రూపాయల వంద గ్రాముల పసుపుపొడి వంటి తొమ్మిది సరకులతో ప్రత్యేక ప్యాకేజీతో కూడిన సంచిని కార్డుదారులకు అందిస్తారు. అంటే ప్యాకేజీ పేరుతో ఉన్న వాటికి కోత విధిస్తున్నట్టే అవుతుంది. ఇంతవరకు గోధుమలు పది నుంచి 15 కిలోల వరకే సరఫరా చేసేవారు. కేంద్రం విడుదల చేసే నిల్వలు, కార్డుదారుల అవసరాలనుబట్టి పది నుంచి 15 కిలోల వరకు ప్రతినెల పంపిణీ చేసే పరిస్థితులు ఇకపై ఉండవు. ప్యాకేజీ పుణ్యమా అని కిలో గోధుమలు మాత్రమే పొందే వీలుంది. అరకిలో చింతపండును మాత్రమే ప్యాకేజీ ద్వారా అందనుంది. బహిరంగ మార్కెట్‌లో రూ.25లిస్తే లభించే చింతపండు 30రూపాయలకు నాణ్యత కొరవడే, అరకిలో మాత్రమే అందిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది. ప్యాకేజీ ద్వారా ఇచ్చే కారం, పసుపు నాలుగు రోజుల కంటే ఎక్కువ రాదు. అదీ బహిరంగ మార్కెట్‌లో ధరలతో పోల్చితే పెద్ద వ్యత్యాసం కూడా కనిపించడంలేదని కార్డుదారులు చెబుతున్నారు. రూ. 185లకు తొమ్మిది సరుకులను ప్యాకేజీగా ఇస్తున్న విదానం కార్డుదారులకు ఏమాత్రం ప్రయోజనం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వచ్చే నెల నుంచే పంపిణీ
ఉగాది కానుకగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తున్నా వాస్తవానికి వచ్చేనెల కోటా ద్వారానే కార్డుదారులకు ఇవి అందనున్నాయి. ఎందుకంటే ఉగాది రోజున హైదరాబాద్‌లో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాంరభిస్తారు. ఈ నెల 15వ తేదీన విశాఖ నగరంలో బహిరంగసభను నిర్వహించి దీని గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. ఈ సభలో ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొంటారు. దీని తరువాత 16వ తేదీ నుంచి 24వరకు రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ లోపు చౌకధరల దుకాణం ద్వారా సరుకుల పంపిణీ పూర్తవుతుంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిబంధనల ప్రకారం ప్రతినెల 3వ తేదీ నుంచి 18వ తేదీలోపు వీటిని అందించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం ఈ నెల అమలు జరపడం ఏ విధంగాను సాధ్యపడదు. కాగా కిలో రూపాయి బియ్యాన్ని యదావిధిగా అందించనున్నారు.

దళితుల సంక్షేమానికి జగ్జీవన్‌రామ్ కృషి ఎనలేనిది
* ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్
విశాఖపట్నం, ఏప్రిల్ 5: దళితుల సంక్షేమానికి డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ ఎనలేని కృషి చేశారని ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ కొనియాడారు. మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్ 106వ జయంతోత్సవాలను పురస్కరించుకుని సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాప్రజాపరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. దళితుల సంక్షేమం, అభివృద్ధి కాంక్షిస్తూ రాజ్యాంగపరంగా వారికి ఎన్నో రిజర్వేషన్లు, హక్కులు, సౌకర్యాలను కల్పించడంలో జగ్జీవన్‌రామ్ కూడా కీలకపాత్ర పోషించారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ తదితరులు ఉన్నత