న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాన మంత్రి పదవికి సమర్థించే ప్రసక్తేలేదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తేల్చి చెప్పటంతో ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగే విషయమై బిజెపిలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. నితీష్ ప్రభుత్వం సుస్థిరతకు ఎలాంటి ఢోకాకాలేదన్న విషయం తెలిసినప్పటికీ ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో బిజెపి నాయకత్వం అనేక మార్గాలను అనే్వషిస్తోంది. 243 మంది సభ్యులున్న బీహార్ విధానసభలో జనతాదళ్‌కు 118 మంది ఎమ్మెల్యేలున్నారు. బిజెపికి 91 మంది సభ్యులున్నారు. బిజెపికి చెందిన సుశీల్‌మోడీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించటమేకాక పరుష పదజాలంతో విమర్ళలు కురిపించిన జనతాదళ్‌తో సంబంధాలను తెగతెంపులు చేసుకుతీరాలని బిజెపి బీహార్ శాఖకు చెందిన సీనియర్ నాయకులు అధినాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. నితీష్ మంత్రివర్గంలో ఉన్న అశ్వనీ కుమార్ చౌబే పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమై జెడియుతో పొత్తును తెగతెంపులు చేసుకోవటానికి తటపటాయించరాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కార్యకర్తలంతా ఇదే అభిప్రాయంతో ఉన్నారని ఆయన పార్టీ నాయకత్వానికి తెలిపారు. బీహార్‌లో నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం చేయటానికి వీల్లేదని నితీష్ షరతుపెడితే అంగీకరించి పార్టీ నాయకత్వం చేసిన తప్పు పునరావృతం కాకూడదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయటానికి పార్టీ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. కాగా మోడీ విషయంలో రెండు శిబిరాల మధ్య రాజీ కుదిరే అవకాశాలు లేనందున ప్రభుత్వంలో కొనసాగటం అనైతికం అవుతుందని పార్టీలోని ఒక వర్గం భావిస్తోంది. బిజెపి వైదొలగినప్పటికీ నితీష్ ప్రభుత్వం మనుగడకు ఎలాంటి ప్రమాదం లేనందున ప్రభుత్వం నుంచి నిష్క్రమించాలన్న పార్టీ ప్రతిపాదనకు అంతోఇంతో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి. ఉప ముఖ్యమంత్రి సుశీల్‌మోడీ ఈ ప్రతిపాదనకు అంత సుముఖంగా లేరని చెబుతున్నారు. నితీష్ ముఖ్యమంత్రిగా పదవి భాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీహార్ రూపురేఖలు మారిపోయి ప్రజలు సుఖంగా ఉన్నందున జెడియు వైపే ప్రజలు మొగ్గుచూపే అవకాశాలుంటాయని ఒక వర్గం వాదిస్తోంది. ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవలసిందిగా సూచించినట్లు తెలిసింది. కర్నాటక విధాన సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బిజెపి ఈ నిష్క్రమణపై తుది నిర్ణయం తీసుకుంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా బిజెపి ఒత్తిళ్లకు, బెదిరింపులకు తాము బెదిరే ప్రసక్తిలేదని జెడియు అధికార ప్రతినిధి త్యాగి ఎదురుదాడి చేశారు. లౌకిక వాదానికి కట్టుబడి ఉన్న తమ పార్టీ మోడీ విషయంలో రాజీపడదని ఆయన స్పష్టం చేశారు. మోడీ కోసం మంకు పట్టుపట్టి తమతో గత పదిహేడేళ్లుగా ఉన్న పొత్తును తెంచుకుంటే తమ కంటే బిజెపినే తీవ్రంగా నష్టపోతుందని జెడియు నేతలు స్పష్టం చేస్తున్నారు.
నితీష్‌తో పొత్తుపై బిజెపి తర్జనభర్జన
english title:
k
Date:
Wednesday, April 17, 2013