Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ట్రాన్స్‌కో కొత్త టెక్నిక్

$
0
0

ఏలూరు, ఏప్రిల్ 17: సామాన్య జనానికి నరకం చూపించటంలో సరికొత్త విధానాలను కనిపెడుతూ ఇంతవరకు అనుమానిస్తున్న ఒక వ్యవహారం నిజమేమోనన్న నమ్మకాన్ని కూడా ట్రాన్స్‌కో కలిగిస్తోంది. కొంత కాలం నుంచి రాష్ట్ర అధికారులు ప్రకటించిన కోతలకు అదనంగా మరిన్ని కోతలను ఎటువంటి గలాటా లేకుండా అమలు చేయగలిగితే అటువంటి అధికారులకు ట్రాన్స్‌కో ప్రోత్సాహకాలను ముట్టచెపుతోందని చెపుతున్నారు. దీనిలో వాస్తవం ఎంతున్నా ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే అది నిజమేమోననిపిస్తుంది. జిల్లాకు విఐపిలు వచ్చారంటే ట్రాన్స్‌కోకు పండుగ మాదిరిగా మారిపోయింది. విఐపిలు ఉన్నచోట్ల అధికారుల హుకుంల్లో, వేడుకోల్లో గాని ఆ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగించి ఆ ఫలితాన్ని కోతల ద్వారా మిగతా జనానికి పంచిపెడుతున్నారు. ఫలితంగా ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు పరిస్ధితి మారిపోయింది. తాజాగా బుధవారంనాటి పరిణామాలను చూసినా జిల్లా కేంద్రమైన ఏలూరులో పగటిపూట పట్టుమని వరుసగా 5,6గంటలు కరెంటు ఉన్న దాఖలాలు లేవు. ఉదయానే్న 7గంటలకు మొదలైన కోత దాదాపు 10గంటలకు పూర్తయింది. ఆతర్వాత 12గంటలకు మళ్లీ. ఇక రాత్రి సమయంలో అయితే దాదాపు రెండుగంటలకు పైగా కోతలతో నగర ప్రజానీకానికి నరకం చూపించారు. ఇంతకీ ఈస్ధాయిలో ట్రాన్స్‌కో ప్రతాపాన్ని ఎందుకు ప్రదర్శించిందంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ఏలూరులో మూడు జిల్లాల అధికారులతో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఆ సదస్సుకు విద్యుత్ అంతరాయం లేకుండా చేయడానికి నగరం మొత్తం అంధకారమయం చేశారు. ప్రాంతీయ సదస్సు స్ధాయిలో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇలాంటి సర్దుబాట్లు చేస్తారని సర్దుకున్నా చివరకు రాత్రి మూడు జిల్లాల అధికారులకు విందు ప్రహసనం నడిచింది. దీనికి కూడా పూర్తిస్ధాయిలో విద్యుత్ సరఫరా చేసేందుకు ఆ కోత మొత్తాన్ని నగరం మొత్తానికి పంచిపెట్టారు. ఈ కారణంగానే రాత్రి రెండుగంటలకుపైగా కోతలు విధించారని ట్రాన్స్‌కో వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. ఒక ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేసేందుకు వచ్చిన సిఫార్సులను ఆమోదించటం ఒక ఎత్తు అయితే ఆ ప్రాంతంలో విధించాల్సిన కోత మొత్తాన్ని మిగిలిన నగరానికి పంచిపెట్టడం మరో ఎత్తు. ఇటువంటి పరిణామాలతో నగర ప్రజలు దాదాపు బుధవారం నరకానే్న చూశారు. ఇటీవల ఏలూరులో జరిగిన డిఆర్సీ సమావేశం సందర్భంగాను, అంతకుముందు, ఆతర్వాత అమాత్యుల పర్యటనల నేపధ్యంలోనూ ఇటువంటి ప్రక్రియనే ట్రాన్స్‌కో అమలుచేసింది. అమాత్యులు ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేస్తూ అక్కడి కోతల మొత్తాన్ని మిగిలిన నగరానికి పంచింది. అయితే ఈవిధంగా సాధారణ కోతలకు తోడు ఈవిధంగా సిఫార్సుల కారణంగా వచ్చిన కోతలు తోడవటంతో సామాన్య ప్రజల పరిస్దితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. దీనికితోడు బుధవారం ఇటీవలకాలంలో ఎన్నడూ లేనిరీతిలో ఎండవేడిమి ఠారెత్తించటంతో దాంతోనే జనం అల్లాడిపోతే కక్ష కట్టినట్లుగా ట్రాన్స్‌కో భారీఎత్తున కోతలకు దిగటంతో జనం అంతా గగ్గోలు పెట్టేశారు. వ్యాపారవర్గాల పరిస్ధితి చెప్పనక్కర్లేదు. ఏ నిముషంలో విద్యుత్ ఉంటుందో, ఎప్పుడు మాయమైపోతుందో తెలియక వ్యాపారం చేసుకునే మార్గం లేక వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదీఏమైనా ట్రాన్స్‌కో విఐపిల టెక్నిక్‌తో మరింత ఆదా చేస్తోందో ఏమోగాని జనానికి మాత్రం ప్రత్యక్ష నరకానే్న ప్రసాదిస్తోంది.
