‘‘శ్రీరామరాజ్యమే కావచ్చు. ప్రక్షాళన అనేది దేనికయినా అవసరం. అది కూడా ‘పీరియాడికల్’గా జరగాలి. అంతేగానీ ఏండ్లూ పూండ్లూ మిన్నకుండి, అప్పుడు ఎప్పటికప్పుడు పట్టించుకోక తాత్సారం చేసి, ఆ తరువాత ఎప్పుడో మేల్కొంటే అప్పటికే జరగవలసిన ‘నష్టం’ జరిగిపోతుంది. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు’అనే సామెతే, అప్పుడు గుర్తుచేసుకోవలసి వస్తుంది’’ అన్నాడు సుందరయ్య.
‘‘ప్రక్షాళన ఎప్పుడు? ఏదయినా సరిగాలేదనుకున్నప్పుడే కదా! అంతే బానే వుంది, ‘సబ్‌ఠీక్‌హై’ అనుకున్నప్పుడు, జరిగిపోతున్నదాన్ని అలానే జరిగిపోనివ్వక తీరికూచుని ఎవరూ కెలుక్కోరుకదా! సజావయిన అస్తిత్వానికి ఏదో ఉపద్రవం సంభవించినప్పుడు కదా సవరణలకు, సంస్కరణలకు పూనుకునేది’’అన్నాడు శంకరయ్య.
‘‘అదేమరి! అంతా బానే వుందనుకుని కళ్ళుమూసుక్కూర్చుంటే ఎలా? ‘అనుమానం’అయినా కలగాలి కదా! అపసవ్యపు తీరుకి, రేఖామాత్రంగా సూచనలు కనిపించినా, వెంటనే ‘అప్రమత్తం’కావాలి! ‘ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్‌నైన్’అని మనకు ఆంగ్లంలో సామెత వుంది. అంటే గోటితోపోయే సమయంలోనే మేల్కొని, ప్రమాదాన్ని నివారించుకోవాలి కానీ, గొడ్డలి దాకా అవసరం పడే స్థితి తెచ్చుకోకూడదు. అనుమానం రాగానే మేల్కొని, పరిశీలించుకుని, ప్రక్షాళన చేపడితే, పెనుప్రమాదాలను తప్పించుకోవచ్చు’’ అన్నాడు సుందరయ్య.
‘‘మీరిద్దరూ దేన్ని గురించి మాట్లాడుతున్నారు? నేటి రాజకీయ పార్టీల గురించేనా? 2014లో రాబోయే ఎన్నికలకోసం, ఇప్పటినుంచే ఏ పార్టీకి ఆ పార్టీ, ‘ప్రక్షాళన’ మొదలుపెట్టినట్లే వున్నాయి కదా! ప్రజలలో తమ పార్టీ పలుకుబడి పెంచుకోవడానికీ, ప్రజావిశ్వాసాన్ని చూరగొని బలం పెంచుకోవడానికేగా- ‘పాదయాత్రలు’ గట్రా చేస్తున్నది? అధికార పార్టీపైనా, ప్రస్తుత ప్రభుత్వ వ్యవహార సరళిపైనా, ప్రజాగ్రహాన్ని పెంచి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ- విద్యుత్ కోత, ధరల పెరుగుదల, మంచినీటి సమస్య వంటి అంశాలమీద ధర్నాలకూ, నిరసనలకూ పూనుకుంటూ, తమ పార్టీకి ప్రజలలో పలుకుబడిని పెంచుకునే ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయికదా? తెలుగుదేశం పార్టీ చంద్రబాబునాయుడుగానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయమ్మ, షర్మిలలు కానీ, వామపక్షాల బి.వి.రాఘవులు, నారాయణగానీ, టి.ఆర్.ఎస్. చంద్రశేఖరరావు గానీ, బి.జె.పి. విద్యాసాగర్‌రావు, కిషన్‌రెడ్డి వంటి నేతలు గానీ, ఎవరిమేరకు వాళ్ళు ఇప్పటినుంచే ప్రచారాస్త్రాలు కూడా ‘సాన’బెట్టుకుంటున్నట్లే కనపడుతున్నారు కదా! ఇదంతా ‘ప్రక్షాళన’క్రిందకే వస్తుందికదా?’’అన్నాడు ప్రసాద్.
‘‘ ‘ప్రక్షాళన’ అంటే ఎదుటివారి మీద దాడికి దిగడమో, విమర్శనాస్త్రాలు సంధించడమో కాదయ్యా? ‘ప్రక్షాళన’అనేది- తమకుతాము ముందు ‘సొంత ఇంట’చేపట్టేది. పరిసరాల పరిరక్షణకు ముందు, ఇంటి‘చెత్తాచెదారం’ శుభ్రంచేసుకోవాలి. ఆ ఇంటి చెత్తను తీసుకెళ్ళి పరిసరాల్లో పోసేయమని కాదు సుమా! తమ అంతర్గత కుమ్ములాటలూ, తమవద్ద మేటవేసుకుని వుంటూనే- క్రియాశూన్యంగా పడివుండి- బూజుగా, చెదగా మారుతున్న విషయాలనూ, వ్యక్తుల నైజాలనూ సకాలంలో గుర్తెరిగి సంస్కరించుకోవడమే ప్రక్షాళన మరి.’’ అన్నాడు శంకరయ్య.
