శ్రీశైలం, ఫిబ్రవరి 13: శ్రీశైల మహాక్షేత్రంలో 11 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి హనుమంతరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ ఇమిడిశెట్టి కోటేశ్వరరావు, వేదపండితులు, అర్చకులు, అధికారులు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. యాగశాల ప్రవేశంతోపాటు గణపతి పూజ, పుణ్యాహవాచనం, శివసంకల్పం, చండీశ్వరపూజ నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటల నుంచి అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపన గావించారు. రాత్రి 7 గంటలకు త్రిశూల పూజ, సకల దేవతలను ఆహ్వానించేందుకు ఆలయ ప్రాంగణంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ధ్వజ పటావిష్కరణ, బలి హరణ గావించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. కాగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచేగాక ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారనే ఉద్దేశ్యంతో అధికారులు ఈ నెల 16 వరకు మల్లన్న స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నారు. శివమాల ధరించిన భక్తులు వేల సంఖ్యలో శ్రీశైలం చేరుతున్నారు. క్యూలైన్లు శివనామ స్మరణ మారుమోగుతోంది. ఇరుముడులు ధరించన భక్తులు క్యూలైన్లలో స్వామి దర్శనానికై గంటల తరబడి వేచిఉంటున్నారు. పాతాళగంగ వద్ద ఉన్న శివదీక్షా శిబిరాల్లో ఇరుముడి సమర్పించి వెంట తెచ్చుకున్న సామాగ్రిని గుండంలో వేస్తున్నారు. .
ఆర్టీసీ చెర్మన్‌గా వైఎస్ వివేకా?
కడప, ఫిబ్రవరి 13: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని నామినేటెడ్ పదవిలో నియమించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్‌గా వివేకాను నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే ఢిల్లీకి రావాలని అధిష్ఠానం నుంచి వివేకాకు కబురువచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన సోమవారం హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్న సత్యనారాయణ స్థానంలో వివేకాను నియమించే సూచనలు ఉన్నాయి. కడప జిల్లాలో గతంలో జరిగిన ఉప ఎన్నికల సమయంలో మంత్రి పదవిని రాజీనామా చేసిన వివేకా అధిష్ఠానం ఆదేశాల మేరకు పులివెందుల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన వదిన విజయమ్మ చేతిలో ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి అధిష్ఠానం ఆదేశాల మేరకు పార్టీ పనిచేసుకుంటూ వస్తున్నారు. ఒక వైపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంచి సంబంధాలు నెరపుతూ మరోవైపు పార్టీ అధిష్ఠానం ఆదేశాల కనుగుణంగా నడుచుకుంటూ వచ్చారు. ఈ నేపధ్యంలో జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు నేపధ్యంలో వివేకాకు నామినేటెడ్ పదవి కట్టబెట్టాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం.
మార్చిలోగా అనర్హత వేటు:లగడపాటి
నందిగామ, ఫిబ్రవరి 13: కాంగ్రెస్ పార్టీ విప్‌ను ధిక్కరించిన జగన్ వర్గం ఎమ్మెల్యేలు 16మందిపై మార్చిలోగా అనర్హత వేటు పడటం ఖాయమని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు వచ్చిన ఆయన దాములూరు గ్రామంలో విలేఖరులతో మాట్లాడారు. తమవారిపై అనర్హత వేటు వేయడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. జగ్గయ్యపేట పర్యటన సందర్భంలో తాను అంబేద్కర్, తాజ్‌మహల్ బొమ్మలున్న ప్లేట్‌లో అల్పాహారం తిన్నట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని లగడపాటి చెప్పారు. తనపై తప్పుడు ప్రచారాలతో కథనాలు ప్రచురిస్తే సదరు పత్రికపై ప్రెస్‌కౌన్సిల్‌కు ఫిర్యాదు తెలిపారు. తొలుత భావోద్వేగాలకు లోనై పార్టీని వీడినవారిలో 90శాతం మంది మళ్లీ వెనక్కు వచ్చారని త్వరలోనే అంతా సర్దుకుంటుందన్నారు.
