ఎడ్రినల్ గ్రంథులనేవి మూత్రపిండాలపైన టోపీ మాదిరిగా అమరి ఉంటాయి. ఒకవేళ ఇవి కార్టిసాల్, ఆల్డోస్టిరోన్ హార్మోన్లను తయారు చేయలేకపోతే ఎడిసన్స్ వ్యాధి ప్రాప్తిస్తుంది. 1855 సంవత్సరంలో డాక్టర్ థామస్ ఎడిసన్ క్షయవ్యాధిగ్రస్తుల్లో ఎడ్రినల్ గ్రంథి పని తీరు దెబ్బతినడాన్ని గమనించి దానిమీద అధ్యయనం చేశాడు. ఫలితంగా ఈ ‘స్థితి’ ఆయన పేరుతోనే ప్రసిద్ధి చెందింది.
కార్టిసాల్ అనేది శరీరంలోని ప్రతి నిర్మాణంపైనా ప్రభావం చూపుతుంది. శరీరం నిర్వర్తించే సాధారణ విధులన్నిటిలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎడ్రినల్ గ్రంథులు కార్టిసాల్‌ని విడుదల చేసి తద్వారా శరీరం వివిధ రకాల ఒత్తిళ్ళను (వ్యాధి, గాయాలు, శస్త్ర చికిత్స, ప్రసవం) తదితర విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి సహకరిస్తాయి. ఆల్డోస్టిరోన్ అనేది శరీరంలో లవణాలు, నీటిని నిలువరించడం ద్వారా రక్తపోటును నిలకడగా ఉంచుతుంది.
ఎడ్రినల్ గ్రంథుల హార్మోన్ల తయారీ మెదడులోని హైపోథెలామస్, మెదడు కింద ఉండే పిట్యూటరీ గ్రంథులు నియంత్రణలో ఉంటుంది. ఈ హార్మోన్ల వ్యవస్థలో ముందుగా హైపోథెలామస్ పిట్యూటరీ గ్రంథికి సంకేతాలను పంపుతుంది. వీటిని అందుకొని పిట్యూటరీ గ్రంథి ఎడ్రినోకార్టికోట్రాపిక్ హార్మోన్‌ని (ఎ.సి.టి.హెచ్) విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ తిరిగి కిడ్నీలపైనుండే ఎడ్రినల్ గ్రంథులను ఉత్తేజితం చేసి అవి కార్టిసాల్‌ను విడుదల చేసేలా చేస్తుంది. ఏదైనా కారణం చేత కార్టిసాల్ నిర్ణీత స్థాయిలో తయారుకాకపోతే, దానిని ఎడిసన్స్ డిసీజ్‌గా చెబుతారు. కాగా, మెదడులోని హైపోథెలామస్‌గాని పిట్యూటరీ గ్రంథిగాని సరైన రీతిలో పనిచేయనప్పుడు అంటే ఎ.సి.టి.హెచ్ సరిగా విడుదల కానప్పుడు కూడా ఇవే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. దానిని సెకండరీ ఎడ్రినోకార్టికల్ ఇన్‌సఫీషియన్సి అంటారు. ఈ వ్యాసం ఎడిసన్స్ వ్యాధికి మాత్రమే సంబంధించిన అంశాలను ఆయుర్వేద దృక్పథాన్ని వివరిస్తుంది.