విద్యలు అభ్యసించబట్టే ఎంతో చైతన్యంతో సామాజిక రుగ్మతలను, అసమానతలను రూపుమాపేందుకు కృషి చేశారన్నారు. అందువల్ల ప్రతిఒక్కరూ ఉన్నత విద్యలను అభ్యసించాలన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నపుడే దళితుల సంక్షేమానికి, అభివృద్ధికి పలు కమిటీలు, పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడం జరిగిందన్నారు. ఇదే క్రమంలో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించడం జరిగిందన్నారు. ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించడం ఎంతో శుభపరిణామని, ఎస్సీ,ఎస్టీల అభివృద్ధి, సంక్షేమానికి అభివృద్ధికి శక్తివంచన లేకుండా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదనడానికి ఈ చట్టమే నిదర్శనమన్నారు. కలెక్టర్ వి.శేషాద్రి మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో ఒక కుగ్రామంలో జన్మించిన జగ్జీవన్‌రామ్ స్వయంకృషితో ఉన్నతవిద్యను అభ్యసించి అట్టడుగు స్థాయి నుండి దేశ ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తిగా పేర్కొన్నారు. నిమ్నజాతి, అట్టడుగు వర్గాల ప్రజమల్లో ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తూ సామాజికంగా, ఆర్థికంగా వారిని అభివృద్ధిపర్చేందుకు జగ్జీవన్‌రామ్ చేసిన సేవలు చిరస్మణీయమన్నారు. కేంద్ర వ్యవసాయ, రక్షణ, కార్మికశాఖమంత్రిగా ఈ దేశానికి సేవలు అందించి ఎన్నో వినూత్న పథకాలకు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. వారి వల్ల ఆపదవులకే ఒక నిండుతనం చేకూరిందన్నారు. నేటి యువతరానికి వీరి జీవితమే ఒక సందేశమన్నారు. రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించడం ఎంతో ముదాహవమన్నారు. ఈ చట్టం ఎస్సీ,ఎస్టీ, అభివృద్ధి సంక్షేమానికి మరింత దోహదపడుతుందనడంలో సందేహం లేదన్నారు. ఈ చట్టం ఎస్సీ,ఎస్టీ అభివృద్ధి, సంక్షేమానికి మరింత దోహదపడుతుందనడంలో సందేహం లేదన్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్లాన్ బడ్జెట్ రూ.52 వేల కోట్లు కాగా, అందులో 8,500 కోట్లు ఎస్సీ,ఎస్టీల సంక్షేమం, అభివృద్ధికి వినియోగిస్తున్నట్టు చెప్పారు. జగ్జీవన్‌రామ్ ఆశయాల సాధనకు జిల్లాయంత్రాంగం పునరంకితం అవుతుందన్నారు. శాసనమండలి సభ్యులు డి.వి.సూర్యనారాయణరాజు మాట్లాడుతూ కేంద్ర వ్యవసాయమంత్రిగా జగ్జీవన్‌రామ్ హరిత విప్లవం అమలు చేయడంలో కీలకపాత్రం పోషించారని, 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారతదేశం విజయవం సాధించడంలో రక్షణమంత్రిగా ప్రధాన భూమిక పోషించారన్నారు. శాసనసభ్యులు తైనాల విజయకుమార్, పంచకర్ల రమేష్‌బాబు, మళ్ళ విజయప్రసాద్, మాజీ కార్పొరేటర్ కె.వెంకటరావు, ఎస్‌సి సంఘాలకు చెందిన నాయకులు దళితుల సంక్షేమం, అభివృద్ధికు జగ్జీవన్‌రామ్ చేసిన సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. ఈ సందర్భంగా రూ.30 లక్షల విలువైన ఆస్తులను పలు పథకాల కింద ఎస్సీ లబ్ధిదారులకు ప్రభుత్వవిప్ కలెక్టర్ పంపణీ చేశారు. కులాంతర వివాహాలు చేస్తున్న దంపతులకు ప్రోత్సాహాక బహుమతిగా పది వేలు చెక్‌లను అందజేశారు.