ప్రశాంతంగా పంచాయతీ రాజ్ ఎన్నికలకు చర్యలు
అధికారులకు ఎన్నికల కమిషనర్ రమాకాంతరెడ్డి ఆదేశం
ఏలూరు, ఏప్రిల్ 17 : రానున్న పంచాయితీ రాజ్ సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పి రమాకాంతరెడ్డి జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామ పంచాయితీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న ముందస్తు చర్యలపై ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల అధికారులతో ఎన్నికల కమిషనర్ పి రమాకాంతరెడ్డి ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ, పంచాయితీ అధికారులు పాల్గొన్న సమావేశంలో ఎన్నికల విధి విధానాలను గూర్చి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. పంచాయితీరాజ్ ఎన్నికలను ఎన్నికల నియమనిబంధనలకు లోబడి నిర్వహించాలన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల ఓటర్ల జాబితా ముసాయిదాలను మార్చి 26వ తేదీ నాటికి, మండల పరిషత్ ముసాయిదా ఏప్రిల్ 2వ తేదీ నాటికి సిద్దం చేయడం జరిగిందన్నారు. ఓటర్లు తమ పేర్లను ముసాయిదాలో పరిశీలించుకోవాలని, ఏమైనా మార్పులుంటే దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. గ్రామ పంచాయితీ ఎన్నికలు రిటర్నింగ్ అధికారులు ప్రకటించిన తేదీల్లో జరుగుతాయన్నారు. నామినేషన్ల స్వీకరణ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుందన్నారు. వార్డు మెంబర్‌కు పోటీ చేసే అభ్యర్ధి సదరు గ్రామంలో ఓటరుగా వుండాలన్నారు. వారిని బలపరిచేవారు పోటీ చేసే వార్డులో అభ్యుర్ధులై వుండాలన్నారు. నామినేషన్ల ఉపసంహరణ తరువాత పోలింగ్‌నకు కనీసం అయిదు రోజుల సమయం ఉండాలన్నారు. పోలింగ్ మొదలవడానికి 44 గంటల ముందు ప్రచారం నిలిపివేయాలన్నారు. పోలింగ్ ఉదయం 10.00 గంటలకు మొదలై 1.00 గంటలకు ముగుస్తుందన్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారన్నారు. ఉపసర్పంచ్ ఎన్నిక కూడా ఆ రోజే జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని 1097 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. జడ్పీటీసీల నామినేషన్లు జిల్లా పరిషత్ కార్యాలయంలో స్వీకరిస్తారన్నారు. ఈ ఎన్నికలకు జిల్లా కలెక్టర్ అప్పిలేట్ అధారిటీగా నిర్వహిస్తారన్నారు. జడ్పీటీసీ సభ్యులు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారన్నారు. అదే రోజు కో ఆప్షన్ సభ్యులను కూడా ఎన్నుకుంటారన్నారు. ఎన్నికల నియమావళిని గూర్చి విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. అభ్యర్ధులకు పూర్తి అవగాహన కలిగించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికలలో ఎటువంటి అక్రమాలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అదనపు సిబ్బంది అవసరమైతే ముందుగా తెలియజేయాలన్నారు. పంచాయిత ఎన్నికల సందర్బంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో నిఘా కెమేరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధుల సేవలు వినియోగించుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ మాట్లాడుతూ పంచాయితీరాజ్ ఎన్నికల నిర్వహణకు జిల్లా పరిషత్, జిల్లా పంచాయితీ అధికారి కార్యాలయంలో జిల్లాస్థాయిలో 46 ఎంపిపి కార్యాలయాల్లో ప్రత్యేక ఎన్నికల సెల్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 30 లక్షల 52 వేల 369 మంది జనాభా ఉండగా వారిలో 21,48,462 మంది ఓటర్లుగా నమోదై వున్నారన్నారు. 