కారణాలు
ఎడిసన్స్ వ్యాధి ప్రాథమికంగా శరీరపు రక్షణ వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్) అదుపు తప్పి ఎడ్రినల్ గ్రంథి మీద దాడి చేసి అది తయారుచేసే కార్టిసాల్, ఆల్డోస్టిరోన్ విడుదలను గణనీయంగా తగ్గించినప్పుడు వస్తుంది. ఎడ్రినల్ గ్రంథులు దెబ్బతినడానికి ఇతర అంశాలు అనేకం దోహదపడతాయి. అలాంటి సందర్భాల్లో కూడా ఈ వ్యాధి ప్రాప్తిస్తుంది. ఉదాహరణకు క్షయ, క్యాన్సర్, హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షనే్ల కాకుండా అనేక రకాలైన బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లవల్ల ఇలా జరగవచ్చు. కొన్ని రకాల శస్తచ్రికిత్సలు, రేడియేషన్ చికిత్సల్లో సైతం ఇలా జరిగే అవకాశం ఉంది. రక్తాన్ని పలచగా ఉంచే యాస్ప్రిన్ తదితర మందులవల్ల ఎడ్రినల్ గ్రంథుల్లో రక్తస్రావం జరిగినప్పుడూ ఈ వ్యాధి వస్తుంది. దీర్ఘకాలం నుంచి కార్టికోస్టీరాయిడ్స్ వాడే వారిలో ఈ వ్యాధి కనిపించే అవకాశాలు ఎక్కువ. అలాగే, కెటోకెనజోల్ వంటి మందులవల్ల కూడా ఈ వ్యాధి రిస్కు పెరుగుతుంది. గర్భధారణ చివరి రోజుల్లోగాని, ప్రసవ సమయంలోగాని ఎడ్రినల్ గ్రంథికి దెబ్బతగిలితే కూడా ఈ వ్యాధి రావచ్చు. అయితే, ఇతర కారణాలతో పోలిస్తే ఇది చాలా అరుదుగా జరుగుతుంది.
ఈ వ్యాధి స్ర్తి, పురుషుల్లో ఎవరిలోనైనా కనిపించవచ్చు. ఏ వయసులోనైనా కనిపించవచ్చు. కాకపోతే వ్యాధి నిరోధక వ్యవస్థ వికటించటం కారణంగా ఏర్పడే ఎడిసన్స్ వ్యాధి మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. క్షయవ్యాధి మూలంగా ఏర్పడే ఎడిసన్స్ వ్యాధి పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.
లక్షణాలు
ఎడ్రినల్ గ్రంథులు సాధారణంగా నెమ్మదిగా వైఫల్యం చెందుతాయి కనుక ఎడిసన్స్ వ్యాధి లక్షణాలు కూడా నెమ్మదిగా పురోగమిస్తాయి. కాగా, ఒకవేళ ఈ గ్రంథులు హఠాత్తుగా దెబ్బతింటే లక్షణాలు కూడా వేగంగా వ్యక్తమవుతాయి.
ఈ వ్యాధిలో ప్రధానంగా బడలిక ఉంటుంది. కండరాల బలహీనత కనిపిస్తుంది. సమయం గడిచేకొద్దీ ఈ లక్షణాలు తీవ్రరూపం దాలుస్తాయి. బరువు తగ్గిపోవటం ఈ వ్యాధిలో కనిపించే మరో ప్రధాన లక్షణం. అలాగే ఆకలి కూడా గణనీయంగా తగ్గిపోతుంది. వికారం, వాంతులు, నీళ్లవిరేచనాలు, కడుపునొప్పి వంటి ఇతర లక్షణాలు కూడా అనేకం ఉంటాయి. ఉప్పగా ఉండే పదార్థాలను తీసుకోవాలని అనిపిస్తుంటుంది. చర్మంపైన నల్లని మచ్చలు తయారవుతుంటాయి. ముఖ్యంగా గాట్లు పడిన చోటగాని, చర్మం ముడతల్లోగాని, పెదవులపైనగాని, నోటినీ ముక్కునూ చుట్టి ఉండే లైనింగ్ వద్దగాని, మోచేతులు, మోకాళ్ళు వేళ్ల కణుపులవంటి కీళ్లజాయింట్ల వద్దగాని ఈ రకం నల్లని ముదురు మచ్చలు కనిపిస్తుంటాయి. చలిని తట్టుకోలేకపోవటం కూడా ఈ వ్యాధిలో ఒక ప్రధాన లక్షణం. మహిళల్లో వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతుంటాయి. కూర్చున్న భంగిమ నుంచి లేచి నిలబడితే తల తిరిగినట్లు, పడిపోతున్నట్లు అనిపిస్తుంది. దీనిని వైద్య పరిభాషలో ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. శరీరం కంపిస్తుంటుంది. కొంతమందిలో రక్తంలోని చక్కెర నిల్వలు తగ్గిపోతుంటాయి కూడా. దీనిలో అనేక మానసిక లక్షణాలు కూడా కనిపిస్తాయి. మనసు నిలకడగా ఉండదు. కేంద్రీకరణ కష్టమవుతుంది. చిరాకు, కోపం, అసహనం వంటివి రోజురోజుకూ ఎక్కువవుతుంటాయి. ఒక దశలో కుంగుబాటు (డిప్రెషన్) కూడా ప్రాప్తిస్తుంది.
