Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కూర్మనాథుని క్షేత్రానికి శుద్ధి

$
0
0

శ్రీకాకుళం, ఏప్రిల్ 17: మూలవిరాట్ మైనపు నమూనా అంశంపై గడచిన రెండు రోజులుగా కూర్మక్షేత్రంలో భక్తులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి భక్తుల డిమాండ్ మేరకు బుధవారం ఉదయం ఆరు గంటలకు ఆలయ కార్యనిర్వాహణాధికారి ప్రసాద్‌పట్నాయక్, పాలక మండలి సభ్యుల నేతృత్వంలో అర్చక స్వాములు అభిషేకాలు నిర్వహించారు. మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ముందుగా విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచనం గావించి లక్ష్మీ సన్నిధిలో వేదమంత్రాలతో హోమాది కార్యక్రమాలు నిర్వహించి జలశుద్ధి గావించారు. తొలుత ఆలయాన్ని కడిగి శుభ్రం చేసారు. అనంతరం శుద్ధి చేసిన జలాన్ని గర్భగుడితో పాటు పరిసర ప్రాంతాల్లో చల్లారు. అనంతరం స్వామి దర్శనార్ధం భక్తులను అనుమతించారు. ఇదిలా ఉండగా గడచిన శుక్రవారం మూలవిరాట్ మైనపు నమూనా సేకరణ, సోమవారం అదే అంశంపై భక్తులు ఆందోళన, ఇ.ఒ. అర్చకుడిపై దాడి, అర్చకునికి గాయం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని శాఖా పరంగా విచారించేందుకు బుధవారం ఇక్కడకు వచ్చిన జిల్లా దేవాదాయ శాఖ ఇన్‌చార్జ్ సహాయ కమిషనర్ ఆర్. పుష్పనాధం, కోటబొమ్మాళి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి గుర్నాధం లను భక్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై సి.బి.సి.ఐ.డి చే విచారణ సాగించాలే తప్ప శాఖాపరంగా విచారణను తాము అంగీకరించేది లేదని వారు కరాఖండిగా తేల్చిచెప్పడంతో విచారణ నిమిత్తం ఇక్కడకు వచ్చిన అధికారులు వెనుదిరిగారు.

ఆదిత్యునికి కల్యాణశోభ
శ్రీకాకుళం కల్చరల్, ఏప్రిల్ 17 నిత్యపూజలందుకుంటున్న అరసవల్లి ఆదిత్య నారాయణుడు కల్యాణశోభితుడయ్యాడు. చైత్ర శుద్ధ సప్తమి పర్వదినాన దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి వారికి కల్యాణాంగ ధ్వజరోహణతో వార్షిక కల్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 25వ తేదికి జరుగుతాయి. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం 6.20నిముషాల నుండి స్వామి వారికి ఆలయ అర్చక బృందం మేళతాళాలతో ప్రత్యేకపూజలు నిర్వహించారు. మూలవిరాట్ నుండి శ్రీ ఆంజనేయజయకేతనంతో పతాకావిష్కరణ పూజలు చేపట్టి ప్రధాన ధ్వజస్తంభం వద్దకు వేదమంత్రాలతో తోడ్కొని వచ్చారు. ఈ సందర్భంగా ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. విశేష అర్చన, దిగ్బలిప్రదానం, హారతి సేవలతో మొదటి రోజు వేడుకలను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ మాట్లాడుతూ వేడుకల్లో భాగంగా గురువారం సాయంత్రం నిర్వహించే సుగంధద్రవ్య మర్ధన ఉత్సవం సాంప్రదాయకీర్తనలతో జరిగే వేడుకలకు భక్తులు పాల్గొని స్వామి వారి దీవెనలు పొందారని కోరారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు తెలుగు సూర్యనారాయణ, పి రామకృష్ణ, కార్యాలయ సిబ్బంది మోహనరావు, మృత్యుంజయరావు, కొండలరావులతో పాటు భక్తుల పాల్గొన్నారు.

