న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో సంక్లిష్టమైన డ్రాను ఎదుర్కొంటున్న భారత యువ ఆటగాడు పారుపల్లి కశ్యప్ తన దృష్టిలో ప్రతి మ్యాచ్ కీలకమైందేనని వ్యాఖ్యానించాడు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్‌లో కష్టమైన డ్రా ఎదురైన విషయాన్ని సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో కొంత మంది ప్రస్తావించగా, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఏ ఒక్క మ్యాచ్‌నీ తేలిగ్గా తీసుకోవడానికి వీలులేదని అన్నాడు. ఇండియా ఓపెన్‌లో తాను మొదటి రౌండ్ నుంచే మేటి ఆటగాళ్లను ఎదుర్కోవాల్సి రావడంతో దీనిని కష్టమైన డ్రాగానే భావించాల్సి ఉంటుందన్నాడు. కానీ, డ్రా ఎలావున్నా, ప్రతి మ్యాచ్‌లోనూ సర్వశక్తులు ఒడ్డి పోరాడక తప్పదని కశ్యప్ పేర్కొన్నాడు. ఫిట్నెస్‌ను కాపాడుకోవడం, ప్రతి టోర్నీలోనూ విజయాలు సాధించడానికి కృషి చేయడంపైనే తన దృష్టి కేంద్రీకృతమైందని అన్నాడు. గతంలో తనను గురించి ఎవరూ పట్టించుకునే వారు కారని, ఇప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లంతా తన ఆటను నిశితంగా గమనిస్తున్నారని కశ్యప్ చెప్పాడు. వీడియో క్లిప్పింగ్స్ తెప్పించుకొని మరీ అధ్యయనం చేస్తున్నారని, ఇది ఒక రకంగా తనకు లభించిన గౌరవమని అన్నాడు. ప్రపంచ నంబర్‌వన్ లీ చాంగ్ వెయ్‌తో మ్యాచ్‌కి ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తారన్న ప్రశ్నపై స్పందిస్తూ, ప్రస్తుతం తన వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని అన్నాడు. ఏ మ్యాచ్‌కి ఆ మ్యాచ్‌ని విడివిడిగా చూడాల్సిన అవసరం ఉందన్నాడు. ఇప్పుడు ఆడాల్సిన మ్యాచ్‌ల గురించి పట్టించుకోకుండా, రానున్న మ్యాచ్‌ల గురించి ఆలోచించడం సరైన విధానం కాదని పేర్కొన్నాడు. విజయావకాశాలపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ గెలవాలన్న పట్టుదలతోనే ఎవరైనా బరిలోకి దిగుతారని వ్యాఖ్యానించాడు.
సంక్లిష్టమైన డ్రాపై కశ్యప్ వ్యాఖ్య
english title:
kashyap
Date:
Tuesday, April 23, 2013