బెంగళూరు, ఏప్రిల్ 22: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం జరిగే మ్యాచ్‌లో పుణే వారియర్స్‌ను ఓడించి ఆధిపత్యాన్ని చాటడమే లక్ష్యం ఎంచుకుంది రాయల్ చాలెంజర్స్. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఈ జట్టుకు పుణే నుంచి గట్టిపోటీ తప్పదు. ఏమాత్రం అంచనాలు లేకపోయినా, సమష్టి పోరాటంతో, ఒడిదుడుకుల మధ్య నెట్టుకొస్తున్న పుణే ఒకటిరెండు సంచలన విజయాలను నమోదు చేసుకుంది. అదే దూకుడును ప్రదర్శించి చాలెంజర్స్‌పై గెలవాలన్న పట్టుదలతో ఉంది. కానీ, క్రిస్ గేల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ వంటి మేటి ఆటగాళ్లు ఉన్న చాలెంజర్స్‌ను ఓడించడం పుణే జట్టుకు అంత సులభం కాదు.
థామస్, ఉబేర్ కప్ ఫైనల్స్‌కు భారత్ ఆతిథ్యం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: బాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మకమైన థామస్ కప్, ఉబేర్ కప్ ఫైనల్స్ రౌండ్స్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని భారత బాడ్మింటన్ సంఘం (బిఎఐ) అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాడు. మన దేశంలో ఈ పోటీలను నిర్వహించడం ఇదే మొదటిసారని అన్నాడు. పురుషుల విభాగంలో థామస్ కప్, మహిళల విభాగంలో ఉబేర్ కప్ ట్రోఫీలకు జరిగే ఈ టీం ఈవెంట్‌లో వచ్చే ఏడాది నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనున్నట్టు పేర్కొన్నాడు. మన దేశంలో జరిగే ఫైనల్ రౌండ్స్‌లో 12 జట్లు తలపడతాయని వివరించాడు.
అలెకిన్ స్మారక చెస్ తొలి రౌండ్‌లో ఆనంద్‌కు షాక్
పారిస్, ఏప్రిల్ 22: లావెర్‌లో ప్రారంభమైన అలెకిన్ స్మారక చెస్ టోర్నమెంట్ తొలి గేమ్‌లోనే భారత ఆటగాడు, ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటన్‌కు చెందిన మైఖేల్ ఆడమ్స్ అనూహ్యంగా పావులను కదుపుతూ ఆనంద్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. 56 ఎత్తుల వరకూ పోరాడిన ఆనంద్ చివరికి ఓటమిని అంగీకరిస్తూ రిజైన్ చేయాల్సి వచ్చింది. రౌండ్ రాబిన్ విధానంలో పది మంది మేటి స్టార్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌లో వ్లాదిమీర్ క్రామ్నిక్, నికితా విటుగొవ్, బోరిస్ గెల్ఫాండ్, పీటర్ స్విడ్లర్ తదితరులు కూడా పోటీపడుతున్నారు.
సాతో రికార్డు విజయం
లాంగ్ బీజ్ (కాలిఫోర్నియా), ఏప్రిల్ 22: జపాన్ డ్రైవర్ తకుమా సాతో ఇక్కడ జరిగిన ఇండీకార్ సిరీస్ గ్రాండ్ ప్రీ రేస్‌ను గెల్చుకొని రికార్డు సృష్టించాడు. జపాన్ తరఫున లాంగ్ బీచ్ ఆటో రేస్‌లో ట్రోఫీని అందుకున్న తొలి జపాన్ డ్రైవర్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. అంతర్జాతీయ పోటీల్లో అంతగా పేరులేని సాతో ఈ విజయంతో ఒక్కసారిగా జపాన్ స్టార్‌గా ఎదిగిపోయాడు.