గుంటూరు, ఫిబ్రవరి 13: గుంటూరులో రాష్ట్ర చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ తొమ్మిదిరోజుల పాటు నిర్వహించిన 2011 నంది నాటకోత్సవాల విజేతలను సోమవారం సాయంత్రం ప్రకటించారు. పద్యనాటకం విభాగంలో హైదరాబాద్ సావేరి సాంస్కృతిక సంస్థ వారి ‘వరూధిని’ నాటకం అగ్రస్థానంలో నిలిచింది. సాంఘిక నాటకం విభాగంలో గుంటూరు జిల్లా కుంచనపల్లి అరవింద ఆర్ట్స్ వారి ‘మీ ఇల్లెక్కడ’, సాంఘిక నాటిక విభాగంలో హైదరాబాద్ కళాంజలి వారి ‘్భమి గుండ్రంగా ఉంది’, బాలల సాంఘిక నాటిక విభాగంలో ప్రకాశం జిల్లా రాజంపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల బాలలు ప్రదర్శించిన ‘మేమున్నాం’ నాటికలు బంగారు నందులను కైవసం చేసుకున్నాయి. బంగారు నందులు పొందిన నాలుగు ప్రదర్శనల్లో రెండు హైదరాబాద్‌కు చెందినవి కావడం విశేషం. అన్ని విభాగాల్లో కలిపి హైదరాబాద్ కళాకారులు మొత్తం 14నందులు కైవసం చేసుకున్నారు. ఈ నెల 5నుంచి గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలు సోమవారం మధ్యాహ్నంతో ముగిశాయి. అక్కినేని సాంస్కృతిక సంఘం (విజయనగరం) కళాకారులు ప్రదర్శించిన రుక్మిణీ కల్యాణం పద్యనాటకాన్ని చివరిరోజు ప్రదర్శించారు. నంది బహుమతుల వివరాలను జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎన్ యువరాజ్ అధ్యక్షతన న్యాయనిర్ణేతలు వెల్లడించారు. పద్యనాటక విభాగంలో మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం (మిర్యాలగూడ) కళాకారులు ప్రదర్శించిన ‘రావణ’కు వెండి నంది, మయూరి నటనాలయం (హైదరాబాదు) వారి ‘వీరపల్నాడు’ నాటకానికి కాంస్య నంది లభించాయి. అలానే సాంఘిక నాటకం విభాగంలో చైతన్య కళాస్రవంతి (విశాఖపట్నం) వారు ప్రదర్శించిన ‘సృజన’ నాటకానికి వెండి, విజయాదిత్య ఆర్ట్స్ (నిజామాబాద్) కళాకారులు సమర్పించిన ‘ఆ రోజు కోసం’ నాటకం కాంస్య నందిని కైవసం చేసుకున్నాయి. సాంఘిక నాటిక విభాగంలో గంగోత్రి పెదకాకాని కళాకారులు ప్రదర్శించిన ‘నష్టపరిహారం’ నాటికకు, కళాతరంగిణి (విశాఖపట్నం) వారు ప్రదర్శించిన ‘బానిస’కు కాంస్య నందులు లభించాయి. ఇక బాలల సాంఘిక నాటిక విభాగంలో కుమార్ పబ్లిక్ స్కూలు (నూజివీడు) వారి ‘కాళ్లాగజ్జా కంకాలమ్మ’ ద్వితీయ ఉత్తమ ప్రదర్శన కింద వెండి నంది, సూతా థియేటర్ (హైదరాబాదు) బాల కళాకారులు ప్రదర్శించిన ‘ఒంటరి రెక్కలు’ నాటికకు తృతీయ ఉత్తమ ప్రదర్శన కింద కాంస్య నంది లభించాయి. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో జరిగిన అవార్డుల ప్రకటన కార్యక్రమానికి జడ్పీ సిఇఓ, ఉత్సవాల నోడల్ అధికారి జయప్రకాష్, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పి శ్రీనివాసులు, ఎఫ్‌డిసి మేనేజర్ శ్రీనివాస్, పిఆర్‌ఒ మధు తదితరులు పాల్గొన్నారు.
నాటకరంగంపై అవగాహన, ఏమాత్రం అనుభవం లేనివారిని న్యాయనిర్ణేతలుగా ఎందుకు నియమించారో అర్ధం కావడంలేదని, అసలుసిసలైన కళాకారులకు అన్యాయం జరిగిందని హైదరాబాదు నగరానికి చెందిన సీనియర్ కళాకారులు తోట సత్యనారాయణ, విజయనగరానికి చెందిన పసుపర్తి సన్యాసిరావు తీవ్రంగా విమర్శించారు. ఎఫ్‌డిసి సరైనవిధంగా మార్గదర్శక సూత్రాలను పాటిస్తున్నట్లు లేదని ఈ బహుమతుల ప్రకటనతో తెలిసిపోయిందని వారు పేర్కొన్నారు. గుంటూరు ఎల్‌విఆర్ క్లబ్ వారు ప్రదర్శించిన ‘సహజీవనం’ నాటకాన్ని నంది పోటీల నుంచి తొలగిస్తున్నట్లు న్యాయనిర్ణేతలు రాతపూర్వకంగా తెలపటం చర్చనీయాంశమైంది. నందుల ఎంపికలో న్యాయనిర్ణేతలు తమకు తీవ్ర అన్యాయం చేశారని ఎల్‌విఆర్ క్లబ్ వారు నాటకోత్సవాల ప్రాంగణంలో నినాదాలు చేసారు. (చిత్రం) పద్యనాటకం విభాగంలో బంగారు నందిని గెల్చుకున్న ‘వరూధిని’ నాటకంలోని ఓ సన్నివేశం
వరూధిని, మీ ఇల్లెక్కడ, భూమి గుండ్రంగా ఉంది, మేమున్నాం ప్రదర్శనలకు బంగారు నందులు
english title:
nandi natakalu
Date:
Tuesday, February 14, 2012