ప్రపంచానికి ఆఖరి ఘడియలు
-డా.మహీధర నళినీ మోహన్‌రావు
విశాలాంధ్ర పబ్లిషింగ్‌హౌస్
బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాద్-1.
పేజీలు: 150 +, వెల: రూ. 80/-
తెలుగులో సైన్స్ రచనలు అనగానే నళినీ మోహన్‌గారి పేరు ముందు స్ఫురణకు వస్తుంది. ఆయనకు ముందు, తరువాత సైన్సు రచనలు లేవని కాదుగానీ, తెలుగులో సైన్సు రాయడం, చదవడం వీలవుతుందని నమ్మకం కలిగించారాయన.
‘ప్రపంచానికి ఆఖరు ఘడియలు’ అనే ఈ రచన ముందు 1959లోను, తర్వాత మరో పేరుతో 1968లోను అచ్చయింది. అదే పుస్తకం కొద్దిపాటి మార్పు చేర్పులతో తిరిగి మన ముందుకు వచ్చింది. రచయిత గురించి, రచన గురించి వివరాలు ఇస్తూ పుస్తకం మొదట్లోనే ప్రసిద్ధ రచయిత డా.దేవరాజుమహారాజుచేత ఒక వ్యాసం లాంటిది రాయించడం బాగుంది.
2012తో ప్రపంచం ముగిసిపోతుందన్నారు. ఏమీ జరగలేదు. అంటే ఈ రకమయిన మాటల్లో సత్యం తక్కువేనన్న మాట. ఈ రకం మాటలు చాలా కాలంనుంచి చెపుతూనే ఉన్నారంటే మాత్రం ఆశ్చర్యం. శాస్తవ్రేత్తలే ప్రపంచానికి చివరి క్షణాలు రకరకాలుగా రావచ్చునంటారు.. అంటూ ఈ రచన మొదలవుతుంది. తోక చుక్కలు, గ్రహ శకలాలు, చంద్రుడువచ్చి భూమికి గుద్దుకునే వీలుంది అది ఆనాడు, ఈనాడు కూడా ఉంది. సూర్యుడు పేలిపోవచ్చు, చల్లారిపోనూవచ్చు. ఇందులో ఏ ఒక్కటి జరిగినా చాలు అంటూ పాఠకులకు ఆసక్తి కలిగించే ప్రయత్నం ఆ రోజుల్లోనే నళినీ మోహన్‌గారు. మరోసారి ఆసక్తికరంగా చేసి చూపించారు. ఈ విషయాల గురించిన వివరణాత్మకమైన వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
నళిన మోహన్ మంచి కథా రచయిత. గేయ రచయిత కూడా. ఆయనలోని మాటకారితనం పాఠకులను పట్టేస్తుంది. కానీ, మొదటి రోజుల్లో ఆయన కూడా సైన్సు చెప్పాలంటే, అందులోని వివరాలను విశదంగా చెప్పాలనే ప్రయత్నంలో కాస్త కష్టపడ్డారని ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. తరువాతి కాలంలో, వచ్చిన ఆయన రచనల్లో కథనం ఇంకా ఎంతో బాగుంటుంది మరి! ఎప్పుడో యాభయి సంవత్సరాల క్రిందట రాసిన రచనను తిరిగి అందించడం బాగుంది కానీ, ఇందులోని అంశాల గురించిన సమాచారం పాతదైంది. ఎన్నో కొత్త సంగతులు వచ్చాయి. తెలుగులో సైన్సు రచనలు పాత వాసన వేస్తుంటాయన్నది నిజం. కొత్త విశేషాలతో కొత్త పుస్తకాలు రావడంలేదు. రచయితలెవరూ ఇందుకు పూనుకోవడం లేదు.
నళినీమోహన్‌గారి పుస్తకం అందరినీ ఆలోచింపచేస్తుందేమో మరి!