ఇందిరమ్మ సంక్షేమ కళాజాత ప్రారంభం
ఈ ఏడాది జనవరి 24వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన ఎస్సీ,ఎస్టీ తెగల ఉప ప్రణాళిక చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ నెల 5వ తేదీ నుండి 14 వరకు జిల్లాలో నిర్వహించనున్న ఇందిరమ్మ సంక్షేమ కళాజాత కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, కలెక్టర్ శేషాద్రి ప్రారంభించారు. హైదరాబాద్ నుండి వచ్చిన సుశిక్షతులైన కళాబృందం జిల్లాలో పది రోజులపాటు ఉప ప్రణాళిక చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. లంకెల బిందెలు లఘునాటిక నృత్యరూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదనపు జెసి వై.నరసింహరావు, సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు డి.శ్రీనివాసన్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి నంబూద్రిపాద్, మాజీ ఎమ్మెల్యేల గంటెల సుమన, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు.

హోటల్ సూపర్‌వైజర్ దారుణ హత్య
* ఉద్యోగంలోకి చేరిన పదిరోజులకే మృత్యువాత
* హత్యచేసి కోస్టల్ బ్యాటరీ ఫుట్‌పాత్‌పై వదిలేసిన అగంతకులు

విశాఖపట్నం, ఏప్రిల్ 5: విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. బీచ్‌రోడ్డులోని ఓ హోటల్‌లో ఉద్యోగానికి చేరిన పది రోజులకే మృత్యు వాత పడ్డాడు. ఒంటిపై ఉన్న కత్తి గాట్లను బట్టి గుర్తు తెలియని వ్యక్తులు అతనిని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. కోస్టల్ బ్యాటరీ వద్ద శుక్రవారం తెల్లవారుజామున మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలివి. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి ప్రాంతానికి చెందిన దుర్గాసి రవికుమార్ అలియాస్ రవి(34) బీచ్‌రోడ్డు సమీపంలోని అప్నా డాబాలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. పది రోజుల క్రితమే ఉద్యోగంలో చేరినట్టు డాబా నిర్వాహకులు తెలిపారు. గతంలో పెందుర్తిలోని బార్ అండ్ రెస్టారెంట్‌లో రవి పని చేశాడు. అర్థరాత్రి 12.30గంటల సమయంలో డాబా సమీపంలో రవి స్థానికులతో కలిసి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా శుక్రవారం తెల్లవారుజామున కోస్టల్ బ్యాటరీ ఫుట్‌పాత్ వద్ద విగత జీవిగా రవి పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుని నుదిటిపై కత్తితో దాడి చేసినట్టు గాయాలు ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు రవిని హత్య చేసి పడివేసినట్టు పోలీసులు గుర్తించారు. పాత కక్షల నేపధ్యంలో జరిగిందా లేక ఇతర కారణాలతో అగంతకులు రవిని హత్య చేశారా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సివుంది. అగంతకులు కత్తులతో దాడి చేసి రవిని హత్యచేసినట్టు పోలీసులు ప్రాధమిక నిర్థారణకు వచ్చారు. అగంతకులు ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను సిఐ ఇలియాస్ ఆహ్మద్ రంగంలోకి దించారు. మృతుని బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్ మార్చురీకి తరలించారు. సిఐ ఇలియాస్ ఆహ్మద్ నేతృత్వంలో ఒకటో పట్టణ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం
విశాలాక్షినగర్, ఏప్రిల్ 5: శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం సందర్భంగా ఎంవిపి కాలనీ టిటిడి దేవస్థానం కళ్యాణమండపంలో శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణ వైభవంగా జరిగింది. శ్రీవారి సేవా సమితి సభ్యులు ప్రతిష్ఠించిన స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు వేదపండితులు పానంగపల్లి రంగనాధాచార్యులు బృందం ఆధ్వర్యంలో అచ్చంగా తిరుమలలో జరిగే పంచామృత సేవను తలపించే విధంగా శాస్త్రోక్తమైన పద్ధతిలో పంచామృతాభిషేకం కనులపండువగా వేద పారాయణంతో భక్తిశ్రద్ధలతో నిర్వసించారు. నూతన పట్టు పీతాంబరాల సమర్పణ, కన్యాదానం, మాంగల్యధారణ, వంటి ఘట్టాలన్నీ క్రమపద్ధతిలో జరిగాయి. గులాబి, చామంతి, బంతి తదితర పుష్పాలతో పాటు బొప్పాయి, బత్తాయి, పుచ్చ, మస్క్‌మిలాన్ వంటి ఫలాలను భక్తులు స్వామికి సమర్పించారు. ప్రతి శ్రవణా నక్షఅతానికీ తాము ఈ తరహా అభిషేకాలు నిర్వహించడం గత కొనే్నళ్లుగా ఆనవాయితీగా వస్తోందని తితిదే హిందూధర్మ ప్రచార పరిషత్ వివాఖ జిల్లా ధార్మిక సలహామండలి పూర్వపు గౌరవ కోశాధికారి హిమాంశుప్రసాద్ వివరించారు.

