విజయవాడ/విశాఖపట్నం, ఫిబ్రవరి 13: పరారీలోని సిండికేట్‌దారుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏసిబి కోర్టులో విచారణ మంగళవారం నాటికి వాయిదా పడింది. గుంటూరుకు చెందిన గద్దె తిరుపతిరావు, కోనేరు సీతారాంప్రసాద్, సునీల్‌దత్, విజయవాడకు చెందిన వెన్నా ఉమామహేశ్వరరావు ముందస్తు బెయిళ్ల కోసం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. విచారణ సమయంలో పిటిషన్‌దారులు సైతం కోర్టుకు హాజరు కావాలంటూ ఏసిబి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దీనివల్ల ముందస్తు బెయిల్ రానిపక్షంలో అక్కడికక్కడే నిందితులను అరెస్టు చేయవచ్చనేది ఏసిబి అధికారుల ఆలోచన. దీనిపై విచారణ వాయిదా పడింది. కాగా, గతంలో అరెస్టయిన రాజమండ్రి సిండికేట్‌లోని గుమస్తా ముళ్లపూడి శ్రీనివాస్‌ను మూడురోజుల పాటు పోలీస్ కస్టడీకి ఏసిబి కోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకే విచారించాలనే షరతు విధించింది. గతంలో అరెస్టయిన విజయవాడ సిండికేట్‌లోని అసిస్టెంట్ ఎకౌంటెంట్ రామ్మోహన్‌రెడ్డిని కస్టడీకి కోరుతూ ఏసిబి అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మంగళవారం నాటికి వాయిదా పడింది. కాగా విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో 15 రోజుల కిందట అరెస్ట్ చేసిన మద్యం సిండికేట్ల నాయకులు, అందులో పనిచేస్తున్న ఉద్యోగులు, ఎక్సైజ్ అధికారులు, సిబ్బందిని మొత్తం 14 మందిని సోమవారం నగరంలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. దీంతోపాటు వీరికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ వీరి తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. నిందితులకు తిరిగి 15 రోజులపాటు రిమాండ్ విధించిన న్యాయమూర్తి, బెయిల్ పిటిషన్‌పై విచారణను 15వ తేదీకి వాయిదా వేసింది. ఏసీబీ అధికారులు ముగ్గురు సిండికేట్ నాయకులను, అందులో పనిచేస్తున్న ఇద్దరు అక్కౌంటెంట్లను, ఎక్సైజ్ శాఖకు చెందిన అసిస్టెంట్ కమిషనర్‌ను, ఇద్దరు సిఐలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిని నాలుగు రోజులపాటు ఏసీబీ అధికారులు విచారణ నిమిత్తం కష్టడీకి తీసుకున్నారు. తిరిగి వారిని సెంట్రల్ జైలుకు తరలించారు.
మద్యం సిండికేట్ల బెయల్ కేసులు
english title:
petitions
Date:
Tuesday, February 14, 2012