అల్‌ఖాయిదా, తాలిబన్, హిజ్‌బొల్లా, జమాత్ ఉద్ దావా, ముజాహిదీన్, హుజీ..పేర్లు ఏవైనా కావచ్చు. ఈ బీభత్స ముఠాలు అంతర్జాతీయ సీమలలో నిరంతరం పొంచి ఉన్నాయనేది మరోసారి ధ్రువపడింది. అదను చూసుకొని గోడలు దూకి ఆవుల మందపై దాడులు చేసే తోడేళ్ళ వలె ఈ ముఠాలు అన్ని చోట్లా అప్పుడప్పుడు దూకుతూనే ఉన్నాయి. అత్యంత కట్టుదిట్టమైన ఆంతరంగిక భద్రతా వ్యవస్థను నెలకొల్పుకున్న అమెరికా సైతం అంతర్జాతీయ బీభత్స మృగాల దాడికి ‘అపవాదం’ కాజాలదని తేలిపోయింది. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని ప్రధాన నగరమైన బోస్టన్‌లో మరోసారి బీభత్సకారులు బాంబులు పేల్చగలగడం అమెరికా అంతర్గత భద్రతా కుడ్యంలో సైతం బొరియలు ఏర్పడి ఉన్నాయన్నదానికి నిదర్శనం. బోస్టన్ బీభత్సపు పొగలు చల్లారకముందే, టెక్సాస్ రాష్ట్రంలోని పెద్ద ఎరువుల కర్మాగారం ప్రాంగణంలో గురువారం భయంకరమైన విస్ఫోటం జరిగింది. టెక్సాస్ సంఘటనకు కారణం విద్రోహమా లేక ప్రమాదమా అన్నది ధ్రువపడాల్సి ఉంది. కానీ 16 మంది బలైపోవడానికి, 150 మందికి పైగా గాయపడటానికి దోహదం చేసిన ఈ విస్ఫోటనం బీభత్స చర్య అని అనుమానించడానికే ఎక్కువ అవకాశముంది. బోస్టన్‌లోని క్రీడా మహాపథంలో సోమవారం మధ్యాహ్నం బాంబులు పేల్చినవారు ఈ అంతర్జాతీయ ముఠాల వారేనన్నది వాస్తవం. ఎందుకంటె పేలుళ్ళ వల్ల మరణించినది ఇద్దరే అయినప్పటికీ గాయపడిన వారి సంఖ్య నూట డెబ్బయిని దాటిపోయింది. బోస్టన్‌లో జరుగుతుండిన పరుగు పందెంలో అనేక దేశాలకు చెందిన ఇరవై ఏడువేల మంది క్రీడాకారులు పాల్గొనడం ఈ మహా క్షిప్రచలన- మారథాన్- స్పర్ధ ప్రాధాన్యానికి నిదర్శనం. ఇరవై ఆరుమైళ్ళ దూరం పరిగెత్తగల ఇంతమంది క్రీడాకారులు పాల్గొనే పోటీ సందర్భంగా భద్రత గురించి అమెరికా నిఘా విభాగాల వారు పట్టించుకోలేదని ఆరోపించడానికి వీలులేదు. అల్ ఖాయిదా ముఠా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా దళాలు పాకిస్తాన్‌లో పట్టుకొని పరిమార్చిన తరువాత నిఘా నిర్నిద్ర ప్రవృత్తితో పనిచేస్తున్నట్టు ప్రచారంజరిగింది. బిన్ లాడెన్ వధకు అల్ ఖాయిదా తాలిబన్ మూకలు ప్రతీకారం తీర్చుకుంటాయన్న భయం ఆవహించి ఉండటమే అమెరికా నిఘా వ్యవస్థ ‘నిర్నిద్ర’ స్థితికి కారణం కావచ్చు. కానీ బీభత్స కారులు మళ్ళీ దాడి చేయగలిగారు. ప్రపంచ వాణిజ్య సంస్థను 2001లో బీభత్స విమానాలు ఢీకొన్న తరువాత పనె్నండు సంవత్సరాలుగా అమెరికాలో మరో బీభత్స ఘటన జరగలేదు. తమ ప్రధాన శత్రువులు భారత్, అమెరికాలేనని జిహాదీ ముఠాలు పాకిస్తాన్‌లోను ఇతర దేశాలలోను ప్రకటిస్తూనే ఉన్నాయి. బోస్టన్ బీభత్సకాండకు సరిగ్గా నెలరోజులు ముందు మన జమ్ము-కాశ్మీర్‌లో జిహాదీ బీభత్సం విరుచుకుపడింది. కేంద్ర రిజర్వ్ పోలీసు దళాల స్థావరం ప్రాంగణంలోకి చొరబడిన హంతకులు ఐదుగురు జవానులను హతమార్చగలిగారు. ఇప్పుడు బోస్టన్ పేలుళ్ళపై అంతర్జాతీయ దృష్టి కేంద్రీకృతం అయిన వెంటనే మన బెంగళూరులో బుధవారం పేలుళ్ళు జరిపారు. ఊహించనిచోట దెబ్బకొట్టడం క్రూరమృగ స్వభావం అనుమానం కలగని చోట దాడిచేయడం జిహాదీ పిశాచాల వ్యూహం...!