‘‘ ‘బూజు’, ‘చెద’అని సరిగ్గా వాడావోయ్ శంకరం! నిజానికి జరుగుతున్నదదే! నూట పాతిక సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన పార్టీ అంటాం. కానీ ఇప్పుడెలా వుందన్నది కదా ప్రధానం! ‘బూజు’పట్టిన భావాలతో, అవినీతి ‘చెద’లుపట్టి, ప్రక్షాళనకు కూడా లొంగనంతగా- అనడానికీ, అనుకోవడానికీ కూడా ‘్భయంకరంగా’ కనిపిస్తూంటే ఎలా? బహుశా ‘రాజకీయ’చెద ‘రంగం’ అన్నమాట సరిగ్గా వర్తిస్తుంది అనుకుంటాను’’అన్నాడు సన్యాసి కూడాను.
‘‘్భద్రపరుచుకోవాలన్న కాంక్ష మంచిదే! కొన్ని ‘యాం టిక్స్’కు ‘పురావిశేష’ విలువలుండచ్చు కాదనం! అసలు స్వాతంత్య్రం రాగానే- ‘కాంగ్రెస్ పార్టీ అనవసరం’ అన్నాడట గాంధీజీ! రాజకీయ పార్టీ మూసలోకాక, ప్రజాచేతనాపథంలో వ్యవహారాలు సాగాలన్నది- ఆయన సంకల్పం. కానీ ఎవరు పడనిస్తారు? ఇందిర, రాజీవ్‌ల కాలంనాటి విలువలు కూడా కనీసం ఇవాళ లేవు! ఒక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహారమే కాదు. ‘తెలుగుదేశం’పార్టీ అయినా- అది స్థాపించిన ‘ఎన్.టి.ఆర్’ ఆశయాలకూ, అభిప్రాయాలకూ దూరంగా జరిగిపోయిందన్నది యధార్థం! జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీబోర్డుల వివాదాల్లో కనబడుతున్నంతగా, తాతగారి ఆశయాల ఛాయల్లో- ‘్ఛయామాత్రంగానైనా’ ఆశావహంగా వున్నాడా? చంద్రబాబునాయుడుగారు తమ పాలనలో ఎంత మామకు వెన్నుపోటు పొడిచిన అపకీర్తి మూటకట్టుకున్నా, తన పనులతో మొదట్లో కొంతయినా జనాదరణ పొందగలిగాడు కనుకే, కనీసం తొమ్మిదేళ్లు పాలించాడు. నిజానికి పొరపాట్లుగా భావించక- అప్పుడు అహంకరించి చేసిన పనుల కారణంగా, తాను అవలంబించిన ప్రక్షాళనారహిత కార్యక్రమాలవల్లే, ఆయనా దెబ్బతిన్నాడు. ఇంట్లో వుడ్‌వర్క్ చేయించిన అందమైన కప్‌బోర్డ్‌లే కావచ్చు. కానీ వాటిల్లో అమూల్యమైన పుస్తకాలు, ఫొటోలు వంటివి పెట్టి- ‘అంతా సజావుగానే వుంది’ అనుకుంటూ, ఏండ్ల తరబడి అవి అలానే వుంచేసామనుకో! లోపల లోపల ‘చెదలు’పుట్టి, వాటిని ‘నాశనం’చేసేస్తాయి. ‘ప్రక్షాళన’లేకుండా- కనీసం అనుమానం అయినా లేక, మధ్యమధ్యలో తెరచిచూసి సంస్కరించి సరిదిద్దుకోక వదిలేస్తే- ‘చెదలకొండే’ ఏర్పడి పారలు, గునపాలు వాడి ‘తవ్వి’పారేయక తప్పదు! సంస్కరణలకు లొంగని వాటిని సమూలంగా నాశనంచేయాల్సిందే! వర్తమాన భారతంలో- అసలు ‘రాజకీయాలే’ అలా తయారై, రూపుకడుతున్నాయి. ‘రాజకీయ’ ‘చెద’రంగం పెరిగిపోయింది. ప్రజాస్వామ్య వ్యవస్థకే పెనుప్రమాదమై కూచుంటోంది. మరి ప్రజాహృదయాల ఏ రసాయనిక చర్యలు ఈ ‘చెదల’ వ్యవస్థను రూపుమాపి, ఉత్థాన నవోదయాన్ని ఇస్తాయో చూడాల్సిందే!’’అంటూ లేచాడు సుందరయ్య.
సంసారాలు
english title:
samsaralu
Date:
Friday, April 19, 2013