మళ్లీ అలజడి
సీతంపేట,ఏప్రిల్ 17:సీతంపేట ఏజెన్సీలో గజరాజులు అలజడి కొనసాగుతోంది.గడచిన నాలుగేళ్లుగా గిరిజనులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగులు అదే తరహాలో పంటలు నాశనం చేస్తున్నాయి. గిరిజనులను మానసికంగా,ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగిస్తున్న ఏనుగులను ఈ ప్రాంతం నుండి తరలించాలని గిరిజనులు పదే పదే కోరుతున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు.గడచిన పది రోజుల క్రితం ఏ ప్రాంతంలోనైతే ఏనుగులు సంచరించాయో అదే ప్రాంతంలోని జీడి తోటల్లో గజరాజులు తిష్టవేసాయి. బుధవారం అర్థరాత్రి 2గంటల ప్రాంతంలో జామితోట గ్రామానికి ఆనుకొని ఉన్న చెరువుకు ఏనుగులు వచ్చినట్లు ఆ గ్రామానికి చెందిన ధర్మారావు తెలిపాడు. అర్థరాత్రి సమయంలో ఏనుగుల ఘీంకారాలు తమకు స్పష్టంగా వినిపించాయని,అయితే ఏ క్షణాన తమ గ్రామంలోకి అవి చొరబడతాయోనని భయంతో బిక్కు,బిక్కుమంటూ రాత్రంతా గడిపామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.తెల్లవారు జామున ఐదు గంటల ప్రాంతంలో ఏనుగులు చెరువు నుండి జీడితోటల్లోకి వెళ్లిపోయినట్లు గ్రామస్థులు చెప్పారు.రాత్రంతా చెరువులోనే సేదతీరిన ఏనుగులు చెరువు పరిసరాల్లో ఉన్న యిసాయి అసిరినాయుడు అనే రైతుకు చెందిన వరి,చెరకు పంటలను నాశనం చేసాయి.జామితోట పరిసర ప్రాంతాల్లోకి ఏనుగులు వచ్చాయనే వార్త తెలుసుకున్న పలు గ్రామాలకు చెందిన గిరిజనులు వాటిని చూసేందుకు ఎగబడ్డారు.అయితే అటవీశాఖాధికారులు ఏనుగులు సంచరించే ప్రాంతానికి చేరుకొని ఎవరూ అటుగా రాకుండా చర్యలు తీసుకున్నారు.
చెరువు పరిసరాల్లోనే ఏనుగుల
రిజర్వ్ ఫారెస్ట్‌లో ఏనుగులు తాగేందుకు చుక్క నీరు లభించక పోవడంతో అవి గ్రామ సమీపంలో ఉన్న చెరువులు, చెలమల వైపు వస్తున్నాయి.దీనిలో భాగంగానే జామితోట గ్రామ సమీపంలో ఉన్న చెరువుకు దాహార్తిని తీర్చుకునేందుకు అవి వచ్చినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.అయితే అటవీ ప్రాంతంలో నీరు లభించకపోవడంతో అవి ఈ చెరువు వైపు వచ్చాయని ,ఒకసారి ఈ చెరువుకు అలవాటు పడిన ఏనుగులు ఈ ప్రాంతాన్ని వదలి ఎటువైపు వెళ్లవని గిరిజనులు చెబుతున్నారు.ఏది ఏమైనప్పటికి ఏనుగుల బారి నుండి తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.