టెర్న్ డిస్టిలరీ కాలుష్యంపై ఆందోళన
కశింకోట, ఏప్రిల్ 5: మండలం తాళ్లపాలెంలో ఉన్న టెర్న్‌డిస్టలరీ ఫ్యాక్టరీ కాలుష్యం కారణంగా పలువురు వివిధ రోగాల బారిన పడుతున్నారని గ్రామస్థులు శుక్రవారం జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి రాస్తారోకో నిర్వహించారు. అదే సమయంలో ఎం.పి సబ్బంహరి నర్సీపట్నం వైపు వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌ను ఆందోళనకారులు అడ్డగించి సమస్యలను వివరించారు. దీంతో ఆయన స్పందించి ఫ్యాక్టరీ సంగతి తేలుస్తానని, నేనంటే ఏమిటో నిరూపిస్తానని ఎంపి హరి హెచ్చరించారు. ఈ సందర్భంగా అనకాపల్లి మార్కెట్‌కమిటీ చైర్మన్ మలసాల కిషోర్, మాజీ సర్పంచ్ చిన్నివల్లభనారాయణరావు, కాంగ్రెస్ నాయకులు కాయల మురళీధర్, అద్దంకి సతీష్, చిన్నిజనార్ధన్, మలసాల కుమార్‌రాజా మాట్లాడుతూ ఫ్యాక్టరీ దుర్వాసన కారణంగా 11 గ్రామాల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, చిన్నారులు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా గ్రామస్థులంతా జాతీయ రహదారిపై వచ్చి సుమారు రెండు గంటలసేపు ఆందోళన నిర్వహించారు. ఈ సమస్యపై శుక్రవారం నాటికి 19వ రోజు రిలే నిరాహారదీక్షలు పూర్తయ్యాయి. ఈ శిబిరంలో కోన దేముళ్లు, కోసిరెడ్డి పవన్‌కుమార్, గంటారాజు, చిన్ని అప్పారావు పాల్గొన్నారు.

బెల్లం మార్కెట్ బంద్ విరమణ
అనకాపల్లి, ఏప్రిల్ 5: బెల్లం దిమ్మలు ప్యాకింగ్ చేసి ఎగుమతి చేసేందుకు మార్కెట్‌లోని కలాసీలకు చెల్లించే కూలి రేట్లను ఎట్టకేలకు ఎగుమతి వర్తకులు పెంపుదల చేశారు. దీంతో గత ఐదురోజులుగా అనకాపల్లి బెల్లం మార్కెట్ కార్మికులు తలపెట్టిన బంద్ విరమణకు మార్గం సుగమమైంది. శనివారం నుండి మార్కెట్‌లో యథావిధిగా బెల్లం క్రయవిక్రయాలు జరగనున్నాయి. వంద దిమ్మలకు కొలగార్లకు ఇంతవరకు 280 రూపాయలు చెల్లిస్తున్నారు. 30 శాతం కూలి రేట్లు పెంచాలని మార్కెట్ కలాసీలు సమ్మెకు దిగారు. ఎట్టకేలకు అనకాపల్లి వర్తకసంఘం అధ్యక్ష, కార్యదర్శులు తమ్మన రఘుబాబు, కొణతాల లక్ష్మీనారాయణరావు సమక్షంలో ఎగుమతి వర్తకులతో, కలాసీల సంఘం నేతలతో జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. వంద దిమ్మలకు చెల్లించే 280 రూపాయల కూలి రేటును 342రూపాయలకు పెంచేందుకు ఎగుమతి వర్తకులు అంగీకరించారు. దీంతో శనివారం నుండి సమ్మె విరమించుకుని యథావిధిగా విధుల్లో పాల్గొననున్నారు. ఐదురోజులుగా అనకాపల్లి మార్కెట్‌కు వచ్చిన బెల్లం అనూహ్యంగా ఉంది. శనివారం దాదాపుగా లక్షన్నర దిమ్మల బెల్లం ఒకేరోజు అమ్మకం జరిగే పరిస్థితి ఉంది. వర్తకులకు, కలాసీలకు జరిపిన చర్చల్లో ఎగుమతి వర్తకులు బుద్ధ సత్యనారాయణ, ప్రసాద్, కళాసీల సంఘం నేతలు సూరిశెట్టి నూకరాజు, పొలిమేర మణి పాల్గొన్నారు.