చికిత్స
ఈ వ్యాధి దీర్ఘకాలం కొనసాగే తత్వం కలిగినది. ఆయుర్వేద చికిత్సలను కూడా దీర్ఘకాలం పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ వ్యాధి చికిత్సను మూడు అంశాలుగా విభజించవచ్చు. మొదటిది ఆహార చికిత్స. రెండవది ఎడ్రినల్ గ్రంథులు పనితీరు మెరుగుపర్చడం. మూడవది, వ్యాధి నిరోధకశక్తిని సక్రమ మార్గంలో నడిపించడం.
ఈ వ్యాధిలో సోడియం నిల్వలు బాగా తగ్గిపోతుంటాయి కనుక సోడియం కలిగిన ఉప్పు వంటి పదార్థాలను, ఉప్పు కలిగిన ఆహారాలను సూచించాల్సి ఉంటుంది. ఉక్కపోత వాతావరణంలోను, స్వేదాధికృత అధికంగా ఉండే పరిస్థితుల్లోను మజ్జిగలో ఉప్పు చేర్చి తీసుకోవాలి. వ్యాయామం వంటివి చేసిన తరువాత, శరీరం నుంచి ఉప్పు చెమట ద్వారా బహిర్గతమయ్యే అవకాశం ఉంటుంది కనుక, ఏదైనా శ్రమ చేసిన తరువాత ఉప్పు చేర్చిన పానీయాలను తీసుకోవటం అవసరం. ఈ వ్యాధిలో పొటాషియం నిల్వలు శరీరంలో పరిమితికి మించి పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అనేక రకాల ఆహార పదార్థాల్లో పొటాషియం అధిక మొత్తాల్లో ఉంటుంది కనుక ఏ రకమైన ఆహారాలను తీసుకోవాలనే విషయం వైద్యులను అడిగి తెలుసుకోవాలి.
తరచుగా బరువును చూసుకోవాలి. ముఖ్యంగా ఆకలి తగ్గిన సందర్భాలోను, వాంతులవుతున్నప్పుడూ బరువు తగ్గిందీ లేనిదీ తెలుసుకోవాలి. బరువు చూసుకునేప్పుడు ఒకే విధానాన్ని అవలంబించాలి. ఉదాహరణకు, రోజులో ఒకే సమయంలో చూసుకోవాలి. అలాగే, బూట్లు, బట్టలవంటివి ఒకే విధంగా ఉండాలి. శరీరంలో గ్రంథుల పని తీరు మెరుగుపర్చడానికి ఆయుర్వేదంలో అనేక రకాల మందులు ఉన్నాయి. ఇవి నిర్మాణపరమైన సమస్యలను, శరీరపరమైన సమస్యలను సరిచేసే నైజం కలిగినవి. కాంచనార, వరుణ తదితర మూలికలకు ఈ లక్షణం ఉంది. వీటితో అనేక రకాల మందులు తయారవుతాయి. లక్షణాలను బట్టి, వ్యాధి సమగ్ర స్వరూపాన్ని బట్టి వీటిని వాడాల్సి ఉంటుంది.
వ్యాధి నిరోధక శక్తి వికటించి ఎడ్రినల్ గ్రంథులను దెబ్బతీసినప్పుడు, దానిని సరిచేసి మళ్లీ సక్రమంగా పనిచేసేలా చేసే చికిత్సలను ఆయుర్వేదంలో స్వస్థస్యోర్జస్కర చికిత్సలని అంటారు. శమన చికిత్సలలో పాటు పంచకర్మలు కూడా ఈ రకం చికిత్సల్లో ప్రధాన అంశాలుగా ఉంటాయి. అమృత లేదా గుడూచి, ఆమ్లకి, హరిద్ర వంటి మూలికలనుంచి తయారయ్యే శమనౌషధాలను చికిత్సలో ప్రయోగించాల్సి ఉంటుంది.
డ్రినల్ గ్రంథులనేవి మూత్రపిండాలపైన టోపీ మాదిరిగా అమరి ఉంటాయి
english title:
adrenal
Date:
Wednesday, April 17, 2013