అధిక ధరలకు పుత్తడి ధరలు
నరసన్నపేట, ఏప్రిల్ 17: ప్రస్తుతం బంగారం ధరలు రోజురోజుకూ క్షీణిస్తున్నా.. వర్తకుల అమ్మకాల ధరల్లో మాత్రం ఎటువంటి తేడా ఉండటం లేదని వినియోగదారులు వాపోతున్నారు. గత మూడురోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నా స్థానికంగా అందుబాటులో లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తులం బంగారం మాత్రం 31,000 రూపాయలకు పైగా అమ్మకాలు జరుపుతున్నారని, ధరలు తగ్గాయన్న ఆనందం లేకుండాపోయిందని వినియోగదారులు వాపోతున్నారు. ఇటీవల ఎన్నడూ లేనంతగా బంగారం ధరల్లో సుమారు 30శాతం మేర తగ్గడంతో ప్రజలు పుత్తడి కొనుగోళ్లకు ముందుకువస్తున్నారు. బంగారం ధరల కారణంగావాటి కొనుగోలు సామర్ధ్యం లేక కొందరు వెనక్కి తగ్గారు. అయితే అమాంతం పుత్తడి ధర నేలకు రావడంతో ముందు చూపుతో కొందరు కొనుగోళ్లకు ముందుకు వస్తుండగా, భవిష్యత్‌లో అవసరం నిమిత్తం కూడా మరికొంతమంది బంగారం కొనుగోళ్లకు సిద్ధవౌతున్నారు. అయితే బుధవారం ఉదయం పది గ్రాముల బంగారం ధర 26,060 రూపాయలుగా ఉంది. ఈ లెక్కన తులం బంగారం సుమారు 30 వేల రూపాయల వరకు ఉండవచ్చునని, అయితే తాము తులం ఆభరణము 31 వేల రూపాయల పైబడి కు కొనుగోలు చేశామని ఒక వినియోగదారుడు చెప్పాడు. మరోవైపు గ్రామీణ ప్రాంతవాసులకు ధరలపై అవగాహన లేక వ్యాపారులు ఎంత చెబితే అంత చెల్లించుకుంటున్నారు. గత ఏడాది కిలో 70 వేలు రూపాయలుగా పలికిన వెండి నేడు 45,600 ఉండడంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఆ ధరలను పక్కనపెట్టి వ్యాపారులు సిండికేటుగా మారి ఎక్కువ ధరకే అమ్మకాలు జరుపడం పట్ల నిరసన వ్యక్తవౌతుంది. కాగా, పుత్తడి దిగి వస్తున్నా స్థానికంగా వ్యాపారుల తగ్గించి అమ్మకాలు జరుపడం లేదని, గ్రామీణుల అమాయకత్వాన్ని, అవగాహన లేమిని ఆసరాగా చేసుకుని దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికారులు పూర్తిస్థాయి పర్యవేక్షణ జరపాలని వినియోగదారులు కోరుతున్నారు.
దీనిపై బంగారం వర్తకుల సంఘ ప్రధాన కార్యదర్శి వూన్న పకీరును వివరణ కోరగా బంగారం ధరలు తగ్గడం వాస్తవమేనని, అయితే విశాఖపట్నంలో ఉన్న హోల్‌సేల్ వ్యాపారులు తమకు తగ్గించిన బంగారం రేట్ల కన్నా ఎక్కువగా అమ్మకాలు చేస్తున్నారని, దీనివల్ల ఈ పరిస్థితి నెలకొందని వివరించారు. బిస్కెట్ బంగారం కొరత ఎక్కువగా ఉందని, దీనివల్ల తాము బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వెళ్లలేకపోతున్నామని స్పష్టంచేశారు. ఏది ఏమైనప్పటికీ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నా స్థానిక వ్యాపారస్థులు మాత్రం వినియోగదారులకు అధిక ధరలకే అమ్మకాలు సాగిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు చొరవచూపి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

