ఆపదామప హర్తారం
దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహమ్
చైత్రశుద్ధ నవమి.. దేశం నలుచెరగులా వేడుకగా జరుపుకొనే గొప్ప పవిత్ర పర్వదినమే ‘శ్రీరామనవమి’. సాక్షాత్తూ భగవానుడు విష్ణుమూర్తే శ్రీరామచంద్రమూర్తిగా ‘్ధర్మ సంస్థాపనార్థమై’ కౌసల్య, దశరథుని కుమారునిగా ప్రాదుర్భవించిన దినం కావడమే ఇందులోని విశేషం. భారతీయత అంటే శ్రీరాముడు. శ్రీరాముడు అంటే భారతీయత. భారతీయుల దృష్టిలో ఆయన ఆదర్శపతి, ఆదర్శ సోదరుడు, ఆదర్శరాజు, ఆదర్శ పురుషుడు, షోడశ కళాపరిపూర్ణుడు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ (రాముడు రూపం ధరించిన ధర్మం)
అందుకే ఆయనను ‘ఆర్షవాఙ్మయం’ ఘనంగా అడుగడుగునా కొనియాడింది. శ్రీరాముని చరిత్రను, నామాన్ని వేదాలు వేనోళ్ల కీర్తించాయి. పురాణాలు పొగిడినాయి. ఉపనిషత్తులు నిలువెత్తు దార్శనికతను చూపించినాయి. అష్టాక్షరిలోని ‘రా’, పంచాక్షరిలోని ‘మ’ అనే పదాలను సంపుటీకరించి ‘రామ’ అని పేరు పెట్టారు. ‘రామ’ అని అంటే చాలు- మనం సర్వకాల సర్వావస్థలయందుచేసిన పాపాలు తొలగిపోతాయి. ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ‘రా’ అనగా రెండు పెదవులు తెరచుకొని సర్వపాపములు, చెడు దోషాలు బయటికి పోతాయి. ‘మ’ అంటే రెండు పెదవులు మూసుకొని మరల హృదయంలో అవి ప్రవేశించకుండా, ఇంటికి తలుపులు మూతపడినట్లుగా మూతపడతాయి. ఎంతో మహిమన్వితమైనది ‘రామనామం’. సకల దేవతా స్వరూపం ఆ నామం.
ఋగ్వేదంలో
ఋగ్వేదంలోని ఒకే మంత్రంలో ఇక్ష్వాకు రాజ్య ధర్మపరిపాలన రామకథ వివరింపబడింది. అలాగే ‘రామస్తుతి’ కూడా కనిపిస్తుంది.
అధర్వవేదం
అధర్వ వేదంలో కూడా ఇక్ష్వాకు పేరు ఉల్లేఖింపబడినది. ‘రామాయణం’ వేదంతో సమానం. దీన్ని వినడం, చదవటం వల్ల పాపా లు నశించిపోయ, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రయాగ వంటి పుణ్య తీర్థాలను, గంగవంటి పుణ్యనదులను, నైమిశం, కురుక్షేత్రం వంటి స్థలాలను దర్శించినందువల్ల కలిగె ఫలం ‘రామాయణం’ వింటే కల్గుతుంది.
పద్మ పురాణంలో
ఎవరి నాలుకపై ‘రామ’ అనే రెండక్షరాలు నిరంతరం జపించబడతాయో నిత్యం తపో, దాన, హోమ అర్చనలు చేసిన ఫలితం కల్గుతుంది.
మార్కండేయ పురాణంలో
నాల్గు వేదాల సారము, సమస్త సుఖాలకు ఏకమాత్ర కారణం, సర్వులకు ప్రేమను ప్రసాదించేది రామనామమే.
ఆనంద రామాయణం
‘రామ’ బీజం ‘రాం’లో అగ్ని సోమాత్మకమైన విశ్వమంతా ప్రతిష్ఠితమైనది. ‘రామ’లో ‘రా’ తత్వదార్థం, ‘మ’ కారము; ‘త్వం’ పదార్థం రెండు కల్సి ‘తత్త్వమసి’ (ఆత్మయే పరమాత్మ) అనే గొప్ప విషయాన్ని తెలియచెప్తుంది.
గరుడ పురాణం
పాపాత్ములు కూడా రామనామాన్ని ఉచ్చరిస్తే సహస్రకోటి పాపాల నుంచి విముక్తులగుతారు.
శ్రీణమోత్తర తాపినీ ఉపనిషత్తు
అవిముక్తమయిన కాశీ క్షేత్రంలో (వారణాసి) రామమంత్రం జపించినట్లయితే బ్రహ్మహత్యాది పాపాల నుంచి విముక్తులగుతారు. ముక్తి, మోక్షం కల్గుతాయి.
ముక్తికోపనిషత్తు
రామనామ సంకీర్తనం వల్ల జీవితంలో చేసిన పాపాలు అగ్నిలో పడిన సమిధల్లా దహించుకుపోతాయి. ఆపదలు పెనుగాలికి దూదిపింజల్లా ఎగిరిపోతాయి. ఇంకా ఎన్నో సందర్భాల్లో, పురాణాలో,్ల ఉపనిషత్తుల్లో, వేదాల్లో తారక మంత్రాన్ని గురించిన విశేషాలున్నాయి. శ్రీరాముడు సకల మానవాళికి ఆదర్శప్రాయుడు. మానవ జన్మ ఎత్తి మానవునిలో భగవంతుడైనటువంటి వాడు సాక్షాత్తూ శ్రీమన్నారాయణ స్వరూపుడు. కష్టసుఖాలను ఓర్చుకొని చివరివరకు మానవధర్మం పాటించవలెనని చెప్పినటువంటి మహనీయుడు. బ్రహ్మాది దేవతల ప్రార్థనపై లోక సంరక్షణార్థం ఈ భూమీద జన్మించి రఘువంశాన్ని పావన పునీతం చేశాడు. కలౌస్మరణాన్ముక్తి- అని కదా ఆర్యోక్తి. ఈ కలియుగంలో ‘్భగవన్మామ సంకీర్తనం’ అత్యంత ఫలప్రదాయకమైనది. భక్త రామదాసు తనకు వేదం, శాస్త్రం ఏమీ తెలియవు. ఒక్క రామనామం మాత్రం తెలుసునని చెప్పాడు. కనుకనే ‘రామనామం’ సర్వలోకాలకు మూలం అయినది.
పూజా విధానం
నవమి రోజున సీతారామ భరత శతృఘు్నల విగ్రములనుగాని, శ్రీరామ పట్ట్భాషేక పటాన్నిగాని పెట్టి శ్రీసూక్తము, పురుషసూక్తం చేత షోడశోపచార పూజ చేసి కౌసల్యా దశరాథులను పూజించి ఫల పుష్పజలం చేత నిండిన శంఖంలో శ్రీరామునికి అర్ఘ్యం ఇయ్యాలి. కలశాన్ని గంధపుష్పాక్షతలతో పూజించి, అధిదేవత ప్రత్యాధిదేవతా సహితంగా నవగ్రహ అష్టదిక్పాలకు మండపారాధన పూజ చేయాలి.
చక్కెర పొంగలి, చెరుకు ముక్కలు, పానకం, వడపప్పుతో నైవేద్యం ఇచ్చి హారతి, నీరాజనం, మంత్రపుష్పంతో పూజ పరిసమాప్తి చేయాలి. ఇలా చేసినవారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సమృద్ధిగా కల్గుతాయననడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్
english title:
m
Date:
Thursday, April 18, 2013