దళిత బహుజన సాహితీవేత్తలు
రచయిత- బి.ఎస్.రాములు,
పేజీలు- 184, రూ.100/-,
ప్రతులకు- విశాల సాహితీ అకాడమి, 201, సులేఖగోల్డెన్‌టవర్,
బాగ్ అంబర్‌పేట్,
హైదరాబాద్- 500013
8331966987
==============
సామాజిక తత్త్వవేత్త బి.ఎస్.రాములు రాసిన ‘దళిత బహుజన సాహితీవేత్తలు’ గత పాతికేళ్ళ దళిత బహుజనుల సాహితీ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. 1990 నుండి 2012 వరకు వివిధ సందర్భాలలో ప్రచురించిన పుస్తకాలకు రాసిన వ్యాసాలు, పీఠికల సంకలనమీ గ్రంథం. విశాల సాహిత్య అకాడమీ 71వ ప్రచురణగా తెలుగు సాహిత్యానికి ఆణిముత్యంగా అందించారు. దళిత బహుజనుల సాహితీ వికాసానికి అవిశ్రాంతంగా బి.ఎస్. చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకం.
మావోయిస్టు ఉద్యమం నుండి జనజీవన స్రవంతిలో కలిసినంక విరివిగా చేసిన రచనల సారాంశం ఒక్కటే. అణచబడుతున్న దళితులు రాజ్యాధికారం పొందాలనే గమ్యం, దానికి అనుగుణమైన భావజాలాన్ని ముందుకు తీసుకుపోతున్న అక్షర సైనికుడు బి.ఎస్.రాములు. అంబేద్కర్ శత జయంతి ఉత్సవాల ఊపుతో, పూలే ఆలోచనలతో బలోపేతమైన దళితవాదానికి అండగా దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక (దరకమే) స్థాపన ద్వారా కృషిచేశారు. భారతీయ సాహిత్యంలో కొత్త అనే్వషణలకు ఊతమిచ్చింది దరకమే. అనాదిగా తిష్టవేసిన సాహితీ ఆధిపత్యాన్ని నిలదీసి, నూతన ఆవిష్కరణలను కొనసాగించింది దరకమే. ఎవరి చరిత్రను వారే రాయాలనే నినాదమిచ్చిన దరకమేకు అనుగుణమైన పుస్తకాలకు బి.ఎస్. రాసిన ముందుమాటలు ఈ సంకలనంలో చోటుచేసుకున్నాయి.
సామాజిక న్యాయం, సామాజిక మార్పు కోసం పనిచేస్తున్న పది మంది ఉద్యమకారుల, కవుల జీవితాల గూర్చి ఈ పుస్తకం తెలియజేస్తుంది. అందులో మొదటగా దళిత కవిత్వంలో బలమైన ప్రతీకలతో ఆగ్రహం ప్రకటించిన కవి శంబుక. ఆయన జీవన నేపథ్యాన్ని, నాటి సాహితీ ధోరణులను వివరించిన వ్యాసం ఇది. శంబుక (1958-95) అనేది పత్తిపాటి మల్లేశ్వరరావు యొక్క కలం పేరు. ఆయన కలం వర్షించిన ‘పోయేదేమి లేనోళ్లం’ కవితా సంపుటికి ‘దళిత సాహిత్య గర్జన’ పేరుతో బి.ఎస్. రాసిన ముందుమాట దళిత దృక్పథానికి ఒరవడి పెట్టింది. శంబుక దళితుల పోరాటాల్లో పాల్గొని పదునైన కవితలతో గళమెత్తిన వైనాన్ని వివరించారు.
సాహు (1955-93) ఒక పోరాట కెరటం. తన పాటలు దళితుల గుండెల్లో గూడుకట్టుకున్నాయి. విప్లవోద్యమంలో భాగంగా ఆదిలాబాద్ అడవుల్లోని గోండులతో కలిసిపోయిన ‘సాహు’ జీవనం అందరికీ ఆదర్శం. ఆయన సంతాప సభ సందర్భంగా ‘సాహితీ సామాజిక సేనాని సాహు’ అని విలువైన వ్యాసాన్ని రాశారు. బి.ఎస్.సాహుగా ప్రసిద్ధుడైన శనిగరం వెంకటేశ్వర్లు తన కలంకు గోండు అమ్మాయి పేరు పెట్టుకొని గోండుల పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారు. ‘కొమురం భీం’ నవలను అల్లం రాజయ్యతో కలిసి రాసి ఆదివాసి పోరాటాలను పరిచయం చేశారు. నిజమైన ప్రజల చరిత్రను రాసే క్రమంలో సాహు అగ్రస్థానంలో ఉంటారని బి.ఎస్. సరిగ్గానే అంచనావేశారు. ‘ప్రపంచ సాహిత్యంలో సాహు లాంటి ఉన్నత వ్యక్తులు అరుదుగా కనపడ్తారు. ప్రేంచంద్, క్రిస్ట్ఫర్ కాడ్వెల్, రాల్‌ఫాక్స్, సుబ్బారావు పాణిగ్రాహి, జ్యోతిబాపూలే వంటి వారి ఒరవడిలో సాహుకు ప్రపంచ సాహిత్య చరిత్రలో సముచిత స్థానం వున్నది.’ (పేజీ..57) సాహు జీవనయానాన్ని తెలుసుకోవటానికి ఈ వ్యాసం దోహదం చేస్తుందనుటలో సందేహం అక్కర్లేదు.
