మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. యుపిఏ ప్రభుత్వం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కనుసన్నల్లో నడుస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే. కానీ మహిళలకు భద్రత కల్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. యువతీ యువకులు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన జరిపారు. వారికి మద్దతుగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఉద్యమ ఫలితంగా నిర్భయ చట్టం వచ్చింది. అయితే దానిని అమలు చేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు అందుకే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఇలాంటి అత్యాచారాల సంఘటనలు దేశం పరువు ప్రతిష్ఠలను మంటగలుపుతున్నాయి. ఇండియాకు వెళ్లడం అంత సురక్షితం కాదని తమ దేశానికి చెందిన పర్యాటకులకు అమెరికా హెచ్చరించిందంటే అంతర్జాతీయంగా మన దేశ పరువు ప్రతిష్టల పరిస్థితి ఏమిటో అర్ధం అవుతోంది. జరిగిన సంఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేసి ప్రధాన మంత్రి చేతులు దులుపుకున్నారు. సోనియాగాంధీ సైతం తమ వంతు సానుభూతి తెలిపారు. అధికారంలో ఉన్న వాళ్లు సానుభూతి తెలపడం కాదు, చట్టాలను కఠినంగా అమలు చేసి అత్యాచారాలకు పాల్పడే వారికి తగిన శిక్ష విధించే విధంగా ఉండాలి. ఎలాంటి నేరం చేసినా ఏమీ కాదు అనే భావన కాంగ్రెస్ పాలనలో సంఘ విద్రోహులకు సాధారణం అయింది. దేశ రాజధాని ఢిల్లీలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మూరు మూల ప్రాంతాల్లో మహిళలకు భద్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యాచారాలకు సంబంధించి చాలా కేసులు పోలీస్ స్టేషన్ల వరకు రావు. వచ్చిన కేసుల్లో సైతం పోలీసులు సరిగా వ్యవహరించడం లేదని ఢిల్లీ సంఘటన రుజువుచేస్తోంది. చిన్నారిపై అత్యాచారం చేశారని పోలీసులకు చెబితే, రెండు వేలు తీసుకొని వెళ్లిపొమ్మని వారు చెప్పడం ఎంత అమానుషం. నిర్భయ చట్టం అమలులోకి వచ్చిన తరువాత అత్యాచారాలు ఉండవు అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. కానీ చట్టాలను కఠినంగా అమలు చేయకపోవడం వల్ల నేరాలకు పాల్పడే వారిలో భయం కనిపించడం లేదు. దేశ రాజధానిలోనే మహిళలకు భ్రదత లేనప్పుడు ఇక దేశంలో ఎక్కడ భద్రత ఉంటుంది? నిర్భయ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. తెనాలిలో ఇటీవల కొందరు తాగుబోతులు ఒక అమ్మాయిని వేధించారు. అడ్డువచ్చిన తల్లిని వాహనం కిందకు తోసి చంపేశారు. నడిరోడ్డుమీద ఇంతటి దుర్మార్గానికి పాల్పడుతున్నారంటే ప్రభుత్వం అంటే దుండగులకు ఎంత చులకనగా ఉందో అర్థమవుతుంది. పాలకులు చిత్తశుద్ధితో చట్టాన్ని అమలు చేసినప్పుడే ఇలాంటి నేరాలు అదుపులో ఉంటాయి. అంతేతప్ప చట్టం చేశామని, చేతులు దులుపుకుంటే ఇలాంటి దుశ్చర్యలకు అంతుండదు.
మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి.
english title:
p
Date:
Thursday, April 25, 2013