న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఆరో ఐపిఎల్‌లో మొదటి నుంచి దారుణంగా విఫలమై, వరుసగా ఆరు పరాజయాలను మూటగట్టుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ముంబయి ఇండియన్స్‌పై సాధించిన విజయం కొత్త ఊపిరిపోసింది. ఓపెనర్ వీరేందర్ సెవాగ్ అజేంగా 95 పరుగులు సాధించి, ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను మళ్లీ ఫామ్‌లోకి రావడం, ఐపిఎల్‌లో మొదటి విజయాన్ని నమోదు చేయడం మహేల జయవర్ధనే నాయకత్వంలోని ఢిల్లీ ఉత్సాహానికి కారణమైంది. ఇదే ఊపుతో పంజాబ్‌ను కూడా చిత్తుచేయాలని ఆశిస్తున్నది. అయితే, ముంబయి గెలవడం తెచ్చిన ఉత్సాహం ఒకవైపు ఉరకలు వేస్తుంటే, మరోవైపు ఇకపై ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లలోనూ విజయం సాధించకపోతే, నాకౌట్ అవకాశాలు మూసుకుపోతాయన్న భయంతో ఢిల్లీ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నది. మంగళవారం నాటి పోరుతోసహా ఈ జట్టు తొమ్మిది మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో కనీసం ఎనిమిది విజయాలను అందుకుంటే తప్ప, తదుదరి దశకు చేరే అవకాశాలు లేవు. ఒకవేళ ఆ మ్యాచ్‌లను గెల్చుకున్నా, మిగతా జట్ల జయాపజయాలు కూడా ఈ జట్టుపై ప్రభావం చూపుతాయి. మొత్తం మీద ప్రతి మ్యాచ్‌లోనూ చావో రేవో అన్న చందంగా ఆడాల్సి రావడం సహజంగా ఏ జట్టునైనా ఒత్తిడికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ పరిస్థితి ఇదే.
ఒకదాని తర్వాత మరొకటిగా ఆరు పరాయాలను ఎదుర్కొన్న ఢిల్లీకి వీరూ ఫామ్‌లోకి రావడం కలిసొచ్చిన అంశమైతే, వెస్టిండీస్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్ సలహాలు, సూచనలు ఆటగాళ్లపై మంచి ప్రభావానే్న చూపాయి. సలహాదారుగా రిచర్డ్స్ తమ మధ్య ఉండడంతో ఢిల్లీ క్రికెటర్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ముంబయి ఇండియన్స్ వంటి మెరుగైన జట్టును తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుచేశారు. తొలి వికెట్‌కు వీరూ, జయవర్ధనే ఆరో ఐపిఎల్‌లో ఇప్పటి వరకూ అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. డేవిడ్ వార్నర్, మన్‌ప్రీత్ జునేజా, కేదార్ జాదవ్ వంటి మేటి ఆటగాళ్ల అండ జట్టుకు ఉంది. ఉన్ముక్త్ చాంద్ బ్యాటింగ్ ఇంకా గాడిలో పడకపోయినా, అతను ఫామ్‌లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. బౌలింగ్ విభాగంలో ఉమేష్ యాదవ్ అగ్రస్థానాన్ని ఆక్రమిస్తాడు. ఆశిష్ నెహ్రాతోపాటు ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వికెట్లు పడగొట్టగల సమర్థులు.
ఇక పంజాబ్ విషయానికి వస్తే, ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఓటమి అంచున నిలిచినప్పటికీ, పుణే వారియర్స్‌పై అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ ఆడం గిల్‌క్రిస్ట్ ఫామ్‌లో లేకపోవడం మాత్రం ఈ జట్టును వేధిస్తున్న సమస్య. అతను ఇప్పటి వరకూ ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లో 15, 9, 0, 7, 26, 4 చొప్పున పరుగులు చేశాడు. అతని వైఫల్యాలు కొనసాగుతున్న కారణంగా బ్యాటింగ్ బాధ్యతను మన్దీప్ సింగ్, డేవిడ్ హస్సీ తమ భుజాలపై మోయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు షాన్ మార్ష్ సేవలు ఇంకా లభించకపోవడం కూడా పంజాబ్‌ను ఆందోళనకు గురి చేస్తున్నది. పుణేతో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ 41 బంతుల్లోనే అజేయంగా 80 పరుగులు సాధించి, పంజాబ్‌ను విజయపథంలో నడిపించాడు. నాలుగో వికెట్‌కు అతను మన్దీప్‌తో కలిసి 128 పరుగులు జోడించడం విశేషం. ఈ జట్టుకు మిల్లర్ రూపంలో గొప్ప ఆయుధం లభించింది. బౌలింగ్ విభాగాన్ని అజర్ మహమూద్, ప్రవీణ్ కుమార్ ముందుండి నడిపిస్తున్నారు. అయితే, ఈ జట్టు ఓడిమిపాలైన రెండు సందర్భాల్లోనూ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించారు. స్పిన్నర్ పీయూష్ చావ్లా ఆరు మ్యాచ్‌లలో కేవలం మూడు వికెట్లతో సరిపుచ్చుకున్నాడు. అతను మళ్లీ స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శిస్తే తప్ప ప్రత్యర్థిని పంజాబ్ తక్కువ స్కోరుకు కట్టడి చేయడం సాధ్యం కాదు. స్థూలంగా చూస్తే, మంగళవారం నాటి మ్యాచ్‌లో పంజాబ్ ఫేవరిట్‌గా బరిలోకి దిగుతుండగా, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిన స్థితిలో ఢిల్లీ కడ వరకూ గట్టిపోటీనిచ్చే అవకాశాలున్నాయి. ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోవడానికి సన్నాహాలు పూర్తి చేసిన నేపథ్యంలో, ఉత్కంఠ పోరు తప్పదని స్పష్టమవుతున్నది. ప్రేక్షకులకు మరో గొప్ప మ్యాచ్‌ని తిలకించే అవకాశం లభించనుంది.
నేడు కింగ్స్ ఎలెవెన్‌తో ఢిల్లీ పోరు
english title:
kings XI
Date:
Tuesday, April 23, 2013