‘సర్వమత సమభావ’- సెక్యులర్- చర్చ మళ్లీ పెద్దఎత్తున మొదలుకావడం అభిలషణీయ పరిణామం! గుజరాత్ ముఖ్యమంత్రి భారతీయ జనతాపార్టీ నాయకుడు నరేంద్రమోడీకి వ్యతిరేకంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నాయకత్వంలోని ‘ఐక్య జనతాదళ్’వారు ప్రదర్శిస్తున్న ‘‘సర్వమత సమభావ’’ తాండవం ఈ చర్చకు వర్తమాన ప్రాతిపదిక! నరేంద్రమోడీ సర్వమత సమవాది- సెక్యులరిస్టు- కాదన్నది నితీశ్‌కుమార్ బృందం తేల్చివేసిన నిగ్గు...నిజాన్ని నిగ్గుతేల్చారా? అబద్ధాన్ని నిగ్గుతేల్చారా? అన్నది వేరే విషయం. అందువల్ల నరేంద్రమోడీ ప్రధాని కారాదన్నది నితీశ్‌కుమార్ బృందంవారి అభిప్రాయం! నరేంద్రమోడీ ప్రధాని కావడానికి కాకుండాపోవడానికి ప్రాతిపదిక ప్రజాభిప్రాయమా? ‘జనతాఐక్యదళ్’ వారి అభిప్రాయమా అన్నది సహజంగా తలెత్తుతున్న సందేశం!
1977వరకు, శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండినప్పుడు, ఆ తరువాత 1980నుండి 1984 మధ్య ప్రధానంగా ‘ప్రజాస్వామ్య’చర్చ ‘సమష్టి’ నాయకత్వం చర్చ నడిచినట్టు చరిత్ర చెబుతోంది! శ్రీమతి ఇందిరాగాంధీని ‘నియంత’గా నిగ్గుతేల్చడం ప్రాతిపదికగా అప్పటి రాజకీయపు పొత్తు, శత్రుత్వం, రాజకీయ మైత్రి ఏర్పడుతూ ఉండేది! ఇందిరాగాంధీని వ్యతిరేకించిన వారందరూ ‘‘ప్రజాస్వామ్యవాదు’’లేనన్నది అలనాటి రాజకీయ కొలమానం! ఇందిరాగాంధీ నియంతా? కాదా? - అన్నది కాదు అసలు విషయం! ఆమెను వ్యతిరేకించడం ‘ప్రజాస్వామ్య’ స్వభావంగా ప్రత్యర్థులు నిగ్గుతేల్చారు! ఫలితంగా ‘ఎమర్జెన్సీ’- అత్యవసర స్థితి-లో ఇందిరాగాంధీని పొగడి, భజన చేసి, పదవులు పొందిన వారెందరో ఆమె అధికారచ్యుతి సమయంలో, ఆమెను తిట్టి ‘ప్రజాస్వామ్యవాదులు’గా ముద్ర వేయించుకున్నారు. ఇందిరాగాంధీ అనంతర రాజకీయ యుగంలో ‘‘్భరతీయ జనతాపార్టీ మతతత్వ పార్టీ’’అన్నది చర్చకు ప్రధానమైన అఖిల భారతస్థాయి అంశమైపోయింది! ‘్భజపా’ మతతత్వ పార్టీనా? కాదా? అన్నది వేరే విషయం! కానీ ఆ పార్టీతో జట్టు విడిపోయిన ప్రతి పార్టీ కూడ ‘్భజపా’సర్వమత సమభావ సంస్థకాదన్న ఆరోపణను సంధించడం 1986నుండి నడుస్తున్న చరిత్ర. అప్పటినుంచి ఆ పార్టీ ఎదగడం ఆరంభంకావడమే ఈ ‘చర్చ’కు ఏకైక కారణం! ఏ పార్టీ ‘సెక్యులర్’ సంస్థ? ఏదికాదు?- అన్న ‘‘నిర్ధారణ పత్రాన్ని’’ జారీచేయడానికి సర్వాధికారం స్వీకరించిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలవారు ఇదే ‘‘ప్రమాణాన్ని’’ పరిగ్రహించారు! ‘్భజపా’ ను వ్యతిరేకించిన ప్రతి పార్టీకి అలా కమ్యూనిస్టులు’’ సర్వమత సమభావ ప్రశంసాపత్రాన్ని’’ జారీచేశారు. ‘్భజపా’తో జట్టుకట్టిన ప్రతి రాజకీయ పక్షానికీ కమ్యూనిస్టులు ‘‘మతోన్మాద’’ముద్రను గుద్దిపారేయడం 2008 వరకు నడచిన చరిత్ర!
