నరసన్నపేట, ఫిబ్రవరి 13: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం జమ్ము గ్రామ పంచాయతీ శివారు ముద్దాడవానిపేట చెరువులో సోమవారం సాయంత్రం బాంబులు పేలడంతో చుట్టుపక్కల పొలాల్లో పనిచేస్తున్న గ్రామస్థులు భయాందోళనతో పరుగులు తీశారు. గతంలో కూడా ఇటువంటి పేలుళ్లు సంభవించాయని గ్రామస్థులు పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో మరో రెండు బాంబులు లభ్యమవడంతో స్థానికులను అప్రమత్తం చేశారు. సిఐ డివిఆర్‌ఎస్‌ఎన్ మూర్తి, ఎస్సైలు బి.నారీమణి, ఎన్.సాయి గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించారు. ఇటీవల పది రోజుల కిందట జమ్ము గ్రామానికి చెందిన చల్ల అప్పన్న అనే రైతుకి చెందిన ఆవు బాంబులు పేలడం కారణంగానే మృతి చెందిందని, దానిపై అప్పట్లో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశామన్నారు. సోమవారం బాంబులు పేలడం, మరికొన్ని బాంబులు దొరకడంతో గ్రామస్థులు భయాందోళనకు గురౌతున్నారు. సి.ఐ.మూర్తి మాట్లాడుతూ పూర్తి వివరాలు సేకరిస్తామన్నారు.
బాంబు స్క్వాడ్ పరిశీలన
జమ్ము గ్రామ శివారులో చెరువులో బాంబులు పేలిన సంఘటనపై ఆరా తీసేందుకు బాంబు స్క్వాడ్‌ను రప్పించారు. వారి పరిశీలనలో దొరికిన ఆధారాల ద్వారా చర్యలు చేపడతామని సిఐ మూర్తి స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం జమ్ము గ్రామ పంచాయతీ శివారు ముద్దాడవానిపేట
english title:
bombs in tank
Date:
Tuesday, February 14, 2012