Clik here to view.

హైదరాబాద్, ఏప్రిల్ 11: కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ 25వ ఉమ్మడి సదస్సు జరుగనున్నాయి. దీంతో అంతర్జాతీయ పర్యాటక రంగ ప్రతినిధులతో రాజధానిలో కోలాహలం నెలకొంది. ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సదస్సును విజయవంతం చేసేందుకు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం ఘనతను ప్రపంచానికి చాటేందుకు కేంద్ర మంత్రి చిరంజీవి సవాలుగా తీసుకుని పనిచేస్తున్నారు. తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ సదస్సు హైదరాబాద్‌లో జరగడం విశేషం. ప్రస్తుతం యుఎన్‌డబ్ల్యుటివో రీజనల్ కమిషషన్‌కు భారత్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రారంభించనున్న ఈ సదస్సులో చిరంజీవి కీలకోపన్యాసం చేయనున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని చిరంజీవి ఇప్పటికే ప్రకటించారు. 29 దేశాల నుంచ 200 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. 2013-14 సంవత్సరంలో రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 221 కోట్ల రూపాయలను కేటాయించింది. రాష్ట్రంలో కోనసీమ, భద్రాచలం, పాపికొండలు, కొండపల్లి, ఇబ్రహీంపట్నంలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. విదేశీ, స్వదేశీ అతిథులకు తారామతి , గోల్కొండ కోటల్లో విందును ఏర్పాటు చేస్తున్నారు. అలాగే శిల్పారామం, నాగార్జునసాగర్, నాగార్జునకొండ పర్యాటక ప్రదేశాలకు ప్రతినిధులను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లుచేశారు. ఈ సదస్సు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.