మహిళల రక్షణకు చట్టాలపై అవగాహన అవసరం
* డిఐజి స్వాతిలక్రా
అనకాపల్లి , ఏప్రిల్ 5: మహిళల రక్షణ చట్టాలపై అన్ని వర్గాల్లోను అవగాహన పెంపొందాలని, ఇందుకు మహిళా సంఘాలు నడుం బిగించాలని విశాఖపట్నం డిఐజి స్వాతిలక్రా పిలుపునిచ్చారు. పోలీస్‌శాఖ ప్రవేశపెట్టిన జయహో మహిళలో భాగం గా గ్రామాల వారీగా మహిళల భద్రతా కమిటీల ఏర్పాటుకు జిల్లా ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. శుక్రవారం స్థానిక న్యూకాలనీలోని రోటరీ కళ్యాణ మండపంలో మహిళా భద్రతా కమిటీల ఏర్పాటుపై శిక్షణ శిబిరానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకమైన కమిటీలు ఏర్పాటు కావడం జిల్లానుండే శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. జిల్లాలో మహిళా రక్షణ దళాలు సమర్ధవంతంగా పనిచేసి ఇతర జిల్లాలకు స్ఫూర్తి కావాలన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ జయహో మహిళా జిల్లా వ్యాప్తంగానే మంచి సత్ఫలితాలు ఇస్తుందన్నారు. నర్సీపట్నం ఒఎస్‌డి ఆర్.దామోదర్ మాట్లాడుతూ మహిళా రక్షణ దళాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు.
ఈ శిక్షణ శిబిరాలు ఏప్రిల్ 5నుండి 19వతేదీ వరకు జరుగుతాయన్నారు. మగవారితో సమానంగా అన్నింట్లో మహిళలకు సమాన హక్కులు వచ్చా యి. అయినప్పటికీ అత్యాచారాలు, అత్తమామల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. వీటిని అరికట్టేందుకు ప్రతి గ్రామంలో ఐదుగురి చొప్పున మహిళలను ఒక కమిటీగా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ విఎస్‌ఆర్ మూర్తి, జిల్లా లోక్ అదాలత్ కమిటీ చైర్మన్ ఆర్. శ్రీనివాసరావు, ఐసిడిఎస్ పిఒ కె.రమణమ్మ, టౌన్ సిఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

కమ్ములుని హతమార్చింది మేమే
* మావోయిస్టుల వెల్లడి
సీలేరు, ఏప్రిల్ 5: ఆంధ్రా - ఒడిశా సరిహద్దు మల్కన్‌గిరిజిల్లా బోడపొదర్ గ్రామంలో కొమ్ములుని హతమార్చింది తామేనని సి.పి.ఐ. మావోయిస్టు కుడుముగుల గుమ్మా ఏరియా కమిటీ కార్యదర్శి రుక్‌ధర్ విలేఖరులకు పంపిన లేఖలో పేర్కొన్నారు. కమ్ములని తాము అన్యాయంగా హతమార్చామని పోలీసులు వాల్‌పోస్టర్లను మద్రించి జిల్లా వ్యాప్తంగా తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్నారు. కమ్ములు కనీల్ వినీల్‌కృష్ణ కిడ్నాప్ సమయంలో చర్చల పేరుతో మధ్యవ్యక్తిగా వ్యవహరించాడని, అనంతరం మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ బలవత్‌సింగ్ జిల్లా ఎస్పీ అనిరుద్దీన్‌సింగ్‌తో చేతులు కలిపి పోలీసు ఇన్‌ఫార్మర్‌గా మారి బోదపొదర్‌లో అనేక మందిని చిత్రహింసలకు గురి చేసి , గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి జైల్‌కు పంపించే విధంగా పోలీసులకు సహకరించాడన్నారు. బి.ఎస్.ఎఫ్. పోలీసులు, కలెక్టర్ నేను చెప్పినట్లు చేస్తారని గిరిజనులను బెదిరించేవాడని, అనేక అక్రమాలకు పాల్పడ్డాడని లేఖలో పేర్కొన్నారు. ఇంత జరిగినా కమ్ములు అక్రమాలను ఎత్తి చూపలేకపోయారన్నారు. తాము హతమార్చితే మీడియా కూడా తామే తప్పు చేశామని కధనాలు రాయడం సరికాదన్నారు. కమ్ములు వంటి ఇన్‌ఫార్మర్లు చాలా మంది ఉన్నారని, వారు తీరు మార్చుకోకపోతే ప్రజాకోర్టులో శిక్ష తప్పవని కుడుముల గు మ్మా ఏరియా కార్యదర్శి దుక్‌ధర్ హెచ్చరించారు.