కథాకథిత మతోన్మాదం, సర్వమత సమభావం మధ్య జరిగిన సంఘర్షణ సృష్టించిన సంక్షోభంనుండీ ‘్భజపా’1980లో అవతరించింది. ‘‘ద్వంద్వ సభ్యత్వం’’అన్న పదజా లం అప్పట్లో ప్రచారమైంది. ‘‘రెండు రాజకీయ పార్టీలలో ఒకే వ్యక్తికి సభ్యత్వం ఉన్నప్పుడుకదా ‘ద్వంద్వ సభ్యత్వం’ అయ్యేది అన్న తర్కం అప్పుడు పనిచేయలేదు. ‘‘సత్యవంతుల మాట జనవిరోధంబయ్యె, వదరుపోతుల మాట వాసికెక్కె’’ అన్న శేషప్ప కవి భయం నిజమైంది. జాతీయ సాంస్కృతిక సంస్థ ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం’ చర్చా వైపరీత్యవాదుల దృష్టిలో ‘రాజకీయ సంస్థ’గా మారింది. అందువల్ల అప్పటి జనతాపార్టీలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ స్వయం సేవకులందరినీ ‘ద్వంద్వ సభ్య త్వం’్భతం ఆవహించింది. దాన్ని వదిలించుకొని వారంతా ‘్భజపా’గా అవతరించారు!!
2008లో ప్రధాని మన్‌మోహన్‌సింగ్ నాయకత్వంలోని ‘ఐక్యప్రగతి కూటమి’ ప్రభుత్వం కమ్యూనిస్టుల మద్దతును వదిలించుకొంది. ‘యుపిఏ’ బండి నీడలో నడవడం కమ్యూనిస్టులు మానుకున్న తరువాత కూడ ‘బండి’నడక ఆగలేదు! ఇది మొదటి ఘటన. 2011లో మమతాబెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ ముప్పయి నాలుగేళ్ల భారత కమ్యూనిస్టు పార్టీ తదితర వామపక్షాల పాలనను తొలగించింది. ఇది రెండవ ఘటన! ఈ రెండు ఘటనలకు కారణం ప్రాభవంకోల్పోయిన కమ్యూనిస్టుల ప్రభావం కూడ తగ్గింది. అందువల్ల మార్క్సిస్టుపార్టీనుండి ఇతర రాజకీయ పార్టీలవారు ‘సర్వమత సమభావ’ ప్రశంసాపత్రాన్ని కోరడంలేదు! అందువల్ల అదను చూసికొని బీహార్ ముఖ్యమంత్రి ఈ ‘సెక్యులర్ సర్ట్ఫికేట్’లను జారీచేసే అధికారాన్ని లాక్కున్నాడు... కమ్యూనిస్టులవలె పార్టీల వారీగాకాక పార్టీలలోని వ్యక్తులవారీగా నితీశ్‌కుమార్ ప్రశంసాపత్రాన్ని, అభిశంసన పత్రాన్ని ముద్రించి పంపిణీ చేస్తున్నాడు! ‘్భజపా’లో నరేంద్రమోడీ తప్ప మిగిలిన వారందరూ సర్వమత సమభావ స్వభావులేనన్నది నితీశ్‌కుమార్ బృందంవారి నిజనిర్ధారణలో నిగ్గుతేలిన అంశం!!
