శ్రీకాకుళం, ఫిబ్రవరి 12: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అధిక ఆదాయం అందించే మద్యం వ్యాపారంపై గత కొన్నాళ్ళుగా కారుమబ్బులు కమ్ముకున్నాయి. తొలుత బెల్టుషాపులు ఎత్తివేయాలని, అనంతరం ఎమ్మార్పీకే విక్రయించాలని విపక్షాలు కిరణ్ సర్కార్‌పై ముప్పేట దాడి చేయగా దీనిపై ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరైంది. ఇంతలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పి.సి.సి. చీఫ్ బొత్స సత్యనారాయణ మధ్య కోల్డ్‌వార్ చిలికిచిలికి గాలివానలా ఎ.సి.బి. సోదాలకు దారితీసింది. ఇక్కడ నుంచి సిండికేట్లు, ఎక్సైజ్ అధికారులు, రాజకీయ ప్రముఖులను కష్టాల్లోకి నెట్టేసింది. ఎ.సి.బి. అధికారులు రాజధాని నుంచి దాడులు ప్రారంభించి శివారు జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో కూడా వీటిని కొనసాగించడంతో సిండికేట్ల నుంచి నెలవారీ మామూళ్ళ గుట్టురట్టయింది. ఇందులో ప్రధాన భూమిక పోషించే సిండికేట్లు, ఆ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది వీరికి చేయూతను అందించిన ఎక్సైజ్ అధికారులకు జైలుయోగం తప్పలేదు. ఇంత జరిగినా ఎసిబి అధికారులు మరింత లోతుగా ముడుపుల వ్యవహారంలో సోదాలు జరపడంతో సాక్షాత్తు రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణకు నెలవారీ మామూళ్ళు లక్షల్లో అందిస్తున్నామని ఓ సిండికేటు యజమాని నోరు విప్పడంతో కిరణ్ సర్కార్‌పై నీలినీడలు అలముకున్నాయి. ఓవైపు విపక్షాలు ముడుపుల సర్కార్ అంటూ ముప్పేట దాడి, మరోవైపు ఆగని ఎసిబి సోదాలు ఆబ్కారీ శాఖామంత్రి మోపిదేవి వెంకటరమణను ఉక్కిరి బిక్కిరి చేసిన విషయం తెలిసింది. దీనినుంచి బయట పడేందుకు మంత్రి వెంకటరమణ సి.ఎం.కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి వివరణ ఇచ్చినా ఫలితం లేకపోయింది. మామూళ్ళ రగడకు పుల్‌స్టాప్ పెట్టకుంటే పార్టీతోపాటు సర్కార్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని పసిగట్టిన మంత్రి మోపిదేవి హుటాహుటిన శ్రీకాకుళంలో కొలువై ఉన్న ఆదిత్యునికి ప్రత్యేక పూజలు పేరిట విశాఖలో ఆశాఖ అధికారులతో అత్యవసర సమావేశాన్ని రహస్యంగా నెరిపినట్లు తెలిసింది.
రాజమండ్రికి చెందిన ఎసిబి అధికారులు జిల్లాలో సోదాలు జరిపి ఇందులో ఆరుగురిని కస్టడీలోకి తీసుకుని విశాఖ కేంద్రంగా విచారణ పేరిట మరిన్ని వివరాలు బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేంద్రంగా మంత్రి ఎక్సైజ్ అధికారులు అప్రమత్తంగా ఉండి మామూళ్ళ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా అట్టిపెట్టాలని ఆదేశించినట్లు సమాచారం. కీలక ఆధారాలు అధికారులు, సంబంధిత స్టేషన్‌లలో లభ్యం కాకుండా జాగ్రత్త పడాలని హితబోధ చేసినట్లు తెలిసింది. సిండికేట్ వ్యవహారాన్ని పక్కనపెట్టి షాపులు దక్కించుకున్న యజమానులు ఎమ్మార్పీకే విక్రయించేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్ల విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఎక్సైజ్ ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించి రహస్య ఎజెండాను అమలు చేయాలని మీడియాకు కూడా ఎటువంటి అంశాలు వెల్లడించకుండా జాగ్రత్త వహించాలని మంత్రి సూచించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పరువు ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలనే ఓ సినీ రచయిత చెప్పినట్లు మంత్రి మోపిదేవి ఈ ఫార్ములాను అమలుచేసే పనిలో సమావేశాన్ని రహస్యంగా నిర్వహించినట్లు తెలియవచ్చింది. ముడుపుల వ్యవహారంలో కిరణ్ సర్కార్ ప్రతిష్ఠను సిండికేటులే దిగజార్చారని, అందువలన అటువంటి వ్యాపారాల జోలికి పోకుండా అమ్మకాలు ఎమ్మార్పీకు సాగించేలా ఎక్సైజ్ అధికారులు కీలకపాత్ర పోషించాలని కోరినట్లు ఆ శాఖలో చర్చసాగుతోంది. బయటకు మాత్రం స్వామి కార్యం అంటూ మంత్రి మోపిదేవి ఆదిత్యుని సన్నిధిలో తారసపడిన మీడియా ప్రతినిధులవద్ద వెల్లడించడం విశేషం.