మన్మథరావుకు దళితరత్న
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 17: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు బోసి మన్మధరావుకు దళితరత్న అవార్డును రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. అంబేద్కర్ 123వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చేతులు మీదుగా ఈ నెల 14వ తేదీన రవీంద్రభారతిలో అవార్డును అందుకున్నారు. సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు పితాని సత్యనారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ రేమాండ్‌పీటర్, కమిషనర్ ఉదయలక్ష్మీ, ఎం.ఆర్.పి.ఎస్. వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ, ఉత్సవ కమిటీ చైర్మన్ నారాయణలకు ఈ మేరకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆధార్ కేంద్రం వద్ద ఆందోళన
నరసన్నపేట, ఏప్రిల్ 17: మండల కేంద్రంలో ఎం.పి.ఇ.పి స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ఆధార్‌కేంద్రం వద్ద స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. ఇక్కడ గతంలో కేంద్రాన్ని ఏర్పాటు చేసి 90 శాతం మేర ఆధార్‌కార్డులను జారీ చేశామని సివిల్‌సప్లై డి.టి హరిబాబు తెలిపారు. అయినా మిగిలిన పదిశాతం మందికి ఆధార్‌కార్డులు జారీచేసేందుకు ప్రత్యేకంగా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. అయితే ఒకేఒక వ్యక్తిని ఆధార్‌కేంద్ర నిర్వాహకునిగా పెట్టడంతో స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. కార్డు తీసుకునేందుకు కొన్ని గంటల సమయం పడుతుందని, దీనివల్ల వందలాది మంది వేచిఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీనిపై సిఎస్‌డిటి మాట్లాడుతూ రోజుకు కేవలం 20 మందికి మాత్రమే ఆధార్‌కార్డులు జారీ చేస్తున్నామని, క్రమపద్ధతిలో వార్డులవారీగా దరఖాస్తులను ఇస్తున్నామన్నారు. కార్డుల కోసం వందలాది మంది కేంద్రం వద్దకు ఒకేసారి రావడంతో ఈ పరిస్థితి నెలకొంటుందని, కేంద్రాన్ని నెలరోజుల పాటు నిర్వహిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.
కంప్యూటర్ పరిజ్ఞానంతో వృత్తినైపుణ్యం
* రిజిస్ట్రార్ కృష్ణమోహన్
ఎచ్చెర్ల, ఏప్రిల్ 17: కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించుకున్నట్లయితే వృత్తి నైపుణ్యం మరింత పెరుగుతుందని అంబేద్కర్ వర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్ స్పష్టంచేసారు. బుధవారం క్యాంపస్ ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. అందువల్లే పదిరోజుల పాటు అధ్యాపకులకు మొదటివిడతగా కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టంచేశారు. అనంతరం పరీక్ష నిర్వహించి ధృవపత్రాలు కూడా అందించనున్నామన్నారు. రెండవ విడతగా సిబ్బందికి ఇదే తరహా శిక్షణ అందించి వృత్తి నైపుణ్యం పెంపొందించేలా మరిన్ని చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్య, అసోసియేట్ ప్రొఫెసర్ కామరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
అదుపుతప్పిన ఒడిశా మంత్రి కాన్వాయ్ వాహనం
* కానిస్టేబుల్ దుర్మరణం * నలుగురికి గాయాలు
టెక్కలి, ఏప్రిల్ 17: ఒడిశా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషారాణి కాన్వాయ్‌లోని వాహనం టెక్కలి బైపాస్ వద్ద టైర్ పేలిపోవడంతో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఎఆర్ కానిస్టేబుల్ కిల్లి అప్పన్న(53) అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో డి.మల్లేసు, జనార్దనరావు, మాణిక్యం, నర్శింగరావులున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో టెక్కలి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టెక్కలి సిఐ రాంబాబు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
బూర్జ, ఏప్రిల్ 17: మండలంలోని మధనాపురం కూడలి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే సరుబుజ్జిలి నుండి పాలకొండ వైపు వస్తున్న ద్విచక్రవాహనాన్ని లకనాపురం కూడలివద్ద కొల్లివలస నుండి పాలకొండ వైపు వెళుతున్న క్వారీ లారీ ఢీకొంది. ఈ సంఘటనలో సీతంపేట మండలం ఈతమానుగూడ గ్రామానికి చెందిన సవర సుందరయ్య(45) అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలపాలైన సవర సోమేసుతో పాటు మరొకరిని 108వాహనంపై శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమేసు(40) మృతిచెందాడు. సంఘటన విషయాన్ని విఆర్‌ఒ వెంకటరావు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ చంద్రవౌళి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్వారీ లారీ డ్రైవర్, క్లీనర్‌లు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయినట్లు వెల్లడించారు. ఘటనాస్థలంలో మృతిచెందిన సుందరయ్యను పాలకొండ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఫొటో

సిఎం పర్యటనతో ప్రజలకు మరింత భరోసా
* డిసిసి అధ్యక్షుడు నరేంద్ర
పాతశ్రీకాకుళం, ఏప్రిల్ 17: అమ్మహస్తం ప్రారంభోత్సవ నేపధ్యంలో జిల్లా పర్యటనకు విచ్చేసి టెక్కలిలో ప్రసంగించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరు ప్రజలకు, కార్యకర్తలకు మరింత మనోధైర్యాన్ని, భరోసాన్నిచ్చిందని డిసిసి అధ్యక్షుడు నర్తు నరేంద్రయాదవ్ అన్నారు. బుధవారం ఇందిరావిజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రచ్చబండ వలె అమ్మహస్తం కార్యక్రమం జయప్రదం కావడంతో జిల్లాకు ప్రతిష్ఠ మరింతగా పెంచిందన్నారు. అధికార ప్రతినిధి రత్నాల నర్సింహమూర్తి మాట్లాడుతూ సి.ఎం జిల్లా దీర్ఘకాలిక సమస్యను గుర్తించి వంశధార మరమ్మతులకు 70 కోట్లు కేటాయించారన్నారు. 52.5 టి.ఎం.సి.ల నీటిని అధికారికంగా జిల్లా రైతులకు వినియోగం కాగా కేవలం 17.5 టిఎంసి మాత్రమే వాడుక జరుగుతుందని, ఈ విషయంపై సి.ఎం దృష్టి సారించారన్నారు. ఈ నెల 22 నుండి 26వ తేదీవరకు కేంద్ర కమిటీ బృందం ఈ విషయమై జిల్లా పర్యటనకు రానున్నారని తెలిపారు. ముందుగా టెక్కలి ట్రాక్టర్‌బోల్తా మృతులకు సంతాపసూచికంగా రెండు నిమిషాలు వౌనం పాటించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ముస్తాక్‌మహ్మద్, యూత్‌కాంగ్రెస్ అధ్యక్షులు రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.