2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రా స్టేషన్‌లో బీభత్సకారులు ఒక రైలుపెట్టెను తగలబెట్టారు. ఇది పథకం ప్రకారం పాకిస్తాన్ ప్రేరిత బీభత్సకారులు హంతక బుద్ధితో పాల్పడిన పైశాచిక చర్య! నరేంద్రమోడీని ‘సర్వమత సమవాది’కాదంటున్న వారికి ఈ బీభత్సకాండ గుర్తులేదు. సమస్య కాదు! స్థానిక ప్రజల ఆవేశం కట్టలుతెంచుకొనడానికి పరాకాష్ఠ గోద్రా బీభత్సం! ఆవేశపరులైన స్థానికులు ‘గోద్రా’తో సంబంధం లేని అమాయకులను హత్యచేయడం మరో పాశవిక కాండ! కానీ ఈ ‘కాండ’కు ఎవ్వరూ పథకం వేయలేదు, గోద్రా దహనకాండవలె ఇది పూర్వ నిర్ధారితంకాదు. బీభత్సకాండలను భరించి భరించి, ఆపలేని ప్రభుత్వపు అసమర్ధతను సహించి సహించి ఉద్విగ్న చిత్తవృత్తులై పడి ఉండిన ప్రజలు ‘గోద్రా’ఘటనతో- అరవై మంది సజీవంగా భస్మం కావడంతో- రెచ్చిపోయారంతే! ఇలా రెచ్చిపోవడం అమాయకులను హత్యచేయడం కూడ బీభత్సమే! అయితే మొదటి బీభత్స శృంఖల ఫలితం, పరాకాష్ఠ ఈ రెండవ హత్యాకాండ!! మొదటి దాన్ని గురించి మరచిపోవడం, రెండవ దాన్ని మాత్రమే పట్టుకొని సాగదీస్తుండడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం!!
గోద్రా దహనకాండను నిరోధించలేక పోయినందుకు నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని కథాకథిత ‘ప్రశంసాపత్ర’ ‘అభిశంసన పత్ర’ ప్రదాయకులు నిందించడం లేదు!! గోద్రా దహనకాండ తరువాత జరిగిన హత్యాకాండను నిరోధించలేకపోయినందుకు మా త్రమే అతగాడి ప్రభుత్వాన్ని ఈ ‘‘ముద్ర వేసే’’ రాజకీయ కోవిదులు నిందిస్తున్నారు!! ద్వంద్వ ప్రమాణాలకు ఇంతకంటే నిదర్శనాలు అక్కరలేదు! సుప్రసిద్ధ రచయిత్రి తస్లిమా నస్రీన్‌ను మతోన్మాదులు కలకత్తాలో ఉండనివ్వలేదు, స్వేచ్ఛగా బహిరంగంగా సంచరించే జీవించే హక్కును మన ప్రభుత్వాలు ఆమెకు కల్పించలేదు. ఇలా కల్పించడంలో విఫలమైన పశ్చిమ బెంగాల్ వామపక్ష ప్రభుత్వంవారు, కేంద్ర ప్రభుత్వ నిర్వాహకులు నితీశ్‌కుమార్ దృష్టిలో సర్వమత సమభావవాదులు... తస్లిమా నస్రీన్‌పై మన రాష్ట్ర రాజధాని నగరంలోనే 2007 ఆగస్టు 9వ తేదీన భయంకర దౌర్జన్యకాండ జరిగింది. నిరోధించలేని అప్పటి ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని మతతత్వవాదులని ఎవ్వరూ అనడం లేదు. సర్వమతాల సంపుటమైన, సర్వభాషల సమాహారమైన, ఈ దేశపు మనుగడకే మూలప్రాతిపదిక అయిన జాతీయతను ఎమ్.ఎఫ్.హుస్సేన్ అనే నగ్న చిత్రకారుడు నిరంతరం అవమానించాడు. భరతమాతను సైతం దిగంబరంగా చిత్రీకరించడం అతగాడి విద్రోహ వికృత చిత్తవృత్తికి పరాకాష్ఠ. కానీ దేశంనుండి పారిపోయి ‘ఖతార్’ పౌరసత్వం స్వీకరించిన అతగాడికి ‘‘ముద్రవేసే’’ రాజకీయవేత్తలు ఇప్పటికీ గౌరవం ఘటిస్తూనే ఉన్నారు!! ఒక మతవర్గంవారి వ్యతిరేకతకు మతోన్మాదానికి ప్రాతిపదిక- తస్లిమా నస్రీన్... మొత్తం జాతిని కించపరచడం గౌరవ గరిమకు ప్రతీక- ఎమ్.ఎఫ్. హుస్సేన్!!
