భారతదేశం ప్రపంచంలోనే పెద్ద రైల్వే వ్యవస్థ గల దేశం. మన రాష్ట్రంనుండి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలోని పెద్దరైల్వే స్టేషన్ల వలె చిన్న చిన్న రైల్వే స్టేషన్లలో కూడా స్టేషన్ ఆవరణలో పండ్లు అమ్ముకునేవారికి లైసెన్స్, కాంట్రాక్ట్ సిస్టం ఏర్పాటుచేసి నిర్ణీత స్థలంలోనే అమ్ముకునే విధంగా రైల్వేశాఖ చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం మండల కేంద్రాల్లో వున్న రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉంటున్నది. ప్రయాణీకులు వచ్చిపోయే దారిలోనే పండ్ల వ్యాపారం చేస్తున్నారు. బుకింగ్ కౌంటర్ వద్ద, ప్లాట్‌ఫాం దగ్గరలో, బ్రిడ్జిల వద్ద ప్రయాణికులకు ఇబ్బందికరంగా చిరుపండ్ల వ్యాపారులు అనుమతిలేని పండ్లవ్యాపారం నిర్వహిస్తున్నారు. అట్టివారిని రైల్వేస్టేషన్లలో పండ్లు అమ్ముకోనీయరాదు. రాత్రివేళల్లో కూడా అర్ధరాత్రి వరకు అసాంఘిక కార్యకలాపాలు, మద్యం సేవించడం, జూదం వంటి కార్యక్రమాలు పండ్ల వ్యాపారులు నిర్వహిస్తూ ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. అమ్మకాలు రద్దు చేయాలని మనవి.
-రాపాక రవీందర్, జనగాం
అటొకటి ఇటొకటి రైళ్లను వేయాలి
ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్‌నుండి గుంటూరు వైపునకు వెళ్లుటకు గానీ, అదే స్టేషన్‌నుండి గుంతకల్ వైపునకు వెళ్లుటకు గానీ తెల్లవారుజామున మూడు మూడున్నర గంటల తర్వాత ఉదయం పది పదిన్నర గంటల వరకు ఒక్క రైలు కూడా లేదు. కనక దయచేసి గిద్దలూరునుండి ఉదయం ఆరు ఆన్నరకు బయలుదేరునట్లు గుంటూరు వైపునకు ఒకటి, గుంతకల్ వైపునకు మరొకటి రైళ్లను ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
-సాయి రామానందస్వామి, ప్రకాశం
చదువు సంసారం సంస్కారం
చదువుకున్న ప్రతివారు సంస్కారులగుతారనేది వట్టిది. చదువు వేరు సంస్కారం వేరు. సంస్కారమనేది పెద్దల ద్వారా అభ్యాసం ద్వారా అబ్బుతుంది. ఎవరు ఎంత కాలం జీవించినా చివరకు వట్టి చేతులతోనే వెళ్ళాలి తప్ప తీసుకెళ్ళేది ఏమీ లేదు. ప్రపంచాన్నంతటిని జయించిన ‘అలెగ్జాండరు’ వట్టి చేతులతోనే భువిని వదిలి వెళ్ళాడు. పెద్దలు, విద్యావంతులు తమ చిన్నారులకు నీతి పాఠాలను నీతి శతకాలను నేర్పిస్తూ తెలుగు భాషను దాని ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలి. విద్యార్థులను సంస్కారవంతులుగా తీర్చిదాద్దిలి. ఈ బృహత్కార్యం ముఖ్యంగా తల్లిదండ్రులపైన, విద్యనొసగు ఉపాధ్యాయులపైనా ఎంతైనా ఉన్నది. చదువు సంస్కారాన్ని అందించాలి. సంసారమనేది ఇక్కడే వుంటుంది. కాని మనతో వచ్చేది ఒక్క సంస్కారం మాత్రమే. కృషితోనాస్తి దుర్భిక్షం మరువకూడదు.
-రాపర్తి ఆదినారాయణ, పిఠాపురం
పల్లెలే వెనె్నముక
దేశానికి వెనె్నముక పల్లెలే అన్నది నిర్వివాదాంశం. పాడి పశుసంపద, పచ్చదనం, పరిశుద్ధమైన జల సంపద, పుష్కలంగా లభించే గాలి, వెలుతురు, మానవ సంబంధాలు ఇవన్నీ పల్లెలకు మాత్రమే స్వంతం. భారతదేశపు పురోభివృద్ధి గ్రామీణాభ్యుదయంలోనే వుందన్న మహాత్ముని సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి పల్లెల అభివృద్ధిని పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మరొక ప్రక్క నగరాలను అంచనాలకు అందనంత వేగంగా అభివృద్ధి చేస్తున్నందువల్ల కాలుష్యం, త్రాగునీటి సమస్య, వాహనాల రద్దీ, భూగర్భ జలాలు అడుగంటిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నవౌతున్నాయి. అరాచకాలు, అత్యాచారాల సంఖ్య పెరిగిపోతూ శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. బడ్జెట్ కేటాయింపుల్లో పట్టణాలకు, గ్రామాలకు మధ్య అంతరం పెరిగిపోతుండడం పాలకుల వివక్షతకు ప్రత్యక్ష నిదర్శనం. ప్రభుత్వం తక్షణం స్పందించి గ్రామాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలుచేయాలి. బహుముఖాల బృహత్పధకం ప్రకారం పల్లెసీమలను నగరాలతో సమానంగా అభివృద్ధిచేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.
- సి.ప్రతాప్, విశాఖపట్నం
ప్రధాని పదవికి మోడీయే సరైన వ్యక్తి
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్రమోడీ భారతదేశ ప్రధాని కాగల అర్హతలున్నట్లు దేశ ప్రజలు గుర్తించారు. భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడడగల శక్తియుక్తులు ఆయనకున్నాయి. అంతేగాదు, గుజరాత్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధివైపు తీసుకుపోయారు, అదే పద్ధతిలో దేశాన్ని నడిపిస్తారని దేశ ప్రజలకు ఆశ వున్నది. శాంతి భద్రతలు క్షేమంగా వుంచగలిగాడు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా ప్రజల ఆస్తులు దోచుకోబడలేదు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాడు. కులాలను, మతాలను ఆమడ దూరం పారవేయగలడు. బీద కుటుంబాలకు ప్రభుత్వం బాసటగా నిలవాలే గాని, కుల మతాల భజన పాటలు మానాలి. బీద కుటుంబాలను ఆదుకోవాలి. ఇది ప్రతి ప్రభుత్వం చేయాల్సిన పనే! ప్రజలను విభజించి, ఐకమత్యాన్ని దెబ్బతీయకండి.
- జి.శ్రీనివాసులు, అనంతపురం