చెన్నై, ఏప్రిల్ 22: ఆరో ఐపిఎల్‌లో తొలి సెంచరీని రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ నమోదు చేసినా, తన జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అతను 61 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, మరో ఆరు భారీ సిక్సర్లతో ప్రేక్షకులను అలరించాడు. ఆజింక్య రహానే (16), దిశాంత్ యాజ్నిక్ (7), కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ (6) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరినప్పటికీ, స్టువర్ట్ బిన్నీ (36 నాటౌట్)తో కలిసి వాట్సన్ నాలుగో వికెట్‌కు 4.1 ఓవర్లలో 46 పరుగులు జోడించాడు. అతని ప్రతిభతోనే రాజస్థాన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 185 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. వార్న్ వీరవిహారం చేస్తే, ఆస్ట్రేలియాకే చెందిన మైక్ హస్సీ చెన్నై తరఫున అద్భుత ప్రతిభ కనబరచడం గమనార్హం. 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నై 21 పరుగుల స్కోరువద్ద మురళీ విజయ్ (3) వికెట్‌ను కోల్పోగా, సురేష్ రైనాతో కలిసి హస్సీ స్కోరు బోర్డును ముందుకు దూకించాడు. 10.1 ఓవర్లలో 90 జోడించిన తర్వాత ఫాల్క్‌నెల్ బౌలింగ్‌లో రైనా ఎల్‌బిగా వెనుదిరిగాడు. అతను 35 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 51 పరుగులు సాధించాడు. 51 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్స్‌తో 88 పరుగులు చేసి హస్సీ దురదృష్టవశాత్తు రనౌటై వెనుదిరిగాడు. ఈ టోర్నీలో చక్కటి ఆటతో రాణిస్తున్న రవీంద్ర జడేజా పరుగుల ఖాతాను తెరవకుండానే ఫాల్క్‌నెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోవడంతో చెన్నై సమస్యల్లో పడింది. 19వ ఓవర్ చివరి బంతికి ధోనీ అవుటయ్యాడు. 21 పరుగులు సాధించిన అతను ఫాల్క్ నెర్ బౌలింగ్‌లో స్టువర్ట్ బిన్నీకి క్యాచ్ ఇచ్చాడు. దీనితో చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 11 పరుగుల దూరంలో నిలిచింది. వాట్సన్ వేసిన చివరి ఓవర్ మొదటి బంతికి క్రిస్ మోరిస్ ఒక పరుగు చేశాడు. రెండో బంతి డాట్ బాల్. మూడో బంతిని డ్వెయన్ బ్రేవో సిక్సర్‌గా మార్చాడు. నాలుగో బంతికి మరో రెండు పరుగులు లభించాయ. చివరి రెండు బంతుల్లో రెండు పరుగుల అవసరంకాగా, ఐదో బంతిలోనే చెన్నై లక్ష్యాన్ని అందుకుంది. రాజస్థాన్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. భారీ స్కోరు కళ్ల ముందు కనిపిస్తున్నప్ప టికీ ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా హస్సీ, రైనా ఆడిన తీరే చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించింది. నిజానికి రాజస్థాన్ చెప్పుకోదగ్గ స్కోరు చేసినప్పటికీ, హస్సీ ఆ లక్ష్యాన్ని సులభతరం చేశాడు. వాట్సన్ విజృంభణ, అతని వీరోచిత సెంచరీ వృథా అయ్యాయ. ఒక ఆస్ట్రేలి యా ఆటగాడి శ్రమను మరో ఆసీస్ ఆటగాడు నిరుపయో గంగా మార్చడం గమనార్హం. మొత్తం మీద సోమవారం చివరి క్షణం వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. తొలుత వాట్సన్, ఆతర్వాత హస్సీ, రైనా పదునైన షాట్లతో ప్రేక్షకులకు కనువిందు చేశారు. ఐపిఎల్ మ్యాచ్‌లకు ప్రపంచ వ్యాప్తంగా ఎందుకు ఆదరణ పెరుగుతున్నదన్న ప్రశ్నకు రాజస్థాన్, చెన్నై మధ్య జరిగిన పోరే నిదర్శనం. (చిత్రం) ఆరో ఐపిఎల్‌లో తొలి సెంచరీ.. షేన్ వాట్సన్
ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై చెన్నై సంచలన విజయం
english title:
watson century
Date:
Tuesday, April 23, 2013