....................................................
రామాయణం కేవలం ఓ కథ కాదు.. అది జీవన సారం. ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం వరకూ జాతి సంస్కృతిని, కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించే మహాకావ్యం గనుకే రామాయణం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ప్రతి పాత్ర మానవాళికి ఏదో ఒక సందేశం, స్ఫూర్తినిచ్చేదే గనుక రామాయణ గాథకు జన హృదయాల్లో సుస్థిర స్థానం దక్కింది. ప్రజలంతా సుభిక్షంగా, సుఖశాంతులతో ఉంటే అది- ‘రామరాజ్యం’ అన్న నానుడి బలపడింది. ఎన్నో ఆదర్శాలు, సద్గుణాల మేలు కలయిక అయినందునే రాముడు ఒక వ్యక్తిగా కాకుండా ‘దేవుడి’గా పూజ్యనీయ స్థానాన్ని అధిష్ఠించాడు. ధర్మం, కర్తవ్య పాలనకు నిదర్శనమైనందున రాముడు సకల జనులకూ ఆదర్శమూర్తిగా నిలిచాడు. మంచి కుమారుడిగా, ఆదర్శ భర్తగా, ఉత్తమ పాలకుడిగా కీర్తినార్జించిన పరిపూర్ణ పురుషుడు రాముడు. వానర సేనను నడిపించిన నాయకుడిగా, కదన రంగాన యోధుడిగా ధర్మపరిరక్షణ చేసిన అవతార పురుషుడు. తండ్రి మాటను నెరవేర్చి పెద్దలను గౌరవించాలన్న సందేశం ఇచ్చాడు. ముగ్గురు సోదరులతో అన్యోన్యంగా ఉంటూ సోదర బంధం ఎలాంటిదో నిరూపించాడు. ఇక సీతారాములు అన్యోన్య దాంపత్యానికి నిదర్శనమై జన నీరాజనాలు అందుకున్నారు. ప్రజారంజకంగా పాలిస్తూ అందరినీ సమదృష్టితో చూసిన రాముడు ఏనాడో ‘సామాజిక న్యాయాని’కి పెద్దపీట వేశాడు. రామాయణాన్ని ఎన్ని కోణాల్లో, ఎంత లోతుగా విశే్లషించినా- కథలా అన్పించదు. జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఉన్నత విలువలతో ఉత్తమ జీవనానికి సరైన మార్గాన్ని నిర్దేశించినందునే రామాయణం ఏనాటికైనా నిత్య నూతనం, స్ఫూర్తిదాయకం.
.................................................
యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిం
బాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమద రాక్షసాంతకం
.....................................
ఎక్కడ రామనామం వినిపిస్తూ ఉంటుందో అక్కడ కళ్ల నిండా ఆనంద బాష్పాలు నింపుకుని తలవంచి నమస్కరిస్తూ నిలబడి ఉంటాడట- రాక్షసులను దోమల్లా నలిపి నశింపజేసే రామభక్తుడైన హనుమంతుడు. రామనామాన్ని జపిస్తే హనుమంతుడు ఎల్లవేళలా మనలను రక్షిస్తూ ఉంటాడు. రామనామ జపం కారణంగా కేవలం రాముడి కృపనే కాకుండా, హనుమంతుని కరుణ కూడా మనకు దక్కుతుంది.
.....................................
సకల లోకాల్లోని సద్గుణాలను రాశిగా పోస్తే మనకు సాక్షాత్కరించేది శ్రీరాముడి దివ్య మంగళ స్వరూపమే. యుగాలు గడిచినా, తరాలు మారినా సర్వ మానవాళికి ఆదర్శప్రాయుడు తారకరాముడు. ఏ కాలంలోనైనా ఉత్తమమైన, స్వచ్ఛమైన జీవనాన్ని మనం కొనసాగించాలంటే స్ఫూర్తి ప్రదాతలు ఎంతో అవసరం. ‘పరిపూర్ణ మానవుడు’ ఎలా ఉండాలన్నదానికి అసలు సిసలు తార్కాణం రామచంద్రుని జీవితం. ఆదర్శంగా జీవించడమంటే కష్టనష్టాలను సమర్ధవంతంగా ఎదుర్కొనడమే. అందుకే ఆదర్శ పురుషులను అనుసరిస్తేనే మన జీవనయానం సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా అనేక వత్తిళ్లకు, ప్రభావాలకు లోనవుతున్న నేటి యువత తమ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే శ్రీరాముడి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.
జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని గమ్యం చేరాలంటే దృఢ చిత్తం, ఏకాగ్రత, సహనం వంటివి అవసరం. ఈ సుగుణాలన్నీ ఉన్నందునే శ్రీరాముడు ఆదర్శప్రాయుడిగా జనం గుండెల్లో ఈనాటికీ నిలిచాడు. విలాసాలు, విశృంఖలత్వం, విపరీత ధోరణులతో ఆధునిక యువతలో అనేకమంది దిశానిర్దేశం లేకుండా కాలక్షేపం చేస్తుంటారు. ఇలాంటి పెడ ధోరణులను తగ్గించుకునేందుకు సన్మార్గం అవసరం. ఇందుకు ‘రామావతారం’ ఎంతగానో దోహద పడుతుంది. ఆదర్శప్రాయుల బాటలో నడవాలని చాలామంది నిర్ణయం తీసుకున్నా, మధ్యలోనే దారి తప్పడానికి కారణం- సవాళ్లు, సమస్యలు ఎదురు కావడమే. ఇలాంటి సందిగ్ధ, సంక్లిష్ట సమయంలో సరైన దారి చూపేదే ‘రామాయణం’.
శ్రీరాముడంటే ఏకపత్నీ వ్రతుడని, శ్రీకృష్ణుడంటే విలాస పురుషుడని నేటి యువతలో కొంతమంది భావన. ఈ ఇద్దరి జీవనశైలి, ఆదర్శ నియమాలను సరైన రీతిలో ఆకళింపు చేసుకుంటే వీరు యువతకు స్ఫూర్తిదాతలన్న వాస్తవం తేటతెల్లమవుతుంది. కుటుం బం అంటే ఏమిటి? అందులో సభ్యులైన తల్లి, తండ్రి, భర్త, అన్న, తమ్ముడు, వదిన.. ఇలా ఎవరెవరు ఎలా ఉండాలన్నది విడమరచి చెప్పేదే ‘రామాయణం’. ఎవరి ధర్మాలను వారు ఉత్తమంగా ఆచరిస్తే కుటుంబ వ్యవస్థ సజావుగా సాగుతుందని రామాయణం చెప్పకనే చెబుతుంది. అలాగే, శ్రీకృష్ణ పరమాత్మ ‘్భగవద్గీత’లో ఉపదేశించిన 700 పైచిలుకు శ్లోకాలు యువతకు మనోవికాసం కలిగించేవే. నేడు పఠనాసక్తి తగ్గిపోయినప్పటికీ, ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాల (డివిడిలు, ఇంటర్నెట్ వగైరా) ద్వారా రామాయణ, భారతంలోని విషయాలను విశ్వవ్యాప్తంగా ఎవరైనా తెలుసుకునే అవకాశం ఉంది. ఇంతటి మహత్తర విషయాలున్నందునే రాముడి వ్యక్తిత్వం ఆచరణీయమని ప్రాచీనులే కాదు, ఆధునికులు సైతం అంగీకరిస్తారు.