2011 జనవరి 1 ప్రాతిపదికగా గ్రామ పంచాయితీ ఓటర్ల జాబితా ప్రచురణ కోసం మార్చి 26వ తేదీన పంచాయితీరాజ్ రూరల్ డవలప్‌మెంట్ ఇవోలకు అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలో 883 గ్రామ పంచాయితీల ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో మూడు దశలుగా గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మొదటి దశలో ఏలూరు, రెండవ దశలో కొవ్వూరు, మూడవ దశలో నర్సాపురం డివిజన్లలో నిర్వహిస్తామన్నారు. జడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల ప్రక్రియ రెండవ దశ ఎన్నికల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికలకు 9786 పోలింగ్ స్టేషన్లు అవసరం కాగా జడ్పీ ఎన్నికలకు 2730 పోలింగ్ స్టేషన్లు అవసరమవుతాయన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి 200 రూట్ ఆఫీసర్లు, 160 జోనల్ ఆఫీసర్లను నియమించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. సమావేశంలో రాష్ట్ర పంచాయితీరాజ్ కమిషనర్ కె రాంగోపాల్, ఎన్నికల కమిషన్ జాయింట్ కార్యదర్శి ఎవి సత్య రమేష్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, కృష్ణాజిల్లా కలెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ ఎం జ్యోతి, విజయవాడ పోలీసు కమిషనర్ ఎన్ మధుసూధనరెడ్డి, ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల ఎస్‌పిలు ఎం రమేష్, ఎన్ శివశంకర్‌రెడ్డి, జె ప్రభాకరరావు, రాజమండ్రి అర్బన్ ఎస్‌పి రవికుమార్‌మూర్తి, డి ఆర్‌వో ఎం మోహనరాజు, డిపివో నాగరాజు వర్మ, సి ఇవో నాగార్జునసాగర్, ఆర్‌డివోలు కె నాగేశ్వరరావు, సూర్యారావు, సత్యనారాయణ, తూర్పుగోదావరి, కృష్ణాజిల్లాల ఆర్డీవోలు, డి ఎస్‌పిలు, డిపివోలు, జడ్పీ సి ఇవోలు పాల్గొన్నారు.
పేదలపాలిట అభయహస్తం
అమ్మహస్తం సభలో మంత్రి పితాని
పెరవలి, ఏప్రిల్ 17: అమ్మ హస్తం పేదల పాలిట అభయ హస్తమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పెరవలిలో బుధవారం అమ్మ హస్తం పథకం కింద కార్డుదారులకు నిత్యావసర సరుకులను ఆయన పంపీణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ నిరంతరం కార్డుదారులకు ఒకే ధరకు 9 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమ్మ హస్తం పథకాన్ని రూపొందించిందన్నారు. పెరిగిన ధరల వ్యత్యాసాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుందని వివరించారు. రాష్ట్రంలో కార్డుదారులకు నాణ్యమైన కిలో రూపాయి బియ్యంతో బాటు నాణ్యమైన నిత్యావసర సరుకులను సబ్సిడీ రేట్లకు పంపీణీ చేయడమే ఈ పథకం ముఖ్యోద్దేశమని వెల్లడించారు. పేద ప్రజలకు షౌష్టికాహారాన్ని సబ్సిడీ ధరకు అందించే ఈ పథకాన్ని ప్రతిపక్షాలు అపహాస్యం చేయడం విడ్డూరంగా వుందన్నారు. అమ్మ హస్తం మొండి హస్తమని చంద్రబాబు విమర్శించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అమ్మ హస్తం విమర్శకుల పాలిట సింహస్వప్నమవుతుందని హెచ్చరించారు. కార్డుదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని అన్నారు. రాష్ట్ర జనాభాలో సుమారు 23 శాతం వున్న ఎస్సీ, ఎస్టీ, గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 8865 కోట్ల రూపాయల నిధులతో సబ్‌ప్లాన్ అమలు చేస్తోందని తెలిపారు. వీరికి కేటాయిస్తున్న నిధులు ఈ వర్గాల అభివృద్ధికి సక్రమంగా అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందన్నారు. వారికి కేటాయించిన నిధులు పక్కదారి పడుతున్నాయని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించి