ఇక మహోదరా మహాపార్శ్వులు, అతికాయుడు యోధానుయోధులు. వాళ్లు అష్టదిక్పతులనయినా ఆజిలో అవశ్యం గెలువగలరు. రావణాసురుడికి సురలకు కంటకులయిన బల్లిదులు లక్షమంది తనయులు. జ్ఞాతులతో అతడి బంధుజలాన్ని లెక్కపెట్టడం బ్రహ్మకైనా అలవి కాదు.
రావణుడికి యక్షరాజు కుబేరాదులే సామంతులు. అట్టివాడి వైభవాన్ని వర్ణింపతరం కాదు. నెత్తుటి మెదడుతో తడిసి సంగరోన్మత్తులయి మిక్కిలి మత్తిల్లిన దైత్యవరులు పది వేలకోట్లు బలియులు వుంటారు. వారి శక్తి వల్ల దనుజాధినాథుడు అఖిల దిక్కులు జయించాడు’’ అని విభీషణుడు విపులంగా వివరించాడు.
అంత రాఘవుడు విభీషణుడితో ‘‘విను. ఇంతకుపూర్వమే నేను విని వున్నాను. మీ అన్న అసమాన వీరుడు. అతడి సేన కూడా అంతటిదే. రావణుడు ఎంతవాడైనా అగుగాక! నా యెదుర వాడిమి, వేడిమి చూప ఆ దశముఖుడు ఎంతవాడు?
హరిహర బ్రహ్మాది దేవతలు అడ్డగించినా వాడి పిండి పెడతాను. విభీషణా! నిన్ను తప్పక లంకకి రాజుని చేస్తాను. నీకు పట్టం కట్టి లంకారాజ్యం ఏలిస్తాను’’ అని ప్రతిన పట్టాను’’ అని వాకొన్నాడు.
విభీషణుడు వినయంతో రామవిభుడికి రెండు చేతులు జోడించి అయిదు పది చేశాడు. ‘‘రామవిభూ! నీకీ రావణుడెంత? ఈ లంక ఎంత?
నీ బాణ జ్వాలలు పర్విననాడు లంక కోటలు కూల్చి, లగ్గలు పట్టి, కినుకతో రక్కసి మూకను తునుమువేళ, నా సామర్థ్యం చూడు. ప్రళయకాల రుద్రుడిలాగు చెలరేగుతాను’’ అని వచింప రామవిభుడు అతణ్ణి ఆలింగనం కావించుకొని లక్ష్మణుడితో
‘‘లక్ష్మణా! ఈ సముద్ర జలంతో నువ్వు, సుగ్రీవుడు భూసురుల ఆశీర్వాద పుణ్యనాదాలతో లంకా రాజ్యానికి విభీషణుణ్ణి పట్టం కట్టవలసి ఉంది’’ అని ఆనతి ఇచ్చాడు.
శ్రీరాముడు విభీషణునకు లంకాభిషేకము చేయుట
లక్ష్మణుడు సముద్ర జలాలను కపి వీరులు కొనిరాగా జలంతో అభిషేకించి, అసరులకందరకు ప్రభుడివి అవు’’ అని అభిషిక్తుణ్ణి కావించాడు. ‘‘విభీషణా! రామచంద్ర విభుడి కీర్తి ఎంతకాలం విలసిల్లుతుందో అంతకాలం నువ్వు రాజ్యపాలన చెయ్యి’’ అని వాకొన్నాడు. ఆమాటలాలించి వానరకోటి హర్షించింది.
రాఘవుడు విభీషణుణ్ణి కనుగొని ‘‘ఈ సమద్రము దాటడం కోసం ఏ ఉపాయం ఆలోచింతాము’’ అని అడిగాడు. విభీషణుడు హస్తాలు ముకుళించి, ‘‘ఈ జలధిని బంధింపక ఇంద్రాదులకయినా దాటతరం కాదు. కనుక సముద్రుణ్ణి ప్రార్థింపవలసింది’’ అని బదులాడుతూ వుండగా దశకంథరుడి అనుమతితో శార్దూలుడు అనే దూత వచ్చాడు.
మెల్లిగా ఎవరికంటా పడకుండా కపిసేన సంఖ్య, వానరులు మాట్లాడుకొనేమాటలు, రాఘవుడు వానరులతో పలికిన పలుకులూ విన్నాడు. వచ్చిన వాడు వచ్చినట్లే లంకకి మరలిపోయాడు. పోయి దశముఖుణ్ణి కాంచి కరాలు మోర్చాడు. ఈ కరణి విన్నవించాడు.
‘‘లంకాధి నాయకా! అతులిత యశులు, ఎగుభుజాలవారు, ఆజానుబాహులు, మహాసత్త్వులూ, మహామతులూ అయిన రామలక్ష్మణులు అపారమైన వానర సైన్యంతో సమద్ర తీరాన్ని విడిసి వున్నారు. నక్షత్రాలనైనా గణింపవచ్చు. వర్షబిందువులనైనా లెక్కింపవచ్చు. ఉధతి కెరకటాలనయినా లెక్కకట్టవచ్చు. ఇసుక రేణువులనయినా గణుతింపవచ్చు. కాని వానరసేన సంఖ్యను లెక్కపెట్టనలవి కాదు. ఇప్పుడు వెంటనే సామోపాయానికి యత్నించడం సముచితం. నేర్పరులను పంపి సంధి ప్రయత్నం మొదలుపెట్టు’’ అని ఆ శార్దూలుడు విధేయతతో విన్నపం చేశాడు.
-ఇంకాఉంది