హైదరాబాద్, ఫిబ్రవరి 13: ప్రతి రోజు ఏదో ఒక వివాదంతో సభను అడ్డుకోవడం కన్నా సభ జరిగేట్టు చూడడమే మంచిదని టిడిపి భావిస్తోంది. టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో సోమవారం టిడిఎల్‌పి సమావేశం జరిగింది. సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఏదో వివాదంతో సభ జరగకుండా పోవడం వల్ల పార్టీకి కలిగే ప్రయోజనం ఏదీ ఉండడం లేదని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైందని పార్టీ నాయకులు తెలిపారు. అయితే ఇది మొదటి రోజు నిర్ణయమని, సభలో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని ఎమ్మెల్యేలు తెలిపారు. ప్రశ్నోత్తరాలతో పాటు సభలో వివిధ అంశాలపై చర్చ జరిగితేనే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యేలు తెలిపారు. ప్రధానంగా జగన్ కుంభకోణాల గురించి, మద్యం సిండికేట్ల వ్యవహారంపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. వీటితో పాటు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తామని సమావేశం అనంతరం టిడిఎల్‌పి ఉప నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలిపారు. టిఆర్‌ఎస్ సభ్యులు ప్రధానంగా తెలంగాణ అంశాన్నిలేవదీస్తారు కాబట్టి సభలో అప్పటి పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అవినీతి సాగుతోందని దీనిపై సభలో ప్రశ్నిస్తామని చెప్పారు. ఇక జగన్ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని టిడిపి ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. సభలో ఈ అంశాలను లేవనెత్తనున్నట్టు తెలిపారు.
ప్రజా సమస్యలపై సమన్వయంతో పని చేస్తాం
* చేతులు కలిపిన టిఆర్‌ఎస్, సిపిఐ, బిజెపి
హైదరాబాద్, ఫిబ్రవరి 13: తెలంగాణపై తీర్మానం, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి శాసనసభలో కలిసి పనిచేయడానికి టిఆర్‌ఎస్, సిపిఐ, బిజెపి పక్షాలు చేతులు కలిపాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాల ఆరంభం సందర్భంగా సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగాన్ని బహిష్కరించిన అనంతరం టిఆర్‌ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో టిఆర్‌ఎస్, సిపిఐ, బిజెపి పక్షాల నాయకులు భేటీ అయ్యారు. అనంతరం ఈ పార్టీల శాసనసభా పక్షాల నాయకులు ఈటెల రాజేందర్, గుండా మల్లేశం, యెండల లక్ష్మీనారాయణ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
సిపిఐ పక్షం నాయకుడు గుండా మల్లేశం మాట్లాడుతూ, పాలకపక్షం తీరు చూస్తుంటే, బయట గాడ్రింపు, లోపల పిల్లి కూతల్లా ఉందని విమర్శించారు. ప్రభుత్వ పాలన అవినీతి కంపు కొడుతోందని, మద్యం, మైన్స్, ఎమ్మార్ కుంభకోణాల్లో అధికారులు జైలుకు వెళ్తుండగా, దానికి బాధ్యులైన మంత్రులు మాత్రం దర్జాగా తిరుగుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. అన్ని కుంభకోణాలతో మంత్రులకు ప్రమేయం ఉన్నప్పటికీ, పెద్ద తిమింగిలాలను వదిలిపెట్టి చిన్న చేపలను పట్టుకోవడం ఇదేక్కడి నీతి అని మల్లేశం నిలదీశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్‌కు నిధులు ఇవ్వడం లేదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయకుండా రాజీవ్ యువకిరణాల పథకం ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రజలను మోసం చేస్తోందని ఆయన సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెసు పార్టీ సభలో తెలంగాణపై తీర్మానం చేయడానికి ఎందుకు జంకుతుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తోన్న కాంగ్రెసు, టిడిపిల వైఖరిని సభలో ఎండగడతామని ఆయన హెచ్చరించారు.
బిజెపి శాసనసభా పక్షం నాయకుడు యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడాన్ని సభలో ఎండగడుతామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సభలో తీర్మానం చేయాలనీ, అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్కార్‌ను నిలదీసేందుకు సభలో టిఆర్‌ఎస్, సిపిఐ పార్టీలతో కలిసి పనిచేస్తామని యెండల తెలిపారు.
చంద్రబాబు ప్రతిపక్ష నేత కావడం దురదృష్టకరం
- పిసిసి నేత బొత్స ఆవేదన
హైదరాబాద్, ఫిబ్రవరి 13: తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులాంటి వారితోనే రాజకీయాల్లో చులకన అవుతున్నామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విలేఖరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రతిపక్ష నేత కావడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ ప్రసంగిస్తుండగా చంద్రబాబు నాయుడు, తమ పార్టీ సభ్యులతో వాకౌట్ చేయడాన్ని బొత్స సత్యనారాయణ తప్పు పట్టారు. రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై చంద్రబాబుకు నమ్మకం లేనందుకే గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించారని ఆయన విమర్శించారు. గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించిన దాఖలాలు గతంలో లేవని ఆయన తెలిపారు.
చౌకబారు నినాదాలు, చౌకబారు ఆలోచనలతో బహిష్కరించారని ఆయన చెప్పారు. రాజకీయ లబ్ది పొందేందుకు దీనిని ఓ పెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నారని బాబు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసినా ప్రజలు విశ్వసించడం లేదని అన్నారు. బాబుకు ఓ విధానం, పద్ధతి లేదని ఆయన విమర్శించారు. అవినీతి, మద్యం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు తాము ఎంత నీతివంతులమో తెలుసుకోవాలని అన్నారు. అవినీతి గురించి మాట్లాడే చంద్రబాబు తనపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణను ఎదుర్కోకుండా కోర్టుకు వెళ్ళి ‘స్టే’ ఎందుకు పొందారని ఆయన ప్రశ్నించారు. తనకు 31 బ్రాందీ షాపులు ఉన్నాయని బాబు చేసిన ఆరోపణలో వాస్తవం లేదని అన్నారు. తన కుటుంబ సభ్యులకు వైన్ షాపులు ఉన్నాయని తాను గతంలోనే చెప్పానని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తొత్తు అనడాన్ని ఖండిస్తున్నానని ఆయన తెలిపారు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకునిగా తన బాధ్యతను నిర్వర్తించాలని, నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలని ఆయన సూచించారు. జగన్ వర్గంలో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని బొత్స మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
టిడిఎల్‌పి సమావేశంలో చర్చ
english title:
tdlp meet
Date:
Tuesday, February 14, 2012