పరిణామ క్రమంలో కోతి మనిషిగా మారాడనేది డార్విన్ సిద్ధాంతం. పరిణామక్రమం అనేది ఉన్నప్పుడు ఒక చోట ఆగిపోదు కదా! ఆ పరిణామం ఇప్పుడు మనిషిని రాక్షసునిగా మారుస్తుందా? దేశవ్యాప్తంగా జరుగుతున్న పలు అత్యాచార సంఘటనలను చూస్తుంటే మనిషి రాక్షసుడ్ని మించిపోతున్నాడనిపిస్తోంది. ఢిల్లీలో వైద్య విద్యార్థి నిర్భయపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమె మరణానికి కారకులయ్యారు. ఈ సంఘటన దేశాన్ని ఒక కుదుపు కుదిపింది. ఢిల్లీలో యువత రోడ్డున పడింది. పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించారు. సోనియాగాంధీ సైతం రోడ్డు మీదకు వచ్చి ఉద్యమకారులకు సంఘీభావం తెలిపారు. ఢిల్లీలో మొదలైన ఆందోళనలు దేశ వ్యాప్తంగా విస్తరించాయి. అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉరి శిక్ష విధించాలని, చట్టం పదునెక్కితే తప్ప ఇలాంటి సంఘటనలు నిలిచిపోవని యువత మొత్తం నినదించింది. కేంద్రం దిగిరాక తప్పలేదు. తన కుమార్తె కూడా ధైర్యంగా బయటకు వెళ్లలేని పరిస్థితి అని స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ బహిరంగంగా ప్రకటించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ఢిల్లీ యువత ఉద్యమ ఫలితంగా ‘నిర్భయ’ చట్టం వచ్చింది. చట్టం వచ్చినంత మాత్రాన పరిస్థితుల్లో మార్పేమీ ఉండదని ఈ చట్టం చాటి చెప్పింది. ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం వల్ల వచ్చిన నిర్భయ చట్టం రాక్షసులను ఏమాత్రం అదుపులో పెట్టలేకపోతోందని ఢిల్లీలో ఐదేళ్ల గుడియాపై జరిగిన అత్యాచారమే నిరూపించింది. నిర్భయ సంఘటన కన్నా హృదయవిదారకమైన సంఘటన ఇది. అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారిని ఒక రాక్షసుడు మూడు రోజుల పాటు ఇంట్లో బంధించి అత్యాచారం జరపడమే కాకుండా చెప్పలేని విధంగా రాక్షసత్వానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గురించి తెలియగానే ఎంతటివారైనా చలించిపోతాడు. కానీ ఢిల్లీ పోలీసులు మాత్రం కనిపించకుండా పోయిందనుకున్న బాలిక దొరికింది కదా... కేసు వద్దు ఏమీ వద్దు... ఇంటికి పోండి... అని సలహా ఇచ్చారు. రెండు వేల రూపాయలు తీసుకొని వెళ్లిపోండి అని బెదిరించారు. విషయం తెలిసిన ఢిల్లీ ప్రజలు మరోసారి ఉద్యమించారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, హోంమంత్రి ఎవరినీ వదలకుండా అందరి ఇళ్ల ముట్టడికి ప్రయత్నించారు. చివరకు ప్రధాన మంత్రి సైతం జరిగిన సంఘటన పట్ల సిగ్గుపడుతున్నట్టు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సోనియాగాంధీ కోరారు. కేవలం చట్టాలు తీసుకువస్తే సరిపోదని సమాజం ఆలోచన ధోరణి మారాలని ప్రధాన మంత్రి అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోనే కాదు దేశ వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు నిర్బయ చట్టానికి ముందు, తరువాత కూడా జరుగుతూనే ఉన్నాయి. ఉద్యమం జరుగుతున్నప్పుడు దాన్ని చల్లార్చడానికి తాత్కాలికంగా చర్యలు తీసుకుంటే సరిపోదు కదా. వరంగల్‌లో గతంలో ఒక అమ్మాయి ప్రేమించడం లేదని యువకులు యాసిడ్ పోశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పారిపోతున్నారని చెప్పి ఎన్‌కౌంటర్ చేశారు. దీనికి ప్రజలు పోలీసులను అభినందించారు. ఈ సంఘటన తరువాత అమ్మాయిలపై యాసిడ్ దాడులు ఆగాయా అంటే అలాంటిదేమీ లేదు. ఒకరిద్దరిపై కఠిన చర్యలు తీసుకున్నంత మాత్రాన సమస్య సమసిపోతుంది అనుకుంటే వరంగల్ సంఘటన తరువాత యాసిడ్ దాడులు జరిగేవి కావు. అలాగే నిర్బయ చట్టం తరువాత ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వాల్సిందీ కాదు. కానీ... అలా జరగడం లేదు. ఆడవారిపైన, చివరకు పసిపిల్లలపై సైతం అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలో అన్ని కోణాల్లో ఆలోచించాలి. కఠినమైన చట్టాలు అమలు చేయడంతో పాటు, ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేయాలి. నైతిక విలువలకు స్థానం లేని చదువులపైన, సినిమాలపైన ప్రభుత్వం దృష్టి సారించాలి. ప్రభుత్వమే కాదు మొత్తం సమాజం తనను తాను సమీక్షించుకోవాలి. నైతిక విలువలకు జీవితంలో స్థానం లేకుండా పోయింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు హడావుడిగా విలువల అవశ్యకత గురించి ప్రధానమంత్రి లాంటి వారు బోధించడం సరిపోదు. పాఠశాల స్థాయిలోనే నైతిక విలువల ఆవశ్యకత పిల్లలకు బోధించాలి. అటు పాఠశాలలో, ఇటు కుటుంబంలో, సమాజంలో ఒక వ్యక్తి విలువల ఆవశ్యకత తెలుసుకునే పరిస్థితి లేనప్పుడు ఇక అతను విలువలు నేర్చుకునేది ఎక్కడ? అమ్మాయిలను హింసించడమే హీరోయిజం అని చాటిచెబుతున్న సినిమాలపై సైతం సెన్సార్ వారు కఠిన నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఇలాంటి సంఘటనలను సమాజం సింహావలోకనం చేసుకోవలసిన అవసరాన్ని చాటిచెబుతున్నాయి. మనం ముందుకు వెళుతున్నామా? అనాగరికత వైపు వెళుతున్నామా? ఆలోచించుకోవలసిన తరుణమిది.
పరిణామ క్రమంలో కోతి మనిషిగా మారాడనేది డార్విన్ సిద్ధాంతం.
english title:
p
Date:
Thursday, April 25, 2013