అమలు చేయడం ద్వారా వారి ప్రగతికి బాటలు వేస్తోందన్నారు. గతంలో 45 శాఖల ద్వారా ఈ నిధులు వినియోగం జరిగేవని, వీటిని కుదించి 27 విభాగాలకు పరిమితం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి మాజీ అధ్యక్షుడు జిఎస్ రావు, నిడదవోలు నియోజకవర్గ ఇన్‌చార్జి జి శ్రీనివాసనాయుడు, మండల పరిషత్ ప్రత్యేకాధికారి డిఎల్‌బిఎల్ కుమార్, తహసీల్దార్ అక్బర్ హుస్సేన్, సొసైటీ అధ్యక్షుడు కరుటూరి గోపాలకృష్ణ (తీపర్రు), పప్పొప్పు కాళీ ప్రసాద్ (అన్నవరప్పాడు), బొలిశెట్టి బ్రహ్మానందం (మల్లేశ్వరం), రామకృష్ణ (ముక్కామల), కాంగ్రెస్ నాయకులు కోటిపల్లి మురళీకృష్ణ, నేదునూరి గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
ముగ్గురు బుకీల అరెస్టు

17 సెల్‌ఫోన్లు, లాప్‌టాప్, టివి, ప్రింటర్ స్వాధీనం
ఏలూరు, ఏప్రిల్ 17 : క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 17 సెల్‌ఫోన్లు, లాప్‌టాప్, టివి, ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్‌పి ఎం రమేష్ ఇందుకు సంబంధించి వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి. భీమవరం టుటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాయలం గ్రామంలో ఇంటూరి భగవాన్‌జీ అనే వ్యక్తి ఒక ఇంటిని అద్దెకు తీసుకుని పడమటి రామకృష్ణ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ నిర్వహించుకోవడానికి ఆశ్రయం కల్పించాడు. ఈ ఇంటి నుంచి రాష్ట్రం నలుమూలల క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. జిల్లా ఎస్‌పి ఎం రమేష్ ఆదేశాల మేరకు ఈ ఇంటిపై భీమవరం సి ఐ జయసూర్య నిఘా వుంచారు. ప్రస్తుతం ఐపి ఎల్ క్రికెట్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఇంటి నుంచే భారీ ఎత్తున క్రికెట్ బెట్టింగ్‌లు జరుగుతున్నాయని సమాచారం అందింది. సి ఐ జయసూర్య తన సిబ్బందితో కలిసి రాయలం గ్రామంలోని భగవాన్ ఇంటిపై మంగళవారం రాత్రి దాడిచేసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న పడమటి రామకృష్ణ, ఇంటూరి భగవాన్‌జీ, అనీల్‌రాజులను అరెస్టు చేశారు. బెట్టింగులకు వారు ఉపయోగిస్తున్న రికార్డింగ్ బాక్సులు, 17 సెల్‌ఫోన్లు, లాప్‌టాప్, ప్రింటర్, టివిలను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సి ఐ జయసూర్య, సిబ్బందిని ఎస్‌పి ఎం రమేష్ అభినందించారు. విలేఖరుల సమావేశంలో జిల్లా అదనపు ఎస్‌పి వి ఎన్‌వి సత్యనారాయణ, నర్సాపురం డి ఎస్‌పి రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
* ఎమ్మెల్యే ఈలి నాని
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 17: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే ఈలి నాని అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూలులో బుధవారం అమ్మ హస్తం కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి మండల ప్రత్యేకాధికారి కె. సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఈలి నాని మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కిలో రూపాయికే బియ్యం అందించిన కిరణ్ నేడు 9 రకాల నిత్యావసర వస్తువులు 185/-లకే అందిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించి దళితవాడల్లో వౌలిక వసతులు కల్పించడానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం పట్టణం, మండలం, పెంటపాడు మండలాల్లో నీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ఆరుగురు మైనార్టీ విద్యార్థులకు సైకిళ్లు అందజేస్తారన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్, సిహెచ్. నాగేశ్వరావు, తహసీల్దారు పి.శ్రీనివాసరావు, ఎంపిడిఒ జివికె మల్లికార్జునరావు, కాంగ్రెస్ నాయకులు దుర్గా రామచంద్రారావు, పాలూరి వెంకటేశ్వరరావు, దాట్ల జగన్నాధరాజు, మారిశెట్టి సుబ్బారావు, కొల్లి రమావతి, నూకల బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలి
వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ బాలరాజు
ద్వారకాతిరుమల, ఏప్రిల్ 17: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను జనంలోకి తీసుకెళ్లి, ప్రతి కార్యకర్త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. మండలంలోని కొమ్మర గ్రామంలో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ విగ్రహం ప్రారంభోత్సవానికి బుధవారం సాయంత్రం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు, గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహ ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే బాలరాజు ప్రసంగిస్తూ వైఎస్సార్ మరణానంతరం ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులపాలు చేస్తోందన్నారు. అధికార పార్టీ బెదిరింపులకు కార్యకర్తలు భయపడనక్కరలేదని, రాష్ట్భ్రావృద్ధే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేసి, జగన్‌ను సిఎం చేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే వనిత మాట్లాడుతూ జగన్ సిఎం అయ్యే వరకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చిలుకాని రాజుబాబు, తలారి వెంకట్రావు, సుంకర ఆంజనేయులు, బుసనబోయిన సత్యనారాయణ పాల్గొన్నారు.
నేటి నుండి ఆధార్ కేంద్రం ఏర్పాటు
అత్తిలి, ఏప్రిల్ 17: అత్తిలి, ఈడూరు గ్రామాలలో గురువారం నుండి ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపిడివో ఎ ఆంజనేయులు తెలిపారు. ఇంతవరకు ఆధార్ కార్డులు పొందని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. గురువారం నుండి అత్తిలిలో ఒంటిపూట మంచినీరు సరఫరా చేయనున్నట్లు ఎంపిడివో ఆంజనేయులు తెలిపారు. ఈ నెల 24న అత్తిలిలో అమ్మహస్తం పథకం ప్రారంభిస్తున్నట్లు ఎంపిడివో ఆంజనేయులు తెలిపారు.
పూరిల్లుకి రూ.7వేలు విద్యుత్‌బిల్లు
ద్వారకాతిరుమల, ఏప్రిల్ 17: వీరేమీ పెద్దపెద్ద భవనాలకు యజమానులు కారు... అలాగే వీరింట్లో ఎసిలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు వంటివి కూడ లేవు. కేవలం ఫ్యాను, లైటు, చిన్న టివి మాత్రమే వుండి పూరిళ్లల్లో నివసిస్తూ కూలి పనులు వెడుతున్న వీరికి వేలల్లో విద్యుత్ బిల్లులు రావడంతో వారు షాక్‌కు గురవుతున్నారు. విద్యుత్ శాఖ అధికారుల చుట్టూ వీరు తిరిగి మొరపెట్టుకున్నా బిల్లులు చెల్లించాల్సిందేనని తేల్చడంతో వేలాది రూపాయలు తెచ్చి ఎలా కట్టాలని వారు వాపోతున్నారు. మండలంలోని జి కొత్తపల్లికి చెందిన నాగదాసు రామకృష్ణ, గంటా వెంకట్రావు, బోడా సూరిబాబు, ఎం ఆంజనేయులు ఇలా అనేక మందికి వేలాది రూపాయలు విద్యుత్ బిల్లులు రావడంతో వారు లబోదిబోమంటున్నారు. మీటర్లు మారుస్తామంటున్న సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు చెబుతున్నారు. వేలల్లో వచ్చిన బిల్లులు కట్టకపోయేసరికి అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పిల్లలతో అంధకారంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సి వుంది.
