న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: భారత టీనేజ్ బాక్సర్ ప్రయాగ్ చౌహాన్‌కు ఆసియా కానె్ఫడరేషన్ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ 60 కిలోల విభాగంలో స్వర్ణ పతకం లభించింది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం, కజకస్థాన్‌లో జరిగిన ఈ పోటీల్లో 16 ఏళ్ల ప్రయాగ్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఫైనల్‌లో స్థానిక బాక్సర్ అజత్ లుబయేవ్‌ను ఓడించి టైటిల్ అందుకున్నాడు. ఈ పోటీల్లో భారత్ ఓ స్వర్ణంతోపాటు మూడు కాంస్య పతకాలను కూడా కైవసం చేసుకొని, ఓవరాల్ టీం ర్యాంకింగ్‌లో మూడో స్థానాన్ని ఆక్రమించింది. 66 కిలోల విభాగంలో భారత జాతీయ సబ్ జూనియర్ చాంపియన్ ఆదిత్య మాన్, 63 కిలోల విభాగంలో ప్రదీప్ సోమవారం కాంస్య పతకాలను సాధించారు.
ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ స్వర్ణం సాధించిన ధన్కర్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత వీరుడు అమిత్ ధన్కర్ స్వర్ణ పకం సాధించాడు. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం 66 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో అతను మంగోలియాకు చెందిన గంజోరింగ్‌ను ఓడించి టైటిల్ అందుకోవడంతోపాటు, భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాడు. ఈ పోటీల్లో భారత్ మొత్తం రెండు స్వర్ణం, ఒక రజతం, ఆరు కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. ఫ్రీస్టయిల్ విభాగంలో రెండు స్వర్ణం, మరో రెండు కాంస్య పతకాలను అందుకొని, అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ ఫలితాల పట్ల భారత రెజ్లింగ్ సమా ఖ్య ఆనందం వ్యక్తం చేసింది.