ఎవరి పేరు వినగానే అప్రయత్నంగా రెండు చేతులు కలిపి నమస్కారం చేస్తామో, ఆ పేరు వినగానే రెండు కళ్ళు భక్తితో మూతపడతాయో అతనే శ్రీరామచంద్రుడు. సకల సుగుణాభిరాముడు, సర్వలక్షణ సంపన్నుడు. నిరంతరం ప్రజాక్షేమాన్ని కాంక్షించే ప్రభువు అయిన శ్రీరాముడు యుగాలు మారినా, తరాలు మారినా నేటికి ప్రజలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. సాక్షాత్తూ మహావిష్ణువు అవతారమైనప్పటికీ దుష్టశిక్షణార్థం భువిలో మానవుడిగా అవతరించి మానవులు పడే కష్టాలను అన్ని అనుభవించాడు.
జీవితంలో స్వార్థమును వీడి ధర్మమార్గాన నడిచే మానవుడు మహాత్ముడవుతాడని రామాయణం ప్రబోధిస్తోంది. ధర్మాధర్మాలు, సత్యాసత్యాల సంఘర్షణే రామాయణంలోని రాముని జీవితం. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎవరెంత ప్రలోభపెట్టినా, బతిమిలాడినా ఇచ్చిన మాటకు కట్టుబడి సత్యవాక్కుకోసం అనేక కష్టనష్టాలను అనుభవించాడు. అన్యోన్య దాంపత్యానికి ఆదర్శం సీతారాములు. ఒకరి కష్టసుఖాలలో మరొకరు పాలుపంచుకుంటూ తన వల్ల ఇతరులకు కష్టం కలగకుండా ఎంతో ఆదర్శవంతమైన జీవనాన్ని గడిపారు. రావణ చెర నుంచి సీతను రక్షించాడు రాముడు. సీత ఎంత పవిత్రంగా ఉందో ఆయనకు తెలుసు. కానీ ఆ విషయాన్ని లోకానికి చాటి చెప్పడానికి లోకుల మాటలకు సీత నొచ్చుకోకూడదన్న కారణంగానే అగ్నిప్రవేశం చేయించాడు.
పుత్రుడిగా, మిత్రుడిగా, పతిగా, శత్రువుగా, ప్రభువుగా అనేక సమస్యలను ఎదుర్కొని వాటిని సమర్థవంతంగా పరిష్కరించాడు. ప్రభువనే వాడు ఏ విధంగా ప్రజారంజక పాలన అందించాలో తన పాలనతో లోకానికి చాటి చెప్పాడు. అటువంటి ఆదర్శమూర్తి పర్వదినం శ్రీరామనవమి దేశ ప్రజలకు పెద్ద పండుగ. శ్రీరాముడు కౌసల్య గర్భాన అన్ని నక్షతాలు సక్రమమైన మార్గంలో ఉండి, శుభ శకునాలు వెలువడుతున్న తరుణంలో చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రాన అవతరించాడు. దశావతారాల్లో సంపూర్ణ మానవ అవతారం. ఎదుటి వారిలో సుగుణాలను మెచ్చుకోవాలని, అది మిత్రుడైనా, శత్రువు అయినా ఒక్కటేనని రాముడు నిరూపించాడు. రామ, రావణ యుద్ధం ముహూర్త నిర్ణయం కోసం రాముడు లక్ష్మణుడిని రావణుడి వద్దకు వెళ్ళమంటాడు. అందుకు నిరాకరించిన లక్ష్మణుడికి రావణుడి గొప్పతనాన్ని వివరిస్తాడు. సకల వేదాలను చదివిన వాడు రావణుడు, మహాభక్తుడు, ఒక్క స్ర్తి వ్యామోహం మినహా మిగతా అన్నింటిలో రావణుడు సుగుణవంతుడేనని వివరిస్తాడు.
సోదర ప్రేమకు, పితృవాక్ పరిపాలనకు, సుపరిపాలన అందించే ఉత్తమ రాజుకు, గురుసేవకు ఇలా మన జీవితంలో ఏ అంశం తీసుకున్నా రాముడు ఆదర్శంగా నిలుస్తాడు. పితృవాక్య పరిపాలనకు, ధర్మాచరణకు, సత్యసంధతకు, ఏకపత్నీ వ్రతానికి ఇలా విశ్వంలోని సద్గుణాలకు ప్రతీక శ్రీరాముడు. శ్రీరాముడి చేత అయోధ్య తరించింది. కానీ శ్రీరామనామంతో మూడు లోకాలు తరిస్తున్నాయి. అంతటి సత్యసంధుడు, మర్యాదా పురుషోత్తముడు అయిన శ్రీరాముని పర్వదినంనుంచి మనలోని దుర్గుణాలను వదిలి, సుగుణాలను అలవర్చుకొని పునీతులమవుదాం.
సబ్ ఫీచర్
english title:
sri ramudu
Date:
Friday, April 19, 2013