వేళాపాళా లేని విద్యుత్ కోతల పట్ల
మన్నించండి
సాంఘిక శాఖామంత్రి పితాని
పెరవలి, ఏప్రిల్ 17: వేళాపాళా లేని విద్యుత్ కోతల పట్ల మన్నించాలంటూ రాష్ట్ర సాంఘిక శాఖామంత్రి పితాని సత్యనారాయణ ప్రజలను వేడుకొన్నారు. పెరవలిలో బుధవారం జరిగిన అమ్మ హస్తం పంపిణీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విద్యుత్ కోతలపై సభ. నుండి వచ్చిన నిరసనలపై ఆయన స్పందించారు. విద్యుత్ కొరతను తీర్చడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఫలితాలు రావడానికి మరికొంత సమయం పడుతుందని అన్నారు. డిసెంబరు వరకూ ఇబ్బందులు తప్పవని, ఓపిక పట్టాలని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరుగుతోదని, యూనిట్ ధర 4.22 రూపాయల నుండి 5.22 రూపాయలకు పెరిగిందని అన్నారు. ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో సమకూర్చి పెంచిన చార్జీలను ఉపసంహరించుకొందని వెల్లడించారు. ఎన్ని అడ్డంకులు ఏర్పడ్డా విద్యుత్ కోతలను నివారించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు.
185 తొమ్మిది రకాల వస్తువులు
పెనుగొండ, ఏప్రిల్ 17: దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు అమ్మ హస్తం ద్వారా 185 రూపాయలకే తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. బుధవారం పెనుగొండ శ్రీ లక్ష్మీజనార్దనస్వామి కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి అమ్మహస్తం సరుకుల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 1వ తేదీనుండి బహిరంగ మార్కెట్‌లో 232 రూపాయలకే దొరికే నిత్యావసర సరుకులను 185 రూపాయలకే అందిస్తున్నారన్నారు. నిరుపేదల కోసం, మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎపుడూ ముందంజలో వుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి అసలు వారసులము మేమేనని, వైఎస్ ఆత్మ తన వెంటే వుందని అన్నారు. జగన్, షర్మిల ఆస్తికి వారసులు తప్ప, వైఎస్‌ను తామెన్నడూ మరువలేదని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీవో కె. సూర్యారావు, మాజీ ఎంపి మెంటే పద్మనాభం, తహసీల్దార్ పిజెఎస్ కుమార్, ఎంపిడిఒ విజయలక్ష్మి, కేతా సత్తిబాబు, నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రెడ్‌క్రాస్‌కు విరాళాలు అందించాలి : కలెక్టర్
ఏలూరు, ఏప్రిల్ 17 : రెడ్‌క్రాస్‌లో సభ్యత్వం పొందడంతోపాటు విరాళాలు కూడా అందించి ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ కోరారు. స్థానిక జిల్లా కలెక్టర్ బంగ్లాలో బుధవారం డి ఇవో ఆర్ నరసింహరావు 7,23,919 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్‌ను రెడ్‌క్రాస్ సొసైటీకి విరాళంగా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్‌కు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు, విరాళాల సేకరణలో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలో ప్రధమస్థానంలో నిలిచిందన్నారు. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో పెద్ద సంఖ్యలో రెడ్‌క్రాస్‌లో సభ్యత్వాన్ని నమోదు చేసి జిల్లాను ప్రధమస్థానంలో నిలిపేందుకు యువత సహకరించాలని అన్నారు. డి ఇవో ఆర్ నరసింహరావు మాట్లాడుతూ రెడ్‌క్రాస్ విరాళాల సేకరణలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ స్కూళ్ల విద్యార్ధినీ విద్యార్ధులు, డివై ఇవోలు, ఎం ఇవోలు సహకరించారన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యాలయం సూపరింటెండెంట్ కె పురుషోత్తం, సీనియర్ అసిస్టెంట్ కె ఎల్ శ్రీనివాస్, సెక్షన్ అసిస్టెంట్ జక్కా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

*మధ్యాహ్నం మీటింగ్*రాత్రి విందు*జనానికి కోతలతో నరకం
english title: 
tra

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>