హైదరాబాద్, ఏప్రిల్ 12: రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి మతిభ్రమించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై మంత్రి ఆరోపణలు చేయడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఆనం లోగడ అన్నారని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా 60 అడుగుల కటౌట్ పెట్టించారని, అనేక విధాలుగా పొగిడారని ఆయన గుర్తు చేశారు. నాడు కీర్తించి, నేడు విమర్శలు గుప్పిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఇలాఉండగా మంత్రి ఆనం మానసిక పరిస్థితి చూస్తుంటే, ఆయన మంత్రి పదవికి, ప్రజాజీవితానికి అనర్హుడని స్పష్టమవుతున్నదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, టి. బాలరాజు ఒక ప్రకటనలో విమర్శించారు. మంత్రిని వెంటనే ఎర్రగడ్డలోని పిచ్చాసుపత్రిలో చేర్చించాలని వారు సూచించారు. పదవి కోసం దిగజారుడు రాజకీయాలు చేయడం మానుకోవాలని, లేకపోతే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని వారు మంత్రిని హెచ్చరించారు.
టీచర్ల సమస్యలు పరిష్కరించండి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 12: ఉపాధ్యాయుల ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకన కేంద్రాల్లో టీచర్లు ఉద్యమించాలని యుటిఎఫ్ పిలుపునిచ్చింది. ఈ నెలవ 15,16 తేదీల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన సభలు నిర్వహించాలని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఇతర ఉపాధ్యాయ సంఘాలను కలుపుకుని స్పాట్ కేంద్రాలను దిగ్బంధనం చేయాలని యుటిఎఫ్ నేతలు ఎన్ నారాయణ, ఐ వెంకటేశ్వరరావులు చెప్పారు.
కారుమంచి కన్నుమూత
నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం నిర్వాహక కమిటీ సభ్యులు కారుమంచి వేంకటేశ్వరరావు (81) గురువారం రాత్రి కన్నుమూశారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నీరుకొండలో ఆయన 1932 జూలై 1న జన్మించారు. అంత్యక్రియలు 13వ తేదీ ఉదయం గుంటూరులో జరుగుతాయని విజయకుమార్ చెప్పారు.
అక్రమ కిరోసిన్ బాధ్యులు డికె కుటుంబమే: నాగం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 12: పేదలకు పౌర సరఫరాశాఖ అధ్వర్యంలో పంపిణీ చేయాల్సిన నీలి రంగు కిరోసిన్‌ను అక్రమంగా తరలించడం వెనుక మంత్రి డికె అరుణ కుటుంబం హస్తం ఉందని ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా మన్నాపురంలో తొమ్మిది వేల లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారికంగా ప్రకటించారని, డికె భరతసింహారెడ్డికి చెందిన బిటి హాట్ మిక్సింగ్ ప్లాంటులో సీజ్ చేశారని వివరించారు.
అధికారులు తొమ్మిది వేల లీటర్లుగా చెబుతుండగా, భరతసింహారెడ్డి కేవలం 1600 లీటర్లుగా చెబుతున్నారని, ఇది ఎలా సాధ్యమని నాగం ప్రశ్నించారు. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు కేవమలం 6ఎ కేసు మాత్రమే వాహనం, డ్రైవర్‌పై నమోదు చేశారని, ప్లాంట్ యజమాని భరత్‌పై ఎటువంటి కేసు నమోదుచేయలేదని నాగం ఆరోపించారు. కాగా, మంత్రివర్గంలో అవినీతి మంత్రులు ఎక్కువైపోయారని, వారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని నాగం డిమాండ్ చేశారు.
ఎసిబికి చిక్కిన విద్యుత్ అధికారి
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, ఏప్రిల్ 12: ఓ రైతు వద్ద నుంచి 30 వేలు లంచం తీసుకుంటూ బోనకల్ మండలానికి చెందిన విద్యుత్ ఎఇ మున్నీర్‌పాషా ఎసిబికి రెడ్ హ్యాండెడ్‌గా శుక్రవారం దొరికిపోయాడు. సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని రావినూతల గ్రామానికి చెందిన తాళ్ళూరి రామకృష్ణ అనే రైతు తన పొలానికి విద్యుత్ కనెక్షన్ కోసం గత ఏడాది ఎఇని కలవగా డిడి తీయాలని రైతుకు సూచించాడు. దీంతో సదరు రైతు డిడి తీసి ఎఇ కార్యాలయంలో సమర్పించగా గత కొంతకాలంగా కనెక్షన్ ఇవ్వకుండా తిప్పుతున్నాడు.
అయితే చివరకు సర్వే చేసి విద్యుత్ సౌకర్యం కల్పించాలంటే 45 వేల రూపాయలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఏమి చేయాలో తెలియని రైతు ఇస్తానని ఒప్పుకొని శుక్రవారం తన ఇంటికి పిలిపించుకొని 30 వేలు లంచం ఇచ్చి రెడ్ హ్యాండెడ్‌గా ఎసిబి అధికారులకు పట్టించాడు. ఈ మేరకు నిందితుడిని హైదరాబాద్‌లోని ఎసిబి కోర్టుకు తరలిస్తున్నట్లు డిఎస్పీ శ్రీ్ధర్, సిఐ సాంబయ్య పేర్కొన్నారు. దాడుల్లో రాఘవేంద్ర, బాబురెడ్డిలున్నారు.