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
అనకాపల్లి , ఏప్రిల్ 5: మండలంలోని వల్లూరు గ్రామానికి చెందిన ముగ్గు రు వ్యక్తులు అనకాపల్లి కూరగాయల మార్కెట్‌కు ఆటోలో వస్తుండగా వీరి ముందువెళ్తున్న లారీని బ లంగా ఢీకొనడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆటోలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వల్లూరుకి చెందిన ఆటోడ్రైవర్ పింటుబోయిన శంకర్రావు, ప్రకాష్, బాడిదబోయిన అప్పలనర్శమ్మ, సిమ్మా వరలక్ష్మీ నలుగురు శుక్రవారం ఉదయం అనకాపల్లి హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌కు ఆటోలో వస్తుండగా కొప్పాక సమీపంలో ఏలేరు వంతెనుపై ముందు వెళ్తున్నలారీ ఆకస్మాత్తుగా ఆగిపోవడంతో ఆటో అదుపుతప్పి లారీని బలంగా ఢీకొంది. దీంతో ఆటోడ్రైవర్ శంకర్రావు మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రకాష్, అప్పలనర్సమ్మ, వరలక్ష్మీ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108లో స్థానికులు వందపడకల ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొత్తగా 108 ఫాస్టు ట్రాక్ కోర్టులు ఏర్పాటుకు యోచన
న్యాయ శాఖామంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి
యలమంచిలి , ఏప్రిల్ 5: సత్వరం న్యాయం అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 108 పాస్టు ట్రాక్ కోర్టులను 84 అదనపు కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని న్యాయశాఖ మంత్రి ఎరాస్ ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన యలమంచిలి విచ్చేసిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కన్నబాబురాజు నివాసంలో విలేఖర్లుతో మాట్లాడారు. కక్షిదారులకు న్యాయం అందించడంలో జాప్యం జరుగుతున్న విషయం వాస్తవమేనన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 84 సాధారణ కోర్టులతోపాటు మరో 108 పాస్టు ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్త్తున్నామన్నారు. ఇప్పటి వరకు హైకోర్టులో 2.40 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దిగువ కోర్టుల్లో మరో 9 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. పాస్టు ట్రాక్ కోర్టుల వలన న్యాయం కోసం సంవత్సరాలపాటు నిరీక్షీంచవలసిన పని ఉండదని, పదిరోజుల్లో తీర్పులు వెలువడతాయని ప్రతాప్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నబాబురాజు, మాజీ జెడ్పీటిసి ఆడారి శ్రీ్ధర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

* కోటాలో కోతలు...తప్పని వెతలు
english title: 
card holders

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>