కందుకూరు, ఫిబ్రవరి 14: రైతులకు, వారి కుటుంబాలకు చేయూతనిచ్చి, వారి ఆర్ధికాభివృద్ధికి తోడ్పాటును ఇచ్చే కృషికార్ విజ్ఞాన కేంద్రాన్ని కందుకూరు పరిధిలోని సిటిఆర్‌ఐలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని సిటిఆర్‌ఐ సెంట్రల్ డైరెక్టర్ టిజికె.మూర్తి తెలిపారు. మంగళవారం సిటిఆర్‌ఐ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. సిటిఆర్‌ఐలో శాస్తవ్రేత్తలు తయారు చేసిన నూతన పొగాకు వంగడాలను పరిశీలించారు. అనంతరం ఆయన అక్కడి నుండి స్థానిక 26వ వేలం కేంద్రంలో జరిగిన రైతులతో ఇష్టాగోష్టి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈసందర్భంగా టిజికె.మూర్తి మాట్లాడుతూ సిటిఆర్‌ఐ సంస్థ కందుకూరు ప్రాంతంలో ఉండడం ఈప్రాంత రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుందని తెలిపారు. కొత్తకొత్త వంగడాలను తయారు చేయడంతోపాటు, విత్తనాలను రైతులకు అందజేయడం వంటివి జరుగుతున్నాయని తెలిపారు. సిటిఆర్‌ఐలో కృషికార్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ క్యూరింగ్‌కు ఉపయోగించే కర్ర ప్రస్తుతం టన్ను 3వేల రూపాయల ధర పలుకుతుందని, ప్రత్యామ్నాయ పద్ధతులకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అందుకు స్పందించిన టిజికె.మూర్తి ప్రత్యామ్నాయం ఏర్పాట్లకై శాస్తవ్రేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇంకా తుదిరూపం దాల్చలేదన్నారు. రైతులు వ్యవసాయ వ్యర్థ పదార్ధాలతో క్యూరింగ్‌కు అవసరమైన శక్తిని రూపొందించుటకు అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో 2మిషన్ల ద్వారా ఆప్రయత్నాలు ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్పత్తి అయిన పొగాకును రైతులు ఆయన చూపించగా, దానిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. రైతుల శ్రేయస్సు కోసం శాస్తవ్రేత్తలు తయారు చేసిన హైబ్రీడ్ వంగడాల వలన నేడు ఎకరాకు 9క్వింటాళ్ళ దిగుబడి వస్తుందన్నారు. పొగాకు పనులు లేని సందర్భంలో రైతులకు చేయూతనిచ్చే కృషికార్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు తాము ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇలాంటి కేంద్రం దర్శిలో ఉందని తెలిపారు. ఈకార్యక్రమంలో శాస్తవ్రేత్తలు పాండా, చంద్రశేఖర్, శ్రీ్ధర్, వేలం కేంద్రం అధికారి బిఎన్.మిత్రా, రైతులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిటిఆర్‌ఐ సెంట్రల్ డైరెక్టర్ టిజికె.మూర్తిని వేలం నిర్వాహణ అధికారి బిఎన్.మిత్రా, రైతులు సన్మానం చేశారు.
===
కమిషనర్‌కు కార్మికుల సమ్మె నోటీసు
ఒంగోలు , ఫిబ్రవరి 14: ఈనెల 28న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఒంగోలు నగర పాలక కమిషనర్ ఎస్ రవీంద్రబాబుకు ఒంగోలు నగరపాలక ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నట్లు మంగళవారం సమ్మె నోటీసు అందజేశారు. లాభాలు వచ్చే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని ఆపాలని, రెగ్యులర్ పనిలో కాంట్రాక్టు పద్ధతిని నిషేధించి రెగ్యులర్ ఉద్యోగులను నియమించాలని, ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 10 వేల రూపాయలు ఇవ్వాలని, పని భద్రత కల్పించాలని, బీమా పెన్షన్ వంటి సౌకర్యాలతో సామాజిక భద్రత కల్పించాలన్నారు. అందరికీ పెన్షన్ గ్యారంటీ చేయాలని, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థలో కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని తదితర డిమాండ్‌లతో తాము సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) నగర అధ్యక్ష, కార్యదర్శులు కె సామ్రాజ్యం, కొర్నెపాటి శ్రీనివాసరావు, సిఐటియు నగర కార్యదర్శి బి వెంకట్రావు, శేషయ్య, కె రాఘవేంద్ర, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
‘మాతాశిశు మరణాలు తగ్గించాలి’
ఒంగోలు, ఫిబ్రవరి 14: మాతాశిశు మరణాల తగ్గింపునకు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె సుధాకర్‌బాబు ఆశా, నోడల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లాలోని ఆశ, నోడల్ అధికారుల సమీక్షా సమావేశం డాక్టర్ సుధాకర్‌బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ ఆశా నోడల్ అధికారులకు జనని, శిశు సంరక్షణ కార్యక్రమం ఉద్దేశాన్ని దాని అమలు తీరు గురించి వివరించారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి డాక్టర్ కళ్యాణి పల్స్ పోలియోపై శిక్షణ ఇచ్చారు. 5 సంవత్సరాలు లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసి నూరుశాతం లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లా పబ్లిక్ హెల్త్ నర్సింగ్ అధికారిణి జయరాణి కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు.
ఘనంగా దామోదరం సంజీవయ్య జయంతి
ఒంగోలు అర్బన్, ఫిబ్రవరి 14: దివంగత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 92వ జయంతిని సంజీవయ్య విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రజాసంఘాల నేతలు మాట్లాడుతూ నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన దామోదరం సంజీవయ్య అంచెలంచెలుగా ఎదిగిన ఆదర్శమూర్తని తెలిపారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్ర, కేంద్ర మంత్రిగా పనిచేసి నిరుపేదలకు ఎన్నో సదుపాయాలు సమకూర్చిన నేత దివంగత దామోదరం సంజీవయ్యని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌లను ఏర్పాటు చేశారని, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్‌లలో రిజర్వేషన్‌లు కల్పించారన్నారు. దేశంలో మొదటిసారిగా బిసిలకు, మైనార్టీలకు రిజర్వేషన్‌లు కల్పించిన మహోన్నత వ్యక్తి సంజీవయ్యని కొనియాడారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు, విగ్రహ కమిటీ అధ్యక్షుడు యాదాల రాజశేఖర్, సోషల్ వెల్‌ఫేర్ డిపార్టుమెంట్ రిటైర్డ్ సూపరింటిండెంట్ జె సంగీతరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలేటి ఆదిశేషు, దళిత నాయకులు వై సామ్యేల్ జాన్, కనమాల నర్సింహారావు, మాజీ కౌన్సిలర్ శశిబాబు, రిటైర్డ్ డిప్యూటీ తాహశీల్దార్ ఓ కొండలరావు, విగ్రహ కమిటీ సభ్యులు ఎం క్రిస్ట్ఫార్, కె సాల్మన్‌రాజు, ఎం దేవదానం, కట్టా సుధాకర్, రిటైర్డ్ ఆర్‌టిసి ఉద్యోగి టి చార్లెస్ తదితరులు పాల్గొని సంజీవయ్య కాంశ్య విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.