సౌదీ అరేబియా కేంద్రంగా అంతర్జాతీయ బీభత్సపు తండాలు అనుసంధానమై ఉన్నాయన్న వాస్తవం బోస్టన్ పేలుళ్ళ వల్ల మళ్ళీ బహిర్గతమైంది! బోస్టన్ పేలుళ్ళను ఏ బీభత్స సంస్థ జరిపించిందన్న విషయమై స్పష్టంగా చెప్పడానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిరాకరించినప్పటికీ ఒక సౌదీ అరేబియా దేశస్థుడిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ -ఎఫ్‌బిఐ- అధికారులు నిర్బంధించి ప్రశ్నించారట. సౌదీ అరేబియా ప్రభుత్వం అమెరికాతో సన్నిహిత మైత్రిని కొనసాగిస్తోంది. పశ్చిమాసియాలో ఇస్లాం మతరాజ్యాలన్నింటిలోను సౌదీ అరేబియా మాత్రమే అమెరికాతో గతంలో ఎప్పుడూ విభేదించలేదు. అమెరికాకు అత్యంత సన్నిహిత దేశమైన ఇజ్రాయిల్‌తో తీవ్ర విరోధాన్ని కొనసాగిస్తున్నప్పటికీ సౌదీ అరేబియా ఇలా గొప్ప వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సౌదీ అరేబియా ప్రభుత్వం అంతర్జాతీయ బీభత్సకాండకు వ్యతిరేకంగా అమెరికాతో కలిసి పోరాడుతోంది. కానీ ఆ దేశంలోని వేలాది మంది సంపన్నులు జిహాదీ టెర్రరిస్టు ముఠాలకు సకలవిధ సహాయం చేస్తున్నారు. ఇదంతా అమెరికాకు మాత్రమే కాదు, అంతర్జాతీయ సమాజానికి తెలిసిన రహస్యం. అల్ ఖాయిదాను నడిపించిన ఒసామాబిన్ లాడెన్ సౌదీ అరేబియాలో పుట్టి పెరికి అఫ్ఘానిస్థాన్‌కు పారిపోయాడు. ఇప్పుడు యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న తాలిబన్లు సోమాలియా ఓడ దొంగలతో జట్టుకట్టి ఉన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వ నిఘా విభాగం ‘ఐఎస్‌ఐ’ ఈ మైత్రిని కల్పించింది. ఇది కూడ అమెరికా వారి సిఐఎకు తెలుసు. అయినప్పటికీ ఓవైపు జిహాదీ ముఠాలతో పోరు సాగిస్తున్న అమెరికా ప్రభుత్వం మరోవైపు అన్ని ఇస్లాం రాజ్యాలతోను మైత్రీ సంబంధాలను పెంచుకొనడానికి కృషి చేస్తోంది. 2008కి పూర్వం అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ అంకురార్పణ చేసిన ఈ విధానాన్ని ఒబామా అమలు జరిపిస్తున్నాడు. సిరియా అధ్యక్షుడు అసాద్ నియంతృత్వానికి వ్యతిరేకంగా అరబ్ ‘లీగ్’ దేశాలు కలిసికట్టుగా పోరాడుతుండడం ఈ అమెరికా వ్యూహంలో భాగం. అందువల్లనే బోస్టన్ బాంబు పేలుళ్ళు జరిగిన తర్వాత ఏ బీభత్స సంస్థ ను కూడ ఒబామా పేరు పెట్టి నిందించలేదు. జిహా దీ టెర్రరిస్టుల పాత్ర స్పష్టమయ్యేవరకు వేచి చూడాలన్నదే ఒబామా వ్యూహాత్మక విధానం.