కిరణ్ సర్కార్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రత్యక్ష దైవరైన సూర్యనారాయణుడిని కోరుకున్నానని పేర్కొనడం గమనార్హం. గత ఏడాది కూడా ఆదిత్యునిని దర్శించుకునేందుకు తాను వచ్చానని, దేవుడు సన్నిధిలో ఎక్సైజ్ కోసం ఎందుకంటూ బుకాయించి మంత్రి అక్కడ నుంచి పలాయనం చిత్తగించడంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. రాష్ట్ర క్యాబినెట్‌లో కీలకశాఖ బాధ్యతలు వహిస్తున్న మంత్రి మోపిదేవి ఎటువంటి హంగు ఆర్బాటం లేకుండా జిల్లాలో కాంగ్రెస్ పెద్దలకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎక్సైజ్ శాఖాధికారులను వెంట పెట్టుకుని పూజలు జరిపించి వెనుదిరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
====
వసతి గృహాల్లో తనిఖీలు
* విద్యార్థుల గైర్హాజరు * నివేదిక పంపుతా: టాస్క్ఫోర్స్ అధికారిణి
వీరఘట్టం, ఫిబ్రవరి 12: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంతోపాటు వెనుకబడిన బాలికల వసతి గృహాలను ఆదివారం మండల టాస్క్ఫోర్స్ అధికారిణి, ఎస్‌సి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహాలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. బాలుర వసతిగృహంలో 60 మంది విద్యార్థులకు ఏడుగురు విద్యార్థులు ఉండగా వసతిగృహాధికారి విధుల్లో లేరు. అయితే సెలవు దరఖాస్తు ఉంది. ఉన్నతాధికారుల అనుమతి లేదని మహాలక్ష్మి విలేఖరులకు తెలిపారు. బాలికల వసతిగృహంలో 92 మంది విద్యార్థులకు 17 మంది మాత్రమే ఉన్నారు. ఇరుచోట్ల హాజరు పట్టీలు అందుబాటులో లేవు. అయితే బాలికల వసతిగృహంలో తనిఖీ పుస్తకం ఉంది. వసతిగృహం అధికారిణి కుక్‌లు ఇద్దరు అందుబాటులో లేనట్లు తెలిపారు. ఈమేరకు వసతి గృహం తనిఖీ నివేదికలు తయారుచేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడుతూ వారికి అందుతున్న వౌళిక సౌకర్యాలపై ఆరాతీశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ.బి.సుందరరావు, ఉపాధి ఎ.పి.ఒ. జె.శంకరరావు సిబ్బంది ఉన్నారు.
========
15న వేర్‌హౌస్ గొడౌన్ ముట్టడి
ఆమదాలవలస, ఫిబ్రవరి 12: పట్టణంలో కొత్తగా నిర్మించిన ఎ.పి స్టేట్ వేర్‌హౌస్ కార్పొరేషన్ గొడౌన్‌లో కుద్దిరాం, చింతాడ కలాసీలకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఈనెల 15వతేదీన మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో గొడౌన్‌ను ముట్టడించనున్నారు. సుమారు 20 వేల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు గల ఈ గొడౌన్‌లో 150మంది కలాసీల వరకు పనిచేయడానికి అవకాశం ఉందని, కేవలం కాంగ్రెస్ పార్టీకి చెం దిన ఒక నాయకుడి సిఫార్సుల మేర కు అతని అనుచరులను మాత్రమే కలాసీ పనిలోకి తీసుకున్నారని, మరో 70మంది కలాసీలను మేనేజర్ ప్రసా ద్ పట్టించుకోవడం లేదని కుద్దిరాం, చింతాడ కూలీలు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు తమ్మినేని ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఇందుకు నిరసనగా ముట్ట డి అనంతరం వేర్‌హౌస్ గొడౌన్ గే టు వద్ద తమ కలాసీలంతా రిలే నిరవధిక దీక్ష నిర్వహించనున్నట్లు కలాసీల యూనియన్ ప్రతినిధులు తోట రా ము, తోట మల్లేశు తెలిపారు.
* విశాఖలో రహస్య సమావేశం * మామూళ్ళ రగడే ప్రధానాంశం * సర్కార్ ప్రతిష్ఠ కాపాడే యత్నం
english title:
mopidevi mantrhrangam
Date:
Monday, February 13, 2012