గోద్రా బీభత్సకాండకు, ‘గోద్రా’ అనంతర హత్యాకాండకు సంబంధించిన దర్యాప్తులు జరిగాయి. న్యాయస్థానాలలో అభియోగాలు దాఖలయ్యాయి. విచారణ జరిగింది, జరుగుతోంది. హంతకులను శిక్షించే కార్యక్రమం నడుస్తోంది! గోద్రా స్టేషన్ శివార్లలో ‘రామసేవకుల’ను సజీవ దహనంచేసిన పదకొండుమందికి 2011 మార్చి ఒకటవ తేదిన అహమ్మదాబాద్‌లోని న్యాయస్థానం మరణశిక్ష విధించింది, మరో ఇరవై మంది నేరస్థులకు జీవిత నిర్బంధ శిక్షను విధించింది. గోద్రా బీభత్సకాండకు ప్రతిక్రియగా హత్యలుచేసిన అనేకమంది నేరస్థులను కూడ న్యాయస్థానాలు శిక్షించాయి. ఆనంద్ జిల్లాలోని ‘ఓదే’ గ్రామంలో ఇరవై ముగ్గురిని సజీవ దహనంచేసిన పద్దెనిమిది నేరస్థులకు ఆనంద్ ప్రత్యేక న్యాయస్థానం గత సంవత్సరం ఏప్రిల్‌లో 12న జీవిత నిర్బంధ శిక్షను విధించింది! 2002 ఫిబ్రవరి 28న విష్ణుగఢ్ పట్టణంలోని దీప్దా దర్వాజా ప్రాంతంలో దౌర్జన్యకాండ జరిపి పదకొండు మందిని బలిగొన్న ఇరవైఒక్క మందికి అహమ్మదాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం గత ఏడాది జూలై 30న యావజ్జీవ నిర్బంధ శిక్షను విధించింది. నేరస్థులను శిక్షించే న్యాయ ప్రక్రియ కొనసాగుతోందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు...
‘గోద్రా’నంతర గుజరాజ్ కల్లోలాలు పథకం ప్రకారం, దుర్బుద్ధి వ్యూహంలో భాగంగా జరగలేదు. ఈ కల్లోలాల ఆవేశ విద్వేష ఆగ్రహం చల్లారిన తరువాత ఆ రాష్ట్రంనుండి ఏ మతానికి చెందినవారు కూడ పారిపోలేదు. పదకొండేళ్ల భద్రతాభావానికి ఇది నిదర్శనం! జమ్మూకాశ్మీర్‌లో 1947నుండి అల్పసంఖ్యాకుల హత్యాకాండ కొనసాగుతోంది. 1990వరకు ఇలా కొనసాగిన కాలంలో షేక్‌అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా లాంటివారు ముఖ్యమంత్రులు. ఈ మతోన్మాద బీభత్సానికి దాదాపు లక్ష మందికి పైగా హతులైపోయారు. కాశ్మీర్ లోయలో మిగిలిన అల్పసంఖ్యాకులు- లక్షలాది మంది- ఇళ్లను పల్లెలను పొలాలను మందిరాలను వదిలి పారిపోయారు. చెల్లాచెదరైపోయారు. కానీ దీన్ని నిరోధించలేని ఆ ముఖ్యమంత్రులను నితీశ్‌కుమార్ వంటివారు ‘సర్వమత సమవాదు’లుగానే గుర్తిస్తున్నారు. వారికి మతోన్మాద ముద్రవేయలేదు. గుజరాత్‌లో పదేళ్లకు పైగా అల్పసంఖ్యాకులకు భద్రత కల్పించిన ముఖ్యమంత్రి ‘మతోన్మాది’! కాశ్మీర్ లోయలో అలా కల్పించలేని ముఖ్యమంత్రులు ‘సర్వమత సమవాదులు’!! ప్రజలు గమనిస్తున్నారు!!
మెయన్ ఫీచర్
english title:
main feature
Date:
Friday, April 19, 2013