న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో టైటిల్ సాధిస్తుందని అభిమానులు ఆశతోవున్నారు. మహిళల సింగిల్స్‌లో సైనా, పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ లీ చాంగ్ వెయ్ హాట్ ఫేవరిట్స్‌గా బరిలోకి దిగనుండగా, ఈసారి పోటీ తీవ్రంగానే ఉంటుందని పరిశీలకుల అంచనా. ఈ పోటీల్లో సైనాకు సులభమైన డ్రానే లభించంది. తొలి మ్యాచ్‌లో ఆమె ఇండోనేషియాకు చెందిన బెలాట్రిక్స్ మనుపుతీని ఢీకొననుంది. గత నెల జరిగిన ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ సిరీస్ ప్రీ-క్వార్టర్స్‌లో బెలాట్రిక్స్‌ను ఓడించిన సైనా మరోసారి ఆమెపై గెలిచే అవకాశాలే ఎక్కువ. హైదరాబాద్‌కు చెందిన ఈ స్టార్ క్రీడాకారిణికి రెండో రౌండ్‌లోనూ తీవ్రమైన ప్రతిఘటన లేకపోవచ్చు. కానీ, మూడో రౌండ్‌లో మాత్రం హైదరాబాద్‌కే చెందిన సంచలన క్రీడాకారిణి, 17 ఏళ్ల పివి సింధుతో ఆమె తలపడాల్సిరావచ్చు. ప్రపంచ నంబర్‌వన్ షిజియాన్ వాంగ్‌ను గత వారం తైపీలో జరిగిన ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఓడించి సంచలనం సృష్టించిన సింధు మరోసారి అలాంటి అరుదైన విజయం కోసం ప్రయత్నించడంలో అనుమానం లేదు. మ్యాచ్‌ల ఫలితాలన్నీ అంచనాల ప్రకారమే ఉంటే, సైనాకు అసలుసిసలైన పోటీ సెమీ ఫైనల్స్‌లో ఎదురుకావచ్చు. ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ క్రీడాకారిణి రచనోక్ ఇన్టానన్ (్థయిలాండ్)తో సైనా పోటీపడే అవకాశాలున్నాయి. ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్స్‌లో సైనాను ఇన్టానన్ ఓడించిన విషయం తెలిసిందే. ఆమె అదే స్థాయిలో రాణిస్తుందా లేక సైనాకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం కల్పిస్తుందా అన్నది వేచి చూడాలి. 2010లో ఈ టైటిల్‌ను అందుకున్న సైనా ఆతర్వాత రెండు సీజన్లలో దారుణంగా విఫలమైంది. ఈ విషయాన్ని ఆమె సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తావించింది. గత రెండేళ్లుగా తాను ఇక్కడ అందరూ ఆశించిన విధంగా ఆడలేకపోయానని పేర్కొంది. టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతున్నందున అందరి దృష్టి తనపై ఉంటుందని, పైగా అంచనాలు కూడా భారీగానే ఉంటాయని తెలిపింది. టైటిల్ గెల్చుకోవడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడతానని హామీ ఇచ్చింది. టోర్నమెంట్స్‌లో ఆడేటప్పుడు ప్రత్యర్థి ఎవరనేది ఆలోచించనని, తన ఆటపై డ్రా ఎలాంటి ప్రభావం చూపదని సైనా స్పష్టం చేసింది. సైనాతో డ్రా గురించి ప్రస్తావించినప్పుడు, ప్రత్యర్థి ఎవరైనా తనకు ఒకటేనని స్పష్టం చేసింది. నిజానికి మొదటి రౌండ్‌లో తాను ఎదుర్కోనున్న మనుపుతీ సమర్థురాలని చెప్పింది. ఈ ఏడాది తాను సాధించిన ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంది. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, చైనా క్రీడాకారిణులను ఎదుర్కొని విజయం సాధించడం అనుకున్నంత సులభం కాదని తెలిపింది. ఒక మ్యాచ్‌లో గెలిచిన వెంటనే, మరుసటి రోజు మరో చైనా క్రీడాకారిణి సవాలు విసరడానికి సిద్ధంగా ఉంటుందని వ్యాఖ్యానించింది. అయితే, చైనా ఆధిపత్యానికి గండి కొట్టడం అసాధ్యం కాదని, నిరంతర కృషితో అది సాధ్యమని తెలిపింది.
పురుషుల విభాగంలో ప్రపంచ ఏడో ర్యాంక్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ ఈసారి పోటీల్లో కొంత కఠినమైన డ్రాను ఎదుర్కొంటున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఈ యువ ఆటగాడు మొదటి రౌండ్‌లోనే తౌఫిక్ హిదాయత్ (ఇండోనేషియా)ను ఢీకొనాల్సి ఉంది. గతంలో ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ను గెల్చుకున్న తౌఫీక్‌ను ఓడించడం అసాధ్యం కాకపోయినా, చివరి క్షణం వరకూ తీవ్ర స్థాయిలో కశ్యప్ పోరాడక తప్పదు. ఈ విభాగంలోనూ ముందుగా ఊహించిన ప్రకారమే ఫలితాలు వెల్లడైతే, క్వార్టర్ ఫైనల్స్‌లో చాంగ్ వెయ్‌ను కశ్యప్ ఢీ కొంటాడు. తొలి రౌండ్ మ్యాచ్‌లలో టామీ సుగియార్తో (ఇండోనేషియా)తో గురుసాయిదత్ తలపడతాడు. అజయ్ జయరామ్, ఆనంద్ పవార్, సౌరభ్, సాయి ప్రణీత్ ఈ టోర్నీలో ఎంత వరకు రాణిస్తారన్నది అనుమానమే. భారత్‌తోపాటు మలేసియా, ఇండోనేషియా, డెన్మార్క్, జర్మనీ, ఇంగ్లాండ్, చైనా, కొరియా, జపాన్ తదితర 22 దేశాల నుంచి రెండు వందలకు పైగా షట్లర్లు పురుషులు, మహిళల విభాగాల్లో పోటీపడుతున్నారు.
నేటి నుంచి ఇండియా ఓపెన్ బాడ్మింటన్
english title:
india open
Date:
Tuesday, April 23, 2013