ఒసామా బిన్ లాడెన్ వధకు జిహాదీ సంస్థలు ప్రతీకారంలో భాగంగానే బోస్టన్‌లో పేలుళ్ళు జరిగాయన్న వాస్తవాన్ని అమెరికా వెంటనే బయటపెట్టలేదు. భవిష్యత్తులో వెల్లడించవచ్చు. వెల్లడించకపోవచ్చు. ఏమయినప్పటికీ గతంలో వలె జిహాదీ బీభత్సకాండ గురించి అమెరికా ప్రభుత్వం ఇప్పుడు తీవ్ర స్వరాలను సంధించలేదు. జిహాదీ ముఠాల పట్ల ఆగ్రహంతో అమెరికా ప్రజలు సామాన్య ముస్లింలపై దాడి చేస్తారన్న భయాందోళనను సైతం అమెరికా ప్రభుత్వం ధ్వనింపజేస్తోంది. ఇతర దేశాలలో జిహాదీలు జరుపుతున్న బీభత్సకాండ గురించి అతిగా పట్టించుకోరాదన్న విధానాన్ని గత కొనే్నళ్ళుగా పాటిస్తోంది. మన దేశానికి వ్యతిరేకంగా బీభత్సకాండను జరిపిన డేవిడ్ కాలిమన్ హెడ్లీ, తహవూర్ హుస్సేన్ రాణాలను మన దేశానికి తరలించడానికి అమెరికా ప్రభుత్వం అంగీకరించకపోవడం ఈ విధానానికి ఒక నిదర్శనం. ముంబయిలో 2008 నవంబర్ 26న పాకిస్తాన్ జరిపించిన బీభత్సకాండను ఇస్లాం దేశాల ప్రభుత్వాలు కొన్ని నిరసించాయి. మరి కొన్ని వౌనం వహించాయి. కానీ ఈ దేశాలలోని నోరున్న సామాన్య ప్రజలలో అత్యధికులు పాకిస్తానీ బీభత్స చర్యను సమర్ధించినట్టు సర్వేలు వెల్లడించాయి. రాణాను, హెడ్లీని అమెరికా ప్రభుత్వం మనకప్పగించకపోవడానికి ఇదీ ఒక పరోక్ష కారణం కావచ్చు. లిబియాలోని అమెరికా రాయబారి క్రిస్ స్టీవెన్స్‌ను గత ఏడాది సెప్టెంబర్‌లో జిహాదీలు దారుణంగా హత్య చేసిన తరువాత కూడా అమెరికా వారి ‘బీభత్స వ్యతిరేక అంతర్జాతీయ సమరం’ తీవ్రం కాలేదు. కేవలం తమ దేశం భద్రంగా ఉంటే చాలునన్న వైఖరి కొనసాగింది. కానీ ఈ విశ్వాసం సైతం ఇప్పుడు వమ్మయిపోయింది. ‘‘మేము విశ్రమించలేదు. విశ్రమించబోము’’ అని జిసాదీలు హెచ్చరించారు. అమెరికా బీభత్స వ్యతిరేక సమరం ఇకనైనా పదునెక్కాలి. మనదేశంతో కలసి బీభత్సంపై పోరాడాలన్న విధానం వికసించాలి.
సంపాదకీయం
english title:
sampadakeeyam
Date:
Friday, April 19, 2013