జూనియర్ డాక్టర్ల దిష్టిబొమ్మ దగ్ధం
విశాఖపట్నం, ఫిబ్రవరి 13: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా జూనియర్ డాక్టర్లు జరుపుతున్న సమ్మె వలన రోగులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారంటూ సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి నాయకులు సోమవారం జూనియర్ డాక్టర్ల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అత్యవసర సేవలకు కూడా ఇబ్బంది కలిగించే విధంగా జూనియర్ డాక్టర్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థి జెఎసి రాష్ట్ర వ్యవస్థాపక కన్వీనర్ ఆరేటి మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా రాష్ట్రంలో సుమారు 200 మంది రోగులు ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. ప్రతి వైద్య విద్యార్థి మూడున్నర సంవత్సరాలపాటు గ్రామీణ ప్రాంతాల్లో తమ సేవలను అందించాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు విధించిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఒక సంవత్సరానికి తగ్గించిందని మహేష్ అన్నారు. ఒకవేళ ప్రభుత్వం జూనియర్ డాక్టర్లకు స్ట్ఫైండ్‌ను పెంచినా, పోయిన రోగుల ప్రాణాలను వెనక్కు తీసుకురాగలుతారా? అని ఆయన ప్రశ్నించారు.
తాండవ పనుల నిలిపివేత
నర్సీపట్నం , ,్ఫబ్రవరి 13: తాండవ రిజర్వాయర్ నుంచి తుని నియోజకవర్గంలోని పలు గ్రామాలకు మంచినీటి సరఫరాకు చేపడుతున్న పనులను తక్షణం నిలిపివేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ మంత్రి కె.జానారెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఫోన్లో ఈ విషయం చెప్పారు. వౌలిక సదుపాయాలు, ఓడరేవుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పసుపులేటి బాలరాజు, నర్సీపట్నం ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప, యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, పెందుర్తి, గాజువాక, విశాఖ నగర ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, వెంకటరామయ్య, తైనాల విజయ్‌కుమార్, ద్రోణంరాజు శ్రీనివాసరావు, మళ్ళ విజయప్రసాద్ తదితరులు పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ శాఖా మంత్రి జానారెడ్డిని కలిసి తాండవ రిజర్వాయర్ నుంచి తుని నియోజకవర్గంలోని పలు గ్రామాలకు మంచినీటి ప్రాజెక్టు తరలింపు ప్రయత్నాలను తక్షణం ఆపివేయాలని కోరారు. ఈమేరకు మంత్రి జానారెడ్డి విశాఖ జిల్లాలో తాండవ నీటి తరలింపు పనులను తక్షణం నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. తాండవ రిజర్వాయర్ నుండి విశాఖ - తూర్పుగోదావరి జిల్లాలోని ఐదు మండలాలకు చెందిన 52 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ నీటిని తుని, పాయకరావుపేట నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు మంచినీటిగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం భారీ ప్రాజెక్టును మంజూరు చేసింది. ఇప్పటికే 13.5 కోట్లు విడుదల చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి. ఈనేపథ్యంలో విశాఖ జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం నేతలు తాండవ రిజర్వాయర్ నుండి ఒక్క నీటి చుక్కను కూడా తరలించేందుకు ఒప్పుకునేది లేదని చెబుతూ రైతులతో ఆందోళనలు నిర్వహించారు.
ప్రభుత్వానికి హైకోర్టు 5వేలు జరిమానా
హైదరాబాద్, ఫిబ్రవరి 13: నల్గొండ జిల్లా మంచినీటిలో ఫ్లోరైడ్ అధిక శాతం ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని దాఖలైన కేసు విచారణకు రాగా ప్రభుత్వం ఇంత వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 5 వేల రూపాయల జరిమానాను విధించింది. ప్రజలకు రక్షిత మంచినీటిని అందేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి సూచిస్తూ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది.
శ్రీశైల మహాక్షేత్రంలో 11 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి
english title:
state bits
Date:
Tuesday, February 14, 2012