శ్రీరామునిది ఒకే మాట, ఒకే బాణం, ఏకపత్నీ వ్రతం. అయితే, తన సహధర్మచారిణి సీతను రాముడు కష్టాలకు గురి చేశాడని, ‘నాతిచరామి’ అనే పెళ్లినాటి ప్రమాణాన్ని పట్టించుకోలేదని కొందరు వాదిస్తుంటారు. పెళ్లినాటి ప్రమాణాన్ని తుచ తప్పకుండా ఆచరించబట్టే రాముడు లంక నుంచి సీతను తీసుకువచ్చాక, ఆమె చేత అగ్ని ప్రవేశం చేయించి పునీతం చేసుకున్నాడు. భార్య పట్ల అచంచల విశ్వాసం ఉండబట్టే ఆమె అగ్ని ప్రవేశం చేస్తున్నా చలించని మనసుతో- సీత తిరిగి తన వద్దకు క్షేమంగా వస్తుందని ఎదురుచూశాడు. లంకలోని అశోకవనంలో సీత ఉండగా, బాధాతప్త హృదయంతో నిరంతరం ఆమె ధ్యానంలోనే గడిపాడు. సీత దూరమైనపుడు పర స్ర్తిల గురించి కలలోనైనా తలవక పోవడం రాముడి వ్యక్తిత్వానికి నిదర్శనం. పరస్ర్తిని విలాస వస్తువుగా చూస్తూ ఆమెపై అత్యాచారాలకు తెగబడుతున్న నేటి ఆధునిక కాలంలో యువతకు శ్రీరాముడి సద్గుణాలు ఎంతైనా ఆదర్శనీయం. సీతను పునీతం చేయడమే గాకుండా, ఆదర్శ వనితగా ఆమెను లోకానికి చాటి చెప్పేందుకే రాముడు తపన చెందాడు. తన అరణ్యవాసానికి కారకులైనప్పటికీ కైకేయి, మందరలపై ఎలాంటి ఆగ్రహం చూపలేదు. వారిని గౌరవ భావంతోనే చూశాడు. శూర్పణఖ వంటి రాక్షస స్ర్తిలను క్షమించి వదిలేశాడు. సీత భద్రత విషయమై ఆలోచించి తన సోదరుడైన లక్ష్మణుడిని ఆమెను అంగరక్షకుడిగా నియమించాడు. సీత కోసమే రావణ సంహారం చేశాడు. రామాయణ ఇతివృత్తాన్ని, అంతరార్థాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే యువతకు ఇలాంటి ఎన్నో విషయాలు తెలుస్తాయి.
శ్రీరాముని గుణగణాలను ప్రస్తుతించేందుకు ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు ‘రామనవమి’ని ఘనంగా పాటించడం భారతీయ సంప్రదాయం. రామ జననం, సీతారామ కల్యాణం, రామావతారం పరిసమాప్తి జరిగిన రోజునే ‘నవమి’ వేడుకల్ని జరుపుకోవడం విశేషం. ఎవరి ఇళ్లలో వారు జరుపుకోకుండా సామూహికంగా నవమి ఉత్సవాలు నిర్వహించడం గ్రామాల్లో అనాదిగా వస్తున్న ఆచారం. భారతావనిలో రామాలయం లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. తాటాకు పందిళ్లు వేసి చాలా ప్రాంతాల్లో తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలను జరుపుతారు. సీతారాముల కల్యాణ వైభోగం కనులారా వీక్షించాల్సిందే. మరోవైపు వేసవి రాకతో వాతావరణంలో మార్పు ఫలితంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వీధుల్లో పసుపునీళ్లు చల్లే ఆచారం ఇప్పటికీ కొన్ని చోట్ల కనిపిస్తుంది. శ్రీరామనవమి ముందుగానే అంటే ఉగాది పర్వదినం నుంచి గరగ సంబరాలతో- వేప కొమ్మలు వేసిన పసుపునీళ్లు చల్లుతారు. ఇక, నవమి వేడుకల్లో నైవేద్యంగా సమర్పించే పానకం, వడపప్పు మనలో వేసవి తాపాన్ని చల్లార్చి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇంకోవైపు నవమి వేడుకలు కాబోయే దంపతులకు ఆహ్వానం పలుకుతాయి. శ్రీరామనవమి నుంచే పెళ్లి ముహూర్తాలు ఊపందుకుంటాయి. ఆదర్శ పురుషుడి కల్యాణంతోనే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభక కావడం అన్ని విధాలా శుభ సూచకం.
ఆధ్యాత్మికత, విజ్ఞానం, వినోదం, ఆరోగ్యం, చక్కటి కుటుంబ వ్యవస్థ, సామాజిక ఐక్యత వంటి విషయాలెన్నో కలగలిసి ఉన్నందునే రామాయణ గాథ నేటికీ అజరామరంగానే నిలిచిపోయింది. తరాలెన్ని గడిచినా తరగని సద్గుణ నిధి- శ్రీరాముడు. ఆ మహనీయుని మార్గంలో నడిచేలా యువత దీక్షా కంకణం ధరించేందుకు ‘రామనవమి’ అరుదైన సందర్భం. జీవితంలో మార్పుకు నాంది పలికేందుకు ఇదే శుభ తరుణం.