చిన్నారులపై, మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారికి న్యాయ స్థానాల్లో సహాయం లభించకుండా చేయాలి. దీనిపై న్యాయవాదులు దృష్టి సారించాలి. అలాగే కఠినంగా చట్టాలను అమలు చేయడం ద్వారా నేరగాళ్లను నివారించవచ్చు. మహిళలపై అత్యాచారాలను నిరోధించేందుకు తీసుకుని వచ్చిన నిర్భయ చట్టం మంచిదే. ఈ చట్టం వచ్చిన తరువాత కూడా కొన్నిచోట్ల అత్యాచారాలు జరుగుతుండడం బాధాకరం. గతంలో జరిగిన ఢిల్లీ ఘటన వంటివి పునరావృతం కాకుండా ఉండాలన్న భావనతో నిర్భయ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది. అయినప్పటికీ మళ్లీ ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరగడం సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమే. విదేశాల్లో చిన్న దొంగతనం చేసిన వారిని కూడా కఠినంగా శిక్షించే చట్టాలున్నాయి. అటువంటి చట్టాలను మన దగ్గర కూడా అమలు చేస్తే బాగుంటుంది. అరెస్టులు జరిగినా బెయిల్‌పై బయటకు రావడం, మళ్లీ నేరాలకు పాల్పడడం జరుగుతోంది. నేరగాళ్లలో భయం లేకుండా పోతోంది. ఇటువంటి నేరాలకు పాల్పడేవారికి జీవిత ఖైదు అవసరం. భవిష్యత్తు అంతా జైలులోనే గడపాలన్న భయం వారిలో కల్పించాలి. అందుకే సైకో తరహా నేరాలకు పాల్పడే వారికి న్యాయ సహాయం తిరస్కరించేలా న్యాయవాదులు ముందుకు రావాలి. ఇటువంటి నేరాలకు పాల్పడే వారికి బెయిల్ కూడా రాకూడని విధంగా చట్టాలు రూపొందించాలి. మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా కొందరు సైకోలు ఇటువంటి ఘటనలకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. ఆరేళ్ల బాలుడిని అతి కిరాతకంగా, కేవలం 45 వేలకు హత్య చేయడం బాధాకరం. అందుకే కఠినంగా వ్యవహరించడం తప్పనిసరి. మహిళలు, పిల్లలపై అత్యాచారాల వంటి ఘటనలపై మీడియా కూడా సంయమనంతో వ్యవహరించాలి. నిందితుల కిరాతకాన్ని బట్టబయలు చేసేలా వార్తా కథనాలు ప్రచురిస్తూ సమాజంలో నిందితులపై ఏహ్యభావం పుట్టేలా చూడాలి. నిందితుల్లో భయం పుట్టించాలి. అంతేతప్ప నేరగాళ్లకు కొత్త ఐడియాలు వచ్చేలా చూడరాదు. నేరాలు జరగకుండా, నేరగాళ్లు విజృంభించకుండా సమాజంలోకి అన్ని వర్గాలు భాగస్వామ్యులు కావాలి. అత్యవసర పనిపై అర్ధరాత్రి బయటకు వెళ్ళినా రక్షణ కల్పించాల్సి ఉంటుంది. నేరాలు జరిగిన సమయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి సైకో నేరగాళ్లను ఉరి తీయాలని కొంత మంది అంటే.. కాల్చి చంపాలని కొందరు.. జైల్లో పెట్టాలని ఇంకొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల నేరస్తులపై చర్యలు కూడా జాప్యమవుతున్నాయి. అందుకే ఇటువంటి సమయాల్లో అన్ని రాజకీయ పార్టీలను, సంస్థలను కూడా భాగస్వాములను చేసి చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఏదియేమైనా నిందితులు ఇక తమకు భవిష్యత్తు లేదనేలా చర్యలు ఉండాలి.
చిన్నారులపై, మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారికి న్యాయ స్థానాల్లో సహాయం లభించకుండా చేయాలి.
english title:
n
Date:
Thursday, April 25, 2013