సియస్‌పురం, ఫిబ్రవరి 14: ఇంటి పన్ను బకాయిలను వంద శాతం వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి కె.శ్రీదేవి ఆదేశించారు. మంగళవారం ఎంపిడిఓ కార్యాలయంలో సియస్‌పురం, వెలిగండ్ల, హెచ్‌ఎంపాడు, పామూరు, కనిగిరి మండలాల పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇంటి పన్ను వసూళ్లలో అలసత్వం వహిస్తే కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో 30శాతం పన్నులు వసూలు చేశారని, 70శాతం పన్నులు కార్యదర్శులు వసూలు చేయాల్సి ఉందన్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఎన్‌ఆర్‌హెచ్‌ఐ నిధులు, 13వ ఆర్థిక సంఘం నిధులతో పారిశుద్ధ్యం మెరుగుకు ప్రత్యేక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పంచాయతీలలో ఉండాల్సిన రిజిస్టర్లు అన్ని ఈనెల మార్చి 15వ తేది కల్లా కార్యాలయాల్లో ఉండాలని సూచించారు. రూపాయి కూడా ఇంటి పన్ను వసూలు చేయని వెలిగండ్ల మండలం గన్నవరం, సియస్‌పురంలోని నల్లమడుగుల కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా నిర్మించే ఇళ్లకు ఇంటి పన్ను నిర్ణయించి వసూలు చేయాలని సూచించారు. ఆర్వో ప్లాంట్‌ల వివరాలు తెలియజేయాలని సూచించారు. పంచాయతీకి సంబంధించిన స్థలాలను ప్రైవేటు సంస్థలకు ఇచ్చినట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పామూరులోని గాంధీనగర్‌లో అక్రమ లేఔట్ రాళ్ళను తొలగించాలని పామూరు కార్యదర్శిని ఆదేశించారు. ఈకార్యక్రమంలో కందుకూరు డిఎల్‌పిఓ సుమతికళ, ఎంపిడిఓ డి.ఈశ్వరమ్మ, ఐదు మండలాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
===
గిరిజనుల ఆధీనంలో లేని భూములను
స్వాధీనం చేసుకోవాలి:జెసి
ఉలవపాడు, ఫిబ్రవరి 14: మండలంలో వీరేపల్లిలో గిరిజనులకు గతంలో పంపిణీ చేసిన అస్సైన్డ్ భూములు పెద్దల చేతుల్లో ఉన్నాయని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీనృసింహం రెవిన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మండలంలోని వీరేపల్లిలో జరిగిన రెవిన్యూ సదస్సులో పాల్గొన్నారు. 1970వ సంవత్సరంలో 119 మంది గిరిజనులకు 70ఎకరాల భూమిని పంపిణీ చేశారని, ఆ భూములు ఎవరి చేతులలో ఉన్నాయో విచారణ జరిపి స్వాధీనం చేసుకోవాలన్నారు. అలాగే గ్రామంలో చెరువులు, వాగులు కొందరు ఆక్రమించుకున్నారని గ్రామస్థులు జెసి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పలువురు పలు సమస్యలపై జెసికి వినతిపత్రం సమర్పించారు. రెవిన్యూ సదస్సులో వచ్చిన అర్జీలను 45రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ రెవిన్యూ సదస్సులో తహశీల్దార్ బాలసుబ్రహ్మణ్యం, ఆర్‌ఐ, సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.
=========
రైలు ఢీకొని బాలిక మృతి
చీరాల, ఫిబ్రవరి 14: రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని బాలిక మృతి చెందిన సంఘటన మంగళవారం స్థానిక ఫైర్ ఆఫీసు గేటు వద్ద చోటుచేసుకుంది. పేరాలలోని ప్రైవేటు పాఠశాలలలో 8వ తరగతి చదువుతున్న పిట్టు రజని (14) పట్టాలు దాటుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. బాలిక మృతితో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఈమేరకు జిఆర్‌పి పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.
నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి
పంగులూరు, ఫిబ్రవరి 14: ముప్పవరం ఎస్‌సి కాలనీలోని నీటి తొట్టిలో పడి ఓ పసిబాలుడు మృతి చెందాడు. కాలనీకి చెందిన పాలపర్తి శ్రీను కుమారుడు బాబు (1) మంగళవారం మధ్యాహ్నం నీటి తొట్టెలో పడగా తల్లిదండ్రులు చాలా సేపటివరకు గమనించలేదు. తరువాత తొట్టెలో తేలుతున్న బాబును గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరిన 108 సిబ్బంది అప్పటికే బాబు మృతి చెందాడని తెలిపారు.