తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జన్మించిన, శ్రీ ఐ.నారాయణమూర్తి కాలేజి విద్య అనంతరం సినిమాల పట్ల అభిరుచితో మద్రాస్ వెళ్ళారు. 1950నుంచి దర్శకత్వ శాఖలో పనిచేశారు. తమిళ చిత్ర నిర్మాత, దర్శకులు శ్రీ రామణ్ణ వీరికి మంచి స్నేహితులు. అందుచేత ఆర్.ఆర్.్ఫలింస్ నిర్మించిన చిత్రాల్లో సహాయకునిగా పనిచేశారు.
కళాప్రపూర్ణ సంస్థవారు నారాయణమూర్తిగారికి వారి ‘‘ఇరుగుపొరుగు’’ చిత్రానికి మొదటిసారిగా దర్శకత్వ బాధ్యతను అప్పచెప్పారు. ఆ తరువాత ‘శభాష్ సూరి’, ‘జగత్ కిలాడీలు’, ‘ఆడజన్మ’, ‘కిలాడి సింగన్న’, ‘జగమేమాయ’, ‘శ్రీరామబంటు’వంటి చిత్రాలకు దర్శకత్వం చేశారు శ్రీ ఐ.యన్.మూర్తి.
ఇరుగుపొరుగు చిత్రానికి కథ- ‘శైలజానందముఖర్జీ’, మాటలు కొండేపూడి, పాటలు ఆరుద్ర, కొసరాజు, నృత్యం - వెంపటి సత్యం, ఫొటోగ్రఫీ - మల్లి ఇరాని, సంగీతం- మాస్టర్ వేణు, ఎడిటింగ్- ఎం.యస్.మణి, నిర్మాత- విజయసారథి.
ఎన్.టి.రామారావు, కృష్ణకుమారి జంటగా నటించిన ఈ చిత్రంలో గుమ్మడి, రేలంగి, సి.యస్.ఆర్, నాగయ్య, బాలయ్య, సంధ్య, నిర్మల, షావుకారు జానకి, గిరిజ, ఇ.వి.సరోజ, యల్.విజయలక్ష్మి, ఇతర పాత్రలు పోషించారు. శోభన్‌బాబు, వాణిశ్రీ గెస్ట్‌పాత్రలు పోషించారు.
లక్ష్మీ, సరస్వతి ఒకచోట నిలిచి వుండవనే నమ్మకం శ్రీ విశ్వనాథానికి. ఇల్లుగడవటం కష్టంగా వుంటుంది. ఆ దశలో కవల పిల్లలైన ఒక కొడుకు, కూతుర్ని కని భార్య మరణిస్తుంది. (జాకీ, జానీ) పిల్లలతో వంటరియైన విశ్వనాథం గుర్రంపందేలాడి డబ్బు గెలుస్తాడు. ఒక నర్తకి (షావుకారు జానకి) ఇంటికి వెళ్ళి స్పృహతప్పుతాడు. నర్తకి అతని డబ్బును జాగ్రత్తపెడుతుంది. కాని విశ్వనాథంపై దొంగతనం నేరం మోపబడి జైలుపాలవుతాడు. తండ్రీ, పిల్లలు వేరయిపోతారు. సి.యస్.ఆర్, నిర్మల దంపతులు జాకీని చిత్ర పేరుతో పెంచి పెద్దచేస్తారు. ఆమె హీరోయిన్ కృష్ణకుమారి. ఆమె వున్న ఇంటి పొరుగున గల రేలంగి, సంధ్యల కుమారుడు రవి (ఎన్.టి.ఆర్.) నాయిక, నాయకుల మధ్య చిలిపి తగాదాలతో మొదలైన పరిచయం ప్రేమగా పరిణమిస్తుంది. జాన్ రాము (బాలయ్య)గా కారు మెకానిక్‌గా పనిచేస్తూ తమ యజమాని కూతురు జయంతి (గిరిజను) ప్రేమిస్తాడు. చివరకు వీరందరూ నాటకీయంగా కలుసుకోవటం, తండ్రి విశ్వనాథం (గుమ్మడి) తన బిడ్డలను కలుసుకుని ఆనందించటంతో కథ సుఖాంతం అవుతుంది.
‘‘ఇరుగుపొరుగు’’ చిత్రం కథాపరంగా సన్నివేశపరంగా వినోదాత్మకంగా రూపొందించిన చిత్రంగా చెప్పుకోవాలి. విశ్వనాథం బిడ్డలకు దూరమయ్యేవరకూ, కొద్దిపాటి విషాద భరితంగావున్నా, హీరో, హీరోయిన్స్ ప్రవేశించిన దగ్గరనుంచి వినోదమే ప్రధానంగా సాగటం ఓ విశేషం. ఇరుగుపొరుగుల మధ్య వుండే చిన్నపాటి కలహాలు, కలతలో సహజంగా చిత్రీకరణ జరిగింది.
మాస్టర్ వేణు సంగీతం అందించిన ఈ సినిమాలో ఘంటసాల, సుశీల పాటలు లేకపోవటం, ట్యూన్స్ కొన్ని హిందీ పాటల బాణీలు సోలో వుండడం విశేషంగా చెప్పుకోవాలి.
కవ్వించేవే, కవ్వించేవే కలువరేకులు కన్నుల దానా-(మాధవపెద్ది, స్వర్ణలత- కొసరాజు), నృత్య దర్శకుడు కె.యస్.రెడ్డి, యల్.విజయలక్ష్మిలపై చిత్రీకరించారు. కిలకిల నవ్వుజూచి, నీ నడకలే జూచి (జిక్కీ-కొసరాజు), తోటకు వచ్చిందొక చెలియ దాని దోర వయసుపై (పి.బి.శ్రీనివాస్- జిక్కి- ఆరుద్ర) షావుకారు జానకిపై చిత్రీకరించిన నృత్య గీతం (నా మనసంతా తీసుకో అది ఏమైనా నువు చేసుకో- జిక్కి, ఆరుద్ర), మబ్బుల మాటున చంద్రునిలా పొదమాటున దాగిన చినవాడా (ఎల్.ఆర్.ఈశ్వరి- ఆరుద్ర), ఇక కథా నాయికా, నాయకులపై చిత్రీకరించిన గీతాలు ‘‘వారెవా జోరుహై, వారెవా జోరుహై’’ (పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి-కొసరాజు) ‘సన్నజాజి చెలిమి కోరి చల్లగాలి వీచెను’ (పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి- ఆరుద్ర).
‘ఇరుగుపొరుగు’ చిత్రం ఆర్థికంగా అంత విజయం సాధించకపోయినా, హాస్య ప్రధాన చిత్రంగా నిలిచింది. మొత్తానికి సక్సెస్ కాని సినిమాగా పరిగణించవచ్చు.
ఫ్లాష్ బ్యాక్ @ 50
english title:
flashback@50
Date:
Friday, April 26, 2013