సిఎం పర్యటనతో ఒరిగేదేమీ లేదు

పాతశ్రీకాకుళం, ఏప్రిల్ 17: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన రాజకీయ లబ్ధికోసమే తప్ప జిల్లా ప్రజలకు ఒరిగేదేమీ లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు ఎద్దేవాచేసారు. బుధవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సి.ఎం వస్తారంటే జిల్లాకు ఏదో చేస్తారనే ప్రజలు ఆశలను నీరుగార్చారన్నారు. తోటపల్లి, వంశధార సమస్యలపై నోరెత్తిన ముఖ్యమంత్రి వెనుకబడిన జిల్లా అంటూ ముసలికన్నీరు కార్చడం హాస్యాస్పదమన్నారు. జలయజ్ఞం పేరుతో నిధులు పక్కదారిన పడ్డాయే తప్ప రైతుకు నీరందించే ఆలోచనే ప్రభుత్వానికి లేదన్నారు. అంబేద్కర్ వర్సిటీకి అనుమతులిచ్చి వౌళిక సదుపాయాలు కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. జిల్లాకు వచ్చిన మంత్రి అధికారుల పనితీరుపై కనీసం రెవెన్యూ సమావేశం కూడా నిర్వహించలేదంటే జిల్లా పట్ల ఆయనకు గల చిత్తశుద్ధి ఏమేరకు ఉందో ఇట్టే అర్ధమవుతోందన్నారు. షీల్డుకవర్‌లో ముఖ్యమంత్రి స్థానాన్ని పొందిన కిరణ్‌కుమార్‌రెడ్డికి చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. గత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎందరో వారి అసమర్ధత పాలనతో టిడిపికి అధికారాన్ని అందించే విషయాన్ని గుర్తుచేస్తూ ఈ సి.ఎం కూడా అదే పంథాలో దేశం పార్టీకి అప్పగించే పరిస్థితులు కల్పించి శాశ్వత మాజీ సి.ఎం జాబితాలో చేరక తప్పదని చలోక్తి విసిరారు. ఎస్సీ, ఎస్టీ అభ్యున్నతి కోసం సబ్‌ప్లాన్ పెట్టామంటూ బడుగువర్గాలకు మభ్యపెట్టడం సరికాదని, గత తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎంత ఖర్చు చేసారో శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూలికి వెళ్తున్న వారిని బలవంతంగా సభకు తరలించి వారి బతుకులు బుగ్గిపాలు చేసారని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని, ఎక్స్‌గ్రేషియా పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, పి.వి.రమణ, రోణంకి మల్లేశ్వరరావు, కోరాడ బాబు, ఎస్.వి.రమణమాదిగ, డి.వి.ఎస్.ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి
* ముగ్గురికి గాయాలు
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 17: జిల్లాలో రణస్థలం మండలం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై ఎద్దులబండిని, రెండు మోటారు బైక్‌లను లారీ ఢీకొన్న సంఘటనలో లావేరు మండలం తాళ్లవలస గ్రామానికి చెందిన అప్పలనాయుడు(49) మృతిచెందారు. అప్పలనాయుడు, పోలిరాజులు ఎద్దులబండిని తోలుకుని పాతపెట్రోల్‌బంకు ఎదురుగా ఉన్న కోతమిషన్‌కు వచ్చి జాతీయ రహదారిపై తిరిగివెళ్తుండగా విశాఖ నుండి శ్రీకాకుళం వైపు వెళ్తున్న సిమ్మెంటులోడు లారీ ఢీకొంది. ఈ ఘటనలో మీసాల పోలిరాజు తీవ్రంగా గాయపడ్డాడు. వీరిని 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అప్పలనాయుడు మృతిచెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. పోలిరాజు రిమ్స్‌లో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఎద్దులబండి నుజ్జునుజ్జు కాగా ఒక ఎద్దు దుర్మరణం పాలైంది. ఇదే ఘటనలో రెండు మోటారు సైకిళ్లు రోడ్డుపక్కన ఉంచి మాట్లాడుతున్న దన్నాన మహేశ్వరరావు, సూర్యనారాయణలకు గాయాలయ్యాయి. వీరు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యువజన సంఘాలకు సామాజిక బాధ్యత
