* * ది క్రూడ్స్ (ఫర్వాలేదు)
కెమెరా: యాంగ్ డుక్ జున్
సంగీతం: అలెన్ సిల్వెస్టర్
నిర్మాతలు: క్రిస్టీన్ బెన్సన్,
జేన్ హార్ట్‌వెల్
కథ, స్క్రీన్‌ప్లే:
దర్శకత్వం: కిర్క్ డెమరో
క్రిస్ సాండర్స్.
క్రూడ్స్’ త్రీడి కంప్యూటర్ యానిమేటెడ్ అడ్వెంచర్ కామెడీ ఫిల్మ్. ఇందులో పూర్వ చారిత్రిక యుగానికి సంబంధించిన నియాండెర్తల్ మానవ కుటుంబపు జీవన పోరాటాన్ని హాస్యభరితంగా చిత్రీకరించారు. మంచు యుగం (ఐస్‌ఏజ్) నాటి జంతువులను వాటి ఆటలను, బతుకు పోరాటాన్ని చిత్రీకరిస్తూ ‘ఐస్ ఏజ్’ సీక్వెల్ చిత్రాలు వచ్చాయి. అయితే ఈ ఐస్‌ఏజ్ చిత్రాలలో జంతువులకు బదులుగా మానవులనుపెట్టి తీస్తే అది ‘క్రూడ్’ సినిమాగా తయారవుతుంది.
అది మంచుయుగం. అక్కడ వున్న రకరకాల విచిత్ర జంతువుల నుండి, ప్రకృతి ఉపద్రవాలనుండి గ్రగ్ అనే ఆదిమానవుడు తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తుంటాడు.
గ్రగ్, అతని భార్య, ఇద్దరు కూతుళ్ళు, కొడుకు, అతని అత్తగారు కలిసి ఒకే కుటుంబం. గ్రగ్ అతి జాగ్రత్తనుండి ఏమిచేయడానికి వీలుకాక పెద్ద కూతురు ఏప్ బోర్‌గా ఫీలవుతుంటుంది. ఒక రాత్రి గుహలో అంతా పడుకుని వుండగా, గుహ బయట కనిపించిన లైట్‌కు ఆకర్షింపబడి- బయటకు వస్తుంది. ఆ లైట్ దగ్గరకుపోయి చూడగా అక్కడ గై అనే యువకుడు కనిపిస్తాడు. ఏప్ పట్ల ఆకర్షితుడైన ఆ యువకుడు, ప్రపంచం త్వరలో అంతం కానున్నదనీ, ఏప్‌ను తనతో రమ్మని పిలుస్తే ఆమె వెళ్ళదు. ఎప్పుడైనా అవసరమయితే పిలవమని గై ఒక బూరను ఇచ్చి వెళ్ళిపోతాడు. గ్రగ్, ఏప్‌ను వెతికి పట్టుకుని ఇంటికి తీసుకువస్తాడు. కొత్త వస్తువులను ముట్టుకోకూడదని ఆ బూరను నాశనం చేస్తాడు. అంతలో భూకంపం వచ్చి వాళ్ళు వున్న గుహ నాశనం అవుతుంది. ప్రాణాలకోసం పరుగెత్తుతూ, కొండలు ఎక్కుతూ, పచ్చదనంతో కూడిన ప్రాంతానికి వస్తారు. వాళ్ళతో కలిసిపోయిన గై, ఆ కొత్త ప్రాంతంలో వాళ్ళను వెంటాడుతున్న విచిత్ర జంతువులను నిప్పుతో చెదరగొడతాడు. గ్రగ్ కుటుంబీకులు ఆ నిప్పును కాజేయడంతో పొరపాటున అడవి అంటుకుంటుంది. ఆ అడవిలో వున్న రాక్షసి మొక్కజొన్న అంటుకుని, రాకెట్లలా పేలిపోయి తయారైన పాప్‌కార్న్ కింద వాళ్ళు కప్పబడిపోవడం గమ్మత్తుగా వుంటుంది. గై తెలివితేటలు, ఆలోచనలను చూసిన గ్రగ్, వాడ్ని బంధించి తమతో తీసుకువెళతారు. గై వల్ల వాళ్ళు అన్ని అవాంతరాలను అధిగమిస్తారు. గై పర్వతం దగ్గర్లోవున్న సముద్రతీరానికి దారిచూపిస్తాడు. స్వర్గంలాంటి ఆ వాతావరణంలో వాళ్ళు స్థిరపడటానికి నిర్ణయించుకుంటారు. గై, ఏప్‌ల మధ్య సాన్నిహిత్యం పెరిగి వారు ఏకమవుతారు.
హాస్యరస ప్రధానంగా తీశారు కాబట్టి, ఈ సినిమాలో సహజాసహజాల గురించి వెతకకుండా సరదాగా చూసి ఆనందించవచ్చు. ఈ చిత్రాన్ని చూసిన తరువాత, దీనికంటే ‘ఐస్‌ఏజ్’ చిత్రాలే బాగున్నాయని అనిపించడంలో ఆశ్చర్యమేమున్నది?