హైదరాబాద్, ఫిబ్రవరి 13: రాష్టవ్య్రాప్తంగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల (జూడాల) అంశం హైకోర్టు పరిధిలోకి వెళ్లింది. హైకోర్టు ఆదేశాల మేరకే ఇక ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజు అనే న్యాయవాది హైకోర్టులో సోమవారం దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వాజ్యం (పిల్)పై కోర్టు వేగంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి, జూనియర్ వైద్యుల సంఘానికి (జూడా), ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ శాఖకు నోటీసులు జారీ చేసింది. తక్షణమే కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలతో ఒకవైపు రాష్ట్ర వైద్య విద్య శాఖ మంత్రి కొండ్రు మురళీమోహన్ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖతోపాటు న్యాయశాఖకు చెందిన అధికారులనూ ఆహ్వానించారు. జూడాల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను కోర్టుకు లిఖితపూర్వకంగా మంగళవారం తెలియచేయాలని నిర్ణయించారు. అలాగే జూడా అధ్యక్షుడు డాక్టర్ అభిలాష్ నేతృత్వంలో ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు సోమవారం సాయంత్రం సమావేశమై కోర్టులో కేసు అంశంపై చర్చించారు. గతంలో జూనియర్ డాక్టర్ల సంఘం నేతృత్వంలో జరిగిన సమ్మె సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను పరిశీలించి, ఇప్పుడు కూడా అదేవిధంగా నడవాలని, తమ వాదనలను, రాష్ట్ర ప్రభుత్వం గతంలో జూడాలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం తదితర అంశాలను కోర్టుకు వివరించాలని, తర్వాత కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అభిప్రాయపడ్డారు. జూడాల తరఫున న్యాయవాది ద్వారా తమ అభిప్రాయాన్ని కోర్టుకు వెల్లడించాలని నిర్ణయించారు.
ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (ఎపిఎంసి) చైర్మన్ డాక్టర్ ఇ రవీంద్రారెడ్డి నేతృత్వంలో కోఠిలోని ఎపిఎంసి కార్యాలయంలో సోమవారం అత్యవసర సమావేశం జరిగింది. మెడికల్ కౌన్సిల్‌కు సంబంధించినంత వరకు జూడాల సమ్మె సందర్భంగా తలెత్తిన విషయాలను వివరిస్తూ ఒక నోట్‌ను ఎపిఎంసి రిజిస్ట్రార్ కె సత్యనారాయణమూర్తి నేతృత్వంలో రూపొందించి కోర్టుకు సమర్పించాలని నిర్ణయించారు. ఐఎంఎ కూడా ఈ కేసులో తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం ఉందని తెలిసింది.
ప్రజా ఆరోగ్య చైతన్య యాత్ర
ఇలావుండగా, జూడాల సమ్మెపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో జూడాలతోపాటు ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, పిడిఎస్‌యు, పిడిఎస్‌ఓ, తెలుగు విద్యార్థి, ఎన్‌వైఎస్, పివైఎల్, ఒపిడిఆర్, డివైఎఫ్‌ఐ తదితర వివిధ విద్యార్థి సంఘాలు సోమవారం మధ్యాహ్నం సమావేశమై విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటి (ఎస్‌యుజెఎసి)ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తక్షణమే ‘ప్రజా ఆరోగ్య చైతన్య యాత్ర’ చేపట్టాలని నిర్ణయించారు.
పెరిగిపోతున్న మరణాలు
ఉస్మానియా, గాంధీతోపాటు వరంగల్, విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతిలలోని ప్రభుత్వ బోధనాసుత్రుల్లో అత్యవసర చికిత్సతోపాటు సాధారణ చికిత్స కూడా అందకపోవడంతో రోగులు అనేక అవస్థలు పడుతున్నారు. వివిధ ఆసుపత్రుల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఇప్పటి వరకు 90మంది మరణించారు. జూడాలు సమ్మె చేస్తున్నందువల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, రోగులకు సరైన చికిత్స అందడం లేదు. ప్రమాదాల్లో గాయపడ్డవారితో పాటు గుండెకు సంబంధించిన జబ్బులు తదితర ప్రమాదకరమైన జబ్బులతో బోధనాసుపత్రులకు వస్తున్న వారికి అత్యవసర చికిత్స సరిగ్గా అందడం లేదు. దాంతో ఆసుపత్రుల్లో పరిస్థితి అత్యంత దుర్బరంగా ఉంది.
‘పిల్’పై వెంటనే స్పందించిన హైకోర్టు కౌంటర్ అఫిడవిట్లపై మల్లగుల్లాలు కొనసాగుతున్న మరణాలు * పరిస్థితి సీరియస్
english title:
judas case
Date:
Tuesday, February 14, 2012