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఏప్రిల్ 17: జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల అమలులో యువజన సంఘాలు కీలకపాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ కోరారు. చైతన్యం కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా లోక్‌శిక్షాసమితి కార్యాలయంలో మండల సమన్వయకర్తలతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాక్షర భారత్‌కేంద్రాల నిర్వహణ పూర్తిగా యువజన సంఘాలు పర్యవేక్షించాలన్నారు. యువజన సంఘాలకు వాటిపై సంపూర్ణ అవగాహన కలిగించాలని సూచించారు. మండలంలో నిర్మింపబడిన నెహ్రూ యువసంఘం సమన్వయకర్త, సాక్షరభారత్ మండల సమన్వయకర్తలు అవగాహనతో పనిచేయాలని ఆదేశించారు. సాక్షర భారత్ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించాలన్నారు. జిల్లాను ఆదర్శవంతంగా నిలపాలని, శతశాతం అక్షరాస్యత జిల్లాగా అవతరించేందుకు కృషిచేయాలన్నారు. కార్యక్రమం పట్ల నిర్లక్ష్యవైఖరి, అలసత్వం ఉండరాదన్నారు. చిత్తశుద్ధితో పనిచేయాలనే తపన ఉన్నవారు కొనసాగవచ్చునని పేర్కొన్నారు. ఇప్పటివరకు మూడు విడతలుగా కార్యక్రమం నిర్వహించామని, జనవరి 2013 నుండి నాల్గవ విడత కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. గ్రామస్థాయి సమన్వయకర్తల పనితీరుపై మండల సమన్వయకర్తలు నివేదికలు అందించాలని ఆదేశించారు. అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు. తదనుగుణంగా వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. వయోజనవిద్య కేంద్రాల జాబితాను ఎంపిడిఒకు అందజేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు వెంటనే విద్యుత్ ఏర్పాటు చేస్తారని చెప్పారు. విద్యుత్ కల్పించని పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్రాలకు అవసరమైన సామాగ్రి తదితర అంశాలను తెలియజేయాలని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో కార్యక్రమాన్ని తీసుకువెళ్లేందుకు యువసంఘాలతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలన్నారు. సాక్షరభారత్ ఎక్కడ అవసరమైతే అచ్చటకు మార్చాలని ఆదేశించారు. సంతకవిటి, పోలాకి మండలాల సమన్వయకర్తలను వెంటనే నియమించాలని సూచించారు. యువజన సంఘాలతో సామాజిక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నామని, వాటిలో ఏడాదికి 30 యూనిట్ల రక్తాన్ని సేకరించడం, గ్రామంలో వందమంది నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేయడం, వంద మరుగుదొడ్లు నిర్మించడం, పంచాయతీ నుండి కనీసం 20 ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో జరిగే విధంగా చేయడం వంటి చర్యలు చేపట్టడం అంశాలున్నాయని చెప్పారు. యువజన సంఘాలు మండలానికి పది స్పోర్ట్స్ కిట్‌లను పంపిణీ చేసామని, అదనంగా కావాలని ముందుకు వస్తే వారికి కూడా సరఫరా చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో ఎజెసి ఆర్.ఎస్.రాజ్‌కుమార్, వయోజన విద్యా ఇన్‌చార్జి ఉపసంచాలకులు ధర్మారావు, ప్రాజెక్టు అధికారి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

మూలవిరాట్ మైనపు నమూనా అంశంపై గడచిన
english title: 
k

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>