హైదరాబాద్, ఏప్రిల్ 11: రాష్ట్రంలో శక్తివంతమైన పార్టీగా బిజెపి ఎదగబోతోందని, కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలోని ఎన్‌డిఎ అధికారంలోకి వస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఉగాది సందర్భంగా పార్టీ రాష్టక్రార్యాలయంలో అనేక కార్యక్రమాలు జరిగాయి. గత ఏడాది మాదిరి బిజెపిలో ఉగాది ఉత్సవం భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం జరిగింది. అనంతరం పంచాగ శ్రవణం జరిగింది. రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని, విజయం దక్కాలని పార్టీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ధర్మం నాలుగు పాదాల నడవాలని, అధర్మంపై ధర్మం విజయం సాధించాలని పేర్కొన్నారు. అలాగే అన్యాయంపైన న్యాయం సాధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశ అభివృద్ధిని కుంటుపరుస్తున్న ప్రతిష్ట దిగజార్చేవిధంగా ఉన్న అవినీతిపై నీతి విజయం సాధించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధనరెడ్డి, బండారు దత్తాత్రేయ, చింతాసాంబమూర్తి, శాంతారెడ్డి, డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, ప్రధానకార్యదర్శి ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ రామకృష్ణ సిద్ధాంతి, శ్రీనాధ్‌శర్మ, మహాదేవ్ శర్మ, ఫాల చంద్రశర్మ, శంకరమంచి శివసాయి శ్రీనివాస శర్మ పంచాగ శ్రవణంలోనూ, హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్రంలో ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడతామని, అందుకే తాను బిజెపి కార్యాలయానికి వచ్చానని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధనరెడ్డి అన్నారు. అందరికీ మేలు జరగాలని ఆకాంక్షిస్తున్నట్టు జనార్ధనరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చేలా లేదని, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ మాత్రమే తెలంగాణ ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో తన సంపూర్ణ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని, కాంగ్రెస్ పాలనలో అనేక ఈతిబాధలను ప్రజలు అనుభవిస్తున్నారని నీళ్లు, కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారని శనిగ్రహాలను దూరంగా పంపితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు.
రాష్ట్రంలో శక్తివంతమైన పార్టీగా బిజెపి ఎదగబోతోందని
english title:
kishen reddy
Date:
Friday, April 12, 2013