పాట అందించే చైతన్యం, కలిగించే ఆలోచనలు, పోరు కదలికలు అవి దళిత బహుజనులపై చూపే ప్రభావాలను వివరిస్త్తూనే, వాటిని రాసిన రచయితలకు రావలసినంత గుర్తింపురాకపోవటం వెనుక ఉన్న డొల్లతనాన్ని ప్రశ్నిస్తారు బి.ఎస్. మరుగునపడిన వాళ్ళ సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చి, వాటికి సముచిత స్థానం కల్పించాలని తపించిన రాములుగారు జి.వై.గిరి, కె.రామలక్ష్మణ్, వల్లంపట్ల నాగేశ్వరరావుల గూర్చి రాసిన వ్యాసాల్లో తన ఆవేదనను చూడవచ్చు. వారి పాటలు ప్రజల నాలుకలపై సజీవంగా ఉన్నాయని, అవి నిరంతరం స్ఫూర్తినిస్తాయని, పరిశోధకులు వాటి మూలాలపై పరిశోధనలు జరపాలని సూచించారు.
దళితుడైన కె.జి.సత్యమూర్తి (1931-2012) విప్లవోద్యమంలో చెరగని సంతకం. విప్లవ సాహిత్యంలో శివసాగర్‌గా పరిచితుడైన మహాకవి అతడు. భౌతికంగా దూరమైన తరుణంలో శివసాగర్ జీవన నేపథ్యాన్ని ‘ఒక తరం అంతరించింది’ అంటూ రాసిన వ్యాసం ఆలోచింపజేస్తుంది. ‘శివసాగర్ విప్లవోద్యమంలో ఎంత ప్రభావితం చేశారో, దళిత బహుజన ఉద్యమంలో అంతకు ఎన్నోరెట్లు విశాల ప్రజానీకంలోకి భావజాలాన్ని ప్రత్యక్షంగా స్వయంగా తీసుకొని ప్రభావితం చేశారు. దశాబ్దాల సాహిత్య సామాజిక ఉద్యమచరిత్ర వారధి శివసాగర్’ (పేజీ...101) ఇది ఎవరూ కాదనలేని వ్యాఖ్యానమే కదా. దళిత కళామండలి వ్యవస్థాపకులు మాస్టార్జీ. ఆయనను వివిధ కోణాలలో పరిచయంచేసే వ్యాసముంది. మూలవాసుల సిద్ధాంతం ఆధారంగా మాస్టార్జీ గీతాలను పరిశీలిస్తారు. మనుధర్మంపై, అంటరానితనంపై, హిందూ బ్రాహ్మణిజంపై ఆయన చేస్తున్న నిరంతర పోరాటాల్ని విశే్లషించారు.
దళిత బహుజన సాహితీవేత్తల్లో ప్రజాయుద్ధనౌకగా స్థిరపడిన గద్దర్ జగమంతా గర్వించదగిన గొప్ప కళాకారుడు. ఆయనగూర్చి సమగ్రమైన సమాచారంతో వివరించిన వ్యాసం ఆకట్టుకుంది. విప్లవకారుడిగా, జన నాట్య మండలి స్థాపకుడిగా, గాయకుడిగా, వాగ్గేయకారుడిగా గద్దర్‌ను చాలామంది సాహితీ విమర్శకులు వివరించారు. చరిత్రను రాసే క్రమంలో మూలాలను మరిచిపోవద్దని బి.ఎస్ హెచ్చరిస్తారు. గద్దర్ జీవన ప్రస్థానాన్ని వివరించారు.
దరకమే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బి.అనంతయ్యకు ఈ పుస్తకాన్ని అంకితం ఇవ్వటమేకాకుండా ఆయనమీద అమ్మంగి వేణుగోపాల్ రాసిన వ్యాసాన్ని చేర్చటం బాగుంది. ఈ పుస్తకానికి జానపద పరిశోధకులు జయధీర్ తిరుమలరావు, దళితోద్యమ నాయకులు కత్తి పద్మారావుల మాటలు అదనపు ఆకర్షణ.
ప్రతి వ్యాసానికి తను రాసిన నాటి పరిస్థితులను సంక్షిప్తంగా వివరించారు. తెలంగాణ ఉద్యమంలో అస్థిత్వ పోరాటాలకు వెన్నుదన్నుగా నిలబడటానికి ఈ వ్యాసాలు తోడ్పాటునిస్తాయి. దళిత బహుజనుల సాహితీవేత్తల జీవనరేఖల్ని అందరూ చదవాల్సిందే. ఈ రకమైన సాహిత్య కృషిని బి. ఎస్.రాములు ఆగకుండా కొనసాగిస్తారని ఆశిద్దాం. సంపాదకులుగా వ్యవహరించిన కర్రె సదాశివ్, మోయిలి శ్రీరాములు అభినందనీయులు.
సామాజిక తత్త్వవేత్త బి.ఎస్.రాములు రాసిన ‘దళిత బహుజన సాహితీవేత్తలు’
english title:
dalitha
Date:
Saturday, April 27, 2013