భారతదేశంలో హనుమంతుని విగ్రహం లేని ఊరు లేదంటే ఆశ్చర్యం లేదు. అందుకే ఆయన చిరంజీవి అయ్యాడు.
యుగ యుగాలుగా పూజలందుతున్న మారుతికి పూజలు చేయడంలో యువకులు అత్యంత ఉత్సాహం చూపుతుంటారు. వ్యాసులవారు చెప్పిన నవ విధ భక్తుల్లో దాస్య భక్తికి ప్రత్యక్ష సాక్ష్యం వాయుపుత్రుడు.
యత్ర యత్ర రఘునాధ కీర్తనం......... మారుతిం నమత రాక్షసాంతకం.
ఇది వాల్మీకి రామాయణంలో చెప్పిన మాట. ఎక్కడైతే రామనామ సంకీర్తనం ఉంటుందో అక్కడ ఆంజనేయుడు ఉంటాడు. ఎలా ఉంటాడంటే వినయ విధేయతలకు మారు రూపంగా ఆర్ధ్రతతో కూడిన కళ్లతో ఉంటాడు. రాక్షసులను హతమార్చడంలో భీకర స్వరూపం చూపిన మహాబలుడు ఇతనేనా అన్న సందేహం కలుగక మానదు. ఆత్మస్థైర్యంతో సీతమ్మవారి జాడ తెలిసికొని, స్వాంతన కలగజేసి రాములవారికి ఆనందాన్ని కలుగుచేశాడు. యుద్ధ సమయంలో అండగా నిలిచాడు. అందుకే నమ్మిన బంటుగా రాముని విజయానికి కారకుడైనాడు. రామాయణ ప్రవచన వేళలో వానర వీరుని కోసం ఎర్రని గుడ్డ పరిచి ఖాళీగా ఉంచితే ఆయన అక్కడ తప్పక కూర్చుని ఆ రామాయణ ప్రవచాన్ని వింటాడని భక్తుల నమ్మకం.
‘కలౌ కపి వినాయకః’ అన్నట్లు ఈ కపివరుని మాలల దీక్షాధారణ నవ యువకులు మొదలుకుని వృద్ధుల వరకు ఆరాధించడం ఈ రెండు దశాబ్దాల్లో అధికంగా పెరిగింది. ఫాల్గుణ శుద్ధ పంచమి మొదలు చైత్ర శుద్ధ పూర్ణిమ వరకు నలభై రోజులు మండల దీక్షలు స్వీకరిస్తున్నారు. కాషాయ వస్తధ్రారణ, ఏక భుక్తం, శీతల స్నానంతో నిత్యం రామనామ స్మరణతో ఆంజనేయుడు హృదయాల్లో స్థిరమయ్యే విధంగా భజనలు, కీర్తనాలాపన చేస్తున్న భక్తుల ఉత్సాహం ఉరకలు వేస్తున్నది. కలియుగంలో భజన, గత యుగాల్లో యజ్ఞ, యాగ తపో దీక్షలు భగవంతుని సన్నిధికి చేరడానికి మార్గాలు. బ్రహ్మచారులకు ఆదర్శప్రాయుడు కేసరి తనయుడు.
బుద్ధిర్బలం మనోధైర్యం.....హనుమాత్ స్మరణాన్ భవేత్
అన్నట్లు అంజనీ సూనుని భజన, స్మరణతో బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం, ఆరోగ్యము, మానసిక దృఢత్వం, వాక్పటుత్వం వంటి ఫలితాలనిస్తాయి. అంతేగాకుండా అణిమాది అష్టసిద్ధులు పొందిన ఆంజనేయుడు శక్తిమంతుడు. ఈయన సత్తు అమేయం, అపూర్వం. తులసీదాసు హనుమాన్ చాలీసాలో ‘అష్టసిద్ధి నవ నిధికే దాతా, అసవర దీన జానకీ మాత’ అని స్థుతిస్తారు. భూత పిశాచాలు నీవంటె హడలు-అన్నట్లు గ్రామ రక్షణ కోసం అత్యంత ఎతె్తైన-్భరీ విగ్రహాల్ని గ్రామ పొలిమేరల్లో స్థాపించి పూజిస్తుంటారుభక్తజనసందోహం.
సీతమ్మ వారిని తల పాపిటలో సింధూరం ఎందుకు ధరించావని కపివరుడు అడిగాడట. రాముని ప్రీతి చేసుకునేందుకు అని చెప్పటంతో తెల్లవారి ఒంటినిండా సింధూరం ధరించి రాముని సభకు వెళ్లి ప్రశంసలు పొందిన హనుమంతునికి చందనం అంటే అందుకే మక్కువ ఎక్కువ. తనను భక్తులు కొలవడం కంటే రామనామ స్మరణతోనే వాయుపుత్రుడు అత్యంత ఆనందాన్ని పొందుతాడు.
శ్రీరామ జయరామ జయజయ రామ
ఓ రామ శ్రీరామ ఓంకార రామ అని భజన చేస్తే ఆయన అంగాంగం పులకిస్తుంది. రోమ రోమమున రాముని నామాన్ని నింపుకున్న హనుమంతుడు హృదయంలో సీతారాములను స్థిరపరుచుకున్నాడు. ఎర్రపూలు, జిల్లేడు (అర్క) పుష్పాలు, తమలపాకులు అంటే అత్యంత ప్రీతి గలవాడు ఎవరైతే నియమ నిబద్ధతతో వినయ విధేయతలతో ఆంజనేయుని పూజిస్తారో వారికి ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని బాధలు తొలగి నిరంతరం సంతోషాన్ని పొందుతారు.
మంచిమాట
english title:
m
Date:
Thursday, April 25, 2013