వర్షాలు సంవత్సరానికి సంవత్సానికి తగ్గిపోతున్న నేటి తరుణంలో పుష్కలంగా లభించాల్సిన జల విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ప్రజల విద్యుత్ అవసరాలు తీర్చాలి. ఈ పరిస్థితుల్లో సహజ వనరుల ద్వారా లభ్యమయ్యే విద్యుత్‌ను వాడకంలో ప్రజలను చైతన్యపరచవలసిన అవసరం ఎంతైనా వుంది. గతంలో వైయస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలవల్ల నేడు ప్రజలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రైతులు, ప్రజలు విద్యుత్‌ను విచక్షణా రహితంగా వాడుతున్నారు. ఉత్పత్తి వినియోగాల్లోని వ్యత్యాసం గణనీయంగా ఉంది. అక్రమ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంది. ఈ ప్రభుత్వంలోని ఉద్యోగులకు, నాయకులకు, ప్రజలకు నిజాయితీ లేదు. ఈ విషయంలో, జాతిహితాన్ని కాంక్షించే సజ్జన సమాజం చొరవ చూపి భవిష్యత్ అవసరాలను గుర్తించి, ప్రజలకు తెలియజేసి వాస్తవ విషయాలను వివరించి ప్రజలను చైతన్యపరచాలి. అప్పుడే సమస్యకు కొంత పరిష్కారం దొరుకుతుంది.
- ఉల్లి బాలరంగయ్య, పోరుమామిళ్ళ
కుక్కలు, పందులతో ఇబ్బందులు
ఆంధ్రప్రదేశ్‌లో మిగతా జిల్లాల సంగతేమిటోగాని, అనంతపురం పట్టణంలో ఏ సందు చూచినా కుక్కలు, పందులు మాత్రమే ప్రసిద్ధిగా కనబడుతున్నాయి. ఎక్కడ చూచినా ఆ జంతువులే కనబడుతున్నాయి. అనేక మంది వాహనదారులు వీటివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటివల్ల కాళ్లు విరగ్గొట్టుకున్న వారు వున్నారు. పందుల పెంపకందార్లతో ఏమైనా మునిసిపాలిటీకి ప్రత్యేకలాభాలేమైనా వున్నాయేమో తెలియదు. ఊర కుక్కలను, పందులను అరికట్టాలని ప్రజల కోరిక. ఏ సందులో చూసినా కాలువలు మురికి, నీటితోను, కాలువలు మట్టితోను నిండి వుంటాయి. వీటి శుభ్రం చేసే వారు ఎక్కడ వుంటారో తెలీదు. మున్సిపల్ వర్కర్లు మాత్రం అడిగినా పట్టించుకోరు. రాష్టమ్రంతా ఇంతేనేమో? మున్సిపల్ ప్రాంతంలో రోగాలకు మూలం మురికినీరు తీయకపోవటం, పందులు కుక్కలు ఎక్కువగా వుండటమే కారణం. అనంతపురం మున్సిపాలిటీ మేల్కొనాలని ఆశిద్దాం. కలెక్టరుగారు, జాయింట్ కలెక్టరుగార్లు ప్రతి నెల ఒక్కమారు వీధులు పరిశీలిస్తే వాస్తవం తెలుస్తుంది. ప్రజాక్షేమాన్ని పట్టించుకోండి.
- జి.శ్రీనివాసులు, అనంతపురం
మోడల్ స్కూళ్ళతో విద్యారంగం పటిష్టం
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యాసంస్కరణల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఆరువేల మోడల్ స్కూళ్లను ప్రారంభించేందుకు అవసరమైన నిధులను విడుదల చేయడం దేశంలో ప్రాథమిక విద్యావిధానం పటిష్టం చేయాలన్న ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పానికి నిదర్శనం. ఇందులో రాష్ట్రానికి ఇప్పటికే 250 స్కూళ్లు మంజూరు కాగా ఒక్కొక్క స్కూలు స్థాపన, అభివృద్ధికి మూడున్నర కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికి అందాయి. అయితే రాష్ట్రంలో ఇప్పటికే వసతులు వున్న పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా మార్చుతున్నట్లు విద్యామంత్రి ప్రకటించడం అత్యంత దురదృష్టకరం. మోడల్ స్కూళ్ల డిజైనింగ్‌ను నిపుణుల చేత ప్రత్యేకంగా చేయించి బాల బాలకలకు అన్ని వసతులు వుండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆటలకు క్రీడా మైదానం, లేబొరేటరీ, కంప్యూటర్లు, సురక్షిత త్రాగునీటి విధానం లాంటి వౌలిక వసతులతోపాటు అనుభవజ్ఞులైన సిబ్బంది వారికి ప్రత్యేక సర్వీసు నియమ నిబంధనావళిని రూపొందించడం అత్యావశ్యకం. విద్యావిధానాన్ని శాసిస్తూ విద్యను వ్యాపారంగా మార్చివేసిన కార్పొరేట్ సంస్థల వ్యాపార నిలయాలైన పాఠశాలలకు దీటుగా మోడల్ స్కూళ్లను అభివృద్ధిచేసి పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషిచేయాలి.
- సిహెచ్.సాయిఋత్త్విక్, నల్గొండ
ప్రభుత్వ నిర్ణయం మంచిదే
మన రాష్ట్రంలో న్యాయపరంగా పాలన తెలుగులోనే జరగాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ముదావహం. బ్రిటీషు కాలంనాటి ఐ.పి.సి, ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లను అందరి సౌలభ్యంకోసం తెలుగులోనికి తర్జుమా చేయాలి. అట్లే న్యాయశాస్త్రానికి సంబంధించిన అన్ని పుస్తకాలు తెలుగులో ముద్రించాలి. ఇంటర్మీడియట్‌లో తెలుగు మీడియం విద్యార్థుల సౌలభ్యంకోసం లా కళాశాలల్లో తెలుగు మాధ్యమం ఈ విద్యా సంవత్సరం నుండి ప్రవేశపెట్టాలి. ఈ విద్యార్థులకు భవిష్యత్తులో సుప్రీంకోర్టు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే వారికి ఆంగ్లంలో వాదనలు విన్పించేందుకు ప్రత్యేక శిక్షణ ఉచితంగా యివ్వాలి. రాష్ట్రంలో తెలుగులో న్యాయపాలన చిత్తశుద్ధితో జరిగి యావత్ దేశానికే తలమానికంగా నిలవాలి.
- సి.ప్రతాప్, విశాఖపట్నం
వర్షాలు సంవత్సరానికి సంవత్సానికి తగ్గిపోతున్న నేటి తరుణంలో పుష్కలంగా లభించాల్సిన జల విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతోంది.
english title:
v
Date:
Monday, April 29, 2013