హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఉపాధ్యాయ నియామకాల సందర్భంగా స్పష్టమైన నిర్దిష్టమైన విధానాన్ని అనుసరించకపోవడంతో గత 30 ఏళ్లుగా వేల కేసులతోనూ, న్యాయవివాదాలతోనూ తలమునకలవుతున్న పాఠశాల విద్య మరోమారు వివాదాలను కోరితెచ్చుకుంటోంది. పండిట్లకు అర్హతల ఆధారంగా వేతనాలను పెంచి వివాదాల్లో చిక్కుకున్న పాఠశాల విద్యా శాఖ గత ఐదేళ్ల నుండి వివాదాలనుంచి తప్పించుకోలేకపోతోంది. మరోపక్క స్పెషల్ టీచర్లు, అన్ ట్రైన్డ్ టీచర్లు, పంచాయితీ రాజ్ టీచర్ల వివాదాలు కలిపి దాదాపు 30 వేలకు పైగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా ఇస్తున్న నోటిఫికేషన్లలో కూడా వివాదాలకు ఊతం ఇచ్చేలా ఉండటంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల రిక్రూట్‌మెంట్‌ను మూడు స్థాయిల్లో చేయాల్సి ఉంటుంది. ఒకటి నుండి ఐదో తరగతి వరకూ, ఆరు, ఏడు, ఎనిమిది తరగతులకు, 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకూ మూడు స్థాయిల్లో ఈ రిక్రూట్ మెంట్ చేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి జాతీయ స్థాయిలో అందరికీ వర్తించేలా మార్గదర్శకాలను జారీ చేసింది.
కాని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆర్‌ఎంఎస్‌ఎ ఉద్యోగాలకు ఇచ్చిన నోటిఫికేషన్‌లో అభ్యర్థులు పిజి అయి ఉండాలనే నిబంధన విధించింది. విచిత్రం ఏమంటే 1 నుండి 8వ తరగతి వరకూ బోధనకు మాత్రమే టెట్ అవసరమని, అంతకంటే పై తరగతుల బోధనకు టెట్ అవసరం లేదనే అర్ధం వచ్చేలా ఎన్‌సిటిఇ గత ఏడాది ఫిబ్రవరి 11న ఉత్తర్వు జారీ చేసింది. అయినా డి.ఎస్సీ రిక్రూట్‌మెంట్‌కూ, ఆర్‌ఎంఎస్‌ఎ రిక్రూట్‌మెంట్‌కూ టెట్‌ను నిర్బంధం చేసింది. దీనివల్ల ఇటీవల జరిగిన టెట్‌లో అనర్హులైన దాదాపు రెండు లక్షల మంది డి.ఎస్సీకి హాజరయ్యే అవకాశాన్ని కోల్పోతారు.
ప్రభుత్వం అనవసరపు నిబంధనలు తేవడం ద్వారా న్యాయవివాదాలను కోరితెచ్చుకుంటున్నట్టవుతోందని డి.ఇడి సంఘం జాతీయ కన్వీనర్ హరికృష్ణ వ్యాఖ్యానించారు.
జిల్లా కలెక్టర్ కావాలంటే డిగ్రీ పూర్తి చేశాక నేరుగా సివిల్ సర్వీసెస్ రాసుకుంటే ఒకే పరీక్షతో పూర్తవుతోందని, కాని ఒకటో తరగతి వారికి బోధించే టీచర్ కావాలంటే డిఇడి ప్రవేశపరీక్ష, డి.ఇడీ ఉత్తీర్ణత, టెట్ ఉత్తీర్ణత, డి.ఎస్సీ ఉత్తీర్ణత కావల్సి వస్తోందని, అంటే నాలుగు పరీక్షలు పాసైతే తప్ప టీచర్ కాలేని పరిస్థితి నేడు ఉందని స్లేట్ సంస్థ డైరెక్టర్ వి. అమర్‌నాధ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే డిగ్రీ చదివిన వారు ఎడ్‌సెట్ రాయాలని, బి.ఇడీ ఉత్తీర్ణులు కావాలని, తర్వాత టెట్, అనంతరం డి.ఎస్సీలో క్వాలిఫై కావల్సి వస్తోందని వివరించారు.
కలెక్టర్ కావాలంటే ఒకే పరీక్ష టీచర్ కావాలంటే నాలుగు పరీక్షలు
english title:
p
Date:
Wednesday, February 15, 2012