గుంటూరు, ఫిబ్రవరి 12: ప్రతి పౌరుడూ యోధుడుగా మారితే ఆ ప్రజా చైతన్యంతో అధికార శ్రేణుల్లో పారదర్శకత పెంపొందుతుందని ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావు చెప్పారు. ఆదివారం స్థానిక అరండల్‌పేటలోని వావిలాల సంస్థ కార్యాలయంలో అవగాహన సంస్థ ఆధ్వర్యంలో‘ప్రజా ప్రతినిధులు, అధికారులు- జవాబుదారీతనం’అనే అంశంపై జరిగిన చర్చా గోష్టిలో ఆయన పాల్గొన్నారు. ఈకార్యక్రమానికి సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అధికారులందరూ సక్రమంగా పని చేయాలంటే ప్రజాప్రతినిధుల సహకారం తప్పనిసరి అన్నారు. ప్రభుత్వ శాఖల్లోనే కాకుండా సమాజంలోని అన్ని రంగాల్లో కూడా అవినీతి పెరిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నూటికి 90 శాతం మంది అడ్డదారులకు అలవాటు పడిపోయారని, మిగిలిన 10 శాతం మంది మాత్రమే సమాజాభివృద్ధి కోసం పనిచేస్తున్నారన్నారు. రైల్వే ఉద్యోగి చేసిన తప్పుకోసం రాజీనామా చేసిన లాల్ బహదూర్‌శాస్ర్తీ వంటి నేతలు నేడు లేరన్నారు. దేశంలో సామాజిక, ఆర్థిక రంగాల్లో పెరిగిపోతున్న వైరుధ్యాలు భవిష్యత్తులో భారతదేశానికి ఇబ్బందులు కల్గజేస్తాయని పేర్కొన్నారు. సమాజంలో మెరుగైన జీవితాన్ని గడిపేవారు తమకు తెలిసిన విషయాలను ఇతరులకు చెప్పి చైతన్యవంతులను చేయాలని సాంబశివరావు సూచించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచలి శివాజీ మాట్లాడుతూ రక్తపాతం లేకుండా ప్రజాస్వామ్య రీతిలో వ్యవస్థను మార్చు చేసుకునే గొప్ప సంస్కృతి మనభారతీయ సంస్కృతి అన్నారు. ఆ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు తిలోదకాలివ్వడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ప్రజాస్వామ్య వ్యవస్థపైనే ప్రజలకు నమ్మకం సన్న గిల్లుతుందన్నారు. ఐఎఎస్
అధికారులు కూడా ముఖ్యమంత్రులు, మంత్రులు చెప్పినట్లుగా పనిచేయడం సరికాదన్నారు. వారు వివేకంతో విధులు నిర్వహించాలని హితవు చెప్పారు. అనంతరం అవగాహన సభ్యులు ఎంపి కావూరి సాంబశివరావును దుశ్శాలువాతో సత్కరించి మెమెంటో బహుకరించారు. ఈ చర్చాగోష్టిలో సంస్థ సీనియర్ సభ్యుడు ఎ హరి, ధనేకుల సాంబశివరావు, వివి రాఘవరావు మాధవి తదితరులు పాల్గొన్నారు.
* ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావు
english title:
praja chaitanyam
Date:
Monday, February 13, 2012