మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించేందుకు నిందితులకు కఠినమైన శిక్షలు విధించడంతో పాటు జాతీయ స్థాయిలో మహిళల భద్రతను జాతీయ అజెండాలో ఒక ప్రధాన అంశంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేర్చాలి. దీనికోసం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాచార పౌర సంబంధాల శాఖ, మీడియా, ఇతర ప్రచార సాధనాల ద్వారా మహిళల భద్రత, వారి హక్కులు, వారి గౌరవానికి భంగం వాటిల్లితే, వారిని అవమానపరిస్తే, దౌర్జన్యాలు, అత్యాచారాలకు పాల్పడితే చట్టంలో ఉండే శిక్షల గురించి విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలి. ఇవేమీ లేకుండా ‘తాంబూలాలు ఇచ్చాం.. తన్నుకు చావండి’ అనే రీతిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తే సరిపోదు. గత డిసెంబర్, జనవరి నెలల్లో ఢిల్లీ అత్యాచార ఘటన దేశాన్ని ఊపింది. నిర్భయ చట్టాన్ని తెచ్చారు. కాని ఆచరణలో ప్రజలకు స్పృహ కలిగించేందుకు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? చట్ట పరిరక్షకులైన పోలీసులే ఢిల్లీలో పసిబాలికపై అత్యాచారం ఘటనలో ఫిర్యాదిదారులకు రెండు వేల రూపాయలు ఇచ్చి కేసు ఎందుకన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి. పోలీసుల పనితీరును ప్రశ్నించిన ఒక యువతిపై ఒక పోలీసు అధికారి చేయి చేసుకున్నారు. ఢిల్లీలో పసిబాలికపై జరిగిన తాజా ఘటన ప్రతి మహిళను కలిచివేసింది. ఈ తరహా సంఘటన జరిగినప్పుడు మన్మోహన్‌సింగ్, సోనియాగాంధీ బాధితురాలిని పరామర్శించి, కన్నీళ్లు కారిస్తే ప్రయోజనం లేదు. పసిబాలికపై అత్యాచారం ఘటనను తీవ్రంగా పరిగణించి కొత్త అత్యాచార నిరోధక చటాన్ని అమలు చేయాలి. మన దేశంలో పోలియో, ఎయిడ్స్ లాంటి వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నారు. కాని మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలను నివారించేందుకు కేవలం చట్టాలు చేస్తే ప్రయోజనం ఏమీ లేదు. దేశంలోని మారుమూల గ్రామాల్లోని ప్రజలకు, సామాన్యులకు, నిరక్షరాస్యులు, అక్షరాస్యులు, అధికారులతో పాటు ప్రతి పౌరుడికి మహిళల భద్రత ప్రాధాన్యత, కఠినమైన చట్టాల గురించి తెలియచేయాలి. ఒక ఘోరమైన సంఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం వల్ల ప్రయోజనం లేదు. తాజాగా ఢిల్లీ ఘటన నేపథ్యంలో మన రాష్ట్రంలో నాలుగు సంఘటనలు జరిగాయి. ప్రభుత్వం సామాజిక బాధ్యతగా స్వీకరించి మహిళలపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించే పద్ధతులను కొనసాగిస్తూనే, సమాజంలో మార్పులు తెచ్చేందుకు జాతీయ స్థాయిలో ఒక డిక్లరేషన్ ప్రకటించాలి. పసిబాలికపై జరిగిన అత్యాచారం ఘటన మహిళాలోకాన్ని నిశే్చష్టులను చేసింది. ఇక ప్రభుత్వం చట్టం తనపని తానుచేసుకుని పోతుందని ప్రకటనలు చేసి చేతులు ముడుచుకుని కూర్చుంటే చూస్తూ ఊరుకోం.
మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించేందుకు నిందితులకు
english title:
m
